S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఆత్మబంధం

చాలామంది మరణించిన వారు తిరిగి రారని చెప్తారు. కొందరు మాత్రం తిరిగి వస్తారని చెప్తారు. అలాంటి వాళ్లల్లో ఎలిసన్, అతని భార్య కూడా ఉన్నారు. మరణించాక వేరే చోటికి, ఈ ప్రపంచానికి మధ్యగల ఛేదించలేని కంచెని ఎలిసన్ సంతానంలోని ఒకరు ఛేదించారు.
పెన్సిల్వేనియాలో గ్రాంట్స్‌విల్ గ్రామంలోని ఎలిసన్ కొడుకు పాల్ తన అక్క శాలీతో ఈతకి వెళ్లాడు. కాని పనె్నండేళ్ల వాడు అక్క వద్దని వారిస్తున్నా వినకుండా సరస్సు మధ్యకి ఈదుకుంటూ వెళ్లి, తిరిగి ఒడ్డుకి చేరుకోలేక మునిగి మరణించాడు.
ఇది తెలిసిన తండ్రి ఎలిసన్ అతని మరణానికి తన కూతుర్నే బాధ్యురాలిని చేసి తిట్టాడు. పాల్ ఖననం జరిగిన రాత్రి ఆయన కోపాన్ని, బాధని భరించలేక విసురుగా శాలీ ఉన్న హాల్లోకి వచ్చి కూతుర్ని తిట్టి, కొట్టబోయాడు. అతని భార్య ఆయన్ని అడ్డుకుని వివేకం మరిచి ప్రవర్తించవద్దని వారించింది. అంతదాకా ఆయన ఎన్నడూ తన పిల్లల్ని కొట్టలేదు.
అప్పటికే పాల్ మరణానికి దుఃఖిస్తున్న శాలీ మనసు తండ్రి మాటలకి గాయపడింది. ముఖ్యంగా ‘శాలీ చస్తే బావుండేది. అప్పుడే పాల్‌కి న్యాయం జరుగుతుంది’ అన్న తండ్రి మాటలకి పదిహేడేళ్ల శాలీ తట్టుకోలేక పోయింది. తన గదిలోకి వెళ్లి సూట్‌కేస్ సర్దుకుని బయటికి నడిచింది. తల్లి వారించినా ఆగలేదు. తను కంట పడటం తండ్రికి ఇష్టం లేదని, ఆ ఇంట్లో ఉండి తను తండ్రి కంట పడలేనని చెప్పింది. తండ్రి తనని ఆగమని కోరితే ఉంటానని కూడా శాలీ చెప్పింది. ఐతే ఆగమని చెప్పకుండా ఎలిసన్ బయటికి వెళ్లిపోయాడు. తల్లి ఆగమని బతిమాలినా ఆగలేదు. ఆయన తిరిగి ఇంటికి వచ్చేసరికి శాలీ వెళ్లిపోయింది.
‘మాకు నీ అవసరం రావచ్చు. కాబట్టి వెళ్లగానే అడ్రస్ రాయి’ అని తల్లి కోరితే, ‘మరణించిన వారు ఉత్తరాలు ఎలా రాస్తారు?’ అని శాలీ నిష్ఠూరంగా నిరాకరించింది. ‘మీ నాన్న నువ్వు తిరిగి ఇంటికి రావాలని కోరుకుంటే ఆ సంగతి నీకు తెలియాలి కాబట్టి నీ అడ్రస్ అవసరం అవుతుంది’ అని తల్లి చెప్తే, దినపత్రికలో తన పేర ఆ ప్రకటనని ఇవ్వమని కోరింది. తను నిత్యం ఇల్లినోయ్ టైమ్స్ దినపత్రికలోని పర్సనల్ కాలంని చూస్తానని మాట ఇచ్చి సరాసరి బస్టాండ్‌కి చేరుకుంది.
శాలీ చికాగోలోని ఓ బార్‌లో వెయిట్రెస్‌గా చేరింది. కొన్ని వారాలు గడిచాక ఎలిసన్‌కి కూతురు మీద గల కోపం తగ్గడంతో శాలీ రావాలనే ప్రకటనని ఇచ్చాడు. అది చూడగానే శాలీ తన ఇంటికి ఫోన్ చేసింది. తండ్రి తనతో ఇంటికి రమ్మని చెప్తేనే వస్తానని చెప్పింది. ఎలిసన్ ఆమెని క్షమించానని, ఇంటికి రమ్మని కోరాడు. తక్షణం బయలుదేరి ఆ రాత్రికే వస్తానని శాలీ మాట ఇచ్చింది.
తను అర్జెంట్‌గా తన ఊరు వెళ్లాలని, తన జీతం ఇస్తే బయలుదేరుతానని బార్ యజమానిని కోరింది. ఇంకో వెయిట్రెస్‌ని పెట్టుకునే దాకా ఆగమని అతను కోరినా వినలేదు. దాంతో మర్నాడు శుక్రవారంనాడే జీతం ఇస్తానని, మర్నాటి దాకా ఆగమని అతను ఆజ్ఞాపించాడు. జీతం కోసం ఆగకుండా శాలీ తక్షణం ఇంట్లోంచి బయటకి నడిచినట్లుగా బార్‌లోంచి బయటకి నడిచింది.
బస్‌లో వెళ్లడానికి డబ్బు లేకపోవడంతో సమీపంలోని సెంట్రల్ మార్కెట్ దగ్గర లోడ్ అవుతున్న లారీల దగ్గరికి వెళ్లి గ్రాంట్స్‌విల్ వైపు వెళ్లే లారీల గురించి విచారించింది. ఓ ఏభై ఏళ్ల డ్రైవర్ తను పార్కర్స్ కార్నర్ దాకా వెళ్తున్నానని చెప్పాడు. అక్కడికి ఆమె ఇల్లు దగ్గరే కాబట్టి తనకి లిఫ్ట్ ఇవ్వమని, బస్‌లో వెళ్లే డబ్బు లేదని కోరింది. ఆయన ఒప్పుకున్నాడు.
దురదృష్టవశాత్తు వారి లారీ ఆమె ఇంటికి మూడు మైళ్ల దూరంలో తిరగబడింది. డ్రైవర్ తక్షణం మరణించాడు. శాలీకి తీవ్ర గాయాలు అయ్యాయి.
* * *
ఆ దారిన వెళ్లే రాబర్ట్ బ్రాడ్లీ అనే ఓ కారు డ్రైవర్‌కి తీవ్ర గాయాలైన శాలీ నడిరోడ్డు మీద కనిపించింది. కారు ఆపి ఆమెని తన కారు వెనక సీట్లో పడుకోబెట్టాడు. శాలీ తన ఇంటి అడ్రస్ చెప్పి అపస్మారకంలోకి వెళ్లిపోయింది. అతను కారుని ఆమె ఇంటి బయట ఆపి వెళ్లి తలుపు కొట్టాడు. తలుపు తెరచిన ఎలిసన్‌తో ఆదుర్దాగా చెప్పాడు.
‘బయట నా కారులో ఓ అమ్మాయి చావుబతుకుల్లో ఉంది. ఈ అడ్రసే చెప్పింది. దయచేసి రండి’
‘అతను భ్రమ పడుతున్నాడని, లోపలకి వచ్చి కాఫీ తాగి తేరుకోమని ఆయన ఆహ్వానించాడు. ఆమెని హాస్పిటల్‌కి తరలించాలని రాబర్ట్ ఆందోళనగా కారు దగ్గరికి పరిగెత్తుకు వెళ్లి చూస్తే శాలీ కారులో లేదు. ఆమె కుడికాలి బూట్ మాత్రం ఉంది. ఎలిసన్ దంపతులు అతన్ని ఇంట్లోకి పిలిచి చెప్పారు.
‘మా అమ్మాయి శాలీ ఏడేళ్ల క్రితం లారీ ప్రమాదంలో చిక్కుకుంది. తీవ్ర గాయాలైనా విల్ పవర్‌తో మా ఇంటి సమీపం దాకా నడిచి వచ్చి కూలిపోయి మరణించింది. అప్పటి నించి ఇంతదాకా ఆమె ప్రమాదం జరిగిన చోట ఆరుగురికి కనపడింది. వారు ఆమెతో మీలా వచ్చారు. వచ్చి తలుపు తట్టారు. మీరు ఏడో వ్యక్తి. ఎవరూ కూడా ఆమెని ఎత్తుకుని ఇంట్లోకి రాలేదు. ఎవరైనా ఎప్పుడైనా ఆమెని ఇంట్లోకి చేతుల్లో మోసుకువచ్చే రోజు కోసం చూస్తున్నాం’

(1952లో ఇల్లినోయ్ ట్రిబ్యూన్‌లో రాబర్ట్ మార్టిన్ అనే జర్నలిస్ట్
శాలీ మీద రాసిన వ్యాసం ఆధారంగా)

-పద్మజ