S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

స్మగ్లర్ల దీవి (విలన్స్, స్కౌన్‌డ్రల్స్ అండ్ రాస్కెల్స్)

స్మగ్లర్ల దీవిని ఎవరో కొన్నారని నేను మొదటిసారి మే నెల్లో విన్నాను. కేమరూన్ తీరంలో సాల్మన్ చేపలని పట్టే వృత్తి నాది. వాటిని అమ్మడానికి ప్రాసెసింగ్ షెడ్‌కి వెళ్లినప్పుడు చేపలని తూకం వేస్తూ కేషియర్ చెప్పాడు.
‘వెర్నే! లాస్‌ఏంజెలెస్ నించి వచ్చిన ఎవరో లక్ష డాలర్లు చెల్లించి స్మగ్లర్ల దీవిని కొన్నారట’
‘ఎవరు కొన్నారు?’ నా పక్కనే ఉన్న ఏబ్నర్ ప్రశ్నించాడు.
‘రోజర్’
‘దేనికో?’ నా ఇంకో భాగస్వామి డేవ్ ప్రశ్నించాడు.
‘బహుశ అక్కడి గుహల్లో దాచిన నిధిని కనుక్కోడానికేమో?’ ఏబ్నర్ చెప్పాడు.
‘ఐతే మూర్ఖుడే అయి ఉంటాడు’ అంతదాకా వౌనంగా ఉన్న మా నాన్న చెప్పాడు.
హార్బర్‌కి మైలు దూరంలో ఒక ఎకరం విస్తీర్ణంలోగల రాతి నేలే ఆ ద్వీపం. చుట్టుపక్కల దానికన్నా చిన్న ద్వీపాలు కూడా కొన్ని ఉన్నాయి. అక్కడున్న కొన్ని వృక్షాల మీద సముద్రపు పక్షులు గూళ్లు కట్టుకున్నాయి. ఆ దీవిలో ఉన్న గుహలోకి అటు సమయంలోనే వెళ్లగలం. చిన్నపిల్లలుగా ఉండగా మేము ఆ గుహలోని సొరంగాల్లోకి వెళ్తే అవి కొంతదూరంలో అంతం అయేవి. అక్కడ నిధి దాగుండటం అబద్ధం అని మా గ్రామస్థులు అందరికీ తెలుసు.
ప్రొహిబిషన్ సమయంలో ప్రభుత్వ రెవిన్యూ ఏజెంట్లు అక్కడ అక్రమంగా తయారుచేసిన ఏభై కేసుల హైగ్రేడ్ విస్కీని స్వాధీనం చేసుకున్నారు. ఆ లంక మీద స్మగ్లర్లకి, రెవిన్యూ ఏజెంట్లకి మధ్య తరచూ ఘర్షణలు జరిగేవి. ఇరు పక్షాల వారిలో అరడజను మంది మాయమయ్యారు. అక్కడ కెనేడియన్ విస్కీ బాటిల్ లేబుల్స్ ముద్రించే యంత్రాన్ని కనుగొన్నారని విన్నాను. అక్కడ నించి శాన్‌ఫ్రాన్సిస్కో నెవేడాలకి లిక్కర్ స్మగుల్ అయ్యేది.
‘బాగా డబ్బున్న వారు కొన్నిటిని ఎందుకు కొంటున్నారో తెలీకుండా కొంటారు. బహుశ దానికిగల పేరు వల్ల కొని ఉంటాడు. మిత్రులతో ‘నేను స్మగ్లర్స్ దీవిని కొన్నాను. అక్కడ ఓ నిధి ఉంది’ అని గొప్పగా చెప్పుకోడానికి కొని ఉండచ్చు’. మా నాన్న చెప్పారు.
కాని నాకు అది ప్రశ్నార్థకంగానే మిగిలిపోయింది.
చిన్న గ్రామంలో వదంతులు తేలిగ్గా వ్యాపిస్తాయి. రోజర్ రియల్ ఎస్టేట్ వ్యాపారి అని, ఆ దీవిలో చిన్న ప్రైవేట్ క్లబ్‌ని నిర్మిస్తాడని ఒకరు... పూర్వం అతను అక్కడ అక్రమంగా ఆల్కహాల్‌ని తయారుచేసేవాడని, ఆ జ్ఞాపకంగా దాన్ని కొన్నాడని మరొకరు... ఓ సినిమా కంపెనీ తరఫున దాన్ని కొన్నాడని, అక్కడ షూటింగ్ ముగిశాక ఆ దీవిని పేల్చేస్తాడని మరొకరు ఇలా అనేక వదంతులు విన్నాను. కాని నేను వేటినీ నమ్మలేదు.
ఓ రాత్రి నేను, ఏబ్నర్, మా నాన్న కలిసి భోజనం చేస్తూండగా డేవ్ చెప్పాడు.
‘ఆ దీవిని కొన్న రోజర్ కేమరూన్ ఇన్‌లో బస చేస్తున్నాడు. గురువారం నించి సింగిల్ రూంని రిజర్వ్ చేసుకున్నాడు’
‘ఒక్క సింగిల్ రూమా? అలాంటి వారి వెంట వందిమాగధులు ఉంటారుగా?’ నా భార్య కొద్దిగా నిరాశ చెందినట్లుగా చెప్పింది.
‘మిగిలిన వారు తర్వాత రావచ్చు’ ఏబ్నర్ చెప్పాడు.
‘అక్కడి గుహలోకి వెళ్లి అటు సమయానికల్లా బయటికి రాకపోతే మునిగి చస్తాడు’ మా నాన్న చెప్పారు.
* * *
గురువారం నేను సాల్మన్ చేపలని పట్టి వచ్చాక ఓ పొడుగాటి వ్యక్తి నా వంక చూస్తూ చెప్పాడు.
‘ఇదిగో. నినే్న’
‘నన్నా?’ అడిగాను.
‘మాట్లాడటానికి ఇక్కడ ఇంకా ఎవరున్నారు? నాకో మోటర్ బోట్ అద్దెకి కావాలి. ఎక్కడ దొరుకుతుంది?’ అడిగాడు.
‘అలాంటివి ఇక్కడ దొరకవు. మీ పేరు రోజరా?’ ఆ నలభై ఏళ్ల సన్నటి వ్యక్తిని అడిగాను.
‘అవును. నేను దాన్ని కొన్నానని గ్రామంలోని అందరికీ తెలుసు’
‘దాన్ని ఎందుకు కొన్నారు?’
‘కేమరూన్ తీరంలో ప్రతీ వాళ్లు అడిగే ప్రశే్న అది. నేను ఆ ద్వీపంలో నివసించాలని చాలా కాలంగా అనుకుంటున్నాను’
‘అంటే అక్కడ మీరో ఇల్లు కడతారా? నేలంతా రాళ్లే. అతి కొద్ది చెట్లే ఉన్నాయి. దాదాపు రెండు వేల పక్షి గూళ్లు కూడా ఉన్నాయి. ఎప్పుడూ ఆ దీవిలో పొగమంచు కమ్ముకుని ఉంటుంది. గాలి కూడా ముప్పై నాట్ల వేగంతో వీస్తుంది’ చెప్పాను.
‘నాకు గాలి, మంచు, సముద్రం, ఏకాంతం, పక్షులు అంటే ఇష్టం’
‘పడవ కోసం బే మెరైన్‌లోని హాకిన్స్‌ని సంప్రదించండి’ సూచించాను.
తర్వాత నాకు తెలిసింది. హాకిన్స్ నించి అతను ఓ పడవని వంద డాలర్లకి అద్దెకి తీసుకున్నాడని.
‘బహుశ నిధి ఉందనే భ్రమలో ఉన్నాడేమో?’ ఏబ్నర్ చెప్పాడు.
అతను వెయిట్రెస్‌లతోను, దుకాణ యజమానులతోను కఠినంగా మాట్లాడతాడని, అవసరం లేకపోతే ఎవరితోనూ మాట్లాడడని తెలిసింది. పగలు ఆ దీవిలో, రాత్రుళ్లు తలుపు బిగించుకున్న హోటల్ గదిలో గడుపుతున్నాడు. అతను ఆర్కిటెక్ట్ అని, ఇంటికి ప్లాన్ గీస్తున్నాడన్న వదంతిని కూడా విన్నాను.
* * *
ఆ ఆదివారం ఉదయం పదికి నేను, నా భార్య చర్చ్‌కి వెళ్లి సముద్రపు ఒడ్డున గల హోటల్‌కి లంచ్‌కి వెళ్లి ఇంటికి తిరిగి వచ్చేసరికి ఐదైంది. మా నాన్న నడుంనొప్పితో మంచం మీద ఉన్నారు.
హాకిన్స్ నాకు ఫోన్ చేసి అడిగాడు.
‘రోజర్ ఉదయం నా బోట్లో దీవికి వెళ్లాడు. తిరిగి రాలేదని హోటల్‌కి ఫోన్ చేస్తే తెలిసింది. నీకేమైనా తెలుసా?’
‘నన్ను ఈ దీవికి వెళ్లమంటున్నావా?’ అడిగాను.
‘నువ్వేం అనుకోకపోతే. రోజర్‌కి ఏమైందా అని కాదు. నా పడవ ఏమైందా అని’
‘సరే. రోజర్ ప్రమాదంలో పడ్డాడేమో మరి?’
నేను ఆ విషయం నా భార్యకి చెప్పి ఆ దీవికి బయలుదేరాను. హాకిన్స్ పడవ దూరం నించే లంగర్ వేసి కనిపించింది. నేను దీవికి వెళ్లాక రోజర్ కోసం వెదకసాగాను. ఆ దీవి మధ్యలో రాళ్ల మీద పడి ఉన్న అతను కనిపించాడు. దగ్గరికి వెళ్లి చూడగానే ఛాతీలో తుపాకీ గుండు దిగి మరణించాడని ఇట్టే గ్రహించాను. ఐతే నాకా తుపాకీ ఎక్కడా కనిపించలేదు.
* * *
కేమరూన్ తీరంలో గత నలభై ఏళ్లల్లో రోజర్ హత్య అతి పెద్ద సంఘటన. ఆదివారం రాత్రి, సోమవారం ఉదయం ఎవరూ ఇది తప్ప మరొకటి మాట్లాడలేదు. అతని శవాన్ని కనుగొంది నేనని తెలిసాక నా ఫోన్ మోగుతూనే ఉంది. పత్రికా విలేకరులు, మిత్రులు నా ఇంటికి వస్తూనే ఉన్నారు. షెరీఫ్ చాలామందిని ప్రశ్నించాడు. రోజర్ తర్వాత ఆ రోజు స్మగ్లర్ల ద్వీపానికి ఎవరు వెళ్లారో పోలీసులు కనుక్కోలేకపోయారు. అతని హత్యకి సంబంధించిన అనేక వదంతులు కూడా పుట్టాయి.
లాస్ ఏంజెలెస్‌లో అతను ఎవర్నో మోసం చేస్తే వచ్చి ప్రతీకారం తీర్చుకున్నారని, స్థానిక పౌరుడ్ని అవమానిస్తే పగ తీర్చుకున్నాడని, అతను నిధిని కనుక్కుంటే అది తెలిసిన ఎవరో చంపి తీసుకుపొయ్యారని.. అంతేకాని ఎందుకు చంపారో ఎవరూ స్పష్టంగా తెలుసుకోలేక పోయారు. షెరీఫ్‌కి కొన్ని ఆధారాలు లభించినా అవి బయటకి పొక్కలేదు. ఎవర్నీ అతను అరెస్ట్ కూడా చేయలేదు.
కేమరూన్ బేలో ఓ హంతకుడు ఉన్నాడని, అతను ఇంకోసారి హత్య చేయడని గేరంటీ ఏమిటనే భయం కూడా ఆడవాళ్లల్లో ప్రవేశించింది.
రోజర్ దగ్గర చాలా డబ్బుంది. దాని కోసం ఎవరో చంపి ఉంటారని భావించాను. లేదా థ్రిల్ కోసం చంపారా? అలాంటి వార్తలు అనేకం చదివాను.
డిప్యూటీ షెరీఫ్ హేరీ నన్ను ప్రశ్నించినప్పుడు నా అనుమానాలని వెలిబుచ్చాను.
‘హత్యకి కారణం తెలిస్తే కాని హంతకుడ్ని పట్టుకోవడం కష్టం’ అతను నన్ను ప్రశ్నించాక చెప్పాడు.
‘అక్కడ ఆధారాలు ఏమీ దొరకలేదా?’ ప్రశ్నించాను.
కొద్దిగా సందేహించినా చివరికి చెప్పాడు.
‘బహుశా దీన్ని నీతో చర్చించకూడదు అనుకుంటా. మాకు అక్కడ దొరికిన వస్తువు ఆ ద్వీపానికి చెందింది కాదు’
‘ఏమిటది?’
‘తేనెపట్టు మైనంతో చేసిన ముద్ద’
‘మైనం ముద్దా?’
‘అవును. దాని గురించి ఏమైనా చెప్పగలవా?’ అడిగాడు.
‘చెప్పలేను’
‘మాకు అది ఉపయోగపడలేదు. అది తప్ప మాకు ఇంకే ఆధారం దొరకలేదు. ఇంకో రెండు, మూడు రోజుల్లో మేము హంతకుడ్ని కనుక్కోలేకపోతే, ఇది అనధికారికంగా పరిష్కరించబడని కేసు అవుతుంది. నీ సమయానికి థాంక్స్’ హేరీ చెప్పాడు.
తేనెపట్టు మైనం! ఏదో ఆలోచన రూపు దిద్దుకోగానే నాలో కొద్దిగా భయం కలిగింది. నాకు కొంత తెలిసినా హేరీకి దాని గురించి చెప్పలేదు. బహుశా నా అనుమానం తప్పై ఉండచ్చు. కాని తప్పు కాదని కూడా అనిపించింది.
రోజర్ని ఎవరు చంపారో నాకు తెలిసింది.
* * *
ఇంటికి తిరిగి వచ్చాక నేను ఇల్లు మొత్తం తిరిగి చూశాను. ఎవరూ లేరు. తర్వాత నేను ఇంటి బయట సన్ డెక్‌లోకి నడిచాను. సన్ డెక్‌లో కూర్చుని స్మగ్లర్ల దీవి వంకే చూస్తున్న ఆయన్ని చూశాను.
‘నాన్నా! నువ్వు రోజర్ని ఎందుకు చంపావు?’ ఆయన వంక సూటిగా చూస్తూ ప్రశ్నించాను.
తక్షణం ఆయనలో నేను ఎదురుచూసిన భయం, ఉలికిపాటు కాని కనపడలేదు. తలతిప్పి కొన్ని క్షణాలు నా వంక చూసి మళ్లీ స్మగ్లర్ల దీవి వైపు నిశ్శబ్దంగా చూస్తూంటే అసలు నా మాటలే వినపడలేదేమో అనిపించింది. ఆయన సమాధానం కోసం వేచి ఉన్నాను. కాసేపటికి దీర్ఘంగా నిట్టూర్చి చెప్పాడు.
‘ఈసారి ఎవరైనా కనుక్కుంటారని భావించాను. నువ్వే కనుక్కోవడం విచారకరం’
‘నాకూ బాధగానే ఉంది’ చెప్పాను.
‘నీకు ఎలా తెలిసింది?’
‘నువ్వు తేనెపట్టు మైనం ముద్దని అక్కడ వదిలేసావు. బహుశా జేబులోంచి తుపాకీ తీస్తూంటే పడి ఉంటుంది. ఈ ఊరిలో దాన్ని దగ్గర ఉంచుకునేది నువ్వు ఒక్కడివే. ఎందుకంటే నువ్వు మాత్రమే పొగాకు పైప్‌లని చేత్తో తయారుచేసేది. ఆ చెక్క పైప్‌లు పూర్తయ్యాక వాటికి మెరుగుపెట్టడానికి నువ్వా మైనంతో పాలిష్ చేస్తావని నాకు తెలుసు’
మా నాన్న కాసేపు ఏం మాట్లాడలేదు.
‘ఎందుకు?’ అడిగాను.
‘రోజర్ దాన్ని కొని అక్కడ ఇల్లు నిర్మించాలని అనుకున్నాడు. ఆ ప్రయత్నం నించి విరమించుకోమని కోరడానికి వెళ్లి అతన్ని కలిశాను. ఎందుకైనా మంచిదని పిస్తోలుని వెంట తీసుకెళ్లాను కాని దాన్ని ఉపయోగించే ఉద్దేశం నాకు లేదు. అతను నన్ను ఎదిరించబోతే...’
‘అతను అక్కడ ఇల్లు కట్టుకుంటే నీకేమిటి నష్టం?’
‘అతను మనుషుల్ని, పరికరాల్ని తెచ్చి అంతా తవ్వుతాడు. ప్రభుత్వ రెవిన్యూ ఏజెంట్ శవం బయటపడుతుంది’
‘నాన్నా!’
‘1920లో నేను, ఫ్రేంక్ అనే ఓ మిత్రుడు అక్రమంగా ఆల్కహాల్ తయారుచేసేవాళ్లతో కలిసి పనిచేశాం. నెలకోసారి ఆ ద్వీపానికి వెళ్లి పడవలో ఆల్కహాల్‌ని తెచ్చేవాళ్లం. 1932లో ఓ రాత్రి మేము ఆ దీవిలోంచి మా పడవలోకి సీసాలని ఎక్కిస్తూంటే చెట్టు చాటునించి ఓ మనిషి పరిగెత్తుకు వచ్చి మాకు రివాల్వర్‌ని గురిపెట్టాడు. అతను అక్కడ మా కోసం దాక్కున్న రెవిన్యూ ఏజెంట్. ఆ రాత్రి వారంతా అక్రమ మద్యం తయారుచేసే చాలాచోట్ల రైడ్ చేశారని తర్వాత తెలిసింది. భయపడి ఫ్రేంక్ పారిపోతూంటే ఆ ఏజెంట్ రివాల్వర్ పేల్చాడు. దాంతో నేను అతన్ని నా రైఫిల్‌తో కాల్చి చంపాను బెర్నె’
మా మధ్య కొద్దిసేపు నిశ్శబ్దం.
‘ఫ్రేంక్ నేను కలిసి అక్కడి రాళ్ల కింద ఏజెంట్ శవాన్ని పాతాం. ఆ తర్వాత నేనా పనిని మానేశాను. ఫ్రేంక్ మాత్రం వదల్లేదు. ప్రొహిబిషన్ ఎత్తివేయడానికి కొద్ది వారాల ముందు రెవిన్యూ ఏజెంట్లు అతన్ని కాల్చి చంపారు. ఇప్పుడు రోజర్ అక్కడ తవ్వబోతున్నాడు’
‘నాన్నా! ఇది జరిగి నలభై ఐదేళ్లు దాటింది. తవ్వినా అక్కడ అస్థిపంజరమే బయటకి వస్తుంది. అది రెవిన్యూ ఏజెంట్‌ది అని బహుశా ఎవరూ గ్రహించలేరు. గ్రహించినా నువ్వే హంతకుడు అని ఎవరూ తెలుసుకోలేరుగా?’
‘తెలుసుకోగలరు. ఇప్పుడు తేనెపట్టు మైనంలా నా రైఫిల్ అక్కడ వారికి కనిపిస్తుంది. అది నాదే అని దాని నంబర్నిబట్టి వారికి తెలుస్తుంది’
తర్వాత ఆఫ్ చేసిన టేప్‌రికార్డర్‌లా మా నాన్న మాట్లాడటం ఆపేసి ఆ దీవి వంక చూడసాగాడు. ఆయన తన జీవితకాలం ఎందుకు మూడీగా ఉండేవాడో, ఎందుకు నవ్వేవాడు కాడో అప్పుడు నాకు అర్థమైంది.
‘ఇదంతా షెరీఫ్‌కి చెప్తావా?’ మా నాన్న ప్రశ్నించాడు.
‘నీ వయసు డెబ్బై రెండు. నువ్వు ఎవర్నీ బాధించగా నేను చూడలేదు. నేను చెప్తే నువ్వు నెల మించి బతకలేవు’ చెప్పాను.
నేను శిక్ష పడని ఒక హత్య కాక రెండు హత్యలు చేసిన మా నాన్న పక్కన కుర్చీలో నిశ్శబ్దంగా కూర్చున్న స్మగ్లర్ల దీవి వైపు చూడసాగాను. కాని నా కళ్ల నిండా నీళ్లూరడంతో ఏమీ చూడలేకపోయాను.
‘అతని శవానికి సంస్కారం జరిగి ఉంటే బావుండేది’ మా నాన్న గొణుగుతున్నట్లుగా చెప్పాడు.
* * *
మర్నాడు నేను స్మగ్లర్ల దీవికి వెళ్లి తవ్వి తీసి మా నాన్న రైఫిల్‌ని కాల్చేశాను. బూడిదని సముద్రంలో కలిపాక సరాసరి షెరీఫ్ దగ్గరికి వెళ్లి చెప్పాను.
‘స్మగ్లర్ల దీవిలో ఓ అస్థిపంజరం కనిపించింది. దానికి ఈ బేడ్జ్ ఉంది విచారించండి’
ఆ తర్వాత నేను మా నాన్న పక్కన కుర్చీలో నిశ్శబ్దంగా కూర్చుని స్మగ్లర్ల దీవి వైపు అనేకసార్లు చూశాను. అప్పుడప్పుడూ ఆయన తన చేత్తో నా చేతిని తీసుకునేవారు. ఆ స్పర్శలో కృతజ్ఞతో, ఆనందమో, మరేదో తెలీని ఓ భావం నన్ను తాకుతూండేదని గట్టిగా చెప్పగలను.

- బిల్ ప్రాంజినీ కథకి స్వేచ్ఛానువాదం -

మల్లాది వెంకట కృష్ణమూర్తి