S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

పుస్తకాల వేట

గూగుల్, యూట్యూబ్‌లను కంప్యూటర్లలో, స్మార్ట్ ఫోన్లలో ఏది కావాలంటే దానిని అప్పటికప్పుడు డౌన్‌లోడ్ చేసుకునే సదుపాయం ఏర్పడినా, ఇప్పటికీ పుస్తక ప్రియులు తమకు కావలసిన పుస్తకాల వేటను మానలేకపోతున్నారు. కొందరిళ్లలో ర్యాకుల కొద్దీ గ్రంథాలు దర్శనమిస్తుంటాయి. వీటిని మొదటిసారి చదివేటపుడే ముఖ్యమైన వాటిని హైలైట్ చేసుకుంటే మరల పుస్తకమంతా చదవనక్కరలేదు. కొందరిలానే చేస్తుంటారు. పుస్తకాలు కొనడం కాదు. వాటిని చదవాలి. పుస్తకం చదివించేటట్టుండాలి. అవి తరువాత రిఫరెన్సుకు ఉపయోగపడాలి. ఇంటిలో వున్న పుస్తక భాండాగారం ముందు తరాల వారికి ఉపయుక్తం కావాలి. కొన్ని పుస్తకాలు చదివి వదిలేసేవి, కొన్ని ఎప్పటికీ దాచుకొనేవి అని జాన్ రస్కిన్ అనే ఆంగ్ల వేదాంతి అన్నాడు. ఆదివారం అనుబంధంలో పుస్తకాల ప్రాశస్త్యాన్ని ప్రవచనం చేయడం ఆనందంగా ఉంది.
-ఎన్.రామలక్ష్మి (సికిందరాబాద్)
భ్రమ
అంతర్జాల ప్రభావం వల్ల పుస్తక పఠనం తగ్గిపోయింది. పాఠకుల సంఖ్యా తగ్గిపోయింది అనుకుంటాం గాని అది కేవలం భ్రమ. పుస్తకాల ముద్రణ తగ్గలేదు. పాటకుల సంఖ్యా తగ్గలేదని పుస్తకాల పూదోటలో చెప్పడం మనసుకు హాయినిచ్చింది. నిజానికి పుస్తకాల పూదోటలో విహారం అంతర్జాల కాననంలో వెదుకులాటకన్నా గొప్ప ఆనందం ఇస్తుంది. క్రైం కథ ఖరీదైన బేరం -పరిస్థితిని ఆసరాగా తీసుకొని దురాశతో పెట్రోలు ధర దారుణంగా పెంచి ప్రాణం మీదకు తెచ్చుకున్న వ్యక్తి విషాదగాథ బాగుంది. నమ్మండి ఇది నిజం అంటూ చెప్పిన పునర్జన్మ కథలు మన దేశంలోనూ జరిగాయి.
-కె.లక్ష్మిప్రసన్న (పేర్రాజుపేట)
పాజిటివ్ దృక్పథం
ప్రతిరోజూ చెడ్డ పనులు చేసేవారున్నట్టే మంచి పనులు చేసేవారూ ఉన్నారు. మంచి పనులు జరిగినప్పుడు మీడియా వాటిని ప్రముఖంగా ప్రచురిస్తూ పాజిటివ్ దృక్పథం వ్యాప్తి చేయడానికి ప్రయత్నించాలని ఓ చిన్న మాటగా బాగా చెప్పారు. 50 అడుగుల ఎత్తున గాలిలో వేలాడుతున్నట్లు ఏర్పాటు చేసిన హోటల్, ఐస్‌తో నైస్‌గా తయారుచేసిన విగ్రహాలు అలరించాయి. ఐదవ అంతస్తులో నివసించే వారి పాట్లు గోపాలంగారు చల్తే చల్తే అంటూ బాగా వివరించారు. ఐదవ అంతస్తులో ఉంటే త్రిశంకు స్వర్గంలో ఉన్నట్టే మరి!
-జె.జ్ఞానబుద్ధ (సిద్దార్థనగర్)
క్యాష్‌లెస్
ఒక దశాబ్దం క్రితం వరకూ ఫోన్‌లో మాట్లాడడానికి ప్రజలు వెనుకంజ వేసేవారు. ఇప్పుడు గ్రామీణులు, విద్యలేని వారూ ధారాళంగా సెల్‌ఫోన్లు వాడుతున్నారు. అలాగే క్యాష్‌లెస్ విధానమూ క్రమక్రమంగా గ్రామీణులు కూడా అలవరచుకుంటారు. అవసరమే వారికి నేర్పుతుంది.
-సి.మైథిలి (సర్పవరం)
జ్ఞాపకాల తోట
జ్ఞాపకాల తోటలో నవ పారిజాతాలు విరిసాయి. ఎప్పటికీ విరుస్తాయి. గుబాళిస్తాయి. పరవశుల్ని చేస్తాయి. వీటికి సృష్టే కాని లయ లేదు. ఉండదు. ఉంటే సంగీతమనే దానికి అర్థమే ఉండదు. ఈ వారం పారిజాతం - మన సాలూరి రాజేశ్వరరావనే సంగీత సామ్రాట్టు, నట గాయకునిగా ప్రస్థానం పొంది సంగీత స్రష్టగా కీర్తినార్జించిన కీర్తిశేషుడు. వీణ పాట వీరి స్పెషల్. ఇంతటి ఘనమైన పేరు పొందిన పెండ్యాల, ఘంటసాల, వేణు, ఆదినారాయణ రావులు సాలూరి వారి సరసన చేరారనడంలో సందేహం లేదు. రాజేశ్వరరావు గారిలా పాట పాడగలిగేవారు ఎవరూ లేరు. చివరకు నేనయినా, ఘంటసాల వారయినా అని ఎస్.పి. ఓ సభలో చెప్పగా విన్నాను. వాద్యఘోషతో సాగే ఈనాటి సినిమా పాట ఏ రాగమో చెప్పడం కష్టం. అసలివి రాగాలు కావు - రోగాల ధ్వనులు. ఏవీ నోటికంటవు. వీటి బారిన పడక తాను ఇవ్వవలసిన మధురాతి మధురమైన సంగీత భరిత పాటలను మనకందించి ప్రకృతి ఒడిలోకి జారుకున్న స్వరకర్త సాలూరి.
-ఎన్.ఆర్.ఎల్. (హైదరాబాద్)
కవితా పరిమళాలు
‘అక్షరాలోచనలు’ శీర్షికన కవితా పరిమళాలను గుబాళింప జేస్తున్నందుకు ధన్యవాదాలు. ‘అవీ-ఇవీ’ శీర్షిక ద్వారా ప్రపంచవ్యాప్త ప్రత్యేకతలను ఛాయాచిత్రాలతో సహా ఆస్వాదిస్తూ ఆనంద పరవశులం అవుతున్నాం. నెగెటివ్ ప్రపంచాన్ని పాజిటివ్‌గా మార్చే అవకాశ విశేషాలను వార్తలు ద్వారా తెలియజేసి నూతన వొరవడికి మార్గం సుగమం చేసినందుకు కృతజ్ఞతలు. ఈ వారం ‘కవర్‌స్టోరీ’ ద్వారా పుస్తకాల పూదోటలో హాయిగా విహరింపజేసి ఆనందామృత ధారలలో తడిసి ముద్దయ్యే సదవకాశాన్ని కల్పించినందుకు ధన్యవాదాలు.
-అల్లాడి వేణుగోపాల్ (శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు)
ఆశావహ దృక్పథం
మనతో వున్నవారితో ఆనందాన్ని, ప్రేమను పంచుతూ ప్రపంచానికి పాజిటివ్ ప్రకంపనలను పంచాలన్న ‘సండే గీత’ స్ఫూర్తిదాయకంగా ఉంది. ఓ చిన్న మాటలో ‘కథ’ కూడా ఆశావహ దృక్పథం, ప్రేమానురాగాలు, శాంతి సౌఖ్యాల ఆవశ్యకత గురించి చక్కగా వివరించింది. చక్కని తెలివితేటలతో, పక్కా ప్లానింగ్‌తో కరడు గట్టిన ముగ్గురు ఆగంతకులను హీరో హతమార్చి అరవై వేల డాలర్లను చేజిక్కించుకున్న విధానం ‘క్రైం’ కథలో ఆసక్తికరంగా చదివాం. సూపర్ సస్పెన్స్‌తో సాగే ఆంగ్ల కథలకు బిగుసడలనివ్వకుండా మల్లాది వారు అనువాదం చేస్తున్న వైనం శ్లాఘనీయం.
-ఎం.కనకదుర్గ (తెనాలి)