S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఫలించని పథకం

తెల్లదొర తెల్లబోయాడు.
భగత్ బృందాన్ని ఉరితీయించేందుకు క్రిమినల్ న్యాయాన్ని చాపచుట్టి, అడ్డగోలు ఆర్డినెన్సుతో నడమంత్రపు ట్రిబ్యునల్‌ని పుట్టించటంతో ఇర్విన్ ప్రభువు ఊరుకోలేదు. ఆ ట్రిబ్యునల్ పని ఎలా నడుస్తున్నది, విచారణ ఎంత వరకు వచ్చింది అన్న దాని మీద వైస్రాయి రోజూ రిపోర్టును తెప్పించుకునేవాడు. నిందితుల నినాదాలు, కోర్టు బహిష్కరణల గురించి అంతకు ముందే విని ఉన్నాడు కాబట్టి ట్రిబ్యునల్ ముందూ అవి జరగడంలో అతడికి ఆశ్చర్యంలేదు. కాని నిందితులను కఠినాతి కఠినంగా శిక్షించే పని కోసం ట్రిబ్యునల్‌కు ఏరికోరి ఎంపిక చేసిన ముగ్గురు జడ్జీల్లో ఒకే ఒక భారతీయుడు కూడా ట్రిబ్యునల్ చేసిన దానికి నిరసన తెలిపేంతగా పరిస్థితి విషమిస్తుందని వైస్రాయి ఊహించలేదు.
కోర్టులో నిందితులను పోలీసుల చేత జడ్జిలే కొట్టించిన దారుణం జరిగిన మరునాడు ఖైదీలెవరూ కోర్టుకు హాజరు కాలేదు. మేము ఒక్కొక్కరినీ పేరుపేరునా అడిగామండి; కిందటి రోజు జరిగిన దానికి ట్రిబ్యునల్ ఛైర్మన్ క్షమాపణ చెప్పి, ఇక ముందు అలాంటివి జరగవని హామీ ఇస్తే తప్ప తాము కోర్టుకు రామని అందరూ చెప్పారండి - అని పోలీసులు రిపోర్టు చేశారు.
దానికి పొగరుబోతు జడ్జిలు పొగరుగా స్పందించారు. కోర్టులో ఆతతాయి ప్రవర్తనను సహించేది లేదు; పాటలను, నినాదాలను అనుమతించేది లేదు. అవసరమైతే నిందితులను బయటికి పంపించటం సహా ఏ చర్యకూ వెనకాడబోము - అని కోల్డ్‌స్ట్రీమ్ అక్కడికక్కడే ఆర్డరు వేశాడు.
అది మొదలు ప్రతిరోజూ పోలీసులు ఖైదీలను జైలుగేటు దగ్గరికి రప్పించి, కోర్టుకు రావాలని అడగడం... వారు రాము పొమ్మనడం.. ఆ సంగతి వెళ్లి కోర్టువారికి చెప్పడం... వారేమో ‘అయితే సరే, విచారణ సాగిద్దాం’ అని చెప్పడం మామూలు అయింది. సర్కారుకు అంతకంటే కావలసింది ఏముంది? తప్పుడు సాక్షుల చేత బనాయింపు సాక్ష్యాలు ఇప్పించటం, జయగోపాల్, హన్స్‌రాజ్ వంటి అప్రూవర్ల చేత కట్టుకథలు చెప్పించటం, ఐడెంటిఫికేషన్‌తో నిమిత్తం లేకుండా నిందితులను సాక్షులు గుర్తు పట్టినట్టుగానే భావించబడటం ప్రాసిక్యూషన్ వారికి వాటంగానే ఉంది.
కాని అందులోనే ఒక చికాకు. అబద్ధపు సాక్షులను నిలదీయడానికి నిందితులు... అభ్యంతరం తెలపటానికి డిఫెన్సు లాయర్లు లేకపోయినా సుఖం లేకపోయంది. ఎందుకంటే- న్యాయమూర్తి ఆగా హైదర్ సాక్షులను గుచ్చిగుచ్చి ప్రశ్నించేవాడు. దానికి తోడు - నిందితులు ఎదుట లేకుండా విచారణ ఏమిటని పత్రికల వారు, రాజకీయ నాయకులు, ఇతర ప్రముఖులు గట్టిగా ఆక్షేపించారు. పత్రికలు విచారణను బహిష్కరించాయి. న్యాయవాదులూ ఆ కేసు నుంచి వైదొలగారు. నిరసనల సెగ ఇంగ్లండు దాకా పాకింది.
దాంతో వైస్రాయ్‌కి దిమ్మ తిరిగింది. ఆడేది నాటకమే అయినా అది సవ్యంగా, సలక్షణంగా జరిగినట్టు లోకానికి చూపెట్టాలి కదా? అందుకని - కోర్టులో ఖైదీలకు సంకెళ్లు వేయించి, తన్ని పంపించిన కోల్డ్‌స్ట్రీమ్‌ని సెలవు మీద వెళ్లమన్నారు. ఇబ్బందికరంగా తయారైన ఆగా హైదర్‌కి పెద్ద పదవి ఏదో ఇస్తామని చెప్పి అక్కడి నుంచి తప్పించారు. వారి స్థానంలో తమ ఇంగితమెరిగి మెలగే జస్టిస్ జె.కె.ఎం.టాప్‌నూ, బారిస్టర్ సర్ అబ్దుల్ కాదిర్‌నూ కొత్త సభ్యులుగా వేశారు. మిగిలిన మూడో సభ్యుడు హిల్టన్‌ని ట్రిబ్యునల్ అధ్యక్షుడిగా నియమించారు. ‘మీరు కోరినట్టు కోల్డ్‌స్ట్రీమ్‌ని పంపేశాము. కొత్త సభ్యులను తెచ్చాము. కాబట్టి పంతం మాని విచారణకు హాజరు కావలసింది’ అని నిందితులను పిలవనంపారు.
‘సరే. చెప్పేదేదో అక్కడికే వచ్చి చెబుతాములే’ అన్నాడు భగత్‌సింగ్.
1930 జూన్ 23న ట్రిబ్యునల్ కొత్త అవతారంలో మొదటిసారి కొలువుదీరింది. ఆరువారాల గైర్హాజరు తరువాత నిందితులందరూ కోర్టుకు వచ్చారు. ఆ రోజు అవకాశం రానందువల్ల మరునాడు భగత్‌సింగ్ కోర్టులో ఒక ప్రకటన చేశాడు.
‘మే 12న జరిగిన దానికి ట్రిబ్యునల్ అధ్యక్షుడు క్షమాపణ అయినా చెప్పాలి; లేదు ఆయనను మార్చనైనా మార్చాలి. అప్పటివరకూ మేము కోర్టుకు రాము అని మేము షరతు పెట్టాం. మాకు జస్టిస్ కోల్డ్‌స్ట్రీమ్ మీద వ్యక్తిగతంగా కక్ష ఏమీ లేదు. ట్రిబ్యునల్‌లో మెజారిటీ సభ్యుల తరఫున అతడు ఇచ్చిన ఆర్డరునే మేము నిరసించాం. ఇప్పుడు కోల్డ్‌స్ట్రీమ్‌ని తొలగించారు. కాని అభ్యంతరకరమైన ఆర్డరుకు పార్టీ అయిన జస్టిస్ హిల్టన్‌ను ట్రిబ్యునల్‌కి అధ్యక్షుడిని చేశారు. దీనివల్ల పరిస్థితి మారలేదు. పైగా మాకు పుండు మీద కారం చల్లినట్టు అయింది.
‘ఆ ఆర్డరుతో తనకు సంబంధం లేదని, ఇక ముందు అలాంటి ఘటనలు జరగవని జస్టిస్ హిల్టన్ మాకు హామీ ఇచ్చే పక్షంలో మేము కోర్టుకు రాగలము. లేదా రేపటి నుంచి కోర్టుకు హాజరుకాము’ - అని ఆ ప్రకటన సారాంశం.
The Trial of Bhagat Singh మెచ్చుకున్నట్టు భగత్‌సింగ్ చెప్పింది హుందాగా ఉంది. అదే రకమైన సంస్కారాన్ని, హుందాతనాన్ని ట్రిబ్యునల్ కూడా చూపించి ఉంటే బాగుండేది. కాని హిల్టన్ పెదవి మెదపలేదు.
మరునాడు నిందితుల బోను ఖాళీ! బూటకపు విచారణ నడిచినన్ని రోజులూ అంతే.
తన ప్రాణం తీయడానికి ట్రిబ్యునల్ దివాణంలో ఉరి తాడు పేనుతున్నారని తెలిసినా భగత్‌సింగ్ చలించలేదు. అక్కడ ఏమి జరుగుతోందన్నది పట్టించుకోనేలేదు. జైలులో అతడి సమయమంతా పుస్తకాలు చదవడంతోటే సరిపోయింది. అతడి జ్ఞానతృష్ణ ఎంత చదివినా తీరేది కాదు. తనను చూడటానికి వచ్చేవారిని ‘నాకు ఏ కానుకలూ వద్దు.. తేగలిగినన్ని పుస్తకాలు మాత్రం తెండి’ అని అతడు చెబుతూండేవాడు. ‘మా తమ్ముడు కుల్బీర్‌తో నాకు ఈ పుస్తకాలు పంపించు’ అంటూ మిత్రుడు జయదేవ్ గుప్తాకు 1930 జూలై 24న రాసిన లేఖలో భగత్‌సింగ్ ఇచ్చిన లిస్టు చూడండి:
1.Militarism 2.Why Men Fight 3.Soviet at Work 4.Collapse of II International 5.Left Wing Communism 6.Mutual Aid 7.Field, Factories and Workshop 8.Civil War in France 9.Land Revolution in Russia 10.Theory of Historical Materialism 11.Peasant in Prosperity and Debt.
ఇలా పుస్తకాల మీద పుస్తకాలను ఎక్కడెక్కడి నుంచో తెప్పించుకుంటూంటే వాటన్నిటినీ తనిఖీ చేయటం జైలు అధికారులకు సమస్యగా ఉండేది. ఓసారి జైలరు భగత్‌సింగ్‌నే అడిగాడు ‘ఈ పుస్తకాలన్నీ నిజంగా నువ్వు చదువుతావా? వీటిని చూసి సెన్సార్ చెయ్యడానికే నాకు టైము చాలటంలేదు’ -అని! ‘ఆహా! అన్నీ చదువుతాను. కావాలంటే ఏదైనా పుస్తకం తీసి అందులో ఏ అధ్యాయానికి సంబంధించి అయినా అడగండి. అందులో ఏమి రాసి ఉన్నదో నేను చెబుతాను’ అని బదులిచ్చాడు భగత్. జైలరు విస్తుపోయాడు.
[Sardar Bhagat Singh, G.S.Deol, p.78]

బ్రిటిషు ప్రభుత్వ న్యాయబుథ్ధి మీద విప్లవకారులకు నమ్మకం లేదు. ముఖ్యంగా భగత్‌సింగ్‌ను ఉరితీయాలని ముందే నిర్ణయించుకుని విచారణ నాటకం ఆడుతున్నారని వారికి తెలుసు. తమ ప్రియమైన కామ్రేడ్‌ని కాపాడుకోవాలంటే తీర్పు వచ్చేలోగానే ఏదో ఒకటి చెయ్యాలని వారు అనుకున్నారు. ఎలాగైనా భగత్‌సింగ్‌ని విడిపించాలని హిందుస్తాన్ సోషలిస్టు రిపబ్లికన్ అసోసియేషన్ సెంట్రల్ కమిటీ నిర్ణయించింది. ఆ బాధ్యత చంద్రశేఖర్ ఆజాద్ తీసుకున్నాడు.
కోర్టుకు వెళ్లటం మానేసినా భగత్, దత్‌లు ప్రతి ఆదివారం బోర్‌స్టల్ జైలుకు వెళ్లి అక్కడి సహచరులతో కేసు విషయాలు మాట్లాడుతూండేవారు. పోలీసులు వారిని అక్కడికి ఎప్పుడు తీసుకువెళతారో, వెనక్కి ఎప్పుడు తెస్తారో కనిపెట్టమని ఆజాద్ ముందుగా వైశంపాయన్‌ని లాహోర్ పంపాడు. అతడు రెండు వారాలు జైలు దగ్గర కాపు కాశాడు. రెండు జైళ్ల మధ్య దూరం 200 మీటర్లే. మొదట్లో భగత్, దత్‌లను కాలినడకనే రెండో జైలుకి తీసుకెళ్లేవారు. ఈ మధ్య పోలీసు వ్యానులో ఆదివారం మధ్యాహ్నం అక్కడ దింపి వస్తున్నారు. ఓ రెండు గంటల తరవాత మళ్లీ అదే వాహనం వెళ్లి వారిని వెనక్కి తీసుకొస్తున్నది. ఆ వేళలు, ఆనుపానులు వైశంపాయన్ కాన్పూరు వెళ్లి ఆజాద్‌కు రిపోర్టు చేశాడు.
అంతకు ముందు వరకూ ఆజాద్‌కి ఒక అపోహ ఉండేది. భగవతీ చరణ్, అతడి భార్య దుర్గాదేవి పోలీసు ఇన్ఫార్మర్లుగా మారారని అతడికి సన్నిహితుల ద్వారా తెలిసింది. వారు అలా ద్రోహానికి పాల్పడ్డారంటే నమ్మలేకపోయాడు. కాని వారికి ఏ విషయమూ తెలియనివ్వవద్దు; దగ్గరికి రానివ్వవద్దు అని పార్టీలో అందరిని కట్టడి చేశాడు. నిజానికి వారు ఏ పాపం ఎరుగరని, తమను నిష్కారణంగా దూరం పెట్టినందుకు చాలా బాధపడుతున్నారని లాహోర్ వెళ్లాక వైశంపాయన్‌కి అర్థమైంది. అనుమానాల మబ్బులు తొలిగాయి.
భగత్, దత్‌లను విడిపించే ‘యాక్షను’లో భగవతీ చరణ్‌ని కూడా చేర్చారు. 1930 జూన్ 1న ‘పని’ కానివ్వాలని ఆజాద్ నిర్ణయించాడు. బోర్‌స్టల్ జైలు గేటులో నుంచి భగత్, దత్‌లు బయటికొచ్చి పోలీసు వాహనం ఎక్కేలోగా ఆపరేషన్ జరగాలి. బాంబు వేసి పోలీసులను చెదరగొట్టడం భగవతీ చరణ్ పని. ఖైదీలను విడిపించి కారులోకి ఎక్కించటం ఆజాద్ వంతు. కావలసిన ఆయుధాలు వగైరా ఆజాద్ సేకరిస్తాడు. సుఖ్‌దేవ్‌రాజ్, యశ్‌పాల్, తేహాల్‌సింగ్, లేఖ్‌రామ్, ధన్వంతరి, ఛయిల్‌బిహారీ, కైలాస్‌పతిలు యాక్షన్ టీములో ఉంటారు. లాహోర్‌లో ఉన్నన్నాళ్లూ అందరికీ బస, భోజనం ఏర్పాట్లు భగవతీ చరణ్ చూడాలి.
లాహోర్‌లో ఒక ఇల్లు అద్దెకు తీసుకున్నారు. దుర్గ్భాభీ, సుశీలాదీదీ అక్కడ కావలసిన వాటిని చూశారు. సన్నాహాలు, ఏర్పాట్లు చురుకుగా సాగాయి. ఆ మధ్య వైస్రాయి రైలు మీద దాడి కోసం తెప్పించిన పేలుడు పదార్థం కావలసినంత మిగిలి ఉంది. తమ దగ్గరున్న బాంబు తొడుగుల్లో యశ్‌పాల్ మందు కూరాడు. బాంబులు రెడీ. ఉపయోగించే ముందు ఒకసారి పరీక్ష చేయటం మంచిదని భగవతీ చరణ్ అనుకున్నాడు. నిర్ణీత ‘ముహూర్తానికి’ మూడు రోజుల ముందు (మే 28న) పరీక్షించవలసిన బాంబును సంచిలో వేసుకుని సుఖ్‌దేవ్‌రాజ్, వైశంపాయన్‌లతో కలిసి పడవ మీద రావినది దాటి దట్టమైన జఖీరా అడవికి వెళ్లాడు.
ఉదయం 11 గంటలకు పడవ దిగి ముగ్గురూ నిర్జనమైన అడవిలో చాలా దూరం వెళ్లారు. అనువుగా కనిపించిన చోట ఆగి భగవతీ చరణ్ సంచిలోంచి బాంబు తీసి చూసి ‘అరె! దీని పిన్ను వదులుగా ఉందే’ అన్నాడు. ఆ స్థితిలో దాన్ని పేల్చడం అపాయకరం. ‘వెనక్కి వెళ్లి రేపు ఇంకో బాంబుతో వచ్చి పరీక్షిద్దాం’ అన్నాడు వైశంపాయన్. భగవతీ చరణ్ వినలేదు. ‘అసలు పని జూన్ 1నే కదా? ఇవాళ మే 28. ‘ఇవాళ కాకపోతే ఇంకెప్పుడు పరీక్షిస్తాం? మరేం ఫరవాలేదు. నేను జాగ్రత్తగా పేలుస్తాను. మీరు దూరంగా ఉండండి’ అన్నాడు.
‘ఇవాళే జరిగి తీరాలి అంటే - మీరు వద్దు. మా ఇద్దరిలో ఒకరికి ఆ పని వదిలెయ్యండి’ - అన్నారు సహచరులు. ‘ఇప్పటికే నన్ను సిఐడిల మనిషినని అనుకుంటున్నారు. మీకు ఏదైనా అయితే నేను భయ్యాకు ముఖమెలా చూపగలను? నిశ్చింతగా ఉండండి. నాకేం కాదు’ అని, భగవతీ భాయ్ గొయ్యి దగ్గర ఒక రాతిపై నుంచున్నాడు. మిగతా ఇద్దరూ దూరంగా చెట్ల వెనుక నిలబడ్డారు.
పిన్ను లాగి బాంబును పైకి ఎత్తి విసిరేలోపే భయంకర శబ్దం. బాంబు భగవతీ చరణ్ చేతిలోనే పేలింది. ఆ శబ్దం అడవి అంతా ప్రతిధ్వనించింది. దట్టమైన పొగను చీల్చుకుని సహచరులు దగ్గరికెళితే కనిపించిన దృశ్యం ఘోరం. భగవతీ భాయి కుడిచేయి మణికట్టు వద్ద తెగి దూరంగా ఎగిరిపడి ఉంది. ఇంకొక చేతి వేళ్లు తెగాయి. కడుపు పగిలింది. ప్రేగులు బయటికి వచ్చాయి. శరీరం నుంచి కారుతున్న రక్త్ధారలు మాతృభూమిని అభిషేకం చేస్తున్నాయి. భరించరాని బాధ. వెంటనే వైద్య సహాయం అందితేగాని మనిషి బతకడు. కాని వారు ఉన్నది జనసంచారం లేని కారడవి లోపల ఎక్కడో!
దారి తెలిసిన సుఖ్‌దేవ్ రాజ్ కాలికి పేలుడులో పెద్ద గాయమైంది. ఎముక విరిగింది. వైశంపాయన్ బాగానే ఉన్నాడు. కాని అతడికి దారి తెలియదు. ఇక చేసేదేముంది? గాయపడ్డ సుఖ్‌దేవ్ రాజే చొక్కా చింపి కాలికి గట్టిగా కట్టు కట్టుకుని కుంటుకుంటూ బయలుదేరాడు. నది దాటి, టాంగా మీద ఊళ్లోకి వెళ్లి సహచరులకు కబురు చెప్పి వైద్య సహాయంతో తిరిగి వచ్చేలోపే అంతా అయిపోయింది. ‘నా చావు భగత్, దత్‌ల విడుదలకు అడ్డంకాకూడదు. ఆ కర్తవ్యం పూర్తయితేనే నా ఆత్మకు శాంతి అని భయ్యాతో చెప్పు. మీ భాభీ జాగ్రత్త...’ అని వైశంపాయన్‌కి అతికష్టం మీద చెప్పి భగవతీ చరణ్ ప్రాణం వదిలాడు. కప్పటానికి తీసుకువెళ్లిన దుప్పటిలోనే పార్థిక కాయాన్ని చుట్టారు. ఒక నిమిషం తల వంచి నిలబడి అందరూ శ్రద్ధాంజలి ఘటించారు. పొగ లేచి పదుగురి దృష్టీ పడవచ్చు కనుక దహన సంస్కారం వద్దనుకున్నారు. అక్కడే ఒక గొయ్యి తీసి ఆజాదే సహచరుల సాయంతో భౌతికకాయాన్ని సమాధి చేశాడు. భర్త కడసారి చూపుకు కూడా నోచుకోని దుర్గాదేవి దుఃఖం కట్టలు తెచ్చుకుంది. ‘విప్లవపు లేత మొక్క వీరుడి రక్తంతోటే పెరుగుతుంది’ అన్న తొలి వాక్యంతో విప్లవ పార్టీ మేనిఫెస్టోను... ‘బాంబు మార్గం’ అనే గాంధీగారి ఆక్షేపణ వ్యాసానికి జవాబుగా ‘బాంబు తత్వం’ (Philosophy of Bomb) అనే ప్రసిద్ధ సమాధానాన్ని రాసిన భగవతీ చరణ్ జీవితం అలా బాంబు ప్రమాదంలో రక్త తర్పణంతో ముగిసింది.
*

ఎం.వి.ఆర్.శాస్ర్తీ