S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ముగ్గురికి ఉరి (భగత్‌సింగ్ 41)

పరాధీన భారతంలో స్వాతంత్య్ర యోధుల మీద కుట్ర కేసులు చాలా పెట్టారు. 1930 నాటి లాహోర్ కుట్ర కేసు అన్నిటిలోకెల్లా అధమాధమమైనది. మామూలుగా అయితే విచారణనుబట్టి శిక్ష. ఈ కేసులో ముందే నిర్ణయమైన శిక్షకు కావలసిన విధంగా విచారణ! నిందితులు లేకుండా కేసు విచారణ, కోర్టు హాల్లో నిందితులపై దారుణహింస, పెరేడ్‌లో గుర్తుపట్టటానికి వీలుగా దొంగ సాక్షులకు నిందితులను ముందే చూపించటం వంటి అక్రమాలకు లెక్కలేదు.
నేరంలో పాల్గొని ఆ తరవాత అడ్డం తిరిగి అప్రూవరుగా మారిన వారి సాక్ష్యానికి పెద్దగా ప్రాముఖ్యం ఇవ్వకూడదు. నేరాన్ని నిరూపించాలంటే ఇతరత్రా సాక్ష్యాలు బలంగా ఉండాలి. విచారణలో ఇతర రుజువుల ద్వారా నిర్ధారణ అయిన దానికి అప్రూవర్లు చెప్పేదీ సరిపోలినప్పుడు, అదనపు రుజువు కింద అప్రూవర్ల కథనాన్ని పరిగణించవచ్చునని ఎవిడెన్సు యాక్టు చెబుతుంది. ఈ కేసులో స్వతంత్ర సాక్ష్యం అంటూ ఏదీ లేదు. ఏడుగురు అప్రూవర్ల చేత పోలీసులు బలవంతంగా చెప్పించిన దానికి మించి తెల్లదొరతనం వద్ద పిసరంత సాక్ష్యం లేదు. పోలీసు బుట్టలో పడిన ఏడుగురు అప్రూవర్లలోనూ ఇద్దరు (రామ్‌శరణ్, బ్రహ్మదత్) ఇచ్చిన స్టేట్‌మెంట్లను వెనక్కి తీసుకున్నారు. పోలీసులు తమను హింసించి, బలవంతపు సాక్ష్యం చెప్పించారని కోర్టులోనే వారు అబద్ధాల కుండ బద్దలు కొట్టారు. అయినాసరే, నిజం వినేదీ కనేదీ లేదని వ్రతం పట్టిన స్పెషల్ డ్యూటీ ట్రిబ్యునల్ జడ్జీలు చట్టానికీ, న్యాయానికీ చెల్లుచీటీ ఇచ్చారు. అప్రూవర్లు పలికిందే అక్షర సత్యంగా పరిగణించి, దానికి మించి ఇంకే రుజువూ అక్కర్లేదని బుకాయించి, అభియోగాలన్నీ నిరూపితమైనట్టే భావించాలని దబాయించారు. ట్రిబ్యునల్‌కు ఇవ్వబడ్డ ఆరునెలల ఆయువు ఇంకో ఇరవై రోజుల్లో తీరుతుందనగా 1930 అక్టోబర్ 7న రడీమేడ్ తీర్పును ఆదరాబాదరా ప్రకటించారు.
తెల్లదొరలు ఆడిన కపట నాటకంలో పాలుపంచుకుని, దానికి లేని విశ్వసనీయత కలిగించటం ఇష్టంలేక భగత్‌సింగ్ బృందం మళ్లీ ట్రిబ్యునల్ కోర్టులో అడుగుపెట్టలేదు. శిక్ష ప్రకటించే రోజునా నిందితులెవరూ కోర్టుకు హాజరుకాలేదు.
మొత్తం 300 పేజీల తీర్పు. అందులో ముఖ్యమైన భాగం 68 పేజీలు. అందులో ముఖ్యమైన విషయం - భగత్‌సింగ్, సుఖ్‌దేవ్, రాజ్‌గురులకు ఉరిశిక్ష.
కిషోరీలాల్, మహావీర్‌సింగ్, విజయకుమార్ సిన్హా, శివవర్మ, గయాప్రసాద్, జయదేవ్ కపూర్, కమల్‌నాథ్ తివారీలకు యావజ్జీవ ఖైదు.
కుందన్‌లాల్‌కు ఏడేళ్లు, ప్రేమ్‌దత్‌కు ఐదేళ్ల జైలు. అజయ్ ఘోష్, యతీంద్రనాథ్ సన్యాల్, దేశ్‌రాజ్‌లను వదిలేశారు. అసెంబ్లీ బాంబు కేసులో యావజ్జీవ శిక్ష అప్పటికే విధించబడినందువల్ల బటుకేశ్వర్ దత్‌ను, సాక్ష్యాధారాలు లేని కారణంతో ఆజ్ఞారామ్, సురేంద్రపాండేలను ఈ కేసు నుంచి అభియోగాల నిర్ధారణ దశలోనే తీసివేశారు.
నిందితులు విచారణను బహిష్కరించినందువల్ల ట్రిబ్యునల్ ఆర్డరునూ భగత్, సుఖ్‌దేవ్, రాజ్‌గురుల ఉరికి బ్లాక్ బార్డరుగల వారంట్లనూ స్పెషల్ మెసెంజరు ద్వారా జైలుకు పంపారు.
నాటికి రెండు రోజుల కిందట లాహోర్ కుట్రకేసు నిందితులందరూ కలిసి భోజనం చేశారు. మామూలు నాసిరకం జైలుకూడే అయినా అదే చివరి విందు కాబట్టి పసందుగా ఆరగించారు. ఏ శిక్ష పడుతుందో, ఏమవుతామోనన్న భయం ఎవరిలోనూ లేదు. ఆడుతూ పాడుతూ జోకులేస్తూ తిరిగిన వారి సందడితో కర్కశపు కారాగారానికి కొత్త కళ వచ్చింది. ఎంతోమంది క్రిమినల్సును చూశాముగాని ఇలాంటి వాళ్లను ఎన్నడూ చూడలేదని ఆశ్చర్యపడుతూ జైలు సిబ్బంది కొందరు కంటనీరు పెట్టుకున్నారు.

7వ తేది మధ్యాహ్నం జైలు బారక్స్‌లో భగత్‌సింగు, అతడి సహచరులు కులాసాగా కబుర్లు చెప్పుకుంటున్న చోటికి జైలు సూపర్నెంటుతో కలిసి ప్రభుత్వ న్యాయవాది వెళ్లాడు. తీర్పు ప్రధాన భాగాన్ని వినిపించి-
‘సర్దార్ భగత్‌సింగ్! వెరీ సారీ! కోర్టు నీకు మరణశిక్ష విధించింది’ అన్నాడు విచారంగా.
‘సారీ ఎందుకు? ఈ విషయం ఇప్పటికే విన్నాలే’ అని బదులిచ్చాడు భగత్.
‘నీ ధైర్యాన్ని నేను మెచ్చుకుంటున్నాను. నీ వయసు ఇలాంటి శిక్షకు గురికావలసినది కాదు. ఒకనాటికి మంచి రాజకీయ నాయకుడు కావలసినవాడివి’ అని నిట్టూర్చాడు ప్రభుత్వ ప్లీడరు.
‘పడుచుతనంలోనే ఇలాంటి శిక్ష మంచిది. మా పెద్దవాళ్లు ఎప్పుడూ ఈ కబీర్ మాట గుర్తు చేసుకుంటారు -
జిస్ మర్‌నే తే జగ్ డరే మేరే మన్ ఆనంద్
మర్‌నే తే హి పాయే పూరణ్ పరమానంద్’
(ప్రపంచాన్ని భయపెట్టే మృత్యువు నా మనసుకు ఆనందాన్ని ఇస్తుంది. మరణం ద్వారానే పరమానందం కలుగుతుంది) అన్నాడు భగత్.
[Sardar Bhagat Singh, G.S.Deol, p.85]

‘సర్దార్ భగత్‌సింగ్, సుఖ్‌థేవ్, రాజ్‌గురులకు ఉరిశిక్ష విధించడమైనది’ అని గవర్నమెంటు అడ్వొకేటు చదవగానే చుట్టూ ఉన్నవారు నిర్ఘాంతపోయారు. కాని ఆ ముగ్గురూ వికసించిన ముఖాలతో నవ్వుతూ ఒకరినొకరు కౌగిలించుకుని ‘ఇంక్విలాబ్ జిందాబాద్’ అని జైలు దద్దరిల్లేలా నినదించారు. ముగ్గురూ మహా ఉత్సాహంగా ఉన్నారు. వారి కోరిక తీరింది. ఉరి కాకుండా తనకు జైలుశిక్ష వేసే పక్షంలో ఆత్మహత్య చేసుకోవాలని తలపోసిన సుఖ్‌దేవ్‌కు ఆ అగత్యం లేకపోయింది.
మామూలుగా అయితే శిక్ష పడిన వాళ్లు బెంబేలు పడాలి. వదిలి వేయబడ్డ వాళ్లు ఎగిరి గంతేయాలి. కాని ఈ కేసులో బయటపడ్డ వాళ్లు బాధపడ్డారు. దేశం కోసం ఆత్మార్పణం చేసే అదృష్టం దక్కిన సహచరులను చూసి ఈర్ష్యపడ్డారు.
భగత్‌సింగ్ అనబడే ముద్దాయిని మరణించేంతవరకూ మెడకు ఉరి వేయవలెనన్న శిక్షను 1930 అక్టోబరు 27వ తేదీన లాహోర్‌లో అమలు జరపవలెనని ఆదేశిస్తూ నీకు ఇందుమూలముగా అధికారము ఇవ్వడమైనది.’ అని రాసి ఉన్న వారంటును, అలాగే మిగతా ఇద్దరివీ జైలు సూపర్నెంటుకు అందజేశారు. ఉరిశిక్ష పడ్డవారిని ఉంచే సెల్ నెంబర్ 14కు ముగ్గురినీ వెంటనే తరలించమని సూపర్నెంటు ఆర్డరు వేశాడు. లంబార్దారు (ఆర్డర్లీ) అప్పటికప్పుడే ముగ్గురి సామాన్లను ‘్ఫంసీ ఘర్’కి మార్పించాడు. అక్కడికి వెళ్లబోయే ముందు భగత్‌సింగ్ మిగతా సహచరులతో ఇలా అన్నాడు:
‘ఫ్రెండ్స్! ఇదే మన ఆఖరి కలయిక. శాశ్వతంగా విడిపోతున్నాం. మళ్లీ కలవం. జైలుశిక్ష పూర్తి చేసి ఇంటికెళ్లాక లౌకిక వ్యవహారాల్లో పడకండి. ఇండియా నుంచి బ్రిటిషు వాళ్లను వెళ్లగొట్టి సోషలిస్టు ప్రజాస్వామ్యం స్థాపించేవరకూ స్థిమితంగా కూచోకండి. మీకు ఇదే నా చివరి మాట’ [G.S.Deol, p.86]

BHAGAT SINGH SENTENCED TO DEATH ( భగత్‌సింగ్ కు మరణశిక్ష) అన్న పత్రికల పతాక శీర్షిక బాంబులా పేలింది. నిండా పాతికేళ్లు లేని ముగ్గురు దేశభక్తులకు బూటకపు విచారణతో అన్యాయంగా ఉరిశిక్ష విధించడం యావద్దేశాన్ని దిగ్భ్రాంతపరచింది. తాము చేసిన దానికి దేశమంతటా తీవ్ర వ్యతిరేకత వస్తుందని బ్రిటిషు ప్రభుత్వం ముందే ఊహించింది. ఎటువంటి పరిస్థితినైనా తట్టుకోవడానికి సిద్ధంగా ఉండాలని, అలజడిని అడ్డుకోవటానికి ముందు జాగ్రత్తలన్నీ తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించింది. ఎక్కువమంది ఒకచోట గుమికూడటాన్ని నిషేధిస్తూ స్థానిక అధికారుల చేత ఎక్కడికక్కడ సి.ఆర్.పి.సి. 144వ సెక్షనును విధింపజేసింది. లాహోర్ కుట్రకేసు నేరస్థులను ఉరితీసే సందర్భంలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎలాగైనా అణచివెయ్యాలని కరకు ఆదేశాలు జారీ చేసింది.
కాని - దొరల దాష్టీకానికి ప్రజలు బెదరలేదు. ప్రత్యేకంగా ఏ సంస్థా పిలుపివ్వకుండానే దేశంలో ఎక్కడికక్కడ హర్తాళ్‌లు, ఊరేగింపులు, నిరసన ప్రదర్శనలు జరిగాయి. నిషేధాజ్ఞలను ధిక్కరించి ప్రధాన పట్టణాలన్నిటిలో అన్యాయపు తీర్పును గర్హిస్తూ బహిరంగసభలు జరిగాయి. ఉద్వేగపూరిత ప్రసంగాలు, సమ్మెలు, నిరసన కార్యక్రమాల ద్వారా అన్ని జీవన రంగాలకు చెందినవారు బ్రిటిషు దుర్నీతిని ఖండించి, భగత్‌సింగు, అతడి సహచరుల పట్ల సంఘీభావం ప్రకటించారు.
భగత్‌సింగ్ సొంత ఊరు అయిన లాహోర్‌లో ప్రజల ఆగ్రహ తీవ్రత గురించి చెప్పనే అక్కర్లేదు. బ్రిటిషు వారికి మహా విధేయమైన గవర్నమెంటు కాలేజి ఒక్కటి మినహా నగరంలోని కళాశాలలు, విద్యాసంస్థలు అన్నీ మూతపడ్డాయి. విద్యార్థినీ విద్యార్థులు వేల సంఖ్యలో వీధుల్లోకి వచ్చి తెల్లవాళ్ల గుండెలదిరేలా నిరసన గళమెత్తారు. పికెటింగులు చేశారు. ప్రతిఘటనను అణచడానికి పోలీసులు పశుబలాన్ని ప్రయోగించారు. చేతిలోని అస్త్రాలన్నీ వాడారు. మహిళా ప్రదర్శకులను, కాలేజి ప్రొఫెసర్లను కూడా లాఠీలతో చితకబాదారు. లాహోర్‌లో సగటున రెండు నిమిషాలకు ఒక అరెస్టు జరిగినట్టు ‘ట్రిబ్యూన్’ పత్రిక రాసింది. భగత్‌సింగ్ ఎన్నోసార్లు ప్రసంగించిన బ్రాడ్‌లాఫ్ హాల్‌లో వందలాది యువతీ యువకులు సమావేశమై భగత్‌సింగ్ సాహసాన్ని, ఆదర్శాన్ని కొనియాడారు. అన్నిటికంటే పెద్ద సభ మోరీ గేటు దగ్గర జరిగింది. లాలా లాజ్‌పత్‌రాయ్ కుమార్తె పార్వతీదేవి దానికి అధ్యక్షత వహించింది. భగత్‌సింగ్ తండ్రి కిషన్‌సింగ్, తాత అర్జున్‌సింగ్, సహచరులు అజయ్ ఘోష్, యతిన్ సన్యాల్ అందులో ఉద్వేగంతో మాట్లాడారు.
భగత్‌సింగ్ దేశవాసులకు ఎంత ఆత్మీయుడయ్యాడో జైలునుంచి బయటికి వచ్చాకే నాకు తెలిసింది. ప్రతి సభలోనూ, ప్రతి నిరసన కార్యక్రమంలోనూ భగత్‌సింగ్ జిందాబాద్’ నినాదం మారుమోగింది. అతడి పేరు కోట్లాది ప్రజల పెదవుల మీద కదలాడింది. అతడి మూర్తి ప్రతి యువకుడి హృదయంలో ముద్ర పడిపోయింది’ అని గుర్తు చేసుకున్నాడు అజయ్ ఘోష్.
‘అతడితో నేను ఏకీభవించినా, ఏకీభవించకపోయినా భగత్‌సింగ్ ధైర్యాన్ని, ఆత్మత్యాగాన్ని నేను హృదయపూర్వకంగా అభిమానిస్తున్నాను. ఇటువంటి శౌర్యం చాలా అరుదు. ఇంతటి అద్భుత సాహసాన్ని , ఉన్నత ఆశయాన్ని మనం మెచ్చుకొనకూడదని వైస్రాయి భావిస్తే అది పొరపాటు. ఒకవేళ భగత్‌సింగ్ ఇంగ్లిషు వాడిగా పుట్టి ఇంగ్లండు కోసం ఇలాగే పోరాడి ఉంటే ఏమనిపించేది అని ఆయన తన మనసును తానే ప్రశ్నించుకోవాలి’ అన్నాడు అలహాబాదులో 1930 అక్టోబరు 30న పెద్ద బహిరంగ సభలో జవాహర్‌లాల్ నెహ్రూ.
భగత్‌సింగ్ శౌర్యాన్ని, త్యాగాన్ని ప్రస్తుతించడంతోబాటు అతడి ప్రాణాన్ని ఎలాగైనా కాపాడాలని దేశంలో మనసున్న ప్రతి దేశభక్తుడూ తహతహలాడాడు. కోల్‌కతాలో బ్రహ్మాండమైన బహిరంగసభలో సురేంద్ర మోహన్ ఘోష్ వంటి అగ్ర నాయకులు ఉరిశిక్షలను రద్దు చేయాలని వైస్రాయ్‌కి, మహాత్మాగాంధికి విజ్ఞప్తి చేశారు. చిటగాంగ్ సాయుధ దాడి కేసులో విచారణ ఖైదీలు, బుక్సా క్యాంపులో ప్రముఖ బెంగాలీ విప్లవకారులు మరణశిక్షలను ఎత్తివేయాలని వైస్రాయ్‌ని కోరారు. వేల మంది సంతకాలతో ఒక పబ్లిక్ పిటీషను వైస్రాయ్‌కి చేరింది.
పట్టుబట్టి, విధంచెడి ఉరిశిక్షలు వేయించిందే బ్రిటిషు సర్కారు కాబట్టి ప్రజల, ప్రముఖుల విన్నపాలకు కరిగిపోయి, వైస్రాయి శిక్షను తగ్గిస్తాడన్న ఆశ ఎవరికీ లేదు. అనుకున్నదాన్ని సాధించడానికి చట్టపరంగా ఉన్నది ఒకేఒక అవకాశం:
బ్రిటిషు సామ్రాజ్యంలో అత్యున్నత అపీలు కోర్టు అయిన ప్రివీ కౌన్సిల్‌కు అపీలు!
ఆ పని చేయటానికి పంజాబ్‌లో డిఫెన్సు కమిటీ ఏర్పాటైంది. తన ప్రాణం కాపాడుకోవాలన్న ఆలోచన భగత్‌సింగ్‌కు ఎన్నడూ లేదు. ప్రజా శత్రువైన బ్రిటిషు దొరతనాన్ని దేనికైనా దేబిరించడానికి అతడు బద్ధ వ్యతిరేకి. అయినా - ప్రివీ కౌన్సిలుకు వెళితే మన కేసు, మన ప్రతాపం ప్రపంచమంతటా మారుమోగుతాయ. ఇండియాలో న్యాయాన్ని రాజకీయ స్వార్థం కోసం దుర్వినియోగం చేస్తున్న తీరు అంతర్జాతీయ దృష్టిని ఆకర్షిస్తుంది. ఆ అవకాశాన్ని ఎందుకు వదులుకోవాలి అని సహచరులు నచ్చచెప్పి మొత్తానికి భగత్‌సింగును ఒప్పించారు.
పైగా ప్రివీ కౌన్సిలుకు వెళ్లటంవల్ల ఉరి అమలు వాయిదా పడుతుంది. ఆలోగా ఆ అంశం మీద దేశవ్యాప్తంగా బ్రహ్మాండమైన ప్రజా ఉద్యమం తేవడానికి వీలు కలుగుతుంది. దానివల్ల ప్రజా చైతన్యం పెరుగుతుంది అన్న వాదన కూడా భగత్‌సింగ్ మీద పని చేసింది. ఏది ఎలా ఉన్నా కనీసం తమ హెచ్.ఎస్.ఆర్.ఎ. పార్టీ పేరుకు అంతర్జాతీయ ఖ్యాతి వస్తుంది కదా అని తలిచి అతడు అనిష్టంగానే ‘సరే’ అన్నాడు.
అపీలును మన్నించవలసిందంటూ మోతీలాల్ నెహ్రూ, ప్రాణనాథ్ మెహతా వంటి న్యాయపారంగతులు ప్రివీ కౌన్సిలుకు విజ్ఞప్తి చేశారు. కుట్ర కేసు వివరాలు, ట్రిబ్యునల్ విచారణ లోటుపాట్ల జోలికి పోకుండా, ఆ ట్రిబ్యునల్‌ను సృష్టించిన ఆర్డినెనే్స చట్టరీత్యా చెల్లదని అపీలుదారులు వాదించారు. ఆర్డినెన్సు
తేవలసినంత ఎమర్జన్సీ ఏదీ దేశంలో లేదని.. శాంతికి సుపరిపాలనకు ఆర్డినెన్సు అవసరమైందన్న సర్కారు వాదంలో పసలేదని.. పై కోర్టుకు అపీలుకు వీలే లేకుండా ట్రిబ్యునల్ చేసేదే తిరుగులేని నిర్ణయమని నిర్దేశించడం న్యాయవిరుద్దమని ప్రసిద్ధ బ్రిటిషు న్యాయవాది డి.ఎన్.ప్రిట్ అపీలుదారుల తరఫున గట్టిగా వాదించాడు. కాని ప్రయోజనం సున్న. కనీసం రెగ్యులర్ విచారణకయినా ప్రివీ కౌన్సిల్ అనుమతించలేదు. ‘ఎమర్జన్సీ పరిస్థితి ఉన్నదా లేదా అని తేల్చగలిగింది దేశాన్ని పరిపాలించే గవర్నర్ జనరల్ మాత్రమే. అతడి నిర్ణయాన్ని ప్రశ్నించడానికి వీలులేదు’ అని చెప్పి 1931 ఫిబ్రవరి 11న ఆరంభ దశలోనే అపీలును ప్రివీ కౌన్సిలు డిస్మిస్ చేసింది.
*

ఎం.వి.ఆర్.శాస్ర్తీ