నాగ్నోట కొత్త పాట
Published Saturday, 23 July 2016రెండ్రోజుల క్రితం సర్ప్రైజ్ అంటూ తెలుగు ప్రేక్షకులను ఊరించిన నాగార్జున ఇచ్చే సర్ప్రైజ్ ఏంటో ఒక రోజు ముందే తెలిసిపోయింది. నిన్న ‘కబాలి’ సినిమా చూసినవారికి నాగార్జున చేసిన ప్రయోగం అర్థమవుతుంది. నటుడిగా, నిర్మాతగా తనదైన ప్రత్యేకతను చాటుకుంటున్న నాగార్జున, మంచి కథ, కథనంతో తెరకెక్కే సినిమాలను నిర్మిస్తూ ప్రత్యేకతను చాటుకుంటున్నాడు. ఈ తరహాలో ‘ఉయ్యాల జంపాల’, ‘పడేసావే’, తాజాగా ‘నిర్మల కానె్వంట్’ సిద్ధమవుతోంది. శ్రీకాంత్ తనయుడు రోషన్‌ను హీరోగా పరిచయం చేస్తూ తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాగార్జున ప్రత్యేక పాటలో నటించడమే కాకుండా ఈ సినిమా కోసం ఓ పాట కూడా పాడడం విశేషం. ఎ.ఆర్.రెహమాన్ తనయుడు అమీన్ పాడిన పాట ఇప్పటికే తెలుగు ప్రేక్షుకలను ఆకట్టుకుంది. తాజాగా నాగార్జున ‘కొత్త కొత్త భాష..’ అంటూ పాడిన ఈ పాట అందరినీ అలరిస్తోంది. దీంతో గాయకుడిగా మరో అవతారమెత్తాడు నాగార్జున. ఇదివరకే ఆయన సీతారామరాజు సినిమాలో సిగరెట్టుపై పాట పాడిన విషయం తెలిసిందే. త్వరలోనే ఈ చిత్రం విడుదల కానుంది.