S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

పదార్థ పరార్థతల ‘ఆత్మ’యోగం

నవ అవతారంలో పైకి కనిపించేది దేహం... కనిపించనిది ఆత్మ. కనిపించే దేహం ఎన్నడో ఒకనాడు కనిపించకుండా పోతుంది. కనిపించని ఆత్మ మాత్రం ఈ దేహం వీడిన మరుక్షణం మరో విశ్వ ప్రకృతికి ప్రయాణమవుతుంది.. ఇలా విశ్వ ప్రకృతిలోని ఆత్మ వర్తనాన్ని మనం ‘మృత్యువు తర్వాతి జీవితం’ అంటుంటాం. అంటే, ఆత్మ ఈ దేహాన్ని ఆశ్రయించి ఉన్నంతవరకు మనది మానవ జీవితం.. ఈ దేహాన్ని వీడిన తర్వాత అధిభౌతిక జీవితం. అంటే, ఆత్మ పదార్థంలోను ఉండగలదు.. పదార్థేతరమైన పరార్థంగాను ఉండగలదు. ఇలా ఆత్మది చావు పుటుకలలో అస్థిరవాసమే.
అయితే, ఆత్మ పాంచ భౌతిక దేహంలో ఉన్నంతకాలం ‘సిద్ధయే సర్వ కర్మణామ్’ - సర్వ కార్యసిద్ధిని పొందాలంటే ‘పంచైతాని’ -అయిదంశలలో ఉన్నతిని పొందాలి. సర్వ కర్మ సిద్ధత్వ పరంగా అయిదంశలనే అయిదు కారణాలనీ చెప్పుకోవచ్చు. అయిదంశలలో మొదటి అంశకు కావలసింది కార్య స్థానం... ఇంతకీ కార్యస్థానం మన దేహమే... కాబట్టి మన దేహమే సర్వకర్మ సిద్ధి విషయకంగా మొదటి కారణం అవుతోంది.
మొదటి కారణం ‘దేహం’.. ఇక రెండవ కారణం ఈ దేహాన్ని తొడుక్కున్న ‘నేను’... మూడవ కారణం దేహాన్ని ఆశ్రయించి ఉన్న ఇంద్రియాలు.. నాల్గవ కారణం దేహవర్తనానికి చెందిన వివిధ ప్రయత్నాలు... అయిదవ కారణం పరమాత్మ. మొత్తానికి అయిదు కారణాలలోను మన దేహం ఏదో రూపేణా తన పాత్ర పోషిస్తూనే ఉంది. అంటే, మన దేహం, మన మనస్సు, మన మాట ఈ మూడూ అయిదు కారణాలకు మూలం. ఇక్కడ మాట అంటే కమ్యూనికేషన్ అని. బాడీ, మైండ్ అండ్ కమ్యూనికేషన్ కలిస్తేనే మనం మానవులం.
మనం మన దేహాన్ని అశ్రద్ధ చేసినా, మన మనస్సును పక్కకు తోసిపుచ్చినా, మన మాటకు విలువ ఇవ్వకున్నా మన మానవజన్మ గతి తప్పినట్లే! సింపుల్‌గా చెప్పుకోవాలంటే దేహం, మనస్సు, వాక్కు కలిస్తేనే ‘నేను’. ఈ మూడింటి సంయోగంతో జరిగే పంచ కారణ సిద్ధికే ఉన్నతావకాశం... ఉన్నత స్థానం. అంటే, కర్మాచరణ పరంగా దేహం, మనస్సు, వాక్కు కూడబలుక్కోవలసిందే! అంతేకాదు, కర్మను ప్రేరేపించే అంశంలో జ్ఞానం, జ్ఞేతం, జ్ఞాతలు కూడా ఒక్కటవ్వాలి. అప్పుడు కానీ కర్మాచరణలో ఇంద్రియాలు, కార్యం, కర్తల భాగస్వామ్యం కావు.
ఇంకా సులభంగా చెప్పుకోవాలంటే - మనం ప్రేరణ పొందనిదే ఏ కర్మాచరణకు, కార్యాచరణకు సాహసించం. అంటే ఎంత చిన్న పని చేయాలన్నా ఎంతో కొంత ప్రేరణ అవసరం. ఈ ప్రేరణ కరువైననాడు జీవితం నిస్సారంగా సాగుతుంటుంది. అందుకే ప్రోత్సహించేవారే లేరని నిరుత్సాహపడుతుంటాం. అంటే కర్మాచరణలో, కార్యాచరణలో మనలోని ప్రతి ఒక్కరికి ఎంతో కొంత ప్రోత్సాహ, ప్రేరణ అవసరమే! మన ఆలోచనలు పదునెక్కటం, భావనలు పురుడు పోసుకోవటం, సంకల్పాలు నిలదొక్కుకోవటం జరిగేది ‘ప్రేరణ’ వల్లనే! ఇంతేకాదు, మనలోని త్రివిధ భౌతిక గుణాలు సైతం ‘కర్మ’ విషయకంగా ప్రధాన పాత్ర పోషిస్తుంటాయి.
* * *
ఈ సృష్టిలో రకరకాల అసంఖ్యాక జీవులు. ఆ జీవరాశిలో మన మానవ జన్మ ఒక జీవ పరిణామం. ఈ జీవ పరిణామంలో అంటే మానవ అవతారంలో సత్వగుణం అద్వితీయ పాత్ర పోషించగలిగితే మనం అవిభక్త ఆధ్యాత్మిక స్వభావానికి తావలమవుతాం. ఇక్కడ అవిభక్త ఆధ్యాత్మిక స్వభావం అంటే సకల జీవరాశిలోని ఆత్మను పట్టుకోగలగటం.. పట్టించుకోవటం. ఇన్ని కోటానుకోట్ల రూప జీవులలో ఉన్నది ‘ఆత్మ’ అని, రూపరహితమైన ఆత్మ ఇన్ని రకాల రూపాలలో తన అస్తిత్వాన్ని చాటుకుంటూనే ఉందన్న తెలివిడే సాత్విక స్వభావం. అంటే, వ్యక్త రూపం నశిస్తోందే తప్ప అరూప ఆత్మది అవ్యక్త అస్తిత్వంగా చిరంజీవత్వమే. ఈ జ్ఞాన ప్రకాశనమే ఆత్మసాక్షాత్కారం. ఆత్మసాక్షాత్కారం జరగాలంటే మనలోని రజోగుణ, తమోగుణాలు తుడిచిపెట్టుకుపోయి ఒక్క సత్వగుణమే శోభించాలి.
అవును, సృష్టి పరిణామంలోని భిన్న రూపాలలో భిన్న జీవుల్ని చూస్తూ ‘ఆత్మ’ను ‘అభిన్నం’గా చూడలేకపోవటం రజోగుణ లక్షణమే! అంటే ఆత్మ చిరంజీవత్వాన్ని, శాశ్వతత్వాన్ని అంగీకరించలేక పోవటం రజోగుణ స్వభావ ఫలితమే! మానవ జన్మ రజోగుణ సంపన్నమైతే ఆత్మ తత్వాన్ని ఆకళింపు చేసుకోలేక ఆత్మను, జీవాన్ని, చైతన్యాన్ని ఒకే గాటకు కట్టి పాంచభౌతిక మానవ దేహంతోపాటు దేహాన్ని చేరిన ఆత్మ సైతం నశిస్తుందన్న భ్రమకు లోనవుతుంటాం. అంతెందుకు ఆత్మను వేరుగాను, జీవాన్ని వేరుగాను, చైతన్యాన్ని వేరుగాను చూడలేకపోవటం రజోగుణం వల్లనే! ఆత్మ, దేహం, చైతన్యం - ఈ మూడింటి స్థితులు వేరువేరు. కాబట్టి ఆత్మ సర్వవ్యాపకత్వాన్ని ఔదలదాల్చటం ఒక్క సత్వగుణ ప్రకాశనం వల్లనే సాధ్యవౌతుంది.
ఆత్మ అస్తిత్వాన్ని గుర్తించలేక పోవటంలో మన విషయంలో డేంజరస్ స్వభావం ఏమిటంటే తమోగుణం. అసలు మానవ జననమే తమోగుణ భూయిష్ఠం కాబట్టి నిత్య వ్యవహారాలతో, దైనందిన జీవన శైలితో వయోవృద్ధితోపాటు ఈ తమో గుణమే మన స్వభావాన్ని ఆక్రమించటం సహజంగా చూస్తున్నాం. తమోగుణం వల్లనే ‘ఆత్మ’ గొప్పగా అనిపించదు. పైగా ఆత్మ అస్తిత్వమూ అల్పమైందిగానే అనిపిస్తుంది. అంటే తమోగుణం ప్రకోపించటం వల్ల మనలో విశ్వజ్ఞత స్థానే అల్పజ్ఞతే ఊడలు దిగుతుంది. పైగా తమోగుణం వల్ల ఆత్మ సంపన్నత వైపు కాక దైహిక సంపదల వైపు మొగ్గు చూపి ఉండటం, యోగిగా కాక భోగిగానే జీవన రచన సాగించటం ఇష్టమవుతుంటుంది. ఇంకా తమోగుణ జీవనాన్ని పశుప్రవృత్తికి సమానమైందిగా చెప్పుకోవచ్చు... పైగా తమోగుణ సంపన్నత కారణంగా ఆత్మ సౌందర్యం కంటే దేహసౌందర్యమే అద్వితీయ మనిపిస్తుంది.

డా.వాసిలి వసంతకుమార్ 93939 33946