S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

నేనూ... బాలూ... ఓ జ్ఞాపకం

బాలు..
పరిచయం చేయనక్కరలేని పేరు..
పాటకు పరిమళం అద్దిన కంఠం అతడిది...
మాటకు మార్దవం నేర్పిన గళం అతడిది..
తెలుగునాట ‘పాడుతా తీయగా’ అంటూ
సరాగాలాడి.. సంగీత సామ్రాజ్యంలో తెలుగువారిని ఓలలాడించినవాడతడు..

తెలుగు చలనచిత్ర రంగంలో సన్నగా.. రివటలా అడుగుపెట్టి.. అంతంతై వటుడింతై అన్నట్లు.. లబ్దప్రతిష్టుడై.. అందరికీ ఇష్టుడైనవాడు.. కోదండపాణి కటాక్షంతో సంగీత సామ్రాజ్యంలో విహరించి లక్ష్మీకటాక్షంతో విలసిల్లినవాడు.. వేలమంది శిష్యులకు గాత్రంలో ఓనమాలు నేర్పి, సభ్యతాసంస్కారాల మాటల కూర్పుతో దారిచూపుతున్న దార్శనికుడు...మన బాలసుబ్రహ్మణ్యం. నెల్లూరులో పుట్టి ఎల్లలు లేని సంగీత సాగరంలో ఓలలాడుతూ డెబ్భై ఏళ్ల వయసులోనూ బిగువు సడలని స్వరధారతో సాగిపోతున్న మన బాలూ ఖ్యాతి విశ్వవ్యాప్తం. ఆ గళానికి ఇప్పుడు అపురూప గౌరవం దక్కింది. గోవాలో ఈనెల 20 నుంచి జరిగే అంతర్జాతీయ భారత చలన చిత్రోత్సవంలో ఆయనను ‘సెంటినరీ అవార్డ్ ఫర్ ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ’తో సత్కరించాలని కేంద్రప్రభుత్వం నిర్ణయించింది. ఈ అవార్డును అందుకుంటున్న తొలి తెలుగువాడు బాలూయే. శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం గురించి తెలియనివారు ఎవ్వరూ లేరు. సినీసంగీత రంగంలో ఆయన వేసిన అడుగులు, చూసిన ఎత్తుపల్లాలు అందరికీ తెలిసినవే. మహమ్మద్ రఫీ పాటలంటే ఆయనకు మహా ఇష్టం. లతామంగేష్కర్ ఆలాపనంటే ప్రాణం. జానకి పల్లవులంటే మురిపెం. హిందీ సహా ఆరేడు భాషల్లో 40 వేలకు పైగా పాటలు పాడి గిన్నిస్ రికార్డు సాధించిన ప్రతిభాశాలి మన బాలు. ఒకసారి ఫిల్మ్‌ఫేర్, ఆరుసార్లు ఫిల్మ్‌ఫేర్ సౌత్, ఆరుసార్లు జాతీయ అవార్డులు, 23 నంది అవార్డులు, మరో ఏడెనిమిది కర్నాటక, తమిళనాడు ప్రభుత్వాల అవార్డులు ఆయనను వరించాయంటే పాట.. ఆయనకు మారుమాటైపోయిందనేకదా అర్థం. 2001లో పద్మశ్రీ, 2011లో పద్మభూషణ్ ఆయన కీర్తికిరీటాన్ని అలంకరించాయి. శంకరాభరణంలో పాటలతో నటరాజుకు గళార్చన చేసిన బాలుకు ఇప్పుడు సెంటనరీ అవార్డు రావడం రాగానికి దక్కిన గౌరవమే. మహామహులకు గాత్రదానం చేయడమే కాదు, ఎన్నో చిత్రాల్లో నటించి మెప్పించిన ఎస్.పి. బహుముఖ ప్రజ్ఞాశాలి. సరే.. ఇవాళ ఎస్.పి.బి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిందేం లేదు. కానీ, ఆయన ప్రత్యేకతలేంటో చెప్పుకోవాల్సింది మాత్రం ఉంది. అదేంటో మనకన్నా సినీనటుడు, రచయిత తనికెళ్ల భరణి కి బాగా తెలుసు. ఆ వివరాలు.. ఆయన మాటల్లోనే..

‘ఎప్పుడో తాడేపల్లిగూడెంలో- మేము ఇండస్ట్రీకి వెళ్లని రోజుల్లో ‘కొక్కొరొక్కో’ నాటకం వేస్తే ఆ సభలో ముఖ్య అతిథి ఆయన. నాకు, మా వాడు తల్లావజల సుందరానికి ఉత్తమ ప్రదర్శన అవార్డు ఇచ్చి, ‘స్టాండింగ్ ఒవేషన్’ ఇప్పించాడు. తరువాత కౌగిలించుకున్నాడు. ఘంటసాల తర్వాత ఆ స్థానాన్ని అద్భుతంగా భర్తీచేసిన వ్యక్తి బాలసుబ్రహ్మణ్యం. ఫిజికల్‌గా ఆయనతో అది మొదటి పరిచయం. చాలా సభలు నిర్వహించాడు. చాలాచోటికి వెళ్లాం కానీ పరిచయం మాత్రం అదే. ఇండస్ట్రీకి వెళ్లిన తర్వాత నేను ‘జైత్రయాత్ర’ సినిమా రాస్తున్నప్పుడు మదనపల్లిలో వాళ్ల బాబు నామకరణం కార్యక్రమానికి వ్యాన్‌లో వెళ్తున్నాం ఫ్యామిలీతో కలిసి. అర్ధరాత్రి వ్యాన్ పాడయ్యింది. చుట్టూ చీకటి. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. లారీలు, వ్యాన్లు అవీ పోతున్నాయి కానీ ఏం చేయాలో తోచడం లేదు. అప్పుడు ఆ మారుతీ వ్యాన్ ఆన్‌చేసి, బాలు పాటలు వింటూ నేను ఫీలైన ఒంటరితనానికి ఆయన తోడయ్యాడు. ఆ సంఘటన నేనెప్పటికీ మర్చిపోలేను. ఆ తర్వాత మేమిద్దరం కలిసి చాలా సినిమాలకు పనిచేశాం. మామూలుగా పరిచయమైన తర్వాత తక్కువ సమయంలోనే బాగా దగ్గరయ్యాం. నేనెప్పుడైనా చెన్నయ్ వెళితే తప్పకుండా వాళ్లింటికి వెళ్లే వస్తా. ఆయన ఇక్కడికి వచ్చినప్పుడు కలవడం జరుగుతుంది. ఇవన్నీ ఒకెత్తు. ఆయనకి బాలగాంధర్వుడని పేరు ఇచ్చింది కోడూరి రామ్మూర్తిగారని ఆస్ట్రేలియాలో ఉంటారు. ‘బాలగాంధర్వమ’ని పేరు నేనే పెట్టా. వెండిది పెద్ద షీల్డును తయారుచేసి, రవీంద్రభారతిలో సభలో అందజేశాం. అలా ఆయనతో అనుబంధం పెరుగుతూ వస్తోంది.
‘మిథునం’లో ఆయన ప్రధాన పాత్ర పోషించారు. బాలు రెగ్యులర్ నటుడు కాదు. ఆయన్నిపెట్టి ‘మిథునం’ ఎందుకు తీశారని చాలామంది అడిగారు. శ్రీరమణ రాసిన కథలో భాగంగా బాపుగారు ఈ పాత్రకోసం సన్నగా రివటలా ఉండే అప్పదాసు పాత్రను సృష్టించారు. కానీ భోజన ప్రియుడు, కాస్త లావుగా వుంటే బావుంటుందని అనిపించింది. చాలామంది ఆ పాత్ర నువ్వే వేయొచ్చుకదా అని అడిగారు. స్క్రిప్ట్ నేనే రాసి, దర్శకత్వం నేనే చేసి, చివరికి నేనే చూసుకోవాల్సి వస్తుందేమోనని అనిపించింది.
ఈ పాత్రకోసం విశ్వవ్యాప్తమైన కీర్తిప్రతిష్ఠ లున్న వ్యక్తి అయితే బావుంటుందని అనిపించింది. అందులో సందేహం లేకుండా బాలు అయితేనే కరెక్ట్ అని నాకు అనిపించి, ఆయనతో పర్సనల్‌గా కలిసి చెప్పాను. మీరు, లక్ష్మి కలిసి నటిస్తే మీ జోడి బావుంటుంది. కాబట్టి మీరే చేయాలని అన్నాను. ఆయన ఏమీ మాట్లాడకుండా సరే అన్నారు. ఈ సినిమాను 30 రోజుల్లో చిత్రీకరణ చేశాం. సినిమా చేసినన్ని రోజులు ప్రతిరోజు మధుర ఘట్టం అని చెప్పాలి. ఈ షూటింగ్ సమయంలో ఆయన ఒక గొప్ప మాట అన్నారు. నా జీవిత కథ రాయాల్సి వస్తే మిథునానికి ముందు.. మిథునం తర్వాత అన్నారు. ఆ మాట చాలు నా జీవితానికి.
ఆ పాత్రకి అపారమైన కీర్తిప్రతిష్ఠలు తెచ్చి పెట్టారు. 40వేలకు పైగా పాటలు పాడిన వ్యక్తి మిథునం సినిమాలోని పాత్రకు మంచి గుర్తింపునిచ్చారు. ఒక సభలో బాలుగార్ని స్టేజిపైకి పిలుస్తూ ఉత్తమ నటుడు అప్పదాసుగారు స్టేజిమీదికి రావాలని పిలిచారు. ఆయన వెంటనే ‘40వేలకు పైగా పాటలు పాడిన నన్ను గాయకుడిగా పక్కనపడేసి నటుడిగా స్టేజిపైకి పిలుస్తున్నార’ని నాతో అన్నారు. అలా ఆ పాత్రతో తనదైన ఇంపాక్ట్‌ను సృష్టించాడు. మిథునం మా జీవితంలో మధురానుభూతి. బాలు అప్పదాసు పాత్రకు ఈయన అయితేనే కరెక్ట్ అనేలా జీవించారు. నేను అనుకున్న కథకు ఎవరైతే సరిపోతారో కచ్చితంగా వారితో మాట్లాడి ఒప్పించడానికే ప్రయత్నం చేస్తా. ఓ సందర్భంలో ఓ స్క్రిప్ట్‌ను నేను రాయాల్సి వచ్చింది. అప్పట్లో రచయితలు, దర్శకులు అందరూ కలిసి పనిచేసేవారు. అన్ని పనులు మేము కూడా చేస్తుండేవాళ్లం. ఒక పాట, రెండు పాటలు, ఆరు, ఏడు పాటల సందర్భాలు ఉంటే ఒక్కో పాటను ఎలా చిత్రీకరించాలని ఊహించి విజువలైజ్ చేసి పంపించేవాణ్ణి. అది చూసి ఆశ్చర్యపోయారు. బాలసుబ్రహ్మణ్యానికి గొప్ప వరం ఉంది. అదేంటంటే ఆయన ఏ భాష మాట్లాడితే ఆ భాష వ్యక్తిగా గుర్తింపు పొందుతారు. అలాగే ఆయన పాటలు ఏ నటుడికి ఎలా పాడాలో అలా మిమిక్రీ చేసి పాడే సత్తావున్న వ్యక్తి. అల్లురామలింగయ్యకు పాడాల్సి వచ్చినా, ఎన్టీఆర్‌కు పాడాల్సి వచ్చినా కచ్చితంగా ఆయన గొంతులో పలికే భావాలు వారిలాగే ఉంటాయి. అందుకే ఆయన అంత గొప్ప గాయకుడయ్యాడు. ఆయన ఎప్పుడూ హంబుల్‌గా చెప్పుకుంటాడు. నాకు సంగీతం రాదు అని. సంగీతం రాని వ్యక్తి ‘శంకరాభరణం’ లాంటి గొప్ప పాటల్ని ఎలా పాడతారు? త్యాగయ్య, రామదాసు కృతులు పాడాలంటే ఎంత తపన ఉండాలి. ఓ సందర్భంలో బాలమురళీకృష్ణ మాట్లాడుతూ త్యాగయ్య కృతులు పాడాలంటే మేము జీవితాంతం ట్రై చేసినా పాడలేం. బాలు మాత్రం అవలీలగా పాడగలడు అని అన్నారు ఓ సభలో. ఒక సింగర్ 40 ఏళ్లు ఫామ్‌లో ఉన్నాడంటే అది గొప్ప విషయమే. ఆయన ‘పాడుతా తీయగా’ కార్యక్రమంతో 150 మందికి పైగా కొత్త సింగర్లను పరిచయం చేయడం మామూలు విషయం కాదు. ఆయన తయారుచేసిన సింగర్లే ఈరోజు గొప్పగొప్పవారయ్యారు. ‘పాడుతా తీయగా’ కార్యక్రమంలో ఆయన చేస్తున్న సామాజిక కార్యక్రమం గొప్పది. మధ్యమధ్యలో ఆయన తెలుగు భాష గొప్పదనాన్ని గురించి చెప్పడం కూడా అభినందనీయం. డౌన్ టు ఎర్త్ ఉండే వ్యక్తి ఆయన. ఒక సామాన్యుడిగానే కనిపిస్తాడు. ఒక మేధావిలా కనిపిస్తాడు. ‘ఒక సూర్యుండు సమస్తజీవులకు ఒక్కొక్కడై తోచు..’ అలాంటి ఆయన జన్మసుకృతం.మిథునం సందర్భంగా శ్రీకాకుళంలో షూటింగ్ జరిపాం. అక్కడ ఒక పాత పెంకుటిల్లు, బావి, వెనకాల కూరగాయల తోటలు. అవన్నీ నిజంగా పెంచాము. ఆ షూటింగ్‌కి వచ్చిన బాలు మొదటిరోజు చూసి షాకయ్యారు. ఏంటీ ఇవన్నీ నిజంగానే పెంచారా? అని. ప్రతిరోజూ షూటింగ్ జరిగినన్నినాళ్లు యూనిట్ సభ్యులు దగ్గరుండి మరీ ఆ చెట్లను పెంచారు. ప్రస్తుతం బాలు పాటలు పాడడం తగ్గించాడు. ఆయన పాడదగ్గ పాటలు రావడం లేదని ఆయన భావన. కచ్చితంగా ఆయన పాడేపాట వుంటే పాడుతాడు. ఈరోజుల్లో వత్తులు, దీర్ఘాలు సరిగా పలకని వాళ్లందరూ సింగర్లైపోయారు అనే బాధ వుండొచ్చు. ఏదైనా బాలుగారు పాడారంటే దానికి తిరుగే వుండదు. ప్రస్తుతం ఆయన పాడాల్సిన అవసరం వుండదు. ఇప్పటికే చాలా పాటలు పాడేశారు. ప్రస్తుతం ఆయన పాడుతా తీయగా కార్యక్రమంలో పూర్తిస్థాయిలో నిమగ్నమయ్యారు. ఆయన ఆ కార్యక్రమం ద్వారా ఎప్పుడూ అందుబాటులోనే వుంటారు. దాంతోపాటు తెలుగు, తమిళ, కన్నడల్లో షోలు చేస్తూనే భక్తి పాటలు కూడా పాడుతున్నారు. కచ్చితంగా ఆయన వందేళ్లు పాట పాడతారు. ఆయనకు వెంకయ్యనాయుడు అవార్డు ప్రకటించిన క్షణమే ఆయనకు మెసేజ్ పెట్టాను. ఆయన ‘శివోహం’ అంటూ రిప్లై ఇచ్చాడు. నిజంగా బాలుగారికి ఈ అవార్డు రావడం భారతీయులందరూ ముఖ్యంగా తెలుగువారు అందరూ గర్వించదగ్గ విషయం. బాలుగారు ఉన్న సమయంలో మేము కూడా ఉన్నామని చెప్పుకోవడం గర్వంగా అనిపిస్తుంటుంది. శతమానం భవతి అనేలా సాగిపోవాలని కోరుకుంటూ శుభం భూయాత్..’