S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

రాళ్ల వర్షం

ఈ ప్రపంచంలో వివరణ దొరకని చాలా విచిత్రాలు జరిగాయి. అలాంటి వాటిలో ఒకటి ఆకాశం నించి పడే వర్షం. ఐతే నీటి బిందువులు కాక రాళ్లు వర్షించడం విచిత్రం. ప్రపంచంలో అనేక కాలాల్లో, అనేక చోట్ల అంతుపట్టని రాళ్ల వర్షాలు కురిసాయి.
నవంబర్ 1921లో అమెరికాలో కాలిఫోర్నియా రాష్ట్రంలోని చికో అనే ఊళ్లో జెడబ్ల్యు ఛార్జ్ అనే వ్యక్తి, ప్రతీరోజు తన గోడౌన్ మీదకి ఎవరో రాళ్లు విసురుతున్నారని, ఫలితంగా కిటికీ అద్దాలు, కప్పు మీది పెంకులు పగిలిపోయాయని చికో మార్షల్ జె ఎ టెక్‌కి ఫిర్యాదు చేశాడు. ఫైర్ చీఫ్, ట్రాఫిక్ ఆఫీసర్ కలిసి వెళ్లి అతని గోడౌన్ ప్రాంతాన్ని పరిశీలిస్తూండగా అకస్మాత్తుగా ఆకాశంలోంచి పెద్ద రాయి వచ్చి, వారు కొద్ది నిమిషాల ముందు నిలబడ్డ చోట పడింది. ఇలా ఆ గోడౌన్ చుట్టుపక్కలే రాళ్లు ఎందుకు పడ్డాయో పోలీసులు తమ విచారణలో కనుక్కోలేకపోయారు.
12 మార్చి 1922న చికోలో అకస్మాత్తుగా మేఘాలు లేని ఆకాశం లోంచి మళ్లీ రాళ్ల వర్షం కురిసింది. స్థానిక పత్రికా కార్యాలయం ముందు ఉదయం పదకొండు ప్రాంతంలో ఆ రాళ్లు పడ్డాయి. ప్రజలు వెంటనే బయటకి వెళ్లి చూస్తే రోడ్డు నిండా పిడికిలి సైజు నించి ఇటుక రాయి సైజు దాకా అనేక రాళ్లు కనిపించాయి. వాళ్లు పైకి చూస్తే మళ్లీ రాళ్లు ఆకాశంలోంచి పడుతూండటం గమనించి పారిపోయారు. వారు వెంటనే మార్షల్‌కి ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు.
వెంటనే వారంతా చుట్టుపక్కల ఎక్కడ వెతికినా వాటిని విసిరిన మనుషులు కాని, ఆ రాళ్లని దాచిన ప్రదేశాలూ కాని కనపడలేదు. ఈ విషయం శాన్‌ఫ్రాన్సిస్కో క్రానికల్, న్యూయార్క్ టైమ్స్ దినపత్రికల్లో వార్తగా వెలువడింది. గత పది నెలలుగా అడపాదడపా చికో గ్రామం మెయిన్ రోడ్‌లో రాళ్లు పడుతున్నాయని గ్రహించి చాలామంది పత్రికా విలేకరులు చికోకి వచ్చారు. ఐతే వాళ్లు అది మనుషుల పనే అని, ఎక్కడ నించో వాటిని యంత్రాలతో విసిరి ఉండచ్చని భావించారు.
చికో క్రానికల్ ఎడిటర్‌కి ఆ రోజు పోస్ట్‌లో ఓ ఉత్తరం వచ్చింది. అందులో ఇలా ఉంది.
డియర్ సర్,
రాళ్లని విసిరింది నేనే. దీన్ని రుజువు చేయడానికి రేపు మధ్యాహ్నం మూడుకి అదే ప్రదేశంలో రాళ్లు విసురుతాను. నేను భూమ్యాకర్షణ శక్తిని నియంత్రించగలను కాబట్టి కొన్ని రాళ్లు మీకు ఆకాశంలో తేలుతూ కనిపిస్తాయి.
-ది ఘోస్ట్
దాన్ని ఎవరో పిచ్చివాడో, ప్రాక్టికల్ జోకరో రాసి ఉంటాడని అనుకుని చెత్తబుట్టలో ఆ ఉత్తరాన్ని పడేశాడు. ఐతే మిగతా పత్రికా విలేకరులతో ఆ సమాచారాన్ని ఆయన పంచుకున్నాడు. అంతా నవ్వుకున్నారు.
ఆ మర్నాడు సాయంత్రం మూడు దాకా పత్రికా విలేకరుల్లో చాలామంది చికో గ్రామంలోనే ఉండిపోయారు. మార్షల్ మాత్రం అది స్థానిక సమస్య అని బయటి వారు రావడానికి ఇష్టపడలేదు. చికోలోని అతి ఎతె్తైన ప్రదేశం మెయిన్ రోడ్‌లోని ఓ గోడౌన్. మర్నాడు సాయంత్రం బైనాక్యులర్స్‌తో శాన్‌ఫ్రాన్సిస్కో క్రానికల్ విలేకరి ఆ పత్రికా ఆఫీసు పై అంతస్తులోంచి ఎతె్తైన ఆ గోడౌన్ మీద కాని, ఇంకెక్కడైనా కాని మనుషులు దాక్కున్నారా అని బైనాక్యులర్స్‌లోంచి చూడసాగాడు.
మూడయ్యేసరికి అంతా ఆసక్తిగా తలెత్తి ఆకాశంలోకి చూశారు. అకస్మాత్తుగా ఖాళీ ఆకాశంలో గాల్లో తేలే రాళ్లు వారికి కనపడ్డాయి. అవన్నీ కిందకి వచ్చి పడ్డాయి. వాటిని మనుషులు పరికరాలతో విసరలేదని, అవి పక్క నించి కాక సరాసరి పైనించి పడ్డాయని అంతా చూసి గ్రహిచారు. కొందరు తక్షణం గుర్రాల మీద పదిహేను కిలోమీటర్ల పరిధిలో వెళ్లి వెదికారు. కాని వాళ్లకి ఎక్కడా అలాంటి పరికరాలు కాని, రాళ్లు కాని, మనుషులు కాని కనపడలేదు.
పది నెలల క్రితం చికోకి వచ్చిన ఓ ముప్పై ఏళ్ల వ్యక్తి వింతగా ప్రవర్తించేవాడు. ఎవరు పలకరించినా మాట్లాడేవాడు కాదు. అతన్ని అంతా పిచ్చివాడుగా భావించి ఎగతాళి చేసేవారు. కాని ఆ రోజు నించి అతను చికో గ్రామం నించి మాయం అయ్యాడు. ఆ తర్వాత ఇక మళ్లీ ఇంతదాకా రాళ్లు పడలేదు. ఆ ఉత్తరం రాసిన ఘోస్ట్ ఎవరు? అది ఇంత దాకా తెలీలేదు.
రాళ్ల కన్నా కప్పలు, చేపల వర్షం పడటం ప్రపంచంలో ఎక్కువసార్లు జరిగింది. దాదాపు నలభై ఏళ్ల క్రితం చికోలో కొన్ని ఎకరాల మేర చేపలు, కప్పలు వర్షించాయి. ఇవి వర్షించడానికి గల కారణాన్ని శాస్తజ్ఞ్రులు అర్థం చేసుకున్నారు. చుట్టుపక్కల సరస్సులు, జలాశయాల్లోని నీరు అకస్మాత్తుగా ఆవిరై, పైకి లేచి ఎక్కడో చోట కురవడంతో నీటితోపాటు పైకి లేచిన చేపలు, కప్పలు వర్షిస్తాయని శాస్తజ్ఞ్రుల అంచనా. ప్రపంచంలోని చాలా ప్రాంతాల్లో ఇలాంటి చేపలు, కప్పలు, పురుగుల వర్షాలు కురిసాయి. ఐతే జలాశయాల్లో ఎన్ని రకాల జీవులు ఉన్నా కేవలం ఒకటి, రెండు రకాల జీవులు మాత్రమే నీళ్లతోపాటు పైకి వెళ్లి వర్షించబడటం మాత్రం ఎందుకు జరుగుతోందో శాస్తజ్ఞ్రులకి అంతుపట్టడంలేదు.
ఆకలి తీర్చడానికి ఇది దేవుడు చేసే పనిగా కొందరు భక్తులు భావిస్తారు. కొన్నిచోట్ల ఆకాశంలోంచి రక్తమాంసాలు వర్షించిన సంఘటనలు కూడా ప్రపంచంలో జరిగాయి! ఏలియన్స్ తమ వ్యర్థాలని ఇలా పంపుతున్నారనే వాదన కూడా ఉంది. అనేక శతాబ్దాలుగా వివిధ ప్రాంతాల్లో పురుగులు, పాములు, రక్తమాంసాలు, కండరాలు వర్షించిన దాఖలాలు కూడా ఉన్నాయి. బైబిల్‌లోని ది బుక్ ఆఫ్ జాష్వాలో ఇజ్రాయిలీలని వెంటాడే సైనికుల మీద ఆకాశంలోంచి రాళ్ల వర్షం కురిసి మరణించారని ఉంది.
1828లో 10-12 రోజులు మేరీలాండ్ రాష్ట్రంలోని కేంబ్రిడ్జ్‌లో నాలుగు నించి ఏడంగుళాలు గల వందల కొద్దీ చేపలు వర్షించాయి. అయితే ఆ చుట్టుపక్కల జలాశయాలన్నీ అప్పటికే ఎండిపోయి ఉన్నాయి. మరి ఈ చేపలు ఎక్కడ నించి వర్షించాయో ఇంతదాకా ఎవరికీ అంతుపట్టలేదు. 24 జులై 1851న శాన్‌ఫ్రాన్సిస్కో దగ్గర మధ్యాహ్నం సైనికులు డ్రిల్ చేస్తూండగా మేఘాలు లేని ఆకాశం లోంచి రక్తమాంసాలు, గొడ్డుమాంసం వాళ్ల మీద పడ్డాయి. అవి పావురం గుడ్డు పరిమాణంలో ఉన్నాయి.
1903లో సుమత్రాలో, 1913లో బెల్జియంలో, 1921లో ఫ్రాన్స్‌లో, 1946-62 దాకా ఆస్ట్రేలియాలో అనేకసార్లు, 1963లో న్యూజిలేండ్‌లో, 1973లో న్యూయార్క్‌లో, 1983లో ఆరిజోనాలో రాళ్ల వర్షాలు కురిసాయి. వీటి సమయంలో ఎక్కడా టొర్నెడో రావడంకాని, అగ్ని పర్వతాలు బద్దలవడం కాని జరగలేదు. ఏ తోకచుక్కలో, ఉల్కలో బద్దలవడం వల్ల ఈ రాళ్ల వర్షం కురుస్తోందని ప్రస్తుతానికి శాస్తజ్ఞ్రుల నమ్మకం.
ఇంతదాకా ఎవరూ దీనికి స్థిరమైన, రుజువైన కారణం కనుక్కోలేక పోవడంతో రాళ్ల వర్షం అంతుపట్టని రహస్యంగా మిగిలిపోయింది.

-పద్మజ