S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

పుస్తకం

చిన్నప్పుడు చందమామ, బాలమిత్ర పుస్తకాలు ఎక్కువగా చదివేవాణ్ని. కాస్త పెద్ద అయిన తరువాత యువ, భూమి, జ్యోతి లాంటి పత్రికలు చదివేవాణ్ని. మా రఘుపతన్నకి సాహిత్యం అంటే మక్కువ. శ్రీశ్రీ, దాశరథి, నారాయణరెడ్డి, కాళోజీ లాంటి కవిత్వ పుస్తకాలతోబాటూ, చలం, బుచ్చిబాబు, శ్రీపాద, రంగనాయకమ్మల పుస్తకాలు లెక్కలేనన్ని వుండేవి. వేయి శిరస్సులు ఖండించిన అపూర్వ చింతామణి లాంటి పుస్తకాలు, జీవిత చరిత్రలు, చరిత్రకు సంబంధించిన పుస్తకాలు ఇట్లా ఎన్నో ఉండేవి. మా ఇంటి ముందు కచేరీ పక్కన ఓ గది ఉండేది. దాన్ని ఇంటి ముందటి అర్ర (గది) అనేవాళ్లం. ఆ గదిలో ఈ పుస్తకాలు ఉండేవి.
మా ఇంట్లో చాలామందిమి వున్నా వాటిని ఎక్కువగా చదివేది నేనూ, మా వినోదక్క. మా రఘుపతన్నకి సాహిత్యం పట్ల ఇష్టం ఉండటంతో ఇంట్లో ఆధునిక సాహిత్యం అంటూ కొలువుతీరింది. ఆయన కవిత్వం రాసే ప్రయత్నం చేశారు కానీ పాఠకుడిగానే మిగిలిపోయారు. మా వినోదక్క సాహిత్య అభిమానిగా మిగిలిపోయింది. నేను మాత్రం సాహిత్య అభిమానిగానే కాకుండా రచయితగా, కవిగా పరిణామం చెందాను. చిన్నప్పుడు నేను విన్న కథలు చదివిన పుస్తకాలు నేను రచయిత కావడానికి ప్రభావితం చేశాయని అన్పిస్తుంది.
రచయిత కావడం వల్ల, మంచి పుస్తకాలు చదవడం వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ధిక్కార స్వరం వస్తుంది. అన్యాయం ఎక్కడ జరిగినా స్పందించే తత్వం ఏర్పడుతుంది.
జ్యుడీషియల్ అకాడెమీలో పని చేసినప్పుడు న్యాయాధికారులతో ముఖాముఖి క్లాసు ఒకటి పెట్టేవాళ్లం. ‘లా’కు సంబంధించిన అంశాలు కాకుండా ఇతర విషయాలు మాట్లాడేవాళ్లం. ఒకసారి వాళ్లతో మాట్లాడుతూ ఓసారి ఇలా చెప్పాను. ‘రోజూ ఓ చిన్న కథనో, కవిత్వాన్నో చదవండి. కొద్దిసేపు సంగీతాన్ని వినండి. ఎవరో ఒకరి ముఖంలో చిరునవ్వు వెలిగించండి. ఇంకా ఇలా చెప్పాను. న్యాయసంబంధమైన పుస్తకాలు కాకుండా ఇతర పుస్తకాలు చదవండి. కవిత్వం, కథలు, నవలలే కాదు.. జీవిత చరిత్రలు, చరిత్ర, తత్వశాస్త్రం లాంటి పుస్తకాలు చదవండి. నెలకు ఒకటో రెండో కొనండి.’
‘లా జర్నల్స్ చదవడానికే సమయం సరిపోవడం లేదు. మిగతా పుస్తకాలు ఎక్కడ చదువుతాం సార్’ అని చాలామంది అన్నారు.
‘న్యాయమూర్తికి చట్ట సంబంధమైన విషయాలే కాదు. చాలా విషయాల మీద అవగాహన ఉండాలి. తత్వ శాస్త్రం, మనస్తత్వ శాస్త్రం, చరిత్ర, సాహిత్యం ఇట్లా ఎన్నో విషయాల మీద అవగాహన ఉండాలి. సాహిత్యం వల్ల మనుషుల మధ్య ఉండే ఆవేశకావేశాలు తెలుసుకునే అవకాశం ఏర్పడుతుంది. అప్పుడే సరైన తీర్పులు చెప్పగలరు.’
ఇదే విషయం చాలామందితో చెప్పాను. ఇంకా ఇలా చెప్పేవాడిని.
‘పుస్తకాలు చదవడమే కాదు. అప్పుడప్పుడూ ఒకటో రెండో కొంటూ ఉండండి. మీకు సమయం లేకపోయినా పుస్తకాలు కొంటూ ఉండండి. మీ ఇంట్లో వుంచండి. వాటిపట్ల మీ పిల్లలు, మీ ఇంటికి వచ్చిన వ్యక్తులు ఆకర్షితులయ్యే అవకాశం ఉంది. ఎవరో ఒకరు వాటిప్ల అభిరుచి పెంచుకుంటారు. భవిష్యత్తులో వాళ్లు రచయితలే కావల్సిన అవసరం లేదు. వాళ్లు చరిత్రకారులు కావొచ్చు. సమాజం పట్లమంచి అవగాహన వున్న వ్యక్తులుగా మారవచ్చు’
ఈ మాటలు చెప్పినప్పుడల్లా వాళ్లు చావా శ్రద్ధగా వినేవాళ్లు. చాలామంది పాటిస్తూ కన్పించారు కూడా.
పుస్తకాలు మనల్ని యువకులుగా ఉంచడానికి మన హృదయం వెచ్చగా ఉండడానికి, మన ఆత్మ వెలగడానికి ఉపయోగపడతాయి. మన ఒంటరితనం పోగొట్టడానికి, మనలో ఆత్మవిశ్వాసం పెంపొందడానికి, మంచి మార్గంలో పయనం చేయడానికి ఉపయోగపడతాయి.

-జింబో 94404 83001