S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

పిల్లాయిపల్లి కాల్వ సర్వే పనుల పరిశీలన

భూదాన్ పోచంపల్లి, జూలై 23 : మండల పరిధిలోని పిల్లాయిపల్లి గ్రామం పిల్లాయిపల్లి సర్వే పనులను శనివారం నీటి పారుదల శాఖ చీఫ్ ఇంజనీర్ సురేష్‌కుమార్ పరిశీలించారు. ఇటీవల ముఖ్యమంత్రి పిల్లాయిపల్లి, ధర్మారెడ్డి, బునాదిగాని కాల్వపనులకు 350కోట్లు ప్రకటించారని, ఈ కాల్వ సర్వే పనులకు 1 కోటి 23 లక్షలు విడుదల చేశారని ఆయన పేర్కొన్నారు. ఆయన వెంట ధర్మన్న, శ్రీ్ధర్‌రావు, రాజశేఖర్,రాజు, హరి, విశ్వనాధం, తదితరులు పాల్గొన్నారు.

అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్
15 సెల్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్ స్వాధీనం

సూర్యాపేట, జూలై 23: పట్టణ పోలీసులు అంతర్ రాష్ట్ర దొంగను అరెస్ట్‌చేసి 15సెల్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను శనివారం పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో డిఎస్పీ సునీతామోహన్ వెల్లడించారు. కేతేపల్లి మండలం కొర్లపహాడ్ గ్రామానికి చెందిన చిలుకూరి శంకర్ విలాసవంతమైన జీవితానికి అలవాటుపడి దొంగతనాలు చేయడం వృత్తిగా ఎంచుకున్నాడు. ఇతనిపై గతంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్టల్రోని పలు పోలీస్‌స్టేషన్‌లలో కేసులు నమోదై జైలు జీవితం కూడ గడిపాడు. శుక్రవారం రాత్రి పట్టణంలోని హైటెక్ బస్టాండ్‌లో అనుమానస్పదంగా కనిపించడంతో పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా చోరీలకు పాల్పడినట్లు అంగీకరించాడని తెలిపారు. అతని వద్ద నుండి 15సెల్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్, రెండు గ్యాస్ సిలెండర్‌లను స్వాధీనం చేసుకొని రిమాండ్‌కు తరలించినట్లు చెప్పారు. ఈ విలేకరుల సమావేశంలో పట్టణ ఇన్స్‌స్పెక్టర్ వై.మొగిలయ్య, ఎస్‌ఐలు క్రాంతికుమార్, బాసిత్, ఐడి పార్టీ సిబ్బంది కరుణాకర్, కృష్ణ, వెంకన్న, శ్రీనివాస్‌లు పాల్గొన్నారు.

ఈత, కర్జ్జూరాలతో
గౌడ్‌ల అభివృద్ధికి కృషి : మంత్రి
నల్లగొండ టౌన్, జూలై 23 : హరితహారంలో భాగంగా ఈత, కర్జుర మొక్కలను నాటించి ప్రభుత్వం గౌడ కులస్తుల సంక్షేమానికి సైతం కృషి చేస్తుందని విద్యుత్, ఎస్సీ అభివృద్ది శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి పేర్కొన్నారు. శనివారం పట్టణంలోని విలీన గ్రామం కేశరాజుపల్లి పరిధిలోని పొలంలో ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో ఆయన ఈత, కర్జుర మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఆయన మొక్కలు నాటడంతో పాటు వాటి సంరక్షణకు ప్రతి ఒక్కరు శ్రద్ద తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా పొలంలో 1600 కర్జుర, ఈత మొక్కలను గౌడ సంఘం ఆధ్వర్యంలో నాటించి వారిచే సంరక్షణ ప్రతిజ్ఞ చేయించారు. తెలంగాణకు హరిత ఉద్యమ యజ్ఞం నిరంతరం ఇలాగే కొనసాగాలని కోరారు. జిల్లాలో పూర్తిస్ధాయిలో అనుకున్న లక్ష్యాన్ని నెరవేరుస్తామని, వర్షాభావ పరిస్థితుల వల్ల మొక్కలు నశించినా తిరిగి మళ్ళీ నాటాలని సూచించారు. రాష్ట్రంలో 4.70 కోట్ల మొక్కలు నాటే లక్ష్యంగా కొనసాగాలని పిలుపునిచ్చారు. గీత కార్మికుల కర్జుర, ఈత మొక్కల్లో పదివేల మొక్కలు బాధ్యతగా తాను స్వీకరించి దానికి రక్షణ కవచంతో పాటు బోరు మోటార్ సైతం ఏర్పాటు చేయిస్తానని హామీ ఇచ్చారు. లక్ష్యాల లెక్కల కోసం కాకుండా మొక్కల సంరక్షణకు కర్తవ్యంగా భావించినప్పుడే భావి తరాలకు బంగారు తెలంగాణ అందించగలమని తెలిపారు. ఎప్పటికప్పుడు సి ఎం కేసి ఆర్ హరితతెలంగాణకై మొక్కలకు సంరక్షణ ఎలా ఉందో సమీక్షలు నిర్వహిస్తూ సూచిస్తున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలోఇంచార్జి కలెక్టర్ సత్యనారాయణ, డ్వామా పిడి దామోదర్‌రెడ్డి, తిప్పర్తి తహశీల్ధార్ చంద్రవదన, టిఆర్‌ఎస్ నియోజకవర్గ ఇంచార్జీ దుబ్బాక నర్సింహ్మారెడ్డి, ఎక్సైజ్ శాఖ అసిస్టెంట్ కమీషనర్ సురేష్ రాథోడ్, అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ గాయత్రి, ఎస్ ఐ శ్రీనివాస్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

నెలాఖరులోగా పుష్కర పనులు పూర్తి చేయాల్సిందే..!

అధికారులకు మంత్రి ఆదేశాలు * నత్తనడకన పనులపై ఆగ్రహం

నల్లగొండ, జూలై 23: కృష్ణా పుష్కరాల ఏర్పాట్ల పనులను ఈ నెలాఖరులోగా పూర్తి చేసేలా అధికారులు ఆహర్నిశలు పని చేయాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జి.జగదీష్‌రెడ్డి అన్నారు. శనివారం కలెక్టరేట్‌లో ఆయన జిల్లా అధికారులతో మాట్లాడుతు కృష్ణా పుష్కరాల పనులు మరింత వేగంగా చేయాల్సివుందన్నారు. ఆర్‌అండ్‌బి, ఆర్‌డబ్ల్యుఎస్, ఇరిగేషన్, విద్యుత్ శాఖలు పనుల్లో ఆలస్యం సాగుతుందని సంబంధిత అధికారులు క్షేత్ర స్థాయిలో ఉండి పనిచేయాలంటు సూచించారు. నత్తనడక పనులపై మంత్రి సంబంధిత శాఖల అధికారులపై మండిపడ్డారు. మీరు పనులు చేయిస్తారా లేక ననే్న క్షేత్ర స్థాయిలో ఉండి పనులు జరిపించమంటారా అంటు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం కెసిఆర్ పుష్కర పనుల పురోగతిని గమనిస్తున్నారని ఆయన దృష్టిలో పడితే అంతే సంగతులన్నారు. ఘాట్‌లు, రోడ్ల పనులు అధిక శాతం పూర్తయ్యాయని, ఆర్‌అండ్‌బి శాఖ 33పనులకు 16మాత్రమే పూర్తి కావచ్చాయని, బిల్డింగ్‌ల పనులు 28శాతం మాత్రమే జరిగాయన్నారు. అయితే ఈ నెలాఖరులోగా పూర్తి చేసేందుకు పనుల్లో వేగం పెంచేందుకు చర్యలు చేపట్టాలన్నారు. మంచినీటి వసతి, మరుగుదొడ్లు, విద్యుత్ లైట్లు, పార్కింగ్, హోల్డింగ్స్ వసతుల కల్పనకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. పంచాయతీరాజ్ శాఖ 70కోట్ల పనుల్లో 59కి 27పనులు మాత్రమే తుది దశకు చేరుకున్నాయన్నారు. ఘాట్‌ల వద్ధకు చేరుకునేందుకు రోడ్ల మార్గాల పనులను సకాలంలో పూర్తి చేయాలన్నారు. పుష్కర పనుల నిర్వాహణలో నిర్లక్ష్యం వహించే కాంట్రాక్టర్లపై, అధికారులపై చర్యలు తీసుకోవాలని సూచించారు. పార్కింగ్, హోల్డింగ్ స్థలాలను వెంటనే ఎంపిక చేసి ఆ ప్రాంతాలను చదును చేసి అక్కడ అవసరమైన కనీస వసతులను కల్పించాలన్నారు. సాగర్‌లో 12ఎకరాలు, వాడపల్లిలో 243ఎకరాలు, మట్టపల్లిలో 173ఎకరాల్లో పార్కింగ్ ఏర్పాటు పనులు వెంటనే చేపట్టాలన్నారు. దేవరకొండ, చందంపేట, పిఏపల్లి, పెద్దవూరా, వాడపల్లిలలో పుష్కర ఏర్పాట్ల పనుల్లో తీవ్ర జాప్యం నెలకొంటుందన్నారు. వెంటనే అధికారులు వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టి పనులు సకాలంలో పూర్తి చేయించాలన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే ఎన్. భాస్కర్‌రావు, ఇన్‌చార్జి కలెక్టర్ ఎన్. సత్యనారాయణ, ఎజెసి వెంకట్రావు, డిఆర్‌వో రవినాయక్, వివిధ శాఖల జిల్లా అధికారులు ధర్మనాయక్, రమణ నాయక్, బిక్షపతి, ప్రభాకర్‌రెడ్డి, రామచంద్రరావు, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

పేదలకు స్వచ్ఛంద సంస్థల చేయూత

* వ్యాధుల బారిన పడకుండా అవగాహన * ఎంపి గుత్తా

మిర్యాలగూడ, జూలై 23: పేద ప్రజలకు ఉచిత వైద్యసేవలు అందించేందుకు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని నల్లగొండ పార్లమెంట్ సభ్యులు గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. శనివారం పట్టణంలోని రైస్‌మిల్లర్స్ అసోసియేషన్ భవనంలో ఎన్‌ఆర్‌ఐ ఫౌండేషన్, రోటరీక్లబ్, మన మిర్యాలగూడ ఆధ్వర్యంలో బసవతారకం, ఇండో అమెరికన్, క్యాన్సర్ రిసర్చ్ ఇన్‌స్టిట్యూట్ వైద్యులచే నిర్వహించే ఉచిత క్యాన్సర్ నిర్ధారణ శిబిరాన్ని ఎమ్మెల్యే భాస్కర్‌రావులతో కలిసి ప్రారంభించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని పేద ప్రజలకు వైద్యసేవలు అందక మృత్యువాత పడుతున్నారని, స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటుచేసి వైద్య సేవలు అందించాలని ఆయన కోరారు. వివిధ రకాల వ్యాదులు, అంతుచిక్కని వ్యాదులు సోకుతున్నాయని, దీనికి కారణం కలుషిత ఆహారం భుజించడం, వాతావరణ కాలుష్యమేనని ఆయన అన్నారు. వ్యాదుల భారిన పడినప్పుడు వేలాది రూపాయలు వైద్యఖర్చులు అవుతున్నందున అది పేదలకు భారంగా అవుతుందని ఆయన అన్నారు. స్వచ్ఛంద సంస్థలు పేదలకు వైద్యసేవలందించేందుకు ముందుకు రావాలని ఆయన కోరారు. వ్యాదులను ప్రాధమిక దశలో గుర్తించినట్లయితే తక్కువ ఖర్చుతో వ్యాది భారి నుండి బయటపడవచ్చని ఆయన అన్నారు. క్యాన్సర్ వ్యాదిభారిన పడకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, క్యాన్సర్ వ్యాదిపట్ల ప్రజలు అవగాహన పెంచుకోవాలని ఆయన అన్నారు. స్వచ్ఛంద సంస్థల ఆద్వర్యంలో క్యాన్సర్ ఉచిత నిర్ధారణ శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఎమ్మెల్యే భాస్కర్‌రావు మాట్లాడుతూ వ్యాదుల భారిన పడిన వారు అర్హులై ఉండి తెల్లరేషన్‌కార్డు లేనట్లయితే వైద్య ఖర్చుల కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి నిధులు మంజూరు చేయించేందుకు కృషిచేస్తానని ఆయన అన్నారు. కాగా ఉచిత క్యాన్సర్ నిర్ధారణ శిబిరానికి భారీ స్పందన లభించింది. ప్రజలు భారీ ఎత్తున తరలి వచ్చి నిర్ధారణ పరీక్షలు చేయించుకున్నారు. సుమారు 350మంది ఉచిత క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయించుకోగా పది మందికి క్యాన్సర్ ఉన్నట్లు గుర్తించినట్లు తెలిపారు. వీరికి తదుపరి వైద్యపరీక్షలు నిర్వహించి వైద్యం అందించనున్నట్లు డాక్టర్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయసింహారెడ్డి, మున్సిపల్ చైర్‌పర్సన్ తిరునగరు నాగలక్ష్మీ, కౌన్సిలర్ భార్గవ్, పొలిశెట్టి శేషాద్రి, శోభారాణి, రైస్‌మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కర్నాటి రమేశ్, మన మిర్యాలగూడ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి మనె్నం శ్రీ్ధర్‌రెడ్డి, బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి పిఆర్‌ఓ పార్థసారధి, వైద్యులు శరత్‌బాబు, రవిశంకర్, శివకుమార్, ప్రవీణ్, శ్రవణకుమారి, సరిత తదితరులు పాల్గొన్నారు.

లావణ్య హంతకులను కఠినంగా శిక్షించాలి

* మృతదేహాంతో బంధువుల ధర్నా, రాస్తారోకో * ఉద్రిక్తత

నూతనకల్, జూలై 23: మండలపరిధిలోని పోలుమల్ల గ్రామంలో శుక్రవారం రాత్రి హత్యకు గురైన రాగిని లావణ్య(22)ను హత్య చేసిన భర్త, ఇతర వ్యక్తులను తక్షణమే కఠినంగా శిక్షించాలని మృతురాలి బంధువులు శనివారం పోలుమల్ల క్రాస్‌రోడ్డు వద్ద గల సూర్యాపేట-దంతాలపల్లి ప్రధాన రహదారిపై మృతదేహాంతో ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. హత్యకు పాల్పడిన భర్తను కఠినంగా శిక్షించాలని, హత్యకు గల కారణాలు, ఇతర వ్యక్తుల వివరాలను తెలియజేసేంత వరకు ఆందోళన విరమించేది లేదని రోడ్డుపై భైఠాయంచారు. మృతురాలి తల్లిదండ్రులకు న్యాయం చేసేంత వరకు అంత్యక్రియలు నిర్వహించేది లేదన్నారు. ప్రధానరహదారిపై ధర్నా చేయడంతో వాహనాలు భారీగా నిలిచిపోయ్యాయి. మృతురాలి కుటుంబానికి న్యాయంచేస్తామని హత్యకు పాల్పడిన వారిని అరెస్ట్‌చేసి జైలుకు పంపిస్తామని సూర్యాపేట డి ఎస్పి సునీతామోహన్ హామీ ఇవ్వడంతో మృతురాలి బంధువులు ఆందోళన విరమించారు. తుంగతుర్తి సిఐ దండి లక్ష్మణ్ పర్యవేక్షణలో నూతనకల్, తిరుమలగిరి, అర్వపల్లి, తుంగతుర్తి ఎస్‌ఐలు గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు నిర్వహించారు.
తక్షణమే అరెస్టు చేయాలి
తుంగతుర్తి : నూతనకల్ మండలం పోలుమల్లలో శుక్రవారం దారుణహత్యకు గురైన రాగిరి లావణ్య భర్తను కఠినంగా శిక్షించాలని ఆమె తల్లితండ్రులు, బంధువులు, గ్రామస్తులు శనివారం స్ధానిక మెయిన్‌రోడ్డుపై , ప్రభుత్వ ఆసుపత్రి ముందు ధర్నా అనంతరం రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా హుజున్‌నగర్ మండలం లక్కవరం గ్రామానికిచెందిన మృతురాలి తల్లితండ్రులు బొమ్మగాని లింగమ్మ సైదులు మాట్లాడుతూ 2015 సంవత్సరంలో పోలుమల్ల గ్రామానికి చెందిన రాగిరి పాపయ్య సూరమ్మల కుమారుడు లింగరాజుతో పనె్నండు లక్షల నగదు కట్నంగా ఇచ్చాము అలాగే పనె్నండు తులాల బంగారం ఇచ్చామని తెలిపారు. వివాహం అయిన కొద్దిరోజుల నుండే తమ కుమార్తెను వేధింపులకు గురిచేస్తూ తన అక్క కూతురును చేసుకోవాలని చూస్తున్నారని తెలిపారు. అందులో భాగంగానే శుక్రవారం ఇంట్లోనే హత్య చేసి గుర్త్తుతెలియని వ్యక్తులు చంపారని తప్పుడు కథనం అల్లారని ఆరోపించారు. ధర్నా చేస్తున్న వారి వద్దకు డిఎస్పీ సునీతామోహన్ చేరుకొని విషయం అడిగి తెలుసుకున్నారు. లావణ్య మృతిపై సమగ్ర దర్యాప్తు జరిపి నేరస్తులను కఠినంగా శిక్షిస్తామని చెప్పారు. ధర్నాలో వామపక్ష పార్టీ, రాష్ట్ర మహిళా సంఘం నాయకురాలు తాటి విజయమ్మతో పాటు లక్కవరం గ్రామస్తులు పెద్దఎత్తున పాల్గొన్నారు.

ఎక్సైజ్ ఆధ్వర్యంలో 45లక్షల మొక్కలు

చిట్యాల, జూలై 23: హరితహారం కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్సైజ్‌శాఖ ఆధ్వర్యంలో 45లక్షల ఈతమొక్కలను నాటడమే లక్ష్యమని రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రెటరీ అజయ్‌మిశ్రా అన్నారు. ఎక్సైజ్‌శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన హరితహారం కార్యక్రమంలో శనివారం మండలంలోని ఏపూర్ గ్రామంలో మొక్కలను నాటే కార్యక్రమానికి రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రెటరీ అజయ్‌మిశ్రా ముఖ్యఅతిధిగా హాజరైనారు. ఎక్సైజ్ ఉప కమీషనర్ జీవన్‌సింగ్, జెడ్పీటీసి శేపూరి రవీందర్, వైస్‌ఎంపిపి పాలెం మల్లేష్, గ్రామసర్పంచ్ గడకారి సైదులుతో కలిసి ప్రిన్సిపల్ సెక్రెటరీ ఈతమొక్కలకు పూజలను నిర్వహించి మొక్కలను నాటారు. ప్రజాప్రతినిధులు, ఎక్సైజ్ అధికారులు, అధికారులు, గౌడసంఘం నాయకులతో మొక్కలను నాటించారు. ఈసందర్భంగా అజయ్‌మిశ్రా మాట్లాడుతూ పచ్చని చెట్లతో పచ్చదనంతో ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుందని ఆహ్లాదకరంతో పాటుగా ఆరోగ్యకరంగా ఉంటారని ప్రతి ఒక్కరు మొక్కలను నాటి చెట్లుగా పెంచాలన్నారు. అటవీసంపద తక్కువగా ఉండడంతో వాతావరణంలో మార్పులు సంబవించి వాతావరణ సమతుల్యత దెబ్బతింటుందని వేసవికాలం, వర్షాకాలంలో కూడా ఎండవేడిమి విపరీతంగా ఉంటుందని చెట్లు లేకపోవడంతో వాతావరణ కాలుష్యం ఏర్పడి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. అటవీసంపద తక్కువ కావడంతో సకాలంలో వచ్చే వర్షాలు రావడంలేదని చెట్లు అధిక సంఖ్యలో ఉండి అటవీప్రాంతం పెద్దఎత్తున ఉన్నట్లయితే వర్షాలు వర్చించేలా చేస్తాయని వర్షలు సకాలంలో వచ్చినట్లయితే వర్షపునీటితో చెరువులన్నీ నిండుతాయన్నారు. వర్షంపై ఎంతో మంది రైతులు ఆధారపడి వ్యవసాయాన్ని సాగుచేసుకుంటారని సకాలంలో వర్షాలు వచ్చినట్లయితే వర్షంపై ఆధారపడిన పంటలకు సాగునీరంతుందని, చెరువులు, కుంటలన్నీ వర్షపునీటితో నిండి కళకళలాడుతాయని భూగర్భజలాల మట్టం పెరిగి నీటి, తాగునీటి సమస్య తీరుతుందన్నారు. సకాలంలో వర్షాలు వచ్చేందుకు అటవీసంపద పెద్దఎత్తున ఉండేందుకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు హరితహారం కార్యక్రమాన్ని చేపట్టారని రాష్టవ్య్రాప్తంగా పెద్దఎత్తున మొక్కలను నాటుతున్నారని, నల్లగొండ జిల్లాలో అటవీసంపద అతితక్కువగా ఉన్నదని ప్రతి ఒక్కరు మొక్కలను నాటి చెట్లుగా పెంచి అటవీసంపదను పెంపొందించాలన్నారు. ఎక్సైజ్‌శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రంలో శనివారం ఒకేరోజున 10లక్షల చెట్లను నాటారన్నారు. హరితహారం కార్యక్రమంలో ప్రతి ఒక్కరు భాగస్వాములుకావాలని, ఇంటింటికి, ఖాళీ ప్రదేశాల్లో వ్యవసాయానికి వినియోగించని భూముల్లో భారీఎత్తున మొక్కలను నాటాలన్నారు. కార్యక్రమంలో ఇన్‌చార్జి ఎంపిడివో బి. లాజర్, తహశీల్దార్ పుష్పలత, ఎక్సైజ్ సిఐ నర్సిరెడ్డి, సూపరింటెండెంట్ దత్తుగౌడ్, గౌడసంఘం నాయకులు, గౌడకులస్తులు పాల్గొన్నారు.

మొక్కలతోనే భవిష్యత్తు : గుత్తా
దేవరకొండ, జూలై 23: మొక్కల తోనే భవిష్యత్తు ఉందని, మొక్కలు లేని భావి సమాజాన్ని ఊహించలేమని ఎంపి గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా శనివారం ఎంపి గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్‌లు దేవరకొండ మండలం చింతకుంట్ల గ్రామంలో మొక్కలు నాటారు. ఎక్సైజ్‌శాఖ ఆధ్వర్యంలో ఈత, కర్జూర మొక్కలను ఎంపి, ఎమ్మెల్యేలు నాటారు. ఈ సందర్భంగా ఎంపి సుఖేందర్‌రెడ్డి మాట్లాడుతూ ప్రతి కుటుంబంలో తల్లిదండ్రులు తమ సంతానాన్ని ఎంత ప్రేమతో, బాధ్యతతో పెంచుకుంటారో అలాగే మొక్కలను కూడా సంరక్షించాలని కోరారు. మొక్కల యొక్క ప్రాముఖ్యతను చిన్నారులకు తెలియజేయాల్సిన బాధ్యత ఉపాధ్యాయులు, తల్లిదండ్రులపై ఉందన్నారు. మొక్కలు లేకపోతే భవిష్యత్తు అన్నదే లేకుండా పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణలో ప్రజలు సకాలంలో వర్షాలు పడి సుఖసంతోషాలతో ఉండాలన్న లక్ష్యం తోనే ముఖ్యమంత్రి కెసి ఆర్ హరితహారం కార్యక్రమంతో మొక్కలు నాటే ఉద్యమాన్ని చేపట్టారని గుత్తా సుఖేందర్‌రెడ్డి చెప్పారు. హరితహారం కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కెసి ఆర్ నల్లగొండ జిల్లా నుండే ప్రారంభించడం జిల్లా ప్రజల అదృష్టమని, జిల్లాను హరితజిల్లాగా మార్చేందుకు కృషి చేయాలని గుత్తా పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే రవీంద్రకుమార్ మాట్లాడుతూ దేవరకొండ నియోజకవర్గంలో హరితహారం కార్యక్రమంలో అన్ని వర్గాల ప్రజలు, ఉద్యోగ సంఘాలు చురుకుగా పాల్గొనడం ఆనందం కలిగిస్తోందన్నారు. దేవరకొండ నియోజకవర్గంలో నాటిన ప్రతి మొక్క ఎండిపోకుండా జాగ్రత్త పడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసి ఆలంపల్లి నర్సింహ్మ, వైస్ ఎంపిపి దూధిపాళ వేణూధర్‌రెడ్డి, దేవరకొండ నగరపంచాయతి వైస్‌చైర్మెన్ నల్లగాసు జాన్‌యాదవ్, ఎక్సైజ్ శాఖ సి ఐ జిలాని, ఎస్ ఐ పరమేశ్‌గౌడ్, కౌన్సిలర్ వడ్త్య దేవేందర్‌నాయక్, లింగారెడ్డి, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.