S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

సుర ప్రవృత్తి.. అమృత జీవనం

మథనంతో పుట్టుకొచ్చింది అమృతం. ఆ అమృతాన్ని దేవతాగణం, దానవ గణం సేవించాలనుకున్నారు. కానీ పంపకంలో జరిగిన పక్షపాత వైఖరితో ఒకరికి దక్కింది... మరొక్కరికి దక్కలేదు. దక్కించుకున్న వారు అమరులయ్యారు. దక్కని వారు రాక్షసులుగానే మిగిలిపోయారు.
సింపుల్‌గా చెప్పుకోవాలంటే సేవించగలిగిన వారు అమృతత్వంతో దేవతలుగా నీరాజనాలు అందుకుంటుండగా, అమృతపానం చేయలేనివారు దానవులుగా పేరుపడిపోయారు. అయితే ఈ దివ్యత్వాన్ని దానవత్వాన్ని రెంటినీ తమ మానవ తత్వంలోకి వొంపుకున్న మానవ అవతారులు మాత్రం పాజిటివిటీతోను, నెగెటివిటీతోను జీవితాలను లాగించేస్తూ మంచి చెడుల కలనేతగా మృతతత్వం వైపు కదలిపోతున్నారు. నిజానికి మానవత్వంతో దైవత్వం జతపడిననాడు మానవుడే మహనీయుడు, ఆరాధనీయుడు! అలాకాక మానవత్వంతో రాక్షసత్వం సహచర్యం చేసినంతకాలం మానవుడే దానవుడు, ఛీత్కారుడు!!
ఈ దివ్యత్వ, దానవత్వాలు మనలో దోబూచులాడుతున్న తీరును భగవద్గీత పదహారవ అధ్యాయం చక్కగా విశే్లషిస్తోంది. అవును, తొండ ముదిరి ఊసరవెల్లి అయిందన్న చందాన మనం కూడా ఒకపక్క దివ్య భావనలతో సామాజిక జీవనాన్ని అభిలషిస్తూనే మరొక పక్క క్రూరమైన దానవ ప్రవృత్తితో జీవిస్తుంటాం.
దివ్యత్వమైనా, దానవత్వమైనా పుట్టుకొచ్చేది మనస్సు నుండే! స్వచ్ఛమైన మనస్సు దివ్యత్వ లోగిలి అవుతుంది. కలుషిత మనస్సు దానవ గుణాలకు ఆకరమవుతుంది. ఏది ఏమైనా మన మానసిక సంపద అంతా సుర, అసుర తత్వ సమాహారమే. కాబట్టే సుర తత్వం, అసుర తత్వం కలగలిసి మానవతత్వంగా మనగలుగుతోంది. అసురతత్వంతో మిడిసిపడితే మహనీయతకు అవకాశం లేకుండా దానవ తత్వంతో అహంకరించటం జరుగుతోంది. సుర తత్వంతో వొదిగిపోతుంటే మహనీయత మూర్త్భీవిస్తోంది.
మానవాత్మ మహాత్మగా పరిణమించాలంటే కర్మాచరణ దివ్య ప్రబంధం కావాలి. సుర ప్రవృత్తికి మానవ తత్వం ఆకరం కాగలిగితే మన రూపం తేజ స్వంతమవుతుంది. ధీరత్వం ప్రకాశమానమవుతుంది. నిజాయితీ, సహనం సహజ కవచాలవుతాయి... ఇంద్రియ నిగ్రహం, అంతఃకరణ శుద్ధి వర్తనంలో ప్రతిఫలిస్తుంటాయి. ఇటువంటి సుర సంపదల నిలయమైన మనస్సు స్వోత్కర్షకు ఏ మాత్రం తావీయదు. అందుకే దైవీ సంపద మోక్షత్వానికి మూలమవుతుంటే దానవ కృత్యాలు ఐహికానికే బందీని చేస్తూ, బంధనానికే బంధనాలవుతుంటాయి.
* * *
శౌచం, సదాచారం, సత్యం - ఈ మూడూ కలిసి అడుగులేస్తున్న జీవన మార్గంలో దివ్యత్వం సైతం తనదైన పంథాలో సహ ప్రయాణీకురాలవుతుంది. అయితే అసుర నిఘంటువులో మాత్రం ఈ పదాలకు ఉనికి ఉండదు.. కారణం వివేచనలేని కర్తవ్య పరాయణత అసుర ప్రవృత్తిది. అంటే వివేక శూన్యతే అసుర సంపదకు రక్షా కవచం. సృష్టిని కామహేతువుగా చూడటం ఈ లేమివల్లే. ఇలా అసుర ప్రవృత్తి గలవారు అల్పబుద్ధులు, నష్టాత్ములు, ఉగ్ర కర్మణ్యులు, అహితులు అవుతున్నారు. పైగా అసుర తత్వం ఆమరణాంతం వెన్నంటే ఉంటుంది. కాబట్టి కామోపభోగమే జీవిత లక్ష్యమవుతుంటుంది. ఇటువంటి దానవ తత్వంలో అహంకరించే వారు ఐహిక బంధాలలో బంధింపబడటమే కాక ఆహుష్మిక చింతనతో విముక్తులు కావటం సాధ్యపడదు.
అందుకే, అసుర ప్రవృత్తి కల మానవులు -
‘ఆశాపాశ శతైర్బద్ధాః’ - వందలాది ఆశలను మూటగట్టుకుని మోస్తుంటారు,
‘కామ క్రోధ పరాయణాః’ - కామక్రోధాదులతో తలమున్కలై ఉంటారు.
‘కామ భోగార్థ మన్యాయేనార్థ సంచయాన్’ - కామ భోగాన్ని, అన్యాయ ఆర్జనను మీదు మిక్కిలి కోరుతుంటారు.
అవును, కోరికలతో వేగిపోతుంటే నక్కినక్కి వెనకడుగులు వేయటం సాధ్యమవుతుందే తప్ప ధీరోదాత్తతతో ముందడుగులు వేయటం కుదరదు. అంటే ఆరోహణకు అవకాశమివ్వని అవరోహణమే అసుర ప్రవృత్తికి ఆలంబన అవుతోంది.
నిజానికి, అసుర ప్రవృత్తికి నెగెటివిటీనే ఆలంబన. ఆధారం - ఎలాగంటే-
‘ఇద మద్య మయా లబ్ధమిదం ప్రాప్స్యే మనోరథమ్’ - ప్రస్తుతానికి అంటే ఇంతవరకు ఇది సంపాదించాను. ఇక ముందు మనోభీష్టం మేరకు ఏ మాత్రం జారవిడుచుకోకుండా సంపూర్ణంగా సంపాదించగలను అన్న అహంకారం ఒక నెగెటివ్ అంశనే.
‘ఇద మస్తీదమసి మే భవిష్యతి పునర్ధనమ్’ - ఇంతవరకు ఇంత ధనం కూడబెట్టాను. ఇక ముందూ ఎంతో కూడబెట్టగలను అన్న అహంభావమూ ఒక నెగెటివ్ అంశనే.
‘అసౌ మయా హతః శత్రుర్సనిష్యే చాపరానపి’ - ఇంతవరకు శత్రుశేషం లేకుండా చేశాను. ఇప్పటి శత్రువునూ హతమార్చాను.. రేపటి శత్రువులనూ హతమార్చగలను అన్న మానసిక ప్రదర్శనా నెగెటివ్ అంశనే.
‘ఈశ్వరో హ మహం భోగీ సిద్ధోహం బలవాన్ సుఖీ’ - నేనే సర్వసమర్థుడ్ని అని అనుకోవటం... నేనే భోగిని అని విర్రవీగటం.. నేనే సంపన్నుడ్నని అహంకరించటం... నేనే బలవంతుడ్నని మిడిసిపడటం.. నేనే సుఖినని మురిసిపోవటం... నేనే ఐశ్వర్యవంతుడనని, నేనే మహావంశజుడనని, నేనే అసమాన్యుడనని... దానాదులు చేయటంలో నేనే మిన్న అని, యాగాదుల నిర్వహణలో నేనే సమర్థుడనని అనుకోవటం కూడా అజ్ఞాన మోహంతోనే. ఈ అజ్ఞాన జీవనం ప్రారంభమయ్యేది అసుర ప్రవృత్తి నుండే.
ఇంతకీ ఇటువంటి దానవ ప్రవృత్తి మనలో నెలకొంటే కామ భోగాసక్తత వైపే మొగ్గి ఉంటాం - డాంబిక వర్తనంతో కన్నుమిన్ను కానక జీవిస్తుంటాం. ధనాహంకారంతో విర్రవీగుతుంటాం - అశాస్ర్తియ యజ్ఞ నిర్వహణా భాగస్థులం అవుతాం. పైగా అహంకారం, బలం, దర్పం, కామం, క్రోధం కారణంగా ఆ పరమాత్మ ఉనికిని శంకించటమే కాక ద్వేషించటమూ జరుగుతుందంటాడు గీతాచార్యుడు. కాబట్టి అసుర ప్రవృత్తి గలవారిది మోక్ష ప్రాప్తికి తావీయని అధమగతే!
* * *
కృష్ణుడి సైకాలజీ, ఫిలాసఫీ ప్రకారం కూడా - కామం, క్రోధం, లోభం నెగెటివిటీకి మూడు ముఖ ద్వారాలు.. నరకానికి ద్వారబంధాలు. వీటి ద్వార ప్రవేశంతో మానవత్వం అడుగంటుతుందే తప్ప దైవత్వం ఏ మాత్రం నిలదొక్కుకోదు.. పైగా దానవత్వమే మానవత్వాన్ని ఆక్రమిస్తుంది. నిజానికి ఈ మూడు ద్వారాలను పసిగట్టి ఆ పరిధుల నుండి సైతం వైదొలగటమే పాజిటివిటీ. అదే స్వర్లోకం.. సుర ప్రవృత్తికి ఆవాసం.
ఇలా కృష్ణుడు సుర అసుర ప్రవృత్తులను గురించి అర్జునుడికి చెప్తూ ఆత్మోద్ధరణకు, ముక్తికి కావలసింది సురవర్తనమే తప్ప అసుర వర్తనం కాదంటాడు. అంతేకాక అసుర ప్రవృత్తి ఇహబంధాల బందిఖానా అని అంటాడు.
అసుర ప్రవృతి పదార్థ భోగులది... సుర ప్రవృత్తి పరార్థ జీవులది. ఐహిక వాంఛలన్నీ మనల్ని అసుర ప్రవృత్తి దరి చేరుస్తున్నట్లే. పైగా ఈ అత్యాశలు మన జీవితాలను దుఃఖమయం చేస్తుంటాయి. మనలో పాదుకునే ప్రతి ఆశా మరో దుఃఖానికి అంకురార్పణ అవుతుంటుంది.

డా.వాసిలి వసంతకుమార్ 93939 33946