S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

హరివంశం 194

అపుడు శ్రీకృష్ణుడు దానిని తలకిందులు చేసి రెండు కాళ్ళు దొరకబుచ్చుకుని గిరగిర తప్పి నేలమీద కొట్టి చంపివేయాలని అనుకొంటూ ఉండగా ఆ ఉగ్రజ్వరాధిదేవత కుయ్యో మొర్రో అని ఆక్రోశించింది. అపుడు కృష్ణ కృష్ణ! జ్వరాన్ని కడతేర్చవద్దు. కరుణించి బతకనివ్వు అని అశరీరవాణి కృష్ణుణ్ణి అర్థించింది. కృష్ణుడు కరుణించాడు. ఆ జ్వరం ఆయన కాళ్ళమీద పడి లోకంలో జ్వరమంటూ ఒక శక్తికే ఉనికి ఉండేట్లూ, ప్రతి సృద్ధిని ఉపసంహరించవలసిందిగాను పరి పరి విధాలా వేడుకొన్నది. అప్పుడు వాసుదేవుడు ఆ ఉగ్ర జ్వరాధి దేవత పట్ల జాలి వహించి తాను సృష్టించిన ప్రతి సృద్ధిని తనలోనే లీనం చేసుకున్నాడు. మనుష్య స్థావర తిర్యక్కులలో నీ ప్రభావం చెల్లుతుంది అని కూడా ఆ జ్వరాధిదేవతకు వరమిచ్చాడు. అప్పుడా జ్వరాధిదేవత చేతులు మోడ్చి శిరసొగ్గి ‘త్రిపురాంతకుడు నన్ను సృష్టించాడు. ఇప్పటివరకు అప్రతిహతంగా నేను లోకాలను నా వశంలో ఉంచుకున్నాను. ఇప్పుడు నీకు దాసోహమన్నాను. ఈ ఆజ్ఞ ఏమిటో చెప్పు. దానిని అవశ్యం నిర్వహిస్తాను అని ఆయనను ప్రార్థించింది.
అప్పుడు శ్రీకృష్ణ చంద్రుడు నీవు నాకేమీ ఊడిగం చేయనక్కరలేదు. నిన్ను నేను మర్తించి నీ పీచమణచిన వృత్తాంతాన్ని ఎవరైతే భక్తితో స్మరిస్తారో, పఠిస్తారో, ఎవరైనా విన్పించినప్పుడు భక్తిశ్రద్ధలతో వింటారో వారి జోలికిగాని, నీ పరివార భృత్యవర్గం కాని సోకటానికి సమీపించటానికి ఎంత మాత్రం వల్లకాదు. ఇదే నేను నిన్ను అనుశాసించేది. అట్లా మసులుకో అని ఆనతివ్వగానే అది మొక్కి ఆ హవభూమినుంచి అంతర్థానమైంది.
ఆ తరువాత ఆ ముగ్గురు వీరులు బాణుడి సైన్యాన్ని కకావికలం చేస్తూ విజృంభించి వైరి వీరులను దునుమాడుతుండగా వారంతా పిక్కబలం చూపారు. ఇది చూసి బాణుడికి క్రోథావమానాలు, మచ్చరం ముప్పిరిగొన్నాయి. సైనికులనుద్బోధిస్తూ నేనుండగా మీకు భయమెందుడు? నన్ను చూసి అరివీర విక్రమంగా సాహసించండి. మీ పరాక్రమం సామాన్యమా? దిక్పాలకులను మట్టికరిపించారు. దేవతలను గడగడలాడించారు. శత్రుమూకలను కాందిశీకులను చేశారు’ అని వాళ్ళను రెచ్చగొట్టారు. మళ్లీ అందరూ యుద్ధ వ్యూహాలు పన్ని ఉత్సాహం తెచ్చుకున్నారు.
బాణుడు మళ్లీ వాళ్లకిట్లా ధైర్యం చెప్పాడు. ‘త్రినయనుడు నాకు వరప్రదాత. శాంభవి నన్ను కన్నతల్లిలాగా చూసుకుంటున్నది. కుమారస్వామి నా సోదరుడు. ఈ నగరిలో ఎవరూ అడుగిడజాలరని మహేశ్వరుడు నాకు రక్షణ వలయం కల్పించాడు. ఇప్పుడు ఈ ముగ్గురినీ ద్వారక దారి పట్టిస్తాను. పరిగెత్తి పారిపోయేట్లు చేస్తాను అని బాణాసురుడు ప్రగల్భాలు పలికాడు. అయినా సుదర్శనాయుధుడి పంచాయుధాలు కంటబడేసరికి బాణాసురుడి ప్రముఖ సేనాధిపతులు కాళ్ళు గడగడ వణికాయి. వెన్ను చూపటానికే తహతహలాడారు కాని ముందు నిలవటానికి ఎవరూ కాళ్ళు కదపలేదు.
తన ప్రియభక్తుడి ఈ దైన్యం ఈశ్వరుడి మనసులో తోచగా ఆయన ఇక ఉపేక్షించలేకపోయినాడు. సింహరథ్యమూ వృషభకేతూజ్జ్వలమూ, నందీశ్వర సారథ్యమూ, రత్న సందీప్త విరాజితమూ అయిన రథం ఎక్కి రణరంగానికి తరలివచ్చాడు. విలయం రాబోతున్నదా అన్నంత భయంకరంగా హరుడి ఆటోపం రణరంగంలోని ఇరుపక్షాలను దిగ్భ్రమకొలిపింది. ఆయన పక్కనే గుహుణ్ణి (కుమారస్వామిని) చూసి వారు మరింత భీతచకితులైనారు. ఇక ప్రమథ గణాల కోలాహలానికి అప్పుడు అంతులేదు.

ఇంకాఉంది

- అక్కిరాజు రమాపతిరావు