S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఎయర్‌పోర్టే అతని ఇల్లు

ప్రపంచంలో రోడ్ల మీద నివసించే బీదవారు కోట్లలో ఉన్నారు. రాత్రైతే తలదాచుకోడానికి వారు తగిన ప్రదేశాలని నిత్యం వెదుకుతూనే ఉండాలి. పార్క్‌లు, పేవ్‌మెంట్స్, అరుగులు లాంటివి వాతావరణం బావున్నప్పుడు ఫర్వాలేదు కాని, వర్షం, మంచు లాంటి ప్రతికూల వాతావరణంలో ఇంకాస్త సురక్షితమైన ప్రదేశాన్ని వెతుక్కోవాలి. టోక్యో అద్దెలు భరించలేని కొందరు తక్కువ జీతం ఉద్యోగస్థులు టోక్యో రైల్వేస్టేషన్‌లోని కార్గో సెక్షన్‌లో ఆరు బై ఎనిమిది అడుగుల అట్టపెట్టెల్లో నిద్రిస్తూంటారు.
కొంతకాలం క్రితం ఇదే శీర్షికలో మీరు- ఏ దేశ పౌరసత్వం లేని వ్యక్తి గురించి చదివారు. వివిధ రాజకీయ కారణాలవల్ల తన పాస్‌పోర్ట్ కోల్పోయిన ఓ వ్యక్తి పేరిస్ ఎయిర్‌పోర్ట్‌లో చిక్కుపడి దాంట్లోంచి బయటపడలేని పరిస్థితి ఏర్పడింది. దీని ఆధారంగా స్టీవెన్ స్పీల్‌బర్గ్ తీసి, టామ్ హేంక్స్ నటించిన ‘ది టెర్మినల్’ అనే హాలీవుడ్ సినిమా కూడా 2004లో వచ్చింది. అందులో విక్టర్ నవోట్‌స్కీ అనే ఈస్ట్రన్ యూరోపియన్‌ని అమెరికాలోకి అనుమతించరు. అతని దేశంలో యుద్ధం ఆరంభం అవడంతో వెనక్కి వెళ్లలేడు. దాంతో జెఎఫ్‌కె ఎయిర్‌పోర్ట్‌లో చిక్కుపడిపోతాడు.
ఆ సినిమా చూసిన లండన్‌కి చెందిన సైమన్ జోన్స్ (అసలు పేరు కాదు) అనే 46 ఏళ్ల మాజీ బ్రిటీష్ సైనికుడికి ఓ ఆలోచన వచ్చింది. ఈ చిత్ర ప్రభావంతో నివసించడానికి ఇల్లు లేని అతను ఆగస్టు 2016లో లండన్‌లోని హీత్రో ఎయిర్‌పోర్ట్‌కి వెళ్లి అందులో నివసించసాగాడు. మొదట అతను ఒకటి, రెండు రాత్రులు మాత్రమే అక్కడ తలదాచుకోవాలని వెళ్లాడు. కాని మూడు వారాలైనా అతను బయటికి రాలేదు.
పేరాషూట్ రెజిమెంట్‌కి చెందిన సైమన్ జోన్స్ నార్తరన్ ఐర్లండ్‌లో యుద్ధంలో పాల్గొన్నాడు. ఇంకా అంగోలా, ఇరాక్, నైజీరియా, సూడాన్, సోమాలియా, ఇజ్రాయిల్, ఆఫ్గనిస్తాన్ దేశాల్లో యుద్ధాల్లో పాల్గొన్నాడు. లండన్ మెట్రోపాలిటన్ పోలీస్ ఇతనికి కౌంటర్ టెర్రర్ నిపుణుడిగా శిక్షణ ఇచ్చారు.
ఆర్మీ నించి రిటైరయ్యాక ప్రైవేట్ సెక్యూరిటీ శిక్షణా వ్యాపారాన్ని ఆరంభించాడు. సైమన్ సౌదీ అరేబియా రాజ కుటుంబానికి సెక్యూరిటీ గార్డ్‌గా కొంతకాలం వ్యవహరించాడు. ఇంకా బ్రిటీష్ ఫుట్‌బాల్ హీరో క్రీడాకారుడు బెక్‌హేమ్, అతని భార్య వికోటిరా, ముగ్గురు పిల్లలు బ్రూక్‌లిన్, రోమియో, క్రజ్‌లకి బాడీగార్డ్‌గా పనిచేశాడు. కాని దానకి డిమాండ్ పోవడంతో నష్టపోయాడు. అతని దగ్గర ఏభై వేల పౌన్లు అప్పు తీసుకున్న ముగ్గురూ తిరిగి చెల్లించక కోర్టులో దివాలా పిటీషన్ వేయడంతో ఇతను సర్వం కోల్పోయాడు. అతను ఆర్థికంగా బలహీనపడగానే అతనితో సహజీవనం చేసే యువతి కూడా దూరం అయిపోయింది. ఆగస్టు 2016 నాటికి అతని చేతిలో పెన్నీ లేదు. రాత్రి పడుకోవడానికి చోటు లేదు. ఇతని బేంక్ ఎకౌంట్ భార్యతో జాయింట్ ఎకౌంట్‌లో ఉంది. దాన్ని భార్య సంతకం లేకుండా తాకలేడు. తను ఎవరికీ బరువు కాదలచుకోలేదు. ఒకటి, రెండు రాత్రులకి మించి మిత్రుల ఇళ్లకి వెళ్లి ఆశ్రయం పొందడం ఇష్టంలేదు. అతనికి ఉన్న తక్కువ మంది మిత్రుల ఇళ్లల్లో ఒకటి, రెండు రాత్రులు నిద్రించాక ఇక అతనికి నిద్రించడానికి చోటు లేకపోయింది.
ఆ రోజు అతనికి తను ఎప్పుడో చూసిన ది టెర్మినల్ సినిమాలోని హీరో పాత్ర తప్పనిసరి పరిస్థితుల్లో విమానాశ్రయంలో జీవించడం గుర్తొచ్చింది. అతను యూరప్‌లోని అత్యంత రద్దీ ఎయిర్‌పోర్ట్ ఐన హీత్రోకి వెళ్లి ఒకటి, రెండు రాత్రుళ్లు తలదాచుకోవాలని అనుకున్నాడు. విమానాశ్రయాల్లో బాత్‌రూమ్‌లు ఉంటాయి. ఉచిత వైఫై కూడా ఉంటుంది. రెండు రోజులు ఉన్నా తనని ఎవరూ పట్టించుకోకపోవడంతో, వెళ్లగొట్టక పోవడంతో ఇంకో మంచి చోటు దొరికే దాకా అక్కడే ఉండాలని నిశ్చయించుకున్నాడు.
కేఫ్ నీరో బయట బెంచీల మీద నిద్రిస్తూ, ప్రయాణీకులు వదిలేసిన ఆహారాన్ని తింటూ, బాత్‌రూంలలో స్నానం చేస్తూ, ఫ్రీ వైఫైని ఉపయోగించి ఉద్యోగాల కోసం వెదుకుతూ గడిపాడు. కేఫ్ నీరో ఇరవై నాలుగు గంటలు తెరిచే ఉంటుంది. కాబట్టి ప్రయాణీకులు వదిలేసిన ఆహారం ఎప్పుడూ లభ్యం అయ్యేది. రెండు రోజులు గడిచినా ఆ కేఫ్ సిబ్బంది అతన్ని పట్టించుకోలేదు. సిబ్బంది విమానం కోసం వేచి ఉన్న ప్రయాణీకుడ్ని అని వారు భావించి ఉంటారు అనుకున్నాడు. మూడు వారాల పైనే అక్కడ జీవించినా వారు కాని, ఎయిర్‌పోర్ట్ సెక్యూరిటీ వారు కాని అతన్ని ప్రశ్నించలేదు.
ది సండే టైమ్స్ అనే దినపత్రికకి అతను ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇలా చెప్పాడు.
‘నేను హీత్రో ఎయిర్‌పోర్ట్‌కి వెళ్లినప్పటి నించీ ఒక్క పెన్నీ కూడా ఖర్చు చేయలేదు. నిజానికి చేయడానికి నా దగ్గర డబ్బు ఉంటే కదా?’
బ్రిటీష్ ప్రధానమంత్రి డేవిడ్ కేమరూన్, ఇంకా అనేక మంది బ్రిటీష్ సీనియర్ నేతలు, హై ప్రొఫైల్ అమెరికన్ డిప్లొమేట్స్‌కి సెక్యూరిటీ గార్డ్ బాధ్యతలని నిర్వహించిన సైమన్ జోన్స్ తన కొత్త ఇంటి భద్రత విషయంలో భయపడుతున్నాడు.
‘హీత్రో ఎయిర్‌పోర్ట్ సెక్యూరిటీ గార్డ్‌లని విమర్శించడం నా లక్ష్యం కాదు. కాని నా నేపథ్యం కౌంటర్ టెర్రరిజం పనిలోని అనుభవం వల్ల నేను గమనించింది హీత్రోలో సెక్యూరిటీ పటిష్టంగా లేదు. ఓ వారంలో టెర్మినల్-2 డిపార్చర్స్‌లో రెండుసార్లు మాత్రమే ఆయుధాలు ధరించిన వారి పెట్రోలింగ్ జరిగింది. అదీ ఇద్దరు మాత్రమే జంటగా వచ్చారు. వారు పక్కపక్కనే నడుస్తూండటంతో ఉగ్రవాది వాళ్లిద్దర్నీ క్షణకాలంలో మట్టుపెట్టగలడు. సాయంత్రం ఆరు నించి ఉదయం ఎనిమిది దాకా డిపార్చర్ లాంజ్‌లో పోలీసులు ఉండరు. ఆ సమయంలో ముగ్గురు, నలుగురు ఉగ్రవాదులు అధిక సంఖ్యలోని ప్రయాణీకులని తేలిగ్గా చంపగలరు. వారిని నిరోధించడానికి ఎవరూ అందుబాటులో ఉండరు’ అతను ఆ ఇంటర్వ్యూలో చెప్పాడు.
‘మనుషులు బీదవాళ్లవడం చాలా బాధాకరం. అలాంటి వారు అప్పుడప్పుడూ మా ఎయిర్‌పోర్ట్‌కి తల దాచుకోవడానికి వస్తూంటారు. బయట మంచు పడుతున్నా లోపల వేడిగా ఉంటుంది. పైగా భద్రతగల ప్రదేశం. హీత్రో ఎయిర్‌పోర్ట్ అలాంటి వారికి సహాయం చేయడానికి సోషల్ వర్కర్స్‌ని ఉపయోగిస్తుంది. మెట్రోపాలిటన్ పోలీస్, ఇతర ప్రభుత్వాధికారులు కలిసి మా ఎయిర్‌పోర్ట్ భద్రత విషయంలో తరచు హై ప్రొఫైల్ రివ్యూ చేస్తూంటారు. వీటిలో కొన్ని బాహాటంగా, కొన్ని రహస్యంగా జరుగుతూంటాయి’ హీత్రో ఎయిర్‌పోర్ట్ స్పోక్స్ పర్సన్ సైమన్ జోన్స్ గురించి ప్రశ్నిస్తే చెప్పాడు.
అతని పేరు చాలామంది గుర్తు పడతారని సండే టైమ్స్ సైమన్ జోన్స్ అనే మారుపేరుని అతనికి పెట్టింది.

-పద్మజ