S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఏజెన్సీలో రెడ్ అలర్ట్

ఏటూరునాగారం, జూలై 24: ఏజెన్సీ మండలాలైన ఏటూరునాగారం, మంగపేట, తాడ్వాయి ప్రాంతాల్లో పోలీసు యంత్రాంగం రెడ్ అలెర్ట్ ప్రకటించింది. ఈనెల 28 నుండి జరిగే మావోయిస్టు వారోత్సవాలను ఘనంగా నిర్వహించుకోవాలని మావోలు బాహాటంగా పత్రికా ప్రకటన విడుదల చేసిన నేపథ్యంలో, వారోత్సవాలను భగ్నం చేసే దిశగా పోలీసులు ముమ్మర ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఇందులో భాగంగానే ఆదివారం మండల కేంద్రంలోని బస్టాండు ప్రాంతం, లాడ్జిలలో తనిఖీలు చేసి అపరిచిత వ్యక్తులు ఎవరైనా తారసపడితే పోలీసులకు తెలియజేయాలని స్థానికులకు, లాడ్జి యజమానులకు హుకుం జారీ చేశారు. మాజీలను సైతం స్టేషన్‌కు పిలిపించి విచారిస్తున్నట్లు సమాచారం. ఆకులవారి ఘనపురం, నేతకానివాడ, ఎర్రమ్మవాడ, ముస్లింవీధి, ఓడగూడెం తదితర ప్రాంతాలలో ఇంటింటా సోదాలు నిర్వహించారు. మండలంలోని ముల్లకట్ట వద్ద గోదావరిపై నిర్మించిన వారధితో చత్తీస్‌గఢ్ నుండి మావోలు ఏటూరునాగారం, ముప్పనపల్లి, బుట్టాయిగూడెం, కంతనపల్లి తుపాకులగూడెం, ముల్లకట్ట రాంపూర్ తదితర ప్రాంతాలలో తలదాచుకునే అవకాశం ఉన్నందున ఆదివారం ముల్లకట్ట గోదావరిపై నిర్మించిన బ్రిడ్జివద్ద స్థానిక సిఐ రఘుచందర్, ఎస్సై నరేష్‌లు వాహన తనిఖీలు నిర్వహించి, అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
అంతేకాకుండా సిఆర్‌పిఎఫ్, గ్రేహౌండ్ దళాలు ఏజెన్సీ అడవులను జల్లెడ పడుతూ... చెట్టు, పుట్ట గాలిస్తున్నాయి. రామన్నగూడెం పుష్కరఘాట్, రాంనగర్, తుపాకులగూడెం, గంగగూడెం, కంతనపల్లి ఏటూరు, ముప్పనపల్లి, లక్ష్మీపురం, ముల్లకట్టలతోపాటు, మంగపేట పుష్కరఘాట్ ఫెర్రీ పాయింట్ల వద్ద గట్టి నిఘా ఏర్పాటు చేసినట్లు సిఐ తెలిపారు. ఏది ఏమైనప్పటికీ మావోల వారోత్సవాలు ముగిసే వరకూ ఏజెన్సీ ప్రజలు ఏక్షణాన ఏం జరుగుతుందోననే భయం గుప్పిట్లో కాలం వెళ్లదీయాల్సిందే.