S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఫలితాన్ని ఆశిస్తే అసూయను ఆహ్వానించినట్లే!

మానవుడు దివ్య పురుషుడు కావలసిందేనా?
మానవ తత్వంలోని పురుషత్వం పురుషోత్తమం కావలసిందేనా?
మానవ జీవితం పురుషోత్తమ యోగానికి నెలవు కావలసిందేనా?
భౌతిక జీవన యానంలో వ్యక్తి ఆరాధన, సాధన ఏ దిశగా సాగాలి?
ప్రాపంచిక పురుషుడు భక్తుడుగా పరిణమిస్తే సరిపోతుందా? అంటే భక్తి మార్గానికి పరిమితమైతే చాలా? భక్తి యోగం ఒక్కటి చాలా పూర్ణ పురుషుడిగా పరిణమించటానికి?
భక్తుడికి భగవంతుడికి మధ్య అనుసంధానం ఎలా సాధ్యవౌతుంది?
అసలు ఆ భగవంతుడిని వ్యక్తి ఆరాధనతో అంటే రూప ప్రధానంగా ఆవిష్కరించుకోవాలా? లేక అరూప ప్రధానంగా సాధనను మలచుకోవాలా?
ఈ ప్రశ్న లన్నిటికీ గీతాచార్యుడు ఇచ్చిన సమాధానం ఒక్కటే. మనసును ఆవల పెట్టి సాధనామగ్నం కావాలని. అదే గిక లక్షణం. దృష్టిని అంటే సాధనన తనపైన నిలపమంటాడు - అంటే ఏకాగ్రచిత్తం అవసరమనేగా?
అవును, భక్తుడు భగవంతుడితో అనుసంధానం కావటానికి కావలసింది ప్రేమ తత్వం. నిష్కళంక ప్రేమతో, నిర్వికార ప్రేమతో, నిస్వార్థ ప్రేమతో మాత్రమే మానవ తత్వంలో దివ్యత్వం నెలకొంటుంది. అప్పుడే దివ్యత్వం హృదయాన్ని అధివసిస్తుంది. ఇలా అనుసంధానం కావటమన్నది మానవ జన్మకు వచ్చిన ఆత్మ బాధ్యత. అంటే పరమాత్మను మనం హృదయంతో అనుసంధానం కాగలమే తప్ప మనస్సుతోను, బుద్ధితోను కాదు.
* * *
తమలోని భక్తి కూడా ఆ భగవత్ ప్రసాదితమే అనుకోవటం భక్తి మార్గంలోని విశిష్టత. పైగా భక్తి మార్గంలో పురివిప్పేది ప్రేమతత్వం కాబట్టి ఆ భగవదారాధన వైయక్తికంగా సాగుతుంది. ఆ భగవంతుడు - తాను’ మాత్రమే అన్నచందాన భక్తి మార్గంలో తలమునకలవ్వటం జరుగుతుంది. అంటే ‘విశ్వాస’ ప్రాతిపదికన ‘రూప’ ప్రధానంగా భక్తి పరిఢవిల్లుతూ పోతుంది. అయితే ఈ భక్తి మార్గ ప్రయాణంలో ఇంకా ఇంద్రియ వశమై ఉండటం సామాన్యంగా జరుగుతుంటుంది. అంటే ప్రాపంచికత నుండి అతీతం కావటానికి సమయం పడుతుంది. కాని ఇంద్రియాతీతం కాగల యోగ మార్గం ద్వారా ఇహానికి అతి త్వరగా అతీతం కావటం సాధ్యమవుతుంది.
కాబట్టి మానవ దృక్పథంలో సమూల మార్పు జరగాలంటే కర్మ మార్గమే ఉన్నత మార్గం అన్నది గీతాచార్యుడి ఉవాచ. అంటే ఇంద్రియాతీత స్థితికి చేరుకోవటం ఉత్తమం అని. స్థిర వర్తనం అంటే ఇదే. మానసికంగా స్థితం కావటం వల్ల ఈ స్థిరవర్తనం సాధ్యమవుతుంది. అందుకే కర్మయోగ సాధకుల మగ్నత అరూపంపైన, అవ్యక్తంపైన, అచలంపైన, అగోచరంపైన. పైగా సంయమన శీలురు కావటం వల్ల ఇంద్రియాతీత స్థితికి చేరుకోవటం సులభ సాధ్యమవుతుంది. అందువల్లనే కర్మయోగులు సర్వ జగద్రక్షకులు కాగలుగుతారు. వీరు ‘బ్లెస్ట్’ కాదు ‘బ్లిస్ట్’.
మొత్తానికి భక్తి మార్గంలో రూపారాధన కంటే కర్మయోగ మార్గంలో అరూపారాధనే శ్రేష్ఠం అన్నది గీతాచార్యుడి వివేచన. కారణం మానవత్వంలో దివ్యత్వం నెలకొనాలంటే మనం దేహాతీతం కావలసిందే. దేహాన్ని ఆశ్రయించి ఉన్నంతవరకే మానసిక భ్రమ. దేహాతీతం అయితే భ్రమాతీతం కావటం కూడా జరుగుతుంది. అంటే దేహ స్థితిని గురించి కాక దేహాతీత అస్తిత్వాన్ని ఔదలదాల్చటం జరుగుతుంది. అంటే కర్మయోగంలో ఆత్మకే అగ్రత్వం.
పారదర్శకత, పవిత్రత చెట్టాపట్టాలేసుకుంటే తప్ప ఆత్మదర్శనం సాధ్యం కాదు. ఆ ఆత్మదర్శనంతోనే పరమాత్మ సాక్షాత్కారమూ సాధ్యమవుతుంది. కేవలం సామాన్య జీవన యానంతో, యాంత్రిక జీవనంతో ఈ ‘అద్వితీయత’ సాధ్యం కాదు. మానవ ఆత్మ ప్రాపంచికానికి పరిమితమై పోకుండా పరమపథాన పరిణిత ప్రయాణం ప్రారంభించాలి. అందుకే ప్రాపంచిక ప్రలోభాలతో బ్రతుకీడ్చుకు వచ్చే తరుణంలో భక్తికే పరిమితమై పోతూ రూపారాధనకే అంకితమై పోవటం జరుగుతోంది. అంటే రూపారాధనలో దేహ భ్రమ తొలగదు. దేహ భ్రమ తొలగితే తప్ప సర్వాంతర్యామిని గుర్తించటం జరగదు. దేహాన్ని, మనస్సును దాటితే తప్ప ‘సకలం’లోని సృష్టి చైతన్యాన్ని అనుభూతించటం సాధ్యం కాదు.
కాబట్టి, ఎంతటి వారికైనా మొదట్లో భక్తి మార్గసాధనే ఆకర్షక మవుతుంటుంది. ఆత్మ ఔన్నత్యాన్ని గుర్తించే వరకు రూపారాధనే సాగుతుంటుంది. మన రూపం అదృశ్యమైతే తప్ప పరమాత్మ తత్వం అందిరాదు. పరమాత్మను అరూపంగా అందుకోలేము. రూపం కరిగితేనే అరూప చైతన్యావిష్కరణ జరిగేది.
* * *
ఏది ఏమైనా, తొలి ఆధ్యాత్మిక ప్రయాణంలోనే ఈ అసందిగ్ధత. అడుగు పడుతుంటే లక్ష్యం స్పష్టమవుతుంటుంది. అనుభవం స్పష్టతగా పరిగణమించి లక్ష్యాన్ని మరింత స్పష్టపరుస్తుంటుంది. భేద భావన తొలగుతుంది. అద్వైతం సిద్ధిస్తుంది. అదే ఆత్మజ్ఞానం. ఆత్మదర్శనంతో భక్తికర్మగా పరిణమిస్తుంది. ఈ తరుణంలోనే మానసిక క్షాళన జరుగుతుంది. మానవత్వానికి పవిత్రత్వం చేదోడవుతుంది. బంధాలకు బద్ధమవని అమలిన స్థితి అది. పూజ, ప్రార్థనలు మనల్ని రూపారాధనకు, విగ్రహారాధనకు కట్టిపడేస్తాయి. ఈ అమలిన, అమనస్క స్థితికి చేర్చేది ధ్యాన మార్గం- ఇక్కడ అనే్వషణతో ప్రయాణం సాగుతుంటుంది.
ప్రాపంచికంగా ఉంటూ భావోద్విగ్న స్థితిలో ఉంటూ భగవంతుడితో అనుసంధానమయ్యేది భక్తి మార్గం - ప్రశ్నకు అవకాశమివ్వని స్థితిలో ఈ మార్గ ప్రయాణం సాగుతుంటుంది.
ప్రాపంచిక వర్తనాన్ని, పారమార్థిక వర్తనాన్ని బాధ్యతతో వహించే స్థితి కర్మమార్గం. కర్మాచరణలో కర్తగా బాహ్యానికి కనిపిస్తున్నప్పటికీ నిమిత్తమాత్రుడిగా వ్యవహరించటం కర్మ మార్గంలో సాధ్యమవుతుంటుంది. కర్మాచరణలోనే ‘పరిపూర్ణం’ కావటం జరుగుతుంటుంది. మొత్తానికి ఈ కర్మ మార్గం నిస్వార్థ మార్గం.
కర్మయోగ సాధనతో ‘నేను’ తొలగుతుంది. మనమే కర్తలం అన్న తలపు కలగదు. ఫలాపేక్ష ఉండదు. ఫలితాన్ని ఆశించనప్పుడు అసూయకు అవకాశం ఉండదు. విరోధత్వం ఉండదు. ‘నేను’ బంధముక్తం కావటం వల్ల ‘అహం’ మిడిసిపడదు. బంధాలతో బరువెక్కటం ఉండదు. పైగా విశ్వచైతన్యంలో అంతర్లీనం కావటం వల్ల విశిష్ట ఆతిథ్యాలను, ప్రత్యేక హోదాలను ఆశించటం జరగదు.

డా.వాసిలి వసంతకుమార్ 9393933946