S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

6,250 ఎకరాల్లో పంట నష్టం

ఆదిలాబాద్, సెప్టెంబర్ 26: జిల్లాలో రెండు రోజులుగా కురిసిన భారీ వర్షాల కారణంగా వాగులు, నదులు ఉప్పొంగి ప్రవహించగా జిల్లాలోని రిజర్వాయర్లు, చెరువులు నిండు కుండలా తలపిస్తున్నాయి. ఈనెల 23, 24 తేదీల్లో ఏకదాటిగా కురిసిన భారీ వర్షాలు, ఎగువ మహారాష్ట్ర నుండి జిల్లాను తాకిన వరద నీటి ప్రవాహంతో గోదావరి ఉదృతరూపం దాల్చింది. అయితే గత పది సంవత్సరాల్లో ఎప్పుడు లేని విధంగా కురిసిన వర్షాల వల్ల ఎస్సారెస్పీతో పాటు కడెం, సాత్నాల, స్వర్ణ, మత్తడివాగు, సుద్దవాగు, కొమరంభీం ప్రాజెక్టు, నిల్వాయి, ఎల్లంపల్లి ప్రాజెక్టుల్లోకి పూర్తిస్థాయి నీటిమట్టం చేరుకోవడం రైతుల్లో ఆనందం కల్గించింది. జిల్లాలోని 540 కాకతీయ మిషన్ చెరువుల్లోకి భారీగా వరద నీరు చేరడంతో ఈ ఖరీఫ్, రబీ సీజన్‌లో 74వేల ఎకరాల ఆయకట్టు స్థిరీకరించేందుకు అవకాశం ఏర్పడిందని, తద్వారా రైతులు రెండు పంటలు పుష్కలంగా పండించుకోవచ్చని ఇరిగేషన్ అధికారులు పేర్కొంటున్నారు. వర్షాలు రైతుల్లో ఆనందాన్ని నింపినా కొన్ని చోట్ల కల్వర్టులు, కాలువలకు గండిపడడం మూలంగా వేలాది ఎకరాలు వరద నీటిలో మునిగి రైతులకు తీరని నష్టాన్ని మిగిల్చాయి. భారీ వర్షాలకు మొక్కజొన్న, సోయాబీన్, పప్పు దినుసు పంటలు నేలకొరిగి కడగండ్లను మిగిల్చాయి. జిల్లా వ్యాప్తంగా 1120 మి.మీటర్ల వర్షపాతం కురియడం రికార్డుగా చెప్పవచ్చు. జిల్లా వ్యాప్తంగా 11 మండలాల్లోని 58 గ్రామాల పరిధిలో 2610 హెక్టార్లలో పంటలు నీటమునిగినట్లు అధికారులు అంచనా వేశారు. ప్రాథమికంగా పంట నష్టంపై అంచనా వేసి పరిహారంపై ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. ఇటీవల ప్రభుత్వం వరద విపత్తులతో ఏర్పడే నష్ట పరిహారం పెంచుతూ ఆదేశాలు జారీ చేయగా సాగునీటి కింద పంటలు నష్టపోయే వాటికి హెక్టారుకు రూ.13500, వర్షాధారం కింద సాగుచేస్తూ వరద విపత్తుకు దెబ్బతిన్న అన్ని పంటలకు హెక్టారుకు రూ.6800 చొప్పున పరిహారం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొక్కజొన్నకు మాత్రం హెక్టారుకు రూ. 8333పరిహారం అందించేలా నిర్ణయం తీసుకున్నారు. జిల్లాలో 6250 ఎకరాల్లో ప్రధాన పంటలు నీటమునిగి నష్టపోగా వీటిలో సోయాబీన్ పంటకు భారీ వర్షాలు తీరని నష్టాన్ని మిగిల్చాయి. రైతులు పత్తికి ప్రత్యామ్నాయంగా సోయాబీన్ వేసుకోగా చేతికి వచ్చే దశలోనే భారీ వర్షాలకు తడిసి ముద్దయి నష్టపోవాల్సి వచ్చింది. చివరి దశలో సోయాబీన్ పంటకు మొలకలు రావడంతో మార్కెట్‌లో గిట్టుబాటు ధర రాని పరిస్థితి నెలకొంది. పలు చోట్ల సుమారు 500 ఎకరాల్లో పంటలు నేలకొరిగి దెబ్బతినగా దిల్వార్‌పూర్ మండలంలోని మూడు గ్రామాల్లో 77 మంది రైతులు 60 ఎకరాల పత్తిపంటను, 75 ఎకరాల సోయాబీన్ పంటను, 26 ఎకరాల వరి పంటను నష్టపోయారు. ఇచ్చోడ మండలంలో 150 హెక్టార్లలో పత్తి పంటనష్టపోయినట్లు అధికారులు గుర్తించగా, భైంసా మండలంలోనే 55 హెక్టార్లలో పత్తి, 32 హెక్టార్లలో సోయాబీన్, 10 హెక్టార్లో మినుము పంట దెబ్బతిన్నట్లు అధికారులు గుర్తించారు. జిల్లాలో పత్తి 1614 హెక్టార్లలో వరద నష్టం సంభవించగా, 532 హెక్టార్లలో సోయాబీన్, 350 హెక్టార్లలో మొక్కజొన్న, 15 హెక్టార్లలో మినుము పంట దెబ్బతిన్నట్లు అధికారులు ప్రాథమిక సర్వేలో తేల్చారు. తద్వారా వివిధ పంటలకు 6.5 కోట్ల నష్టపరిహారంతో రైతులను ఆదుకునేలా చర్యలు చేపట్టారు. ఈమేరకు సోమవారం మంత్రి జోగురామన్న, జిల్లా ప్రత్యేకాధికారి వికాస్ రాజ్ జిల్లాలో జరిగిన వరద నష్టంపై సమీక్ష నిర్వహించి, యుద్ద ప్రతిపాదికన మరమ్మత్తు పనులు చేపట్టాలని, నష్టం వివరాలతో ప్రభుత్వానికి నివేదికలు సమర్పించాలని అధికారులను ఆదేశించారు.
రోడ్ల మరమ్మత్తులకు 2.5 కోట్లు
జిల్లాలో రెండు రోజులుగా కురిసిన భారీ వర్షాలకు పంచాయతీరాజ్, ఆర్ అండ్‌బి రోడ్లు భారీ మొత్తంలో దెబ్బతిని గుంతలమయంగా మారాయి. దీంతో పలు పట్టణాల్లో రోడ్లపై వెళ్లేందుకు ప్రయాణికులు జంకుతున్నారు. జిల్లా మొత్తం మీదా రోడ్ల మరమ్మత్తులకు రూ.2.5 కోట్లు అవసరమని నివేదికలు సమర్పించారు.