S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

మోహం

వయస్సుతో నిమిత్తం లేకుండా కొంతమంది చాలా హుషారుగా ఉంటుంటారు. స్పోర్ట్స్ షూస్ వేసుకొని, టీషర్ట్‌లు వేసుకుని కూడా కన్పిస్తుంటారు. మీసాలకి, తల వెంట్రుకలకి రంగు వేసుకొని కూడా దర్శనం ఇస్తుంటారు. వాళ్ల వయస్సు ఓ పది నుంచి ఇరవై సంవత్సరాలు తగ్గినట్టుగా కూడా కన్పిస్తుంటారు. వాళ్లు తమ యుక్తవయస్సులో కూడా అంత శ్రద్ధ తీసుకొని ఉండరు. అలాంటి వ్యక్తులను చూసినప్పుడు ఎదుటి వ్యక్తుల్లో ఓ ఆశావహ శక్తి వస్తుందని అన్పిస్తుంది. ఇంకా కొంతమంది తమ వయస్సుతో పనిలేకుండా తమ అనుభవాన్ని ఇతరులకి అందజేస్తూనే ఉంటారు.
అలాంటి వ్యక్తుల్లో ఒకరు వెంకయ్యగారు. ఆయన ప్రభుత్వ ఉద్యోగిగా పని చేశారు. యం.సి.ఆర్. మానవ వనరుల సంస్థలో సీనియర్ ఫాకల్టీగా పనిచేసి పదవీ విరమణ చేశారు. నాకు ఆయన ఓ ఇరవై ఐదు సంవత్సరాలుగా తెలుసు. అకౌంట్స్, ఉద్యోగుల క్రమశిక్షణా నియమాలు, సెలవు నియమాలు లాంటివి ఆయనకు కొట్టిన పిండి. ఆయన క్లాస్ తీసుకుంటే ఎంతో ఉత్సాహంగా ఉండేది. ఆయన ఇంకా ఉత్సాహంగా ఉండేవారు.
నేను పోలీస్ అకాడెమీలో డిప్యుటేషన్ మీద పని చేస్తున్నప్పుడు అతన్ని గెస్ట్ లెక్చరర్‌గా తరచూ పిలిచేవాణ్ని. ఆయన వచ్చేవారు. ప్రభుత్వం జారీ చేస్తున్న ఇతర జీవోలని అన్నీ ఆయన చూసుకొని క్లాస్ తీసుకునేవారు. అట్లాగే సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పులని కూడా చర్చించేవారు. ఇది 1995లోని మాట.
ఆ తరువాత 2011వ సంవత్సరం నుంచి ఓ నాలుగు సంవత్సరాలు జ్యుడీషియల్ అకాడెమీలో పని చేశాను. అక్కడ న్యాయమూర్తులకి శిక్షణ ఇచ్చేవాళ్లం. అతిథి ఉపన్యాసాలు ఇవ్వడానికి వెంకయ్య గారిని పిలిచేవాళ్లం. మా ఆహ్వానాన్ని ఆయన మన్నించేవాళ్లు.
కొత్తవాళ్లని పిలవండి. నా వయస్సు అయిపోతోంది అనేవాళ్లు. కొత్తవాళ్లతోపాటు మిమ్మల్నీ పిలుస్తున్నామని చెప్పేవాణ్ని. వయస్సు 80 దాటినా పిలిచినప్పుడు వచ్చేవారు. ఆయన ఎప్పుడూ ఉత్సాహంగా, శక్తివంతంగా అన్పించేవాళ్లు. దానికి కారణం పాఠం చెప్పాలన్న కోరిక. దానే్న మోహం అంటారు. ఇలాంటి మోహం ఉండటంవల్ల చాలా చలాకీగా ఉండేవాళ్లు. కొత్తకొత్త తీర్పుల మీద దృష్టి కేంద్రీకరించేవారు. పాఠం చెప్పాలన్న మోహం వల్ల ఇంట్లో కూడా ఆయన చురుకుగా ఉండేవాళ్లు. కంప్యూటర్, ఇంటర్నెట్‌లలో చట్టాల పురోగతిని చూసేవారు. ఆయన అంత చలాకీగా, ఆనందంగా, ఉత్సాహంగా ఉండటానికి జ్ఞానం ఇతరులకి పంచాలన్న ఆయన కాంక్ష, మోహం.
ఇలాంటి వ్యక్తులు ఎక్కువగా కన్పించరు. పదవీ విరమణ చేయగానే ఏదో కోల్పోయినట్టు అరవై సంవత్సరాలు దాటగానే అంతా అయిపోయినట్టుగా భావిస్తూ ఉంటారు. ఎవరైనా ఏదో విషయం మీద మోహం పెంచుకోవాలి. అది పాట కావొచ్చు, పాఠం కావొచ్చు, బొమ్మ కావొచ్చు. ఏదైనా కావొచ్చు. మోహం అనేది ఉండే సమయం గడవకపోవడం ఉండదు. అంతేకాదు ఉత్సాహంగా కూడా ఉంటారు.
మోహం అంటే ఏమిటి? ఏదైనా విషయం మీద ఓ గట్టి అనుభూతి ఉండటం. ఏదైనా పనిని కాంక్షతో చేయడం. మోహంతో చేస్తే అనుకున్న పనిలో ఫలితం ఉంటుంది. మోహం వ్యామోహంగా మారకపోతే అది మరీ బాగుంటుంది.

-జింబో 94404 83001