S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

హెడ్ వర్క్స్ ఇఇ సస్పెన్షన్

ఏలూరు, జూలై 23 : పోలవరం ప్రాజెక్టు భూసేకరణ పనుల్లో అలసత్వం వహించిన హెడ్ వర్క్స్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరును సస్పెండ్ చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కాటంనేని భాస్కర్ చెప్పారు. స్థానిక కలెక్టరేట్‌లో శనివారం సాగునీటి ప్రాజెక్టుల భూసేకరణపై అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టరు భాస్కర్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టారని, ప్రాజెక్టు భూసేకరణ పనులను వేగవంతం చేసేందుకు అధికారులతో తాను వారం వారం సమీక్షలు నిర్వహిస్తున్నానన్నారు. ప్రాజెక్టు ముంపు మండలాలైన కుకునూరు, వేలేరుపాడు మండలాలకు చెందిన 24 గ్రామాలకు సంబంధించిన భూసేకరణ పనులపై సమీక్షకు ఇంత వరకు పోలవరం ప్రాజెక్టు హెడ్ వర్క్స్ జంగారెడ్డిగూడెం ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు హాజరుకావడం లేదని, ఇది విధుల పట్ల అతని తీవ్ర నిర్లక్ష్య ధోరణికి నిదర్శనమని, కావున సదరు ఎగ్జిక్యూటివ్ ఇంజనీరును సస్పెండ్ చేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తామన్నారు. సాగునీటి ప్రాజెక్టు పనులలో ఎవరు నిర్లక్ష్యంగా వ్యవహరించినా ఇదే పరిస్థితి ఎదుర్కోవలసి వస్తుందన్నారు. చింతలపూడి ఎత్తిపోతల పధకానికి సంబంధించి ఎల్‌పి షెడ్యూల్స్, డిజైన్స్ అందించడంలో జాప్యం చేస్తున్న గాయత్రీ ఏజెన్సీ మరో 15 రోజుల్లో మొయిన్ కెనాల్ డిజైన్స్ సమర్పించాలని, లేనిపక్షంలో ఏజెన్సీ తొలగిస్తామని గాయత్రీ ఏజెన్సీ ప్రతినిధులను హెచ్చరించారు. డెల్టా ఆధునీకరణకు సంబంధించి నందమూరు, ఆరుళ్ల గ్రామాలలో భూసేకరణ పూర్తి చేసి భూమిని స్వాధీనం చేసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. భూసేకరణ చేసిన భూమిని అధికారులు తక్షణమే స్వాధీనం చేసుకుని పనులు ప్రారంభించాలన్నారు. ఏలూరు, భీమవరం, తాడేపల్లిగూడెం, తణుకు, నర్సాపురం వంటి ప్రధాన పట్టణాలలో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు ప్రత్యామ్నాయ రోడ్లను గుర్తించి నిర్మించాలని రోడ్లు, భవనాల శాఖ సూపరింటెండింగ్ ఇంజనీరును కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో జెసి పి కోటేశ్వరరావు, జెసి-2 షరీఫ్, భూసేకరణల ప్రత్యేక కలెక్టర్ భాను ప్రసాద్, డి ఆర్‌వో కె ప్రభాకరరావు, నర్సాపురం సబ్ కలెక్టరు ఎ ఎస్ దినేష్‌కుమార్, ఐటిడి ఏ పివో షాన్ మోహన్, ఆర్డీవోలు తేజ్‌భరత్, శ్రీనివాస్, లవన్న, భూసేకరణల స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు డి పుష్‌పమణి, సూర్యనారాయణ, సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టరు రంగలక్ష్మీదేవి, రోడ్లు భవనాల శాఖ ఎస్ ఇ నిర్మల, డిపివో కె సుధాకర్, ఇరిగేషన్ ఎస్ ఇ శ్రీనివాసయాదవ్, వ్యవసాయ శాఖ జాయింటు డైరెక్టరు సాయిలక్ష్మీశ్వరి తదితరులు పాల్గొన్నారు.
చినకాపవరం పాఠశాలను పరిశీలించిన డిఇఒ
ఆకివీడు, జూలై 23: మండలంలోని చినకాపవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను శనివారంనాడు జిల్లావిద్యాశాఖ అధికారి మధుసూదనరావు పరిశీలించారు. పాఠశాల ఆవరణలోని ప్రాంతాలను, తరగతి గదులు, వంటశాలను కూడా పరిశీలించారు. అనంతరం అస్వస్థతకు విద్యార్థిని, విద్యార్థుల ఇళ్లకు వెళ్లి వివరాలు అడిగితెలుసుకున్నారు. తల్లిదండ్రులు ఎటువంటి ఆందోళనకు గురికావ్వద్దని ఆయన భరోసా ఇచ్చారు. ఈనెల 26వ తేదీన ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక శిబిరం ఏర్పాటుచేసి వైద్యపరీక్షలు చేస్తామని చెప్పారు. ఈయన వెంట పాఠశాల ప్రధానోపాధ్యాయులు రామానుజచార్యులు, సర్పంచ్ దారపురెడ్డి కనకయ్య, ఇందుకూరి సత్యనారాయణరాజు, మర్రివాడ వెంకటరమణ తదితరులు ఉన్నారు.
బిజెపి ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం
ఏలూరు, జూలై 23 : కాంగ్రెస్, యువజన కాంగ్రెస్ జిల్లా శాఖల ఆధ్వర్యంలో శనివారం వసంతమహల్ సెంటర్‌లో బిజెపి ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేసి శుక్రవారం పార్లమెంటులో జరిగిన సంఘటన పట్ల నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో బిజెపి, టిడిపిలు కూడా ప్రత్యేక హోదా అవసరమని అంటూ పార్లమెంటులో కెవిపి రామచంద్రరావు ప్రవేశపెట్టిన ప్రత్యేక హోదా బిల్లును ప్రవేశపెట్టనీయకుండా చర్చకు రానీయకుండా టిడిపి, బిజెపి నాయకులే అడ్డుపడ్డారని, దీన్నిబట్టి ప్రత్యేక హోదాకు బిజెపి, టిడిపిలు ఆసక్తి చూపడం లేదనేది తేటతెల్లమవుతుందని కాంగ్రెస్, యువజన కాంగ్రెస్ నాయకులు రాజనాల రామ్మోహనరావు, పెద్దిరెడ్డి సుబ్బారావులు వ్యాఖ్యానించారు. కొద్దిసేపు నినాదాలతో హోరెత్తించారు. ఈ కార్యక్రమంలో నాయకులు పెద్దిరెడ్డి ప్రదీప్, ఏపూరి సతీష్, అంకెం సీతారామ్, ఈదుల వెంకటేశ్వరరావు, మిద్దే వెంకటేశ్వరరావు, భోసెట్టి సోములు, ఎస్ బాబూ ప్రసాద్, మహిళా ప్రతినిధులు దండుపాటి అప్పలనర్సమ్మ, గెడ్డం ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.
సేంద్రియ ఎరువులతో
పండించిన ఆహారోత్పత్తులపై
అవగాహన పెంపొందించాలి
జాయింట్ కలెక్టర్-2 ఎంహెచ్ షరీఫ్
ఏలూరు, జూలై 23 : సేంద్రియ ఎరువులు ద్వారా పండించిన ఆహారోత్పత్తులపై రైతుల్లో, ప్రజల్లో అవగాహన పెంపొందించాలని జాయింట్ కలెక్టర్-2 ఎంహెచ్ షరీఫ్ చెప్పారు. శనివారం స్థానిక ఐ ఎడిపి హాలులో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సేంద్రియ ఉత్పత్తులు ప్రదర్శన కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సేంద్రియ వ్యవసాయంపై రైతుల్లో ఆసక్తిని పెంపొందించి తద్వారా వచ్చిన ఉత్పత్తులపై డిమాండ్ పెరిగేందుకు చర్యలు తీసుకోవాలని ఆయన వ్యవసాయాధికారులకు సూచించారు. సేంద్రియ ఆహారోత్పత్తులను వాడడం ద్వారా ప్రజల్లో వచ్చే వ్యాధులను నివారించవచ్చునని ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే సేంద్రియ ఆహారోత్పత్తులను వినియోగించుకోవాలని చెప్పారు. జిల్లాలో సేంద్రియ వ్యవసాయ పద్దతి ద్వారా ఆహారోత్పత్తులను పెంపొందించుకునేందుకు ఎక్కువ అవకాశమున్నందున ప్రభుత్వం వ్యవసాయదారులను ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకుంటున్నదని చెప్పారు. ఉత్పత్తి డిమాండ్ రేటు ఎక్కువగా ఉంటే రైతు ఆసక్తి చూపించే అవకాశం వుంది కావున సేంద్రియ పద్దతుల ద్వారా ఆహారోత్పత్తులను వినియోగించుకునేందుకు ప్రజల్లో అవగాహన కల్పించాలని చెప్పారు. సేంద్రియ ఆహారోత్పత్తుల ఉపయోగంపై విద్యార్ధినీ విద్యార్ధులకు అవగాహన కల్పించి భవిష్యత్తులో పిల్లలు ఆర్గానిక్ ఆహారాన్ని తీసుకునేందుకు అవకాశం కలుగుతుందని ఈ ఉద్దేశ్యంతో ప్రభుత్వం పాఠశాలలకు సేంద్రియ వ్యవసాయ విత్తనాలను పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పారు. వ్యవసాయ శాఖ జెడి సాయి లక్ష్మీశ్వరి మాట్లాడుతూ సేంద్రియ ఆహారోత్పత్తులు జిల్లాలో విస్తృత ప్రచారం ద్వారా అభివృద్ధి చేసినట్లయితే ఇతర రాష్ట్రాల్లోనూ, ఇతర దేశాల్లోనూ కూడా ఈ కార్యక్రమంపై మంచి ఆసక్తి కలుగుతుందని, ప్రభుత్వం ఈ విషయంపై రైతులకు అవగాహన కలిగించి సేంద్రియ పద్దతులు ద్వారా ఆహారోత్పత్తులు పెంపొందించేందుకు చర్యలు చేపట్టడం జరుగుతుందని చెప్పారు. ఈ నెల 23, 24 తేదీల్లో వ్యవసాయ శాఖ కార్యాలయ ఐ ఎడిపి హాలులో సేంద్రియోత్పత్తుల ప్రదర్శన నిర్వహణ ద్వారా జిల్లాలో విస్తృత ప్రచారం గావించి రైతులకు, విద్యార్ధులకు, ఉద్యోగులకు అవగాహన కలిగించేందుకు చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. ఆత్మ పిడి ఆనందకుమారి మాట్లాడుతూ ఆర్గానిక్ ఫామింగ్ ద్వారా ప్రభుత్వం ఎన్నో చేయాలని ఆశిస్తున్నదని, ప్రణాళిక ద్వారా ఆర్గానిక్ ఫుడ్ ఉత్పత్తులను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు చర్యలు చేపడతామని చెప్పారు. అగ్రికల్చరల్ డిడి వరలక్ష్మి మాట్లాడుతూ సేంద్రియ వ్యవసాయ శిక్షణా కేంద్రాల ద్వారా రైతులకు శిక్షణ ఇవ్వడం జరుగుతుందని, సేంద్రియ వ్యవసాయంపై రైతులు అభివృద్ధి సాధించి ప్రజలకు మరింత మేలైన ఆహారోత్పత్తులను అందించేందుకు రైతులు ముందుకు రావాలని చెప్పారు. కార్యక్రమంలో జెసి-2 తొలుత సేంద్రియోత్పత్తుల ద్వారా తయారు చేసిన సేంద్రియ ఎరువులు, ఆహారోత్పత్తుల ఎగ్జిబిషన్‌ను పరిశీలించారు. కార్యక్రమంలో అగ్రికల్చరల్ డిడిలు అనురాధ, ప్రసాద్, సుధారాణి, తాతారావు, ఆర్గానిక్ ఎడి ఏ వై సుబ్బారావు, వ్యవసాయ ఉప సంచాలకులు పి ఎల్ వరలక్ష్మి, తూర్పు, కృష్ణాజిల్లాల ఆర్గనిక్ వ్యవసాయ రైతులు తదితరులు పాల్గొన్నారు.
పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధి నిధులతో గ్రామీణాభివృద్ధి
ఉండి, జూలై 23: గ్రామీణ ప్రగతికి పార్లమెంట్ నియోజకవర్గం అభివృద్ధి నిధులు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని నర్సాపురం పార్లమెంట్ సభ్యులు గోకరాజు గంగరాజు అన్నారు. మండలంలోని కోలమూరు గ్రామంలో పలు సిసి రోడ్లను ఎమ్మెల్యే శివరామరాజుతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన కోలమూరు అరుంధతిపేటలో ఎంపి మాట్లాడుతూ తమ పార్లమెంటు అభివృద్ధి నిధులు పూర్తిగా సద్వినియోగం చేస్తున్నట్లు చెప్పారు. ప్రాధాన్యతాక్రమంలో డ్రెయిన్లు, సిమెంట్ రోడ్లు నిర్మాణంతోపాటు మంచినీటి పథకాలు చేపట్టినట్లు చెప్పారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శివరామరాజు మాట్లాడుతూ కోలమూరు గ్రామంలో రక్షిత మంచినీటి సమస్య పరిష్కారానికి కృషిచేస్తామని హామీ ఇచ్చారు. కొందరు రైతులు మాట్లడుతూ ఆక్రమణలు ఫలితంగా పంటకాలువ అబివృద్ధి ఆగిపోతోందని ఎమ్మెల్యే శివరామరాజు దృష్టికి తీసుకొచ్చారు. స్పందించిన ఎమ్మెల్యే శివరామరాజు వెంటనే ఇరిగేషన్ డిఇని పిలిచి సర్వే చేయించి కాలువ అభివృద్ధికి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. మరికొందరు పాఠశాల ప్రాంగణం చుట్టూ ఉన్న డ్రెయిన్ అభివృద్ధి చేయాలని కోరారు. ఈ సమస్య కూడా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి దలియాలక్ష్మి, జడ్పీటిసి కరిమెరక వెంకట సత్యతులసి, టిటిడి బోర్డు సభ్యులు గోకరాజు రామరాజు, బిజెపి జిల్లా అధ్యక్షులు భూపతిరాజు శ్రీనివాసవర్మ, పంచాయతీ సర్పంచ్ నేతల మార్టిన్, ఉపసర్పంచ్ గోపాలకృష్ణంరాజు, కూనపరాజు రాంబాబు, జుత్తిగ శ్రీనివాస్, పాల్గొన్నారు.
జాతీయ పట్టణ జీవనోపాధి రాష్టప్రాలకమండలి
కార్యనిర్వహణ కమిటీ సభ్యురాలిగా రత్నమాల
నరసాపురం, జూలై 23: జాతీయ పట్టణ జీవనోపాధి రాష్టప్రాలకమండలి కార్యనిర్వహణ కమిటీ సభ్యులుగా నరసాపురం మున్సిపల్ ఛైర్‌పర్సన్ పసుపులేటి రత్నమాలను ప్రభుత్వం ఎంపిక చేసింది. ఈ పాలకమండలి ఛైర్మన్‌గా ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యవహరిస్తారు. పట్టణ ప్రజల జీవనోపాధికి సంబంధించి కేంద్రం నుంచి వచ్చే నిధులను సద్వినియోగం చేసుకోవడం, నిధుల పర్యవేక్షణ, పథకాల అమలు, సలహాలు తదితర అంశాలను రాష్టస్థ్రాయి పాలకమండలి పర్యవేక్షించనుంది. జాతీయ పట్టణ జీవనోపాధి రాష్టప్రాలకమండలి సభ్యులుగా ఎంపికైన రత్నమాలను ఈ సందర్భంగా శనివారం కౌన్సిలర్లు అభినందించారు. అబేదాసుల్తానా, సుధారాణీ, శ్రీదేవి, నాగజ్యోతి, బి. సీతారాముడు, భారతలక్ష్మణ, టిడిపి నాయకులు లక్ష్మీనారాయణ, కొప్పాడ రాజు తదితరులు పుష్పగుచ్చం అందచేసి అభినందనలు తెలియజేశారు.

గడువు తేదీలోగా హామీ అమలు చేయకపోతే
తాడిపూడి కాలువ వద్ద బైఠాయంపు
ఎమ్మెల్యే
ముప్పిడి
దేవరపల్లి, జూలై 23: రైతులకు ఇచ్చిన హామీ గడువు తేదీలోగా అమలు చేయకపోతే తాడిపూడి కాలువ వద్ద తాను బైఠాయిస్తానని గోపాలపురం ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు ఇరిగేషన్ అధికారులను హెచ్చరించారు. దేవరపల్లి మండల పరిషత్ కార్యాలయంలో శనివారం తాడిపూడి కాలువ ఆయకట్టు రైతుల సదస్సులో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముప్పిడి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎంతో ప్రతిష్ఠాత్మకంగా 2004లో తాడిపూడి లిఫ్ట్ ఇరిగేషన్‌కు శంకుస్థాపన చేశారని, టిడిపి అధికారంలోకి వచ్చాక తాడిపూడి ఆయకట్టు రైతులకు 2 లక్షల 60 వేల ఎకరాలకు సాగునీరు ఇవ్వాలన్న సంకల్పంతో పనులు వేగవంతం చేశారని తెలిపారు. ఇరిగేషన్ అధికారుల నిర్లక్ష్య ధోరణి కారణంగా ఆయకట్టు రైతులకు పూర్తిస్థాయిలో సాగునీరు అందించలేక పోతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడిపూడి కాలువకు 5 లిఫ్టులు ఉన్నాయని, మొదటి లిఫ్టు ద్వారా మాత్రమే నీరు సక్రమంగా అందుతోందని చెప్పారు. మిగిలిన నాలుగు లిఫ్టుల ద్వారా నీరు అందడం లేదని రైతులు వాపోతున్నారన్నారు. లిఫ్ట్-2లో గుడ్డిగూడెం నుండి పొంగుటూరు వరకు నీరు సక్రమంగా అందడం లేదని చెప్పారు. జగన్నాథపురం, చిన్నాయగూడెం, గోపాలపురం రైతులు అసంతృప్తితో ఉన్నారన్నారు. లిఫ్ట్-3లో పల్లంట్ల, కురుకూరు, లక్ష్మీపురం గ్రామాలకు చెందిన రైతులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. ఫీడింగ్ ఛానల్ ద్వారా కూడా నీరు రావడం లేదని ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు ఎస్‌ఇ శ్రీనివాస్ దృష్టికి తెచ్చారు. ఆయా లిఫ్టులకు సంబంధించిన ఇఇలు దేవప్రకాష్, చినబాబు మాట్లాడుతూ కొన్ని సాంకేతిక కారణాల వల్ల నీరు అందించలేక పోతున్నామన్నారు. కురుకూరు వద్ద కాపర్ ప్లేట్లు చోరీకి గురయ్యాయని, దీనికి రూ.లక్ష వ్యయమవుతుందని చెప్పారు. ఈమేరకు దేవరపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామని తెలిపారు. లిఫ్ట్-2లో కొంత భూసేకరణ చేయాల్సి ఉందని, ఈ నెలాఖరుకు పూర్తిస్థాయిలో నీరందిస్తామని రైతులకు హామీ ఇచ్చారు. ఇరిగేషన్ ఎస్‌ఇ శ్రీనివాస్ మాట్లాడుతూ తాడిపూడి కాలువ ద్వారా నిర్దేశించిన స్థాయిలో సాగునీరు అందించడానికి కృషిచేస్తామన్నారు. ఈ సందర్భంగా తాడిపూడి ఆయకట్టుకు చెందిన రైతులు 10 మంది నిరసన వ్యక్తం చేశారు. ముప్పిడి జోక్యం చేసుకుని వారికి సర్దిచెప్పారు. కార్యక్రమంలో ఇఇలు గంగరాజు, ఆదిశేషయ్య, డిఇలు సత్యదేవ, రామకోటేశ్వరరావు, శ్రీనివాస్, జడ్పీటీసీలు కొయ్యలమూడి సుధారాణి, కొఠారు అనంతలక్ష్మి, ఎం లక్ష్మీరమణి, ఇన్‌ఛార్జి ఎడీవో శ్రీనివాస్, రైతు నేతలు ఉండవల్లి సుభాష్‌చంద్రబోస్, ఈలి శరత్, కొండపల్లి దొరయ్య, కాట్రు సత్యనారాయణ, కాట్రు భీమరాజు, ఈలపోలు చిన్ని, పరిమి రామకృష్ణ, గోపాలపురం, దేవరపల్లి, నల్లజర్ల, మండలాలకు చెందిన సుమారు 300 మంది రైతులు పాల్గొన్నారు.
శ్రీనివాసునికి బంగారు పుష్పాలతో అర్చన
ఏలూరు, జూలై 23 : రామచంద్రరావుపేటలోని శ్రీ వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో స్వామివారికి శనివారం భక్తులు సామూహికంగా బంగారు పుష్పాలతో అర్చనలు నిర్వహించారు. భగవద్గీత పారాయణ మండలి ప్రతినిధులు సామూహికంగా భగవద్గీతను పఠించారు. స్వామివారికి ప్రీతికరమైన రోజు కావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు దర్శించుకుని తీర్ధప్రసాదాలు స్వీకరించారు. ధ్వజస్థంభాల వద్ద దీపాలను వెలిగించి పసుపు, కుంకుమలతో అర్చనలు జరిపి కర్పూర జ్యోతులను వెలిగించి నివేదనలతో ఆరాధించారు. ఆలయ నిర్వాహకులు భక్తులకు అన్నప్రసాద వితరణ ఏర్పాటు చేశారు. ఆలయ కార్యనిర్వహణాధికారి బి కిషోర్‌కుమార్, సిబ్బంది శ్రీనివాస్, గంగాధర్ భక్తులకు తగు ఏర్పాట్లు చేయగా ఆలయ అర్చకులు ఇల్లిందల శ్రీనివాసాచార్యులు, కిళాంబి మారుతీ శ్రీనివాస రామానుజాచార్యులు, సత్యనారాయణాచార్యులు పూజలు చేయించారు. గోవింద నామ స్మరణలతో ఆలయ ప్రాంతం మార్మోగింది.
రుణాలు ఓవర్ డ్యూ వెళ్లకుండా చర్యలు చేపట్టాలి:కలెక్టర్
ఏలూరు, జూలై 23 : స్ర్తినిధి, గ్రూపుల ద్వారా బ్యాంకింగ్ లింకేజ్ ద్వారా తీసుకున్న రుణాలన్నీ ఎప్పటికప్పుడు ఓవర్ డ్యూ వెళ్లకుండా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కాటంనేని భాస్కర్ ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లో వెలుగు ఏరియా కో ఆర్డినేటర్లు, డిస్ట్రిక్ట్ ప్రాజెక్టు ఆఫీసర్లతో డి ఆర్‌డి ఏ ద్వారా చేపట్టే స్ర్తినిధి పధకం, అన్న సంజీవని జనరిక్ మందులు, డిజిటల్ లిటరసీ, వర్మీకంపోస్టు అంశాలపై కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బ్యాంకు రికవరీ గత వారంతో పోల్చుకుంటే ఈ వారం కూడా ఏమి ప్రగతి జరగలేదని, ఎపి ఎంలు, డిపి ఎంలు క్షేత్రస్థాయిలో లోన్ రికవరీలను ఎందుకు చేయడం లేదని ఆయన ప్రశ్నించారు. గోపాలపురం, బుట్టాయిగూడెం, కామవరపుకోట, బూరగంపాడు, వేలేరుపాడు, ఇతర మండలాల్లో కూడా పది లక్షల మించి ఉన్న రికవరీ చేయవలసిన వారందరూ కూడా వారానికి కనీసం మూడు లక్షల నుంచి అయిదు లక్షల రూపాయలు రికవరీ చేయవలసి వుంటుందని, లేని ఎడల వారి పనితీరు మెరుగుపరుచుకోకపోతే వారు వేరే ఉద్యోగాలు చూసుకోవచ్చునని కలెక్టర్ సూచించారు. స్ర్తినిధి పధకం ద్వారా చింతలపూడి, కొయ్యలగూడెం, ఇతర మండలాల్లో రెండు కోట్ల 61 లక్షల రూపాయలు ఓవర్ డ్యూ అయిపోయిందని, దానిని నాలుగు వాయిదాలు మొత్తం సొమ్మును రికవరీ చేయవలసిందిగా కలెక్టరు ఆదేశించారు. జిల్లాలో 1110 స్వయం సహాయక బృందాలుండగా కొన్ని గ్రూపులు డి, సి గ్రేడ్‌లో వున్నాయని వారి పనితీరును ప్రతీ నెలా సమీక్షిస్తామని అన్ని గ్రూపులు ఏ, బి గ్రేడులో ఉండే విధంగా గ్రూపు మెంబర్స్‌ను ప్రోత్సహించాలని చెప్పారు. ఆగస్టు మొదటి వారం కల్లా డి గ్రేడులో వున్న వారిని తొలగించడం జరుగుతుందని ఆయన హితవు పలికారు. జిల్లాలో వెలుగు ద్వారా పెనుమంట్ర మండలంలో దీర్ఘకాల వ్యాధులు బిపి, షుగర్, గ్యాస్ట్రోస్టిక్ ఇతర వ్యాధులతో బాధపడుతున్న వారికి ఒక సర్వే నిర్వహించి 4900 మందిని ఒక సర్వే నిర్వహించగా వారు ఆరు లక్షల 92 వేల రూపాయలు విలువ చేసే మందులను అన్న సంజీవని ద్వారా కొనుగోలు చేసారని జిల్లాలో దీనిని ఆదర్శంగా తీసుకుని ప్రతీ మండలంలో సర్వే చేసి అన్న సంజీవని ద్వారా మందులు కొనేటట్లుగా చేసిన ఎడల ప్రజలకు ఎంతో మేలు చేసినట్లవుతుందని పేదవారి ఆర్ధిక పరిస్థితిని గ్రహించి వారికిది ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. ఇక ముందు ప్రతీ ఆసుపత్రి అన్న సంజీవని జనరిక్ మందులనే కొనవలసి వుంటుందని చెప్పారు. జిల్లాలో పనిచేసిన ప్రభుత్వాసుపత్రులు, పిహెచ్‌సి ఆసుపత్రుల్లో పనిచేసే డాక్టర్లు తప్పనిసరిగా అన్న సంజీవని జనరిక్ మందులనే వ్రాయవలసి వుంటుందని డి ఎంహెచ్ వో, డిసిహెచ్ ఎస్‌లను కలెక్టర్ ఆదేశించారు.

నీటిగుంటలో పడి బాలుడు మృతి
ఆకివీడు, జూలై 23: ఆడుకుంటూ రెండేళ్ల బాలుడు నీటిగుంటలో పడి మృతిచెందిన సంఘటన శనివారంనాడు మండలంలోని చినమిల్లిపాడు గ్రామంలో జరిగింది. నత్తా ఏసేబు కుమారుడు రెక్కీ (2) తోటి పిల్లలతో కలిసి ఆడుకుంటూ పంచాయతీకి చెందిన మంచినీటి ట్యాంకు సమీపంలోని వాల్‌గుంటలో పడిపోయాడు. అయితే బాలుడి గురించి చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికారు. చివరకు గుంటలో పడి మృతిచెందాడన్న విషయం తెలుసుకున్న కుటుంబీకులు శోకసముద్రంలో మునిగారు. పంచాయతీ నిర్లక్ష్యం వల్లే తమ కుమారుడు చనిపోయాడని తల్లి ధనలక్ష్మితో పాటు బంధువులు ఆందోళనకు దిగారు.