S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

నిండు ప్రాణాలను బలిగొంటున్న కుండపోత వానలు

నిజామాబాద్, సెప్టెంబర్ 25: కుండపోత వానలు నిండు ప్రాణాలను బలిగొంటున్నాయి. జిల్లాలో ఇప్పటికే వర్షాల తాకిడితో ముగ్గురు మృత్యువాత పడగా, తాజాగా మరో ఇద్దరి ప్రాణాలను వరదలు కబళించాయి. కామారెడ్డి పట్టణంలో శనివారం రాత్రి ఏకధాటిగా కురిసిన కుండపోత వర్షంతో పలు కాలనీల్లోని ఇళ్లలోకి వర్షపు జలాలు చొచ్చుకువచ్చాయి. దీంతో మోసిన్ అనే యువకుడు బియ్యం బస్తా తడవకుండా మరో గదిలో చేర్చేందుకు తీసుకెళ్తున్న క్రమంలో వర్షపు నీటిలో కాలుజారి కిందపడగా, అతనిపై బరువైన బియ్యం బస్తా పడి ఊపిరాడక అక్కడికక్కడే మృతి చెందాడు. సిరికొండ మండలం గడ్డమీదితండాలో చోటుచేసుకున్న మరో సంఘటనలో కిష్టయ్యనాయక్(65) అనే వృద్ధుడు కూడా భారీ వర్షాల తాకిడికి లోనై తనువు చాలించాడు. తండాకు చేరువలోనే ఉన్న వరి పంట పొలానికి కాపలా కాసేందుకు శనివారం రాత్రి వెళ్లిన కిష్టయ్య, అక్కడే ఏర్పాటు చేసుకున్న గుడిసెలో నిద్రించాడు. కుండపోత వర్షం కారణంగా గుడిసె కూలడంతో దాని కింద చిక్కుకుని మృత్యువాతపడ్డాడు. కాగా, వేల్పూర్ మండలం పడిగెల్ శివారులో వాగులో కారు కొట్టుకుపోయిన సంఘటనలో తల్లీ, కుమారుడు గల్లంతవగా, తీవ్ర గాలింపులు జరిపిన మీదట తల్లి ప్రియాంక మృతదేహం ఆదివారం లభ్యమైంది. రెండేళ్ల చిన్నారి వర్షిత్ ఆచూకీ కోసం ఇంకనూ గాలింపులు కొనసాగిస్తూనే ఉన్నారు. ఆదివారం నాటి సంఘటనతో భారీ వర్షాల కారణంగా జిల్లాలో మృతి చెందిన వారి సంఖ్య ఐదుకు చేరింది. మరో రెండు రోజుల పాటు భారీ నుండి అతి భారీ స్థాయిలో వర్షాలు కురిసే అవకాశాలున్నట్టు వాతావరణ శాఖ చేసిన హెచ్చరికలతో జిల్లా ప్రజలు చిగురుటాకులా వణికిపోతున్నారు. శనివారం రాత్రి నుండి ఆదివారం ఉదయం వరకు కూడా జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. జిల్లా వ్యాప్తంగా సగటున 61.4మి.మీ వర్షం కురిసింది. అత్యధికంగా మాచారెడ్డి మండలంలో 320.8మి.మీ వర్షం కురియగా, కామారెడ్డిలో 275.4మి.మీ, జక్రాన్‌పల్లిలో 165.8, సదాశివనగర్‌లో 119.2, దోమకొండలో 116.2, బాల్కొండలో 94, ఆర్మూర్‌లో 92.4, సిరికొండలో 89.2, వేల్పూర్‌లో 63.6, భిక్కనూరులో 98.2 మి.మీ చొప్పున వర్షపాతం నమోదైంది. కుండపోత వర్షం ధాటికి కామారెడ్డి పట్టణంలోని అనేక కాలనీల్లో నివాస ప్రాంతాల్లోకి వరద జలాలు చొచ్చుకుపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పట్టణం గుండా హైదరాబాద్ - నిజామాబాద్ వైపు రాకపోకలు సాగించే మార్గంలో సరంపల్లి వంతెన వరద తాకిడికి దెబ్బతినడంతో వాహనాల రాకపోకలను నిషేధిస్తూ బైపాస్ మీదుగా మళ్లిస్తున్నారు. కామారెడ్డికి చేరువలో ఉన్న సదాశివనగర్ మండలం ఉప్పల్‌వాయి వద్ద రైల్వే ట్రాక్‌పైకి వరద జలాలు చేరుకోవడంతో పలు రైళ్ల రాకపోకలకు సైతం అంతరాయం ఏర్పడింది.
రికార్డు స్థాయిలో 32సెం.మీలకు పైగా కురిసిన వర్షంతో మాచారెడ్డి మండలంలోని పలు గ్రామాలు కూడా జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. సిరికొండ మండలంలోని కప్పలవాగు పొంగి ప్రవహిస్తుండడంతో కొండూర్ బ్రిడ్జి, గడ్కోల్ బ్రిడ్జిలు దెబ్బతినడంతో నిజామాబాద్ - సిరికొండ మార్గంలో రాకపోకలు స్తంభించాయి. ఏకధాటిగా కురుస్తున్న వర్షాలతో మూడు రోజులుగా వేలాది ఎకరాల్లో పంటలు నీటిలోనే మునిగి ఉన్నాయి. పలుచోట్ల పురాతన కాలం నాటి పెంకుటిండ్లు, మట్టి గోడలు కలిగిన నివాస గృహాలు ధ్వంసమవడంతో బాధితులు నిరాశ్రయులుగా మారారు. ఆయా మండలాల్లో సుమారు డజనుకు పైగా చెరువులకు గండ్లు పడ్డాయి. కుండపోత వర్షాలతో ఎగువ నుండి భారీగా వచ్చి చేరుతున్న వరద కారణంగా జిల్లాలోని ప్రధాన జలాశయాలన్నీ నిండుగా నీటి నిల్వలను సంతరించుకున్నాయి. కేవలం 24గంటల వ్యవధిలోనే నిజాంసాగర్ నిండిపోవడంతో ఆదివారం వరద గేట్ల ద్వారా మిగులు జలాలను విడుదల చేశారు. అయితే ఆదివారం ఉదయం నుండి వర్షం కాస్తంత ఎడతెరపినివ్వడం ఒకింత ఊరటనందించింది.