S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

యాత్ర అనే జాతర

ఎవరు ఎందుక వస్తున్నారు, ఎందుకు, ఎక్కడికి పోతున్నారు తెలియకుండా జనం కదులుతూ ఉంటే ‘జాతర’లాగ ఉంది, అనడం అలవాటు. యాత్ర అనే మాట నుంచి జాతర పుట్టింది.
‘జాతర వోదం నరుసు, జక్కయకుంట ఉరుసు’ అంటడు పాటగాడు. అంతట్లో ఒగ సంగతి అర్థమవుతుంది. ‘చేతుల లేదు కాసు!’ మరేం చేయాలె? ‘నీ మెడనున్న గొలుసు, నేనమ్ముకుంట సైసు!’ సైసు అంటే గుర్రాల పనివాడు. సైసు అంటే సహించు, అంటే ఓపిక పట్టు అని గూడ అర్థము. నాన్న జరమొచ్చినప్పుడు పాటలు వాడేది. అట్ల యిన్న పాట ఇది. ‘శిన్నగ నడుసుకుంటు, శిందులు దొక్కుకుంటు’ జాతరకు వోతరు ఆ జంట!
పాలమూరు నగరానికి మా పల్లె ఇటుపక్కన ఉంటే, అటు పక్కన కొంత దూరంలో మనె్నముకొండ అనే చిన్న క్షేత్రమున్నది. ‘జాతరమ్మ జాతర, మనె్నముకొండ జాతర’ అని పాటలు వాడంగ ఇన్న గుర్తు కూడ ఉన్నది. ఇక మా ఊరికి ఇటు పక్కన గంగాపురము క్షేత్రము అక్కడ గూడ జాతర. ఈ రెండు జాతరలకు బడికి సెలవు ఇచ్చేవారని గట్టిగ గుర్తుంది. మేమెప్పుడూ జాతరకు పోలేదు. పల్లెలోని పాటక జనం మాత్రం తప్పకుండా జాతర వోవతరు ‘జాతరకు పోతరు’ అని పాటలో గూడ రాలేదు. (గమనించితిరా? ఈ మధ్యన ఎందుకో తెలియదు, తెలీదు, తెల్వదు, తెలువదు గానీ జనం, తెలుగు పత్రికల పుణ్యమా అని ఎక్కడికయినా పోటెత్తుతున్నారు! ఆ మాటను ఎన్నడూ విన్న గుర్తులేదు. ఎవరు కనుగొన్నరో, ఎక్కడి మాండలికమో తెలియకుండనే జనం పోటెత్తుతున్నారు మరి! తప్పు లేదు. మరో మాట లేదంటే దారి వేరు. కానీ పోతున్నారు వలెనే, ఇది పడికట్టు అయ్యింది!)
వాకిలి ఊడ్చేటి ఆమె రాదు. పసులగాసే పోరగాడు రాడు. అందరు జాతరవోతరు. ‘ముద్దుగ స్నానంబు జేసి, వొద్దిక తిలకమ్ము దీద్దీ!’ పద్ధతిలో చక్కగ స్నానం చేస్తరు. చెంపల మీదుగ కారిందాన్క నూనె రుద్దుకుంటరు, నెత్తికి! కుండలో కుదిమి దాచిన దాపుడు జీర, అంగీలు బయిటికి వస్తయి. ఇగ జూస్కొ నా సామి రంగ! ఒగ సందూకు పెట్టెలో మారుబట్టలు, పైసలు ముల్లె గట్టుకోని జాతరకు బయలుదేర్తరు. అప్పట్లో ఎడ్లబండి మీద పోయ్యేది ఒక పద్ధతి. వెసులుబాటు లేనివారు ఎంత దూరమయినా నడకనే. సర్కారు వాండ్లు ప్రత్యేకం బస్సులు నడిపేవారని అనుమానం!
నేనెన్నడు ఈ జాతరలకు పోలేదు. జాతరలను తిరునాళ్లు, తీర్థం అని గూడ అంటరు. తిని మురువ తీర్థం బోవాలె, అని మా ప్రాంతంలో ఒక మాట. అంటే జాతరలో భక్తికన్నా, రక్తి పాలు ఎక్కువని నాకు ఆనాడే అర్థమయింది. తిరుమల బ్రహ్మోత్సవాలకు ప్రయత్నంగ తీసుకపోయిన నాన్న, జాతర పేరు ఎత్తలేదంటే సంగతి అర్థమయింది. మా అన్నగారు ఒకాయన గోపాలుపేటలోని రామాలయంలో పరిచారకుడుగ పనిలో ఉండెను. నన్ను, తమ్ముణ్ని ఆయన ఒగసారి ఉత్సవానికి తనతో తీసుకుపోయినడు. వారం రోజులు గుడిలోనే గడిచింది. అక్కడ తతంగం నడిపించడానికి వచ్చిన పెద్దలంత బంధువర్గములోని వాళ్లే. మాకు ఇక పండుగగా నడిచిందంటే అనుమానం లేదు. చుట్టుపక్కలంత డేరా అంగళ్లు. రకరకాల వస్తువులు అమ్మకం. బత్తీసాలు అనే తిండి పదార్థం తయారీ నేను మొదటిసారి అక్కడనే చూచిన. చక్కెరపాకం తోటి, రకరకాల బొమ్మలు, దండలు, బిళ్లలు తయారుచేస్తున్నరు. మరమరాలు అనే ముర్మురే, అనే బొరుగులు, అనే బొంగులు వాటితో పుట్నాలు అనే శెనగపప్పు కూడ జాతర స్పెషల్. కానీ మాకు అవి కొని తినడానికి అనుమతి లేదు.
నిత్యం ప్రత్యేక పూజలు, పుళిహోర కోటలు లాంటివి నడిచినయి. తేరు అనే రథోత్సవం నాడు, పెద్దలతో మేమిద్దరం గూడ రథమెక్కినము. అది ఒక గొప్ప అనుభవం. కానీ, పోయి జనం నడుమ తిరుగుదమంటే మాత్రం పెద్దలు వద్దన్నరు. అక్కడ అలంకరించిన ఎద్దుబండ్ల ఉత్సవం, గిత్తలు అను కోడెలు బండలాగే పోటీ వంటివి మాత్రం దూరం నుంచి జాగ్రత్తగ చూడగలిగినము. అంతా తొడతొక్కిడిగా జనం. అప్పుడు పోటెత్తినరో లేదో మరి! కానీ, జాతరలో అవాంఛనీయమయిన సంగతులు గూడ మామూలుగ జరుగుతయన ఎవరో తర్వాత వివరించినరు.
కేశంపేట జాతర గురించి విన్న. చదువుకని బయలుదేరిన తర్వాత కొండగట్టు గురించి తెలిసింది. వరంగల్‌లో ఉన్నప్పుడు సారమ్మ, సమ్మక్క జాతర గురించి తెలిసింది. వీటితో పోలిస్తే మా మనె్నముకొండ ఒక లెక్కలోది కాదు. ఆదిలాబాద్‌లో ఉన్నప్పుడు అక్కడి ఆటవికులు ముఖ్యంగా జరుపుకునే వేళ్లాపూర్ గురించి తెలిసింది. ఎక్కడ చూచినా లెక్కలేని జనం. అసౌకర్యం అని తెలిసి కూడా, ఆ జాతరకు రాకుంటే, ఆ అడ్వెంచర్ తప్పిపోయిన భావం. కోటప్పకొండ మరింత బాగుంటుందని చెప్పగా, చూడాలనిపించింది. తిరుమల ఉత్సవాలకు చాలాసార్లు వెళ్లవలసిన అవసరం, అవకాశం అందినయి. అక్కడ ఎక్కువ శాతం మనుషుల్లో నిజంగ భక్తి కనబడుతుంది. మరి ఈ జాతరల సంగతి మరొక రకంగ ఉంటుందని అంటారు. విజయనగరం సిరిమాను పండుగ జాతరా? ఉత్సవమా?
నాగోబా జాతరకు చారిత్రకంగా గుర్తింపు ఉంది. అక్కడికి ప్రభుత్వ అధికారులు మొత్తం జిల్లా యంత్రాంగం తప్పకుండ వస్తరు. ఒక కొలువు జరుగుతుంది. ఈ పద్ధతి మరెక్కడయిన ఉంటే తెలియదు. మిగతా జాతరలలో రవాణా, రక్షణ, ఆరోగ్యం, పారిశుద్ధ్యం వంటి ఏర్పాట్లు చేయడమే ప్రభుత్వం బాధ్యత. జాతరను నడిపించేది మాత్రం ప్రభుత్వం కాదు. అసలు యింత దూరం జాతరలను గురించి చెప్పే ప్రయత్నం వెనుక మూలమయిన ఆలోచన ఇప్పటికి నా మనసులోకి బలంగ వచ్చినట్టుంది. పనె్నండు ఏండ్లకు ఒకసారి నదులకు పుష్కరాలు వస్తయి. అంటే నా జీవిత కాలంలోనే కృష్ణ, గోదావరులకు అయిదుసార్లు వచ్చినట్టు లెక్క. గతంలో ఎన్నడు, గడిచిన రెండేండ్లలో జరిగినంత గోల, ప్రచారం లేవని గట్టిగా చెప్పగలను. కలకత్తాకు పోయి గంగలో మునగకుండ వచ్చిన వాడిని నేను. గడిచిన రెండు పుష్కరాలలోనూ నా సంగతి తెలిసిన మిత్రులు, బందుగులు సీసాల్లో నీళ్లు తెచ్చి, వాటితో స్నానం చేయమని చెప్పారు. వాళ్ల మాట విన్నాను. పుణ్యం కూడ వచ్చే ఉంటుంది.
ప్రజాస్వామ్యంలో ఎవరి మతాన్ని, అభిమతాన్ని వారు పాటించే స్వేచ్ఛ ఉంటుంది. ఉండాలె. కానీ, నీళ్లను తపాలా ఆఫీసుల్లో అమ్ముతాము, వచ్చిన వారికి భోజనాలు పెడతాము అంటూ సర్కారు వారు ఈ జాతరలను (పుష్కరాలు కూడా జాతరలే) తలకెత్తుకొనడం వింతగా తోచింది. దేవునికీ, భక్తులకు మధ్యలో మరెవరో ఉండడం మన సంప్రదాయం. అట్లా ఒక పద్ధతి లేకుంటే గుడులన్నీ జాతరలవుతాయి. జాతరల నిర్వాకం (నిర్వాహకము అని మాత్రమే, ఏదో తప్పుడు మాటగా కాదని మనవి!) ఎవరి బాధ్యత?
తిని మరువ తీర్థం బోవాలె అని గదా మాట. మామూలుగాకుండ మరేదో తినాలె. మురుసుడు అంటే ఆనందమని అర్థము. కొంత ఉల్లాసంగ గడవడానికి పల్లెకారు వారికి, పండుగలు, జాతరలు మాత్రమే అందుబాటులోని సందర్భాలు. ఆయా జాతరల వెనుకనున్న చారిత్రక నేపథ్యాన్ని గూడ అందరూ అర్థం చేసుకుంటే, మురిపెం మరింత బాగుంటుంది!

చిత్రం..బోనాల జాతర

కె.బి. గోపాలం