S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

కర్ణాటక సంగీతంలో స్టార్ సింగర్లు

సుప్రసిద్ధ సినీ నేపథ్య గాయకుడు పి.బి.శ్రీనివాస్ మద్రాసులో జరిగే సంగీత కచేరీలకు తరచుగా హాజరవుతూ ఉండేవారు. నాకు మంచి మిత్రుడు. వేలాది సినిమా పాటలు పాడిన మీకు, ఈ సంప్రదాయ సంగీత కచేరీలు వినాలనే ఆసక్తి ఎందుకు కలుగుతోంది? అని అడిగాను.
‘కొనే్నళ్లు నేను కూడా సంప్రదాయ సంగీతం చాలా కష్టపడి నేర్చుకున్నాను. నా దురదృష్టం ఏమో! భైరవి రాగంలో పచ్చి మిరియం ఆది అప్పయ్యగారి ‘అటతాళ వర్ణం’ అంటే ఎందుకో! భయమేసింది. పైగా మా గురువు చాలా గట్టివాడు. అనుస్వరయుక్తంగా ఆ వర్ణాన్ని చెప్పి, ఓ రోజు - రెండు కాలాల్లోనూ పాడమన్నారు. అంతే! ఒళ్లంతా చెమటలు పట్టేశాయి.
అక్కడికి ఆ సంగీతానికి ఫుల్‌స్టాప్ పెట్టేశాను. ఇదిగో! ఇప్పుడు విచారిస్తూ ఉంటాను.
కాస్త ఓపికతో, శ్రద్ధగా, దీక్షతో, సంగీతం అప్పుడే కొనసాగించి ఉంటే గాయకునిగా కాకుండా, విద్వాంసుడిగా గుర్తింపు వచ్చి ఉండేది గదా!’ అంటూ వాపోయేవారు.
సంప్రదాయ సంగీతం పట్ల ఆయనకున్న గౌరవమది.
అందుకే సంగీతం ఎవరి దగ్గర నేర్చుకున్నాం? ఎందుకు నేర్చుకుంటున్నాం? ఎంతకాలం నేర్చుకున్నాం? అన్నది కాదు ముఖ్యం. ఏం నేర్చుకుంటున్నాం? ఎలా నేర్చుకుంటున్నాం! అనేదే ముఖ్యం.
పుస్తకాల్లో కంటికి కనిపించే స్వరాలకూ, పాడే స్వరాలకు చాలా తేడా ఉంటుంది. ఈ తేడాను విశే్లషించి చెప్పగలిగే గురువును మాత్రమే ఆశ్రయించాలి. గురువు అనుగ్రహం ఉండాలి. శిష్యునికి ఓర్పు, నిగ్రహం కూడా ఉండాలి. సంగీతానికి ఓ లక్ష్యం ఉండాలి - సరిపోదు సాధన చేయాలి. త్రికరణ శుద్ధిగా నమ్మగలిగే గురువును పట్టుకోవాలి.
త్యాగయ్యకు శొంఠి వెంకటరమణయ్య దొరికినట్లు అందరికీ సద్గురువులు దొరకరు. మన ప్రాంతంలో నారుమంచి జానకి రామయ్యగారు త్యాగరాజ స్వామి వద్దకు వెళ్లారట సంగీతం చెప్పమని. ఆయన త్యాగరాజు కాలంనాటివాడు. ‘నాకు 70 ఏళ్లు వచ్చాయి నాయనా!... నేను చెప్పలేను. వీణ కుప్పయ్యర్ దగ్గరికి వెళ్లు. నేను చెప్పమన్నానని చెప్పు’ అన్నారు.
వీణ కుప్పయ్యర్ త్యాగయ్యగారి ప్రథమ శిష్యులలో ముఖ్యులు - ఆ కుప్పయ్యర్ దగ్గర జానకిరామయ్యగారు నేర్చుకున్నాడు.
తరువాత సుశర్ల దక్షిణామూర్తిగారు. దక్షిణామూర్తిగారి వద్ద పారుపల్లి రామకృష్ణయ్య పంతులుగారు, మంగళంపల్లి పట్ట్భా రామయ్యగారు, (అంటే బాలమురళీకృష్ణగారి తండ్రి) నేర్చుకున్నారు.
సుశర్ల దక్షిణామూర్తిగారి గురువు మానాంబుచావిడి వెంకట సుబ్బయ్యర్. ఇదీ... గురు శిష్య పరంపర. ఒకరిని మించి మరొకరు. అలా పెరిగిపోయింది సంగీతం.
సంగీతం నేర్పటంలో గురువు పాత్ర చాలా గొప్పది. ‘గురువే చిల్లగింజ గురువే భ్రమరము గురువే పరుసవేది’ అంటారు త్యాగయ్య. సముద్రంలో రెండు కాళ్లూ ముంచి చుట్టూ జూడండి - అదిగో! అలా ఉంటుందీ సంగీత సాగరం. ఈ సాగరాన్ని దాటించగల సమర్థుడు - గురువు మాత్రమే.
గట్టు మీదుండి నాలుగు చెంబులు నెత్తిన పోసుకుని సముద్ర స్నానం చేశామనుకుంటారా? ఎవరైనా? ఈ సంగీత సాగరం కూడా అంతే. రాగాల పేర్లు, వాటి ఆరోహణ, అవరోహణలొక్కటే కాదు సంగీతమంటే. స్వామి చిన్మయానంద ఋషీకేశ్‌లో శివానంద సరస్వతి దగ్గర కొన్నాళ్లుండి, ఆ తర్వాత ఉపనిషత్తులూ, భగవద్గీత చెప్పమని కోరితే, ఉపనిషత్తులు చెప్పాలంటే ఫలానా గురువున్నాడు. ఆయన దగ్గర నేర్చుకోమని చెప్పి పంపాడు. సమర్థుడైన శిష్యునికి ముందు గతిని నిర్దేశించగలవాడే గురువు. ఇటువంటి వారికి తర తమ భేదాలుండవు.
త్యాగరాజుకు మొదటి తరంలోని శిష్య వర్గంలో ముఖ్యుడు మానాంబుచావిడి వెంకట సుబ్బయ్యర్. ఆయన శిష్యుడు నామక్కల్ నరసింహయ్యంగార్. ఈయన శిష్యుడు సుప్రసిద్ధ కర్ణాటక సంగీత విద్వాంసుడైన అరియక్కుడి రామానుజయ్యంగార్.
నరసింహయ్యంగార్ వద్ద కొనే్నళ్ల పాటు గురుకుల వాసం చేసిన తర్వాత, గురువుగారి ఆదేశం ప్రకారం ‘పట్నం’ సుబ్రహ్మణ్య అయ్యర్ శిష్యుడైన పూచి శ్రీనివాసయ్యంగార్ వద్ద తన సంగీతాభ్యాసాన్ని కొనసాగించారు అరియక్కుడి.
అలా సాగిన ఆయన సంగీత ప్రస్థానం... కర్ణాటక సంగీత రంగంలో సుస్థిర స్థానాన్ని సంపాదించి పెట్టింది. ఆయన శిష్యుడే సుప్రసిద్ధ కర్ణాటక సంగీత విద్వాంసుడైన పాల్ఘాట్ కెవి నారాయణస్వామి - శిష్యుడై గురుకుల వాసంలో గురువుతో కూడా ఉంటూ కచేరీల్లో తంబురా సహకారంతో పాడుతూ శ్రద్ధగా అనుసరిస్తూ ఆయన అపారమైన సంగీతానుభవాన్ని సంపాదించారు. ఈవేళ తంబురా సహకారంతో సంగీత కచేరీలు చేసే గురువులు కానీ, వారితో తిరిగే శిష్యులు కానీ మన ఆంధ్ర ప్రాంతంలో కనిపించరు. తమిళనాడులో ఇంకా ఉన్నారు.
సంగీత కళానిధి డా.ఎం.ఎల్.వసంతకుమారి, కర్ణాటక సంగీత రంగంలో ఒక స్టార్ సింగర్. అపారమైన సంగీత జ్ఞానం కలిగిన మేధావి - ఆమెకు తొలి గురువు, తన తల్లయిన లలితాంగియే. పూర్తి పేరు మద్రాస్ లలితాంగి. తండ్రి అయ్యస్వామి
వీణధనమ్మాళ్ వద్ద లలితాంగి ఎన్నో పదాలు, జావళీలు నేర్చుకున్నారు. మంచి సంగీత వాతావరణంలో పుట్టి పెరిగి మద్రాస్ లలితాంగి వసంతకుమారిగా కర్ణాటక సంగీత రంగంలో మహాగాయనిగా కీర్తినార్జించారు. ఈమె గురువు మహావిద్వాంసుడైన జి.ఎన్.బాలసుబ్రహ్మణ్యం.
జిఎన్‌బి గురువు ‘టైగర్’ వరదాచారి. కర్ణాటక సంగీత పితామహుడైన పురందరదాసు కీర్తనలను బహుళ ప్రచారంలోకి తెచ్చారు ఎంఎల్‌వి. ఆమె కంఠస్వరానికి ముగ్ధులైన సినీరంగ ప్రముఖుల వల్ల ఆమెకు సినిమాల్లో పాడే అవకాశాలు వచ్చాయి.
సినిమా స్థాయికి దిగిపోకుండా తన వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకుంటూ సంగీత ప్రధానమైన పాటలు పాడి ఎంతో పేరు తెచ్చుకున్నారు ఎంఎల్‌వి. సుప్రసిద్ధ కర్ణాటక సంగీత విదుషీమణులు, చారుమతీ రామచంద్రన్, సుధారఘునాథన్ ఎంఎల్‌వి శిష్యులే.
కర్టాటక సంగీత రంగంలో మరో సూపర్‌స్టార్ సింగర్ శ్రీమతి ఎం.ఎస్.సుబ్బులక్ష్మి పేరు వినని సంగీత రసికులుండరు. ఆమె శతజయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నాం. సుస్వరానికి సుమధుర గానానికి సాక్షి సుబ్బులక్ష్మి పాట.
కర్ణాటక సంగీతంలో పరిపూర్ణ గాయనిగా సుబ్బులక్ష్మిని తీర్చిదిద్దటంలో, అనేక మంది సంగీత విద్వాంసుల పాత్ర ఉంది. ఈమెకు కూడా తల్లి ‘షణ్ముఖవడివు’ తొలి సంగీత గురువు.
పాటలో చక్కని, బరువు, తూకం, నిర్దిష్టమైన చక్కని కాల ప్రమాణంతో కీర్తన పాడటంలో ఆమెకు మార్గదర్శకుడైన గురువు శ్రీ సెమ్మంగుడి శ్రీనివాసయ్యర్. అరియక్కుడి రామానుజయ్యంగార్ తన గురువైన రామ్నాడ్ శ్రీనివాసయ్యంగార్ కృతులు సుబ్బులక్ష్మి నేర్చారు. అలాగే, ముసిరి సుబ్రహ్మణ్య అయ్యర్, కడయనల్లూర్ వెంకట్రామన్, నేదునూరి కృష్ణమూర్తి గార్లను సుబ్బులక్ష్మి తన గురువులుగా భావిస్తారు. నేదునూరి వద్ద అన్నమయ్య కీర్తనలు నేర్చుకుని గ్రామఫోన్ రికార్డు ఇచ్చారు. ప్రసిద్ధ వైణికుడు కె.ఎస్.నారాయణ స్వామి గమక యుక్తంగా పాడటంలో ఎన్నో మెళకువలు నేర్పారు.
పాల్ఘాట్ కెవి నారాయణస్వామి, రామ్నాడ్ కృష్ణన్, అలత్తూర్ సోదరులు, ప్రసిద్ధ వయొలిన్ విద్వాంసులు పాపా వెంకట్రామయ్య, అన్నాస్వామి భాగవతార్, టి.రాజగోపాలశర్మ మొదలైన విద్వాంసుల వద్ద సుబ్బులక్ష్మి, ఎన్నో కృతులు నేర్చుకున్నారు.
టి.బృంద వద్ద ఎన్నో పదాలు నేర్చారు.
అంతేకాదు, ఉత్తర హిందుస్థాన్‌లో సంగీత దర్శకునిగా ప్రఖ్యాతి చెందిన దిలీప్‌కుమార్ రాయ్ వద్ద ఎన్నో మీరా భజన్‌లు నేర్చుకున్నారు.
పండిట్ నరాయణరావు వ్యాస్ హిందుస్థానీ సంగీత గురువు. టుమ్రీ గానంలో సిద్దేశ్వరీదేవి శిక్షణ పొందారు.
ఆమె విష్ణునామ స్తోత్రం వినని శ్రోత ఉండడు. ప్రఖ్యాత వేద పండితుడైన అగ్నిహోత్రం తాతాచారి బృందంతో నలభై రోజుల పాటు దీక్షగా సాధన చేసి ఈ స్తోత్రం రికార్డు చేశారు.
సంగీతానికే తన జీవితాన్ని అంకితం చేసుకున్న ఆ మహాగాయని ఎంత ఎత్తుకు ఎదిగినా అంత వొదిగి ఉంటూ, వినయ సంపదతో సంగీత రసికుల హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోయారు.
కచేరీలతో ఆర్జించిన సొమ్మును ఎన్నో ధార్మిక సంస్థలకు విరాళాలుగా అందజేసిన పుణ్యాత్మురాలు.
భద్రాచల రామదాసు గారు చెప్పినట్టు ‘వానవ రాజ్య భోగ సుఖ వార్ధిని తేలు ప్రభుత్వమబ్బినా యాసకు మేరలేదు, కనకాద్రి సమాన ధనంబు గూర్చినన్ కాసును వెంటరాదు’ అని నమ్ముతూ సంగీతాన్ని సద్వినియోగం చేసుకుని, విద్వాంసులకు మార్గదర్శిగా నిలిచిపోయారామె.
జాతీయ స్థాయిలోనూ, అంతర్జాతీయ స్థాయిలోనూ, ఆమెకు జరిగిన సన్మానాలకూ, సత్కారాలకూ లెక్కలేదు.
ఆధ్యాత్మిక గురువులకు ఆమె సంగీతం ప్రాణం - సంగీతం కోసమే సంగీతం పాడుకున్న మహా మనీషి.

చిత్రాలు.. ఎంఎస్ సుబ్బులక్ష్మి, ఎంఎల్ వసంతకుమారి

-మల్లాది సూరిబాబు 9052765490