S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

నల్లగాలి

అది నవంబర్ ఆఖరి వారంలోని ఓ గడ్డ కట్టే చలి రాత్రి.
ఈస్ట్ కోస్ట్‌లోని మా గ్రామానికి పావుమైలు దూరంలోని పర్వతాల్లోంచి వచ్చే చల్లటి తూర్పు గాలి కత్తిలా కోస్తోంది.
నేను నడిపే బార్ తలుపు మూసి ఉన్నా, తలుపు మీద గాలి వత్తిడి నాకు స్పష్టంగా తెలుస్తోంది. మా గ్రామస్థులు ఆ గాలిని నల్లగాలిగా పిలుస్తూంటారు. అందులో పది నిమిషాలు చిక్కుకుంటే చాలు. ఒళ్లు కొంకర్లు పోయి అవయవాలు స్వాధీనం తప్పుతాయి. మరో పది నిమిషాల్లో శరీరం నీలిరంగుకి మారి, ఇంకో పావుగంటలో కాపాడబడకపోతే మరణం తథ్యం. అలా కొందరు గ్రామస్థులు, చాలామంది కొత్తవాళ్లు మరణించారు.
న్యూయార్క్ రాష్ట్రంలోని మా ఉడ్‌లైన్ గ్రామంలో నల్ల గాలి మీద అనేక మూఢ నమ్మకాలు ఉన్నాయి. వాటిలో ఒకటి ఆ నల్ల గాలి తప్పక ఓ మనిషినైనా ఉద్రేకపరచి, హింసాత్మక ప్రవర్తనకి పురికొల్పుతుందన్నది. అందువల్ల గ్రామస్థులు ఎవరూ నల్లగాలి వీచే సమయంలో ఇళ్లల్లోంచి బయటకు రారు. కాని ఆధునిక కాలంలో మాత్రం దాన్ని ఎవరూ పట్టించుకోవడం లేదు. కాని ఆ రాత్రి నా బార్ ఖాళీగా ఉండటానికి అది ప్రధాన కారణం.
గంట నించి నా బార్‌లోకి ఒక్క కస్టమర్ కూడా రాలేదు. అంటే రాత్రి ఏడు నించి. ఇక రారని నాకు అనుభవాన్ని బట్టి తెలుసు కాబట్టి, దాన్ని మూసేసి ఇంటికి వెళ్లి ఓ గ్లాస్ బ్రాందీతో ఫైర్ ప్లేస్ ముందు సోఫాలో కూర్చుని విశ్రాంతి తీసుకోవాలని నేను అనుకుంటూండగా కారు హెడ్‌లైట్ల వెలుగు కిటికీలోంచి లోపలకి పడింది. అంటే కస్టమర్స్ వచ్చారు. కొద్ది క్షణాల్లో కారు కీచుమంటూ ఆగిన శబ్దం నాకు వినపడింది. బహుశ వచ్చింది టీనేజ్ కుర్రాళ్లు అయి ఉంటారని అనుకున్నాను. కార్లని అలా ఆపేది ఆ వయసు వాళ్లే.
కాని లోపలకి వచ్చిన ఆ ఇద్దరూ యువకులు కారు. ముప్పైలు దాటిన ఓ మగ, ఓ ఆడ. వాళ్లు తలుపు తెరచుకుని లోపలికి రాగానే చలి గాలి రివ్వున లోపలకి ప్రవేశించింది. వాళ్లు మళ్లీ తలుపు మూసేలోగా అది నన్ను బలంగా, కత్తి పదును ఒంటికి తాకినట్లుగా తాకింది.
ఇద్దరూ చలి కోట్లు, మఫ్లర్‌లు ధరించారు. నల్లటి గౌన్‌లోని ఆమె చేతిలో ఖరీదైన మొసలి చర్మం హేండ్‌బేగ్ ఉంది. ఆ మగాడు కౌంటర్ ముందున్న ఓ స్టూల్ మీద కూలబడ్డాడు. అతని మొహం కోపంతో జేవురించి ఉన్నట్లుగా నాకు అనిపించింది. అతను నగరానికి చెందిన వాడని అతని దుస్తులనిబట్టి ఇట్టే ఊహించాను. అతని సైగని అర్థం చేసుకుని నేను గ్రామఫోన్ రికార్డ్‌ని ఆపేశాను.
‘కాఫీ’ అతను నాతో కోపంగా చెప్పాడు.
‘అలాగే. రెండు కాఫీలా?’ అడిగాను.
‘ఒక్కటే కాఫీ. ఆమెకి కావాల్సింది ఆమే ఆర్డర్ చేసుకుంటుంది’ నా వంక చురుగ్గా చూస్తూ చెప్పాడు.
అతని కోపం ఆమె మీద అని నాకు అతను మాట్లాడే పద్ధతిని బట్టి అనిపించింది. ఆమె మధ్యలో ఓ స్టూల్‌ని వదిలి ఇంకో స్టూల్ మీద అతని ఎడమవైపు దూరంగా కూర్చుంది. ఆమె నగరవాసుల దుస్తుల్లో అందంగా ఉంది. ఆమె మొహంలో కూడా ఎక్కడా శాంతి లేదు.
‘బ్లాక్ కాఫీ’ పొడిగా చెప్పింది.
నేను వారిద్దరి వంకా చూశాను. వారిద్దరి మధ్యా గల తీవ్రమైన వత్తిడిని గమనించాక నాలో కొంత అసౌకర్యం ఏర్పడింది. వారి మధ్య పోట్లాటని తీర్చే పెద్ద వయసు నాకు ఉన్నా, వారి మూడ్‌ని గమనించాక వారు కోరితే కాని జోక్యం కలగ చేసుకోకూడదు అనుకున్నాను. నేను నిశ్శబ్దంగా హాట్ ప్లేట్ మీది కాఫీ పాట్‌ని, కౌంటర్ మీది రెండు మగ్‌లని అందుకున్నాను.
‘నాకు రై బ్రెడ్‌తో హేమ్ అండ్ ఛీజ్ సేండ్‌విచ్ కావాలి. తీసుకెళ్తాను’ అతను చెప్పాడు.
‘ఎస్ సర్. మీకు?’ అడిగాను.
‘వైట్ బ్రెడ్ టునా ఫిష్ సేండ్‌విచ్. ఇక్కడే తింటాను’
‘ఎస్ మేడం’ చెప్పాను.
‘లేదు. మాకు ఆగే టైం లేదు. నాలా వెంట తీసుకెళ్తుంది’ అతను కోపంగా చెప్పాడు.
ఆమె అతని వంక నిరసనగా చూసి చెప్పింది.
‘లేదు. ఇక్కడే తింటాను’
‘సరే’ అని అతను ఆమెతో చెప్పి తిరిగి నావైపు చూస్తూ చెప్పాడు.
‘కాని నేను కాఫీ తాగాక బయలుదేరుతాను. అప్పటికి నా సేండ్‌విచ్‌ని సిద్ధం చేయండి’
‘సరే. సరే. సరే. సరే’ ఆమె నాలుగుసార్లు గట్టిగా చెప్పింది.
ఆ సమయంలో ఆమె కళ్లల్లోంచి నిప్పులు కురిసాయి.
‘సరే సర్’ నేను మర్యాదగా చెప్పాను.
నేను రెండు మగ్గుల్లో కాఫీని నింపి వారి ముందు ఉంచాను. ఆమె కళ్లార్పకుండా ఎదురుగా షెల్ఫ్‌ల్లోని సీసాల వంక నిశ్చలంగా చూడసాగింది. అతను దాన్ని అందుకుని చెక్క నేల మీద చప్పుడయ్యేలా నడుస్తూ ఓ బల్ల ముందుకి వెళ్లి తలుపువైపు ముఖం పెట్టి కూర్చుని కాఫీని ఊదుకుంటూ తాగసాగాడు.
‘మేడం. మీ సేండ్‌విచ్ ఇక్కడే తింటారా? లేక...’ నేను అర్థంకాక సందేహిస్తూ అడిగాను.
ఆమె మొదటిసారి నా వంక చూసింది. ఆ కళ్లల్లోకి నేను సూటిగా చూడలేనంత ద్వేషం స్పష్టంగా కనిపించింది.
‘లేదు. నేను ఏమీ తినను’ చెప్పింది.
ఆమె కాఫీ మగ్‌తో లేచి ఇంకో టేబిల్ ముందుకు వెళ్లి కూర్చుంది.
నేను రై బ్రెడ్‌ని, వైట్ బ్రెడ్‌ని షెల్ఫ్‌ల్లోంచి తీసి వారు కోరిన సేండ్‌విచ్‌లని నిశ్శబ్దంగా చేయసాగాను. నిశ్శబ్దంలో బయట నించి గాలి ఈలలు వినిపిస్తున్నాయి. వారి మధ్య వత్తిడి ఆ గదంతా అలుముకుని నన్ను తాకుతున్న భావన కలిగింది. నేను నా పని చేస్తూ వారి వంక ఓరకంట చూడసాగాను. అతను ఇంకా తలుపు వైపే చూస్తూ కాఫీ తాగుతున్నాడు. ఆమె మధ్యమధ్యలో అతన్ని కోపంగా గమనిస్తోంది. వారు న్యూయార్క్‌లోని ధనవంతులైన దంపతులు అనుకున్నాను. ఇద్దరి చేతులకీ గల ఖరీదైన వెడ్డింగ్ రింగ్స్ ఉన్నాయి. బహుశ ఏ ఫిలడెల్ఫియాకో వెళ్తూ దారిలో ఇక్కడ ఆగారు అనుకున్నాను. వారిలో కోపం లేకపోతే మాటలు కలిపి ‘ఎక్కడ నించి? ఎక్కడికి వెళ్తున్నారు?’ లాంటివి అడిగేవాడినే.
లేదా వారాంతపు సెలవులు గడపడానికి పర్వతాల్లోకి వెళ్తూ ఆగి ఉండచ్చు. దేని మీదో వారు దారిలో బాగా దెబ్బలాడుకున్నారు అనుకున్నాను. పెళ్లైన వారు చాలా దూరం కలిసి కారులో వెళ్లేప్పుడు ఏదైనా విషయం మీద అభిప్రాయ భేదంతో పోట్లాడుకోవడం గురించి విని ఉన్నాను. ఇంట్లో అయితే పక్క గదిలోకో, బయటకో వెళ్లచ్చు. లేదా టీవీ ఆన్ చేయచ్చు. కాని వేగంగా వెళ్లే కారులో అది కుదరదు కదా. దాంతో త్వరలోనే వారి మధ్య మాటల టపాకాయలు పేలడం మొదలవుతుంది.
ముప్పై ఏళ్లుగా నేనా బార్‌ని నడుపుతున్నాను. వైవాహిక సమస్యలు గల చాలామంది నగర దంపతులని ఇక్కడ చూశాను. కాని ఈ ఇద్దరిలా బయటికి తమ కోపాన్ని అంత బాహాటంగా ప్రదర్శించే వారిని ఎన్నడూ చూడలేదు. మర్యాద సాధారణంగా దాన్ని అణచి వేస్తూంటుంది. వారి మధ్యగల వత్తిడి, క్రోధం తాజా పోట్లాట వల్ల పుట్టినవి కావని నాకు స్పష్టంగా తెలుస్తోంది. వారిద్దరి మధ్యా నిజమైన ద్వేషభావం ఉంది. బహుశ అది కొన్ని వారాలు, నెలలు లేదా సంవత్సరాల నించి కొనసాగుతోందని, ఆ రోజు అది తీవ్రంగా బయటపడిందని నాకు అనిపించింది. ఏదో ఓ రోజు అగ్నిపర్వతంలా బద్దలయ్యే అలాంటి క్రోధం మంచిది కాదు అని చెప్పే ధైర్యం చేయలేకపోయాను.
వారి మధ్య ఆ పేలుడు నా బార్లో సంభవిస్తే తప్ప అది నాకు సంబంధించిన విషయం అవదు. కాని అది ఇక్కడ పేలేలా లేదు. నాకు వారిని చూస్తే కొంత బాధ కలిగింది. ఇలాంటి నల్లగాలి గురించి చెప్పి ఆ నల్లగాలి రాత్రి వారి మధ్య ద్వేషం మంచిది కాదు అని చెప్పాలని అనిపించింది. కాని వారి స్పందన సానుకూలంగా ఉండదని నాకు అనిపించింది. అందువల్ల ఆ ధైర్యం చేయలేదు. నేను సేండ్‌విచ్‌లని రెండు సగాలుగా కోసి పేపర్ సంచీలో ఉంచాను.
బార్‌లో వారి మధ్యగల వత్తిడి బయటి గాలి కన్నా అధ్వాన్నంగా ఉందని నాకు అనిపించసాగింది.
అకస్మాత్తుగా నాకు పెద్ద శబ్దం వినిపించింది. మొదట అది పిస్తోలు పేలిన శబ్దం అని భ్రమపడ్డాను.
కాదు.
అతను క్రోధంగా గుప్పిట బిగించి బల్ల మీద ఖాళీ మగ్‌ని పెట్టిన చప్పుడు. తన కోపాన్ని భార్యకి అలా ప్రదర్శించాడని అనిపించింది.
అతను కుర్చీని చప్పుడయ్యేలా విసురుగా వెనక్కి నెట్టి లేచి ఆమెతో చెప్పాడు.
‘నువ్వు బిల్ చెల్లించు’
‘నేనెందుకు చెల్లించాలి?’ ఆమె కోపంగా అరిచింది.
అతను బార్లోకి వచ్చాక మొదటిసారిగా తల తిప్పి ఆమె వంక మింగేసేలా చూస్తూ చెప్పాడు.
‘డబ్బంతా నీ దగ్గరే ఉంది కాబట్టి’
‘నా దగ్గర ఉందా? అబద్ధాలు చెప్పకండి’
‘నాకు తెలీదనుకోక. నువ్వే అబద్ధాలకోరు...’ అతను చెప్తూ రెస్ట్‌రూంలోకి వెళ్లాడు.
కొద్ది క్షణాలు ఆమె తన కోపాన్ని దిగమింగుకునే ప్రయత్నం చేసింది.
‘సేండ్‌విచ్ సిద్ధమా?’ తర్వాత మర్యాదగా మాట్లాడే ప్రయత్నం చేస్తూ నన్ను అడిగింది.
‘సిద్ధం మేడం. ఇంకేమైనా కావాలా?’ మర్యాదగా అడిగాను.
‘లేదు... కావాలి.. నాక్కూడా తింటానికి ఏమైనా కావాలి. అది ఏం పై?’ గాజు అద్దంలోంచి కనపడే పైలని చూస్తూ అడిగింది.
‘సినామిన్ ఏపిల్ పై’
‘అదొకటి తీసుకుంటాను’
‘అలాగే మేడం. ఒక్కటి చాలా?’
‘ఒక్కటి చాలు. వెంట తీసుకెళ్తాను’
నేను పైని తీసుకుని వేక్స్ పేపర్లో దాన్ని చుట్టాను. ఆమె కౌంటర్ దగ్గరికి వచ్చి హేండ్‌బేగ్‌లోంచి ఓ పర్స్‌ని బయటకి తీసి, డబ్బు తీసి అడిగింది.
‘ఎంత?’
‘మూడు డాలర్ల ముప్పై ఎనిమిది సెంట్లు’
అతను రెస్ట్‌రూంలోంచి బయటకి వచ్చి తలుపు తెరచుకుని బయటకి నడిచాడు. ఐదు డాలర్ల నోట్ ఇచ్చి, కౌంటర్ మీది సంచీని అందుకుని ఆమె వెనక్కి తిరిగింది.
‘మీకు చిల్లర వస్తుంది’ చెప్పాను.
నా మాటలు విన్నా ఆమె ఆగలేదు. ఆమె కూడా తలుపు తెరచుకుని అతని వెంట బయటకి నడిచింది. కొద్ది క్షణాలకి మళ్లీ హెడ్‌లైట్ల కాంతి కిటికీలోంచి లోపలికి పడింది. కారు టైర్లు చప్పుడు చేస్తూ కదిలింది.
కస్టమర్స్ నా బార్‌లోంచి వెళ్లినప్పుడు నేను ఎన్నడూ అంతగా సంతోషపడలేదు. ఐదు డాలర్ల నోట్‌ని కౌంటర్ మీంచి తీసుకుని గల్లా పెట్టెలో పడేశాను. క్రమంగా కారు ఇంజన్ శబ్దం దూరం అయింది.
బార్ మూసే ప్రయత్నంలో టేబిల్ మీది మగ్గులని అందుకున్నాను. వారి గురించిన ఆలోచనలు నన్ను వదల్లేదు. ముఖ్యంగా ఆమె గురించి. ఆ ఇద్దరిలో ఆమెలో ఎక్కువ ద్వేషం, క్రోధం ఉన్నాయని నాకు అనిపించింది. ఆమె కళ్లల్లోని క్రోధం అతని కళ్లల్లో లేదు. కేవలం మొహంలోనే ఉంది. ఆమెలో నల్లగాలి వీస్తోందని అనుకున్నాను.
వెనక్కి తిరిగి మూడు అడుగులు వేశాక చటుక్కున ఆగి మళ్లీ వెనక్కి తిరిగాను. టేబిల్ మీద చూశాక ‘ఓ మై గాడ్’ అనుకున్నాను. నాకు ఏం చేయాలో తోచలేదు. నేను అనుమానించిందే ఆమె చేయబోతోందా? ఆమె టేబిల్ మీది ట్రేలో రెండు ఫోర్క్‌లు, రెండు చెంచాలు, ఓ కత్తి ఉన్నాయి. రెండో కత్తి మాయమైంది.
నేను బయటకి పరిగెత్తుకెళ్లి చూశాను. వారి కారు కనపడలేదు. ఎలాంటి కారులో వారు ప్రయాణిస్తున్నారో నాకు తెలీదు. నంబర్ కాని, వారి పేర్లు, చిరునామాలు కాని, ఎక్కడికి వెళ్తున్నారో అది నాకు తెలీదు. నా చుట్టూ నల్లగాలి అరుస్తోంది. మాయమైన ఆ కత్తి పదునులా అది నా చర్మాన్ని కోస్తూ లోపలికి వెళ్లే ప్రయత్నం చేస్తోంది.
నా అనుమానం నిజమైంది. నల్ల గాలి తన పనిని మరోసారి ప్రకృతి సిద్ధంగా చేసింది.
ఆ రాత్రి నేను రేడియోలో ఆ వార్త విన్నాను.

బిల్ ఫ్రాంజినీ కథకి స్వేచ్ఛానువాదం

మల్లాది వెంకట కృష్ణమూర్తి