S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

బోనం అందుకునే బళ్ళారి దుర్గమ్మ

అమ్మలగన్న అమ్మ బళ్ళారి దుర్గమ్మ. బళ్ళారి చుట్టుప్రక్కల ప్రాంతాల ప్రజలు ఎంతో భక్తిశ్రద్ధలతో దుర్గమ్మను అనునిత్యం పూజలు చేస్తూ అమ్మవారిని కొలుస్తున్నారు. బళ్ళారికి వెళ్ళే ప్రతి ఒక్కరూ దుర్గమ్మ దేవాలయానికి వెళ్ళి పూజలు చేసి తరిస్తున్నారు. ఎన్నో మహిమలుగల తల్లిగా కోర్కెలు తీర్చే దేవతగా భక్తులు ఆరాధిస్తున్నారు. దుర్గమ్మ అంటే సాక్షాత్తూ శక్తిస్వరూపిణి. శక్తి స్వరూపిణి అయిన దుర్గమ్మ అమ్మవారు ఎన్నో సంవత్సరాల క్రితం పుట్టలో సూక్ష్మరూపంలో దుర్గమ్మతల్లి స్వయంభూగా వెలసినట్లు స్థల పురాణం చెబుతుంది. పుట్టలో స్వయంభూగా దుర్గమ్మ వెలిసింది కాబట్టి అమ్మను పుట్టలమ్మగా కూడా భక్తులు పిలుచుకుంటూ పూజలు చేస్తున్నారు. బళ్ళారిలో కొలువై వున్న దుర్గమ్మ అష్టనేత్రాయుక్తంగా భక్తులకు దర్శనం ఇస్తుంది. వందల సంవత్సరాల క్రితం పుట్టలో వెలిసిన అమ్మవారు ఆలయ ముఖద్వారంపై కనకదుర్గగా దర్శనం ఇస్తుంది. సూక్ష్మరూపంలో పుట్టలో వెలిసిన దుర్గమ్మను పుట్టపైనే వుంచి పుట్టకే ఎనిమిది నేత్రాలతో వెండి ఆభరణములతో అలంకరించి అమ్మకు పూజా నైవేద్యాలతో ప్రతిరోజు పూజలు చేస్తున్నారు. ఎనిమిది నేత్రాలతో భారీ పుట్టపై అమ్మవారి ముఖాన్నిపెట్టి రజిత కవచాలతో అమ్మవారిని అలంకరిస్తారు. సూక్ష్మరూపిణిగా వెలిసిన పుట్టకే అమ్మవారిగా అలంకరించి పూజలు చేస్తారు. 200 సంవత్సరాల క్రితం అమ్మవారి దేవాలయాన్ని నిర్మించారు. ఈ దేవాలయం విశాలమైన మైదానంలో వుంది. బళ్ళారిలో అంటువ్యాధులు ప్రబలి ప్రజలు చనిపోతున్న సమయంలో ప్రజలను దుర్గమ్మ అంటువ్యాధుల బారినుంచి రక్షించిందని చరిత్ర చెబుతుంది. అందువల్ల ఆనాటినుంచి భక్తులు దుర్గమ్మ బోనాలను తీసుకొని మేళ తాళాలతో వచ్చి అమ్మవారికి నైవేద్యం సమర్పించి జంతువధ ఇచ్చి పూజలు చేయటం ఈనాటికీ ఆనవాయితీగా ఎన్నో సంవత్సరాల నుంచి కొనసాగటం అమ్మవారి మహిమకు తార్కాణం. అమ్మవారికి మొక్కులను సమర్పించుకొని భక్తులు తమ భక్తిప్రపత్తులను చాటుకుంటున్నారు. దుర్గమ్మ దేవాలయం ఆవరణలోనే పూజారుల సమాధులు వున్నాయి. పూజారుల సమాధులకు ముందుకు పూజలుచేసి ఆ తరువాతనే అమ్మవారికి పూజారులు పూజలు చేస్తారు. అమ్మవారిని వారానికి ఒక్కసారి మాత్రమే అలంకరిస్తారు. అమ్మవారిని చందనంతో తీర్చిదిద్దటం జరుగుతుంది. అమ్మవారికి ఇరువైపుల లక్ష్మి, సరస్వతులను వుంచి పూజలు సాగిస్తారు. పుట్టపై సూక్ష్మరూపంలో వెలిసిన పుట్టలమ్మకు పసుపు, కుంకుమ నీటిని కలిపి పూజలుచేస్తే అంటువ్యాధులు దరిచేరవని భక్తుల విశ్వాసం. అందువల్ల అమ్మవారికి వేలాదిమంది భక్తులు ప్రతిరోజు పసుపుకుంకుమ కలిపిన నీటితో అమ్మను అభిషేకించడం జరుగుతుంది. పెళ్ళికానివారు దుర్గమ్మను భక్తితో పూజిస్తే వారికి వివాహం జరుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అందువల్ల ప్రతి నిత్యం దేవాలయం భక్తులతో కిటకిటలాడుతూ వుంటుంది. భక్తుల కోర్కెలుతీర్చే తల్లిగా దుర్గమ్మ పూజలందుకొంటుంది.
ఆషాఢ మాసంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు భక్తులు నిర్వహిస్తారు. భక్తులు బోనాలతో, చీర, సారెలతో డప్పులవాయిద్యాల మధ్య వూరేగింపుగా వచ్చి మొక్కులు,తీర్చుకుంటారు.

- తెలుగు ఈరన్న