S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

స.హ. చట్టాన్ని పాఠ్యాంశం చేయాలి

కాకినాడ, జూలై 23: సమాచార హక్కు చట్టంపై విద్యార్థి దశ నుంచే అవగాహన ముఖ్యమని, ఈ చట్టాన్ని పాఠశాల, కళాశాల విద్యల్లో పాఠ్యాంశంగా చేర్చాలని కేంద్ర సమాచార కమిషనర్ మాడభూషి శ్రీ్ధర్ ఆచార్యులు అన్నారు. సమాచార హక్కులో ఉన్న అంశాలతో పాటు భారత రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలన్నారు. కాకినాడ జెఎన్‌టియులో జిల్లా సమాచార ఐక్యవేదిక ఆధ్వర్యంలో మహిళా సాధికారిత అనే అంశపై శనివారం నిర్వహించిన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. దేశంలో అయిదువేల చట్టాలున్నాయని, అందులో సమాచార హక్కు చట్టం మాత్రమే వేగంగా ప్రజల్లోకి వెళ్ళిందన్నారు. ఈ చట్టం ద్వారా ప్రభుత్వ పథకాలు అర్హులకు అందుతాయన్నారు. ఈ చట్టం ద్వారా మావూరు, మాబడి, మా నగరం బాగు చేసుకునే విధంగా వినియోగించుకోవాలన్నారు. మహిళలు వారికున్న అధికారాలు, చట్టాల గురించి తెలుసుకోవాలని సూచించారు. సమాచార హక్కు చట్టాన్ని దుర్వినియోగం చేయమంటూ అక్కడకు వచ్చిన వారందరితో శ్రీ్ధర్ ప్రతిజ్ఞ చేయించారు. కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి మాట్లాడుతూ మహిళల కోసం ఎన్నో చట్టాలున్నాయని వాటిని తెలుసుకోవాలన్నారు. జనవిజ్ఞాన వేదిక జాతీయ అధ్యక్షుడు డాక్టర్ వి బ్రహ్మారెడ్డి మాట్లాడుతూ మన ఇంటి నుండే మహిళా చట్టాలు అమలు చేసి అదర్శంగా నిలవాలని సూచించారు. మహిళా హక్కుల పరిశోధకురాలు అరుణ గోగులమంద మాట్లాడుతూ మహిళలు తమ హక్కుల గురించి తెలుసుకుని ప్రశ్నించాలన్నారు. ఐక్యవేదిక మహిళా అధ్యక్షురాలు నాళం ఆండాళ్ అధ్యక్షతన జరిగిన సదస్సులో జెఎన్‌టియు రిజిష్ట్రార్ జివిఆర్ ప్రసాదరాజు, రెక్టార్ బి ప్రభాకరరావు, జెఎన్‌టియు ప్రిన్సిపాల్ వి రామచంద్రరాజు, డిపిఆర్వో ఎం ఫ్రాన్సిస్, ప్రజావేదిక కోఆర్డినేటర్ కాండ్రేగుల వెంకటరమణ, రాష్ట్ర ఉపాధ్యక్షుడు తోటకూర కృష్ణమూర్తిరాజు, ఐక్యవేదిక రాష్ట్ర కార్యదర్శి ప్రెసింగి ఆదినారాయణ ప్రసంగించారు. ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు వై చేతన, నాయకులు పుప్పాల నరసింహారావు, జంగా గగారిన్, అనుసూరి చినబాబు, కామిరెడ్డి లలితాదేవి, తలాటం కాళిప్రియ తదితరులు పాల్గొన్నారు.
మంచి వేలిముద్ర తీసుకోవాలి
-రేషన్ పంపిణీలో సమయం ఆదా:జెసి సత్యనారాయణ
సామర్లకోట, జూలై 23: ఇపోసు విధానంలో రేషన్ పంపిణీకి డీలర్లు ఇకనుండి కార్డుదారుడి 10 వేలిముద్రలు సేకరించకుండా కేవలం బాగా వస్తున్న వేలిముద్ర (బెస్టు ఫింగర్ ప్రింట్)ను తీసుకుంటే సమయం ఆదా కావడంతో పాటు ఇంటర్నెట్ చార్జీలు భారం కూడా తగ్గుతుందని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ సత్యనారాయణ చెప్పారు. శనివారం సాయంత్రం స్థానిక 16వ వార్డు రేషన్ షాపులో సరిగా వేలిముద్రలు పడని కార్డుదారుల నుండి బెస్టు ఫింగర్ ప్రింట్ నమోదు కార్యక్రమం నిర్వహించగా, ఆ కార్యక్రమాన్ని జెసి పరిశీలించారు. సరిగా వేలిముద్రలు పడని వారికి ఏ వేలు బాగా పడుతుందో గుర్తించి నెల నెలా ఆ ప్రకారం రేషన్ సరుకులు జారీ చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో డిఎస్‌వో ఉమా మహేశ్వరరావు, తహసీల్దారు ఎల్ శివకుమార్, ఆర్‌ఐ విశ్వనాధ్, విఆర్వో శివరామ్ తదితరులు పాల్గొన్నారు.

నగారా సస్పెన్షన్
శంఖవరం, జూలై 23: ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం శ్రీ వీర వేంకట సత్యనారాయణస్వామివారి దేవస్థానం రత్నగిరిపై వ్రతాల విభాగంలో నగారాగా పనిచేస్తున్న పెండ్యాల సత్యంను దేవస్థానం ఇఒ కాకర్ల నాగేశ్వరరావు శనివారం సస్పెండ్ చేశారు. దేవస్థానం అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం వ్రతాల విభాగంలో భక్తుల నుండి వ్రత పురోహితులు వసూలు చేసిన సొమ్ములో తనకు కొంత సొమ్ము ఇవ్వాలని సత్యం పురోహితులతో కుమ్మక్కైనట్లు భావించి చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. దీనిపై 15 రోజుల్లోగా సంజాయిషీ ఇవ్వాలని లేని పక్షంలో క్రమశిక్షణ చర్యలు తీసుకోనున్నట్లు ఉత్తర్వుల్లో హెచ్చరించారు.
ఇదిలావుండగా స్వామివారి కల్యాణోత్సవాలు ముగిసిన నాటినుండి దేవస్థానంలో అవినీతి, అలసత్వంతో వ్యవహరిస్తున్న ఉద్యోగులపై ఇఒ నాగేశ్వరరావు డేగ కన్ను వేసి చర్యలకు ఉపక్రమిస్తున్నారు. దీంతో ఇప్పటికే మొద్దునిద్రలో ఉన్న కొందరు ఉద్యోగులు పొరపాట్లను సరిదిద్దుకోగా, మరి కొంతమంది పాత బాణీలనే కొనసాగిస్తుండడంతో సస్పెన్షన్లలకు గురవుతున్నారు.
డ్రెయిన్ల తవ్వకాలు నత్తనడక
ఆంధ్రభూమి బ్యూరో
అమలాపురం, జూలై 23: వర్షాకాలంలో పంట పొలాలను ముంపు బారి నుండి కాపాడి రైతులను ఆదుకోవాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన డ్రైయిన్ల తవ్వకాలు నత్తనడకన సాగుతున్నాయి. అమలాపురం సబ్ డివిజన్ పరిధిలోని అమలాపురం, ఉప్పలగుప్తం, కాట్రేనికోన, ముమ్మిడివరం, ఐ పోలవరం మండలాల్లో నేటికీ యాభై శాతం కూడ పూర్తికాలేదు. అమలాపురం సబ్ డివిజన్ పరిధిలో 260 రెవెన్యూ డ్రైయిన్లను గుర్తించి వాటిని తవ్వేందుకు రూ.4 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. అయితే పనులు మాత్రం ముందుకు సాగడంలేదు. ముఖ్యంగా డ్రెయిన్లను ఇష్టానుసారంగా ఆక్రమించి నిర్మించిన నిర్మాణాలను తొలగించడం అధికారులకు సాధ్యం కావడంలేదు. దీనికి తోడు ఇటీవల విస్తారంగా కురుస్తున్న వర్షాలు కూడా పనులకు అడ్డంకిగా మారాయి.
పనులు నిర్వహించేందుకు అనుకూలంగా ఉండే వేసవిలో పనులు చేపట్టకుండా జాప్యంచేసి వర్షాలు కురిసే సమయంలో పనులు చేపట్టి తూతూ మంత్రంగా నిర్వహిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ముమ్మిడివరం డివిజన్‌లో 115 డ్రెయిన్లను గుర్తించిన అధికారులు 54 డ్రైయిన్లలో మాత్రమే పూడిక పనులు ప్రారంభించారు. అమలాపురంలో 103 డ్రైయిన్లకు గాను కేవలం 60 డ్రెయిన్లలో మాత్రమే పూడికతీత పనులు ప్రారంభమయ్యాయి. అలాగే ఐ పోలవరంలో 66 డ్రైయిన్లకు గాను 38 డ్రెయిన్లలో మాత్రమే పనులు జరుగుతున్నాయి. పనులను ఆయా మండలాల్లో నీటి సంఘాల నాయకులే నిర్వహించడం వల్ల కూడ పనులు నత్తనడకన సాగుతున్నాయని రైతులు ఆరోపిస్తున్నారు.
ఈ విషయమై డ్రెయిన్స్ డిఇఇ టివి పాండురంగారావును వివరణ కోరగా డ్రైయిన్లపై ఆక్రమణలు, వర్షాలు, జెసిబిల కొరత వంటి కారణాల వల్ల పనుల్లో జాప్యం జరుగుతోందన్నారు. గుర్తించిన డ్రెయిన్లలో పూడిక తీత పనులను సకాలంలో పూర్తిచేసేలా చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు.
వ్యవసాయ పనులకు సానుకూలత
ఆంధ్రభూమి బ్యూరో
రాజమహేంద్రవరం, జూలై 23: ఖరీఫ్ సీజన్ భారీ వర్షాలతో ఆరంభం కావడంతో జిల్లాలో వ్యవసాయ పనులకు పూర్తి సానుకూల పరిస్థితులు ఏర్పడ్డాయి. జిల్లాలోని ఇటు మెట్టలోనూ, అటు డెల్టాలోనూ ముమ్మరంగా ఖరీఫ్ వ్యవసాయ పనులు ఊపందుకున్నాయి. జిల్లాలో సుమారు 4.60 లక్షల ఎకరాల విస్తీర్ణంలో ఖరీఫ్ పనులు మొదలయ్యాయి. మెట్ట ప్రాంతానికి ప్రస్తుత వర్షాలు మరింత మేలు చేస్తాయంటున్నారు. తుని, ప్రత్తిపాడు, కిర్లంపూడి, కోరుకొండ, గోకవరం, సీతానగరం, పెద్దాపురం, రంగంపేట, గండేపల్లి, రాజానగరం తదితర మండలాల్లోని మెట్ట పొలాలన్నీ ప్రస్తుత వర్షాలకు ముమ్మరంగా ఖరీఫ్ పనులు చేపట్టేందుకు దోహదపడ్డాయి. మెట్ట ప్రాంతంలో మొత్తంగా కొన్ని చోట్ల ఆకుమడులు, మరి కొన్ని ప్రాంతాల్లో దమ్ములు, ఊడ్పులు జరుగుతున్నాయి. సీతానగరం, కోరుకొండ, రాజానగరం, గండేపల్లి, రాయవరం, కిర్లంపూడి, ప్రత్తిపాడు, జగ్గంపేట తదితర మండలాల్లో ముమ్మరంగా ఊడ్పులు జరుగుతున్నాయి. మెట్ట ప్రాంతం కంటే కాస్తంత ముందుగా కోనసీమ ప్రాంతంలో ఖరీఫ్ పనులు మొదలయ్యాయి. చాలా చోట్ల ఊడ్పులు పూర్తయ్యాయి. ఇటు ఈస్ట్రన్ డెల్టాలోనూ, అటు సెంట్రల్ డెల్టాలో కూడా ఖరీఫ్ పనులు ఊపందుకున్నాయి. శనివారం జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు మరింత ముమ్మరంగా వ్యవసాయ పనులకు అవకాశం కలిగిందని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. సకాలంలో వ్యవసాయ పనులు పూర్తయ్యే విధంగా ప్రస్తుత తరుణంలో కురుస్తోన్న వర్షాల వల్ల దిగుబడికి ఆస్కారం ఎక్కువగా వుందని అంచనా వేస్తున్నారు. దాదాపు ఇప్పటి వరకు జిల్లాలో 20 శాతం వరకు ఊడ్పులు అయినట్టుగా చెబుతున్నారు. ప్రస్తుత వర్షాల నేపధ్యంలో మరో వారం రోజుల్లో జిల్లా అంతటా ఊడ్పులు పూర్తయ్యే పరిస్థితి అనుకూలించిందని అంటున్నారు. ఇటు పుష్కర, చాగల్నాడు, ఏలేరు, సుబ్బారెడ్డి సాగర్, తొర్రిగడ్డ తదితర పధకాల కింద కూడా ఈ సారి ఖరీఫ్ పనులు సకాలంలో పూర్తవుతున్నాయని అంటున్నారు. శనివారం జిల్లాలోని అన్ని మండలాల్లోనూ భారీ వర్షం కురిసింది. రాజమహేంద్రవరంలో సుమారు రెండు గంటల పాటు ఎడతెరిపి లేకుండా కుంభవృష్టిగా వర్షం పడింది. మొత్తంమీద జిల్లా అంతటా ఈ వర్షాలకు ఖరీఫ్ పనులు ముమ్మరంగా పూర్తయ్యేందుకు దోహదపడుతున్నాయని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.
మాట నిలుపుకోకపోతే మరో ఉద్యమం
ఆంధ్రభూమి బ్యూరో
అమలాపురం, జూలై 23: కాపు రిజర్వేషన్లకు సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు మాట నిలుపుకోకపోతే మరో ఉద్యమం తప్పదని రాష్ట్ర కాపు రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు నల్లా విష్ణుమూర్తి హెచ్చరించారు. శనివారం అమలాపురంలోని కాపు ఉద్యమనేత దివంగత నల్లా సూర్యచంద్రరావు స్వగృహంలో విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తాము ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానం నెరవేర్చాలని కోరుతున్నామన్నారు. రిజర్వేషన్లపై చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన గడువు ముగిసిన నేపథ్యంలో ఆ విషయాన్ని గుర్తుచేసేందుకే ముద్రగడ పద్మనాభం ఉద్యమానికి శ్రీకారం చుట్టారని, దీనిలో రాజకీయ కోణం లేదన్నారు. రిజర్వేషన్లు కల్పిస్తే రాష్టవ్య్రాప్తంగా ఉన్న కాపులంతా తెలుగుదేశం జెండాలు పట్టుకుని ఆ పార్టీకి తిరిగి పట్టం కడతారని, లేకపోతే కూల్చేస్తారన్నారు. ముద్రగడ దీక్షలు చేపట్టిన సమయంలో కేసులు నమోదు చేసిన వారితో బాండ్లు తీసుకుని వేధించడంపై నల్లా మండిపడ్డారు. తాము ప్రభుత్వ ఆస్తులకు గాని, ఇతర కులాలకు గాని ఎక్కడా ఇబ్బందులు కలగకుండా నిరసన తెలిపామని, అయినా వేధించడం ఏమిటని ప్రశ్నించారు. ఇప్పటికే గ్రామస్థాయి నుండి ఉద్యమాన్ని నిర్వహించడానికి జెఎసిలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. కాపులంతా ముద్రగడ తీసుకునే నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నారని, ఆయన పిలుపు ఇచ్చిన వెంటనే ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని నల్లా స్పష్టంచేశారు. సమావేశంలో బండారు రామ్మోహనరావు, వంటెద్దు బాబి, అధికారి సత్యనారాయణమూర్తి, నల్లా పవన్, నల్లా సంజయ్, ఏడిద దొరబాబు, రంకిరెడ్డి రామలింగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
రుణమాఫీ చేయడమే లక్ష్యం
రావులపాలెం, జూలై 23: రాష్ట్ర ప్రభుత్వం విభజన వల్ల రూ.16079 కోట్ల లోటు బడ్జెట్టులో ఉన్నా ఇచ్చిన హామీకి కట్టుబడి రైతులకు రూ.24వేల కోట్లమేర రుణమాఫీ చేయాలనే లక్ష్యంతో ఉందని ఎమ్మెల్సీ రెడ్డి సుబ్రహ్మణ్యం అన్నారు. శనివారం సాయంత్రం స్థానిక అరటి మార్కెట్టు యార్డులో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్రంగానీ, నాబార్డు వంటి సంస్థలు గానీ సహకారం లేకుండానే దేశంలోనే మొట్టమొదటి సారిగా రూ.24వేల కోట్ల మేర రుణమాఫీ చేస్తున్న ఘనత రాష్ట్ర ప్రభుత్వానిదేనన్నారు. ఇప్పటికే రెండు విడతల్లో రుణమాఫీ రైతులకు అందజేశామని, వచ్చే మూడేళ్లల్లో పూర్తిగా రుణమాఫీ చేస్తామని చెప్పారు. ఈ నేపథ్యంలో కొత్తపేట నియోజకవర్గంలో వ్యవసాయ, ఉద్యాన పంటలు పండించే రైతులకు రూ.42కోట్ల మేర రుణమాఫీ చేస్తామన్నారు. ప్రభుత్వం ఏ హామీని అమలుచేయడం లేదని ఆరోపిస్తున్న ప్రతిపక్ష నేతలు గడపగడపకూ వైసిపి కార్యక్రమం చేసే ముందు గ్రామ పంచాయతీ గడప తొక్కితే అక్కడ ప్రభుత్వం అమలుచేస్తున్న అన్ని కార్యక్రమాల జాబితాలు ఉంటాయన్నారు. రైతు రుణమాఫి, పెన్షన్ల లబ్ధిదారుల జాబితాలు చూసి ఆ తర్వాత తమ కార్యక్రమాలు చేసుకుంటే బాగుంటుందని వైసిపి నేతలకు సూచించారు. రుణమాఫీయే కాకుండా రైతులకు చేయూతనందిస్తూ ప్రభుత్వ వ్యవసాయ యాంత్రీకరణ పథకానికి అమలుచేస్తోందన్నారు. కొత్తపేట నియోజకవర్గంలో రూ.1.36 కోట్ల మేర సబ్సిడీతో ప్రభుత్వం మూడవ దఫా యంత్రాలను రైతులకు అందజేస్తోందన్నారు. రావులపాలెం మండలంలో 121 యూనిట్లను రూ.41.3 లక్షల సబ్సిడీపై అందజేస్తున్నట్టు తెలిపారు. లబ్ధిదారులను పారదర్శకంగా ఎంపిక చేయాలని వ్యవసాయ శాఖ అధికారులకు సూచించినట్టు తెలిపారు. సమావేశంలో ఎఎంసి ఛైర్మన్ బండారు వెంకట సత్తిబాబు, ఆత్మ కమిటీ ఛైర్మన్ జక్కంపూడి వెంకటస్వామి, టిడిపి మండల శాఖ అధ్యక్షుడు గుత్తుల పట్ట్భారామారావు, నీటి సంఘం అధ్యక్షుడు పడాల బులికొండారెడ్డి, కుడిపూడి శ్రీనివాసు, పెచ్చెట్టి చిన్నారావు, ఎస్ జనార్ధనరాజు, ఎస్ రామకృష్ణంరాజు తదితరులు పాల్గొన్నారు.
ఎటియం దొంగ అరెస్టు
కాకినాడ సిటీ, జూలై 23: ఎటిఎంల వద్ద మాటువేసి, అమాయకుల కార్డులను చేజిక్కించుకుని, పెద్ద మొత్తంలో డబ్బులు కాజేస్తున్న తెలంగాణా రాష్ట్రానికి చెందిన ఒక మోసగాడిని కాకినాడ టూటౌన్ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. నిందితుడు రాజమండ్రి, తణుకు, గుడివాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, కాకినాడ ప్రాంతాలతో పాటు వినుకొండలో సైతం ఎటిఎం నేరాలకు పాల్పడి ఎట్టకేలకు పోలీసులకు పట్టుబడ్డాడు. ఈకేసుకు సంబంధించి టూటౌన్ ఎస్సై కె వంశీధర్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్ చింతల్ ప్రాంతానికి చెందిన రామిరెడ్డి రోషన్‌రెడ్డి అనే వ్యక్తి మణిపాల్ యూనివర్శీటిలో ఉన్నత విద్యను చదువుకుని చెడు వ్యసనాలకు బానిసగా మారి నిరుద్యోగులకు ఉద్యోగాలకు ఇప్పిస్తానని, ఎటిఎంల నుండి డబ్బులు ఏవిధంగా విత్‌డ్రాచేయాలో తెలియని వారికి సహకారం పేరుతో అమాయకులను ఎంచుకుని వారి కార్డును తష్కరించి డబ్బులు అక్రమంగా విత్‌డ్రాచేస్తు మోసాలకు పాల్పడుతున్నాడు. కాకినాడ రేచర్లపేటకు చెందిన పేకేటి సారథి అనే వ్యక్తి ఈనెల 9న భానుగుడి ప్రాంతంలో ఒక ఎటిఎం నుండి డబ్బులు విత్‌డ్రా చేసుకునేందుకు వెళ్లి డబ్బులు ఏవిధంగా తీసుకోవాలో తెలియక వేచిచూస్తుండగా ఒక వ్యక్తి అక్కడకు వచ్చి తాను విత్‌డ్రాచేసి ఇస్తానంటూ నమ్మబలికాడు. దీంతో ఆయన తన ఎటిఎం కార్డును ఆ వ్యక్తికి ఇచ్చి కొంత నగదును విత్‌డ్రాచేసి తీసుకున్నాడు. కొద్ది గంటల వ్యవధిలో మరికొంత సొమ్ము ఎటిఎం నుండి విత్‌డ్రా చేసినట్లు సారిథి సెల్‌ఫోన్‌కు బ్యాంకు నుండి సమాచారం అందింది. దీంతో సారథికి అనుమానం వచ్చి ఎటిఎం కార్డును చూడగా ఆ కార్డు మార్చబడి ఉంది. తాను మోసపోయానని గ్రహించిన బాధితుడు విషయాన్ని టూటౌన్ సిఐ చైతన్యకుమార్‌ను ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదుపై అప్రమత్తమైన సిఐ చైతన్యకృష్ణ వెంటనే విచారణ చేయాలని ఎస్సై కె వంశీధర్‌ను ఆదేశించడంతో బాధితుడు సారధి నుండి అనుమానితుని వివరాలను సేకరించి పలు ఎటిఎంల వద్ద పోలీస్ నిఘా ఏర్పాటుచేశారు. ఈనేపథ్యంలో సారధి ఇచ్చిన రూపురేఖల్లో ఉన్న వ్యక్తి శుక్రవారం రాత్రి భానుగుడి ప్రాంతంలో ఉన్న ఎటిఎం వద్దకు వచ్చాడు. అప్పటికే అక్కడ నిఘావేసి ఉన్న పోలీసులు ఆవ్యక్తిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించి విచారించగా అతనే ఎటిఎంల వద్ద ఇతరుల ఎటిఎంల కార్డుల నుండి డబ్బులు దోచుకుంటున్నట్లు గుర్తించారు. బాధితుడు సారధి నిందితుడిని గుర్తించడంతో శనివారం రోషన్‌రెడ్డిని అరెస్టుచేసి కోర్టులో హాజరు పరిచారు. రోషన్‌రెడ్డి సారధి ఎటిఎం కార్డును అతని వద్ద దాచి మరో కార్డును ఇచ్చి అసలు కార్డు ద్వారా సుమారు రూ.1.15 లక్షలు కాజేసినట్లు ఎస్సై వంశీధర్ తెలియజేశారు. ఇటువంటి నేరాలకు పాల్పడుతూ రోషన్‌రెడ్డి 4లక్షల రూపాయలకు పైగా ఇతరుల సొమ్ములను దోచుకున్నాడని చెప్పారు. అతను చేసిన నేరాలపై విచారణ జరుపుతున్నామని, నిందితుని పట్టుకోవడంలో కానిస్టేబుల్ కె రూఫ్‌కుమార్ కీలకపాత్ర పోసించినట్లు ఎస్సై వంశీధర్ తెలిపారు.
కాంగ్రెస్ కార్యకర్తల ధర్నా
రాజమహేంద్రవరం, జూలై 23: ఎపికి ప్రత్యేకహోదా విషయంలో అధికార బిజెపి, టిడిపి పార్టీలు ప్రజలను దగా చేశాయని డిసిసి అధ్యక్షుడు కందుల దుర్గేష్ ధ్వజమెత్తారు. ప్రత్యేకహోదా బిల్లును అడ్డుకోవడాన్ని నిరసిస్తూ శనివారం కాంగ్రెస్ కార్యకర్తలు స్థానిక కంబాలచెరువు వద్ద మానవహారాన్ని ఏర్పాటు చేసి, రాస్తారోకో జరిపారు. ఈకార్యక్రమంలో పాల్గొన్న కందుల మాట్లాడుతూ హోదా రాకుండా అడ్డుకుంటే ప్రజలు క్షమించరని హెచ్చరించారు. రాష్ట్భ్రావృద్ధికి ప్రత్యేకహోదా అత్యవసరమన్నారు. ఇప్పటికైనా ద్వంద్వ వైఖరిని విడనాడి ప్రత్యేకహోదా సాధన కోసం కలిసి రావాలని పిలుపునిచ్చారు. ఈకార్యక్రమంలో కార్పొరేటర్ రాయుడు సతీష్, కాంగ్రెస్ నాయకులు దాసి వెంకట్రావు, నరాల పార్వతి, లక్కోజు ఓంకార్, ఓగేటి రవికుమార్, ఎస్‌ఎం అన్సర్, నలబాటి శ్యామ్, ముంతా సుమతి, కిశోర్‌కుమార్‌జైన్, ముళ్ల మాధవ, కొల్లిమళ్ల రఘు తదితరులు పాల్గొన్నారు.

రాజమహేంద్రవరంలో కుండపోత
ఆంధ్రభూమి బ్యూరో
రాజమహేంద్రవరం, జూలై 23: రాజమహేంద్రవరంలో శనివారం కుండపోతగా వర్షం కురిసింది. లోతట్టు, పల్లపు ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షానికి ప్రధాన రోడ్లు సైతం జలమయం అయ్యాయి. సాయంత్రం ఐదున్నర నుంచి దాదాపు తొమ్మిది గంటల వరకు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి సాధారణంగా కాసింత వర్షానికే మునిగిపోయే రోడ్లే కాకుండా కొన్ని ప్రధాన రోడ్లు సైతం జలమయం అయ్యాయి. ప్రధాన రోడ్లు సైతం చెరువులను తలపించే విధంగా మారాయి. దీంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ స్ధంభించింది. లోతట్టు, పల్లపు ప్రాంతాలు ముంపుతో గంటల తరబడి జల దిగ్భంధమయ్యాయి. తుమ్మలావ, ఆర్యాపురం, గరికిపాటి రాజారావు, ఆదెమ్మదిబ్బ, నటరాజ్ టాకీస్, కంబాలచెరువు, దేవీచౌక్, రైల్వే స్టేషన్, కారల్ మార్క్స్ రోడ్లు తటాకాల్లా మారాయి. రైల్వే స్టేషన్ రోడ్డులో ఇటు ఐదు బళ్ళ జంక్షన్ నుంచి ఇటు పాల్ చౌక్ వరకు మునిగిపోవడంతో అమలాపురం వైపు వెళ్ళే ఆర్టీసీ బస్సులు మోరంపూడి జంక్షన్ నుంచి పదహారవ నెంబర్ జాతీయ రహదారి వైపుగా మళ్ళాయి. కాసింత వర్షానికే మునిగిపోయే కంబాలచెరువు హైటెక్ బస్ షెల్టర్ ఈ భారీ వర్షానికి చెరువుగా మారి వాహనాల రద్దీతో కెరటాల మయంగా మారింది. దీంతో కనీసం ఆ రోడ్డులో ఆర్టీసీ బస్సులు వచ్చి నిలుపుదల చేసే పరిస్థితి లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వై.జంక్షన్ సమీపంలో బస్సులు నిలుపుదల చేయాల్సి వచ్చింది. రైల్వే స్టేషన్ రోడ్డులో సుమారు మూడు గంటల పాటు ట్రాఫిక్‌కు ఇబ్బంది ఎదురైంది. వర్షపు నీటిలో పలు చోట్ల వాహనాలు చిక్కుకోవడంతో వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రస్తుతం నగరంలో డ్రెయిన్లు విస్తరణ పనులు జరుగుతున్నాయి. ముంపు ప్రాంతాలను ద ష్టిలో పెట్టుకునే ఇప్పటికే కొన్ని చోట్ల డ్రెయిన్లు లోతు చేశారు. ఎన్ని నిధులు వెచ్చించి డ్రెయిన్లను ఆధునీకరించినా నగరంలోని ముంపు సమస్యకు పరిష్కారం లభించడం లేదనేది ఈ వర్షాలకు మరో సారి రుజువైంది. అయితే ముంపు ఎదురైనా త్వరితగిన వర్షం నీరు లాగేయడం వల్ల దేవీచౌక్ తదితర ప్రాంతాల్లో ఇబ్బందులు తప్పాయి. మొత్తంమీద కుంభవ ష్టిగా ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షానికి నగరం తడిసి ముద్దయింది.
సామర్లకోటలో...
సామర్లకోట: సామర్లకోట పట్టణంలో శనివారం సాయంత్రం సుమారు గంటన్నరపాటు కుండపోత వర్షం కురిసింది. వర్షం దాటికి పట్టణంలో పల్లపు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. రైల్వేస్టేషన్ సెంటరు, ఆర్టీసీ బస్ కాంప్లెక్సు, జయలక్ష్మీటాకీసు రోడ్డు, ప్రెసిడెంటుగారీ వీధి, పోలీస్ స్టేషన్ ఏరియా, తెలుకులపుంత, పెద్దాపరం రోడ్డు పూర్తిగా నీటితో నిండిపోయాయి. ఆర్టీసీ బస్టాండులో బురద నీటిలోనే బస్సులు, ప్రయాణీకులు ప్రయాణాలు సాగించారు. డ్రైయిన్లలో నీరు పేరుకుపోవడంతో రోడ్లపైకి వర్షం నీరు పారింది.