S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

సద్విమర్శ

మంచి చేసినా చెడు చేసినా విమర్శలు తప్పవు. విమర్శలు లేకుండా జీవితం గడవదు. సద్విమర్శలోని మంచిని గ్రహించినప్పుడే వృద్ధి చెందుతామన్న ‘ఓ చిన్న మాట’ బహు బాగుంది. అసౌకర్యాలకు బాధపడకుండా లెక్కలేనంత మంది వేడుకగా జరుపుకునే జాతరల గురించి గోపాలంగారు బాగా చెప్పారు. నిజానికి భారతీయాత్మ జాతర్లలోనే ఉందని చెప్పాలి. నోట్ల రద్దు గురించి అనేక వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. నిజం ఏమంటే చిన్నాపెద్దా తేడా లేకుండా ఎవరి స్థాయికి తగినట్లు వారు కమీషన్లకు ఆశించి నల్లదొరలకు సాయం చేస్తున్న మనవాళ్లు, మన ప్రజల వల్లే ఇది అతి పెద్ద సమస్యగా మారింది!
-కె.హితీక్ష (రమణయ్యపేట)

ఉత్తమ లేఖలు
కార్టూనిస్టుగా, చిత్రకారునిగా, సినీ దర్శకునిగా బహుముఖ ప్రజ్ఞను ప్రదర్శించిన మేధావి బాపు. శ్రీశ్రీ మహాప్రస్థానం, రావిశాస్ర్తీ కథలూ తరితరాలకు బొమ్మలు వేశాడని, రాముడన్నా, రామాయణమన్నా ఇష్టమని తెలుసుకున్నాం. బాపు-ముళ్లపూడిల మధ్యనున్న స్నేహబంధం ఎంత మధురమో, బాపుగారి ఉత్తరాలు ఎంత విశిష్టమైనవో, ఆయన ఉత్తరాలలో తొణికిసలాడే ఆత్మీయత ఎంతనో తెలుసుకున్నాం. ‘నవరత్నమాల’ చదవాల్సిన గ్రంథం. బాపుగారి ఉత్తరాల్లో హాస్య ప్రియత్వం, అభిమానంతో పాటు ఏమేమి తొణికిసలాడతాయో తెలిపారు. ‘నాట్’కు బాపుగారు రాసిన లేలఖ కంటతడి పెట్టించింది. ముళ్లపూడి, బాపుల అనుబంధానికి వెల కట్టలేం.
-సరికొండ శ్రీనివాసరాజు (వనస్థలిపురం)

కొత్తదనం
క్రైం కథలో నల్లగాలి వర్ణన, ఆ చలి రాత్రి వాతావరణ వివరణ బాగా చిత్రించాడు రచయిత. చివర పెద్దగా సస్పెన్స్ లేకపోయినా కొత్తదనంతో చకచక చదివించింది. ముప్పై మందిని హతమార్చడానికి చాలినంత సైనైడ్‌కన్నా ప్రమాదకర విషం వెదజల్లే గ్లోబ్‌ఫిష్, గబ్బిలం మాదిరి కనిపించే పుష్పాల విశేషాలు ఆకట్టుకున్నాయి. పూలపాన్పు మీద పడుకుంటే సత్యం అవగతం కాదు. అహం వీడినప్పుడే పరిణితి ఏర్పడుతుందని చక్కని నీతి చెప్పింది కథాసాగరంలోని కథ. బాగుంది. తారలు పట్టించుకోకపోయినా వారి ప్రేమలు, పెళ్లిళ్ల గురించిన గాసిప్స్ పాఠకుల్ని మాత్రం ఉక్కిరిబిక్కిరి చేస్తుంటాయి.
-ఎ.శాంతిసమీర (వాకలపూడి, తూ.గో.జిల్లా)

ఓ ఉత్తరం..
కవర్‌స్టోరీ ‘బాపు.. ఓ ఉత్తరం’లో మాకు తెలీని కొత్త విషయాలు చదివాక ఆయన గురించి ఎంత చదివినా కొంత మిగిలిపోతూనే ఉంటుందని అర్థమైంది. నిజమే. బాపు లాంటి బహుముఖ ప్రజ్ఞావంతులు బహు అరుదు. నాదస్వర వాద్యం కోసమే పుట్టిన మహా విద్వాంసుడు, నాదస్వర చక్రవర్తి రాజరత్నం, ఇతర నాదబ్రహ్మల గురించి అమృతవర్షిణిలో విపులంగా ప్రస్తావించడం మమ్మల్ని అలరించింది. జీవన్మరణాల మధ్య ఛేదించరాని కంచె వున్నా మరణించిన వారు ఆ కంచె ఛేదించుకొని జీవితంలోకి రావడం లాంటి వింతలు జరుగుతూనే ఉంటాయని నిరూపించింది ‘నమ్మండి.. ఇది నిజం’లో చెప్పిన ఉదంతం.
-ఎన్.గిరిధర్ (కాకినాడ)

గీతకారుడు
బొమ్మల బాపు సినిమా స్క్రిప్ట్‌నంతా బొమ్మలతో తయారుచేసి సినిమా బొమ్మలతో (నటులు) ఆడించేవారట. ముళ్లపూడి రాతగాడిగా, బాపు గీతగాడిగా ప్రసిద్ధి చెందిన అపూర్వ మిత్రద్వయం. బ్రతికున్నంత కాలం వీరి స్నేహం మధురంగా వర్థిల్లింది. ‘లా’ పట్టా పొందినా మాటలు నేర్వని కారణం లాయరు కాలేకపోయినా కళాత్మక నిర్దేశకుడయ్యాడు. అనేక వేదికల మీద సన్మానాలు అందుకున్నా ఒక్క పలుకు కూడా పలక్కుండా ప్రదర్శించిన మూగతనం నిర్వాహకులకు కొంత నిరుత్సాహం కలిగించిందన్నది వాస్తవం. వీరి దర్శకత్వంలో వచ్చిన సినిమాల్లో విజయాలు, అపజయాలు కూడా ఉన్నాయి. అయితే ఇవి కళాఖండాలుగా నిలిచిపోయాయి. బాపు పాటల్లో పల్లవి అయ్యాడు. బొమ్మలకు కుంచె అయ్యాడు. అట్టల మీద వెలిసాడు. చిరునవ్వును మిగిల్చాడు. చిత్రసీమలో చిరస్థాయిగా నిలిచాడు. తెలుగు సంప్రదాయాలను తెరపరం చేశాడు.
-ఎన్.రామలక్ష్మి (సికిందరాబాద్)

మాతో మీరు
ఈ ప్రపంచంలో అవకాశం అనంతం. ఒక చిన్న ప్రయత్నంతో చిన్ననాటి కలలు కూడా సాఫల్యం చేసుకోవచ్చని చెప్పిన ‘సండే గీత’ ఎక్స్‌లెంట్. ముఖాముఖిలో ‘పరిష్కారం దళిత సమాజం నుంచే రావాలి. వస్తుంది’ అన్న మీ సమాధానం బాగుంది. తన ఉత్తరాలు ప్రచురించడం లేదన్న ఒక పాఠకుని బాధ చాలామందిలో ఉంది. వరుసగా నెల రోజుల భూమి ఉత్తరాయణం, మాతోమీరు, మనలో మనం చదివి చూడండి. ఇద్దరు ముగ్గురు నెల పొడవునా కనిపిస్తారు. మిగిలిన పాతవారు అస్సలు కనిపించరు. లేఖాంశాలు ముఖ్యం కాని లేఖకుల పేర్లు ముఖ్యం కాకూడదు. అక్షరాలోచనల్లో ‘అమ్మతనం’ కవిత బాగుంది.
-ఎస్.కృష్ణ (కొండయ్యపాలెం)

ఛాలెంజ్
స్ర్తివాదంపై అనేక కథలు చదివాం. కానీ అన్నింటికంటే ఈ వారం ప్రచురించిన ‘్ఛలెంజ్’ కథ అత్యుత్తమంగా ఉంది. పిల్లల్ని కనే యంత్రంగా స్ర్తిని భావించేవాళ్లు. పిల్లల్ని ప్రసవించే ప్రతీ సందర్భంలో స్ర్తి మృత్యుముఖంలోనికి ప్రవేశించి, బిడ్డకు జీవితం ఇవ్వాలన్న ఒక్క దృఢ సంకల్పంతో విజయవంతంగా ఆ యజ్ఞంలో మృత్యువుతో పోరాడి తిరిగి వస్తుందనే సత్యాన్ని గ్రహించిననాడు, స్ర్తిని ఎందుకు దేవతలుగా ఆరాధించాలో అర్థం చేసుకోగలం. అందుకే వేద వాఙ్మయాలు, సనాతన భారతీయ తత్వం స్ర్తికి ఉన్నతమైన స్థానం కల్పించాయి.
-ఎం.కనకదుర్గ (తెనాలి)