S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

నర్సరీ

కథల పోటీలో ఎంపికైన రచన
.....................
ఎన్నిసార్లు చెప్పాను ఈ కర్ర ముక్కల్తో ఆడొద్దని? అడ్డమైన చెత్త పట్టుకొచ్చి మంచం కింద విసరొద్దని.. సర్దలేక ఛస్తున్నాను.. ఆఫీస్‌లో చచ్చే చాకిరి... ఇంటికొస్తే నీ అల్లరి...’ భరించలేని విసుగు సంగీత గొంతులో..
‘ఇది చెత్తా? క్రికెట్ సెట్.. కొన్నన్నావుగా? అందుకే తయారుచేసుకున్నా... పారేసావంటే చూస్కో మరి..’ వేలుతో బెదిరించాడు.
‘వేలెడు లేవు బెదిరిస్తావా? ఉతికేస్తాను’ అంది కోపంతో సంగీత. వాడు ఒళ్లు విరుచుకుంటూ.. ఆవులిస్తూ-
‘ననే్నం ఉతుకుతావ్? ముందు నాన్న నిన్ను ఉతక్కుండా చూస్కో!’ అన్నాడు నిర్లక్ష్యంగా. అప్పుడే ఆ రోజు కాస్త త్వరగా ఇంటికొచ్చిన భర్త రాంప్రసాద్‌కి గోపి అన్నది చెప్తే విని ఫక్కున నవ్వాడు.
‘కుర్రాడు ఆడుకోక నువ్వూ నేనూ తైతక్కలాడతామా?’ అన్నాడు కొడుకుని వెనకేసుకొస్తూ... అప్పుడు గోపి కాళ్లు బార్లచాపి తెగ ఊపుతూ శనక్కాయలు తింటూ తొక్కలు విసురుతున్నాడు.
‘చూశారా ఆ విసురుడు.. ఇప్పుడే ఊడ్చాను... పనిమనిషి ఐదు రోజులయింది పన్లోకి రాక.. బండెడు చాకిరి.. అయినా వీడ్నిలాగేనా పెంచేది?’ అంది.
‘ఓసోస్! నేనా ఏటి పెంచేది? తెల్లారకంట నీ కంటే ముందోయి, పొద్దోయి నలభై మైళ్ల దూరం నుంచి రేత్రి వస్తన్న. అబ్బో.. మీ టెలిపోనాపీసులో పనేటుంటదో తెల్దా నాకి?’ అన్నాడు.
‘మీకు పుణ్యముంటుంది ఆ భాష మార్చండి..’ అంది చేతులు జోడించి.
‘అద్గదీ అలా రా దారికి’ అన్నాడు కొడుకు వేపు గొప్పగా చూస్తూ. వాడు కిసుక్కున నవ్వాడు.
‘నేనాడుకోడానికి పోతున్నా నాన్నా... స్కూల్ నించి వచ్చి అమ్మొచ్చేదాక ఇంటికి కాపలా ఉన్నా!’ అనేసి బాట్ తీసుకుని పారిపోయాడు గోపి.
సంగీతకి ఆపుకోలేని కోపం వస్తోంది మొగుడిని చూస్తే. ఒక్క మందలింపు లేకుండా కొడుకుని చెడగొడ్తున్నాడు... పెద్దాడు ప్రశాంత్ లోకంతో సంబంధం లేకుండా పుస్తకంతో కుస్తీ పడుతున్నాడు. చిన్నాడి కోసమే తన బెంగంతా. గోపి ఇలా వెళ్లాడో లేదో భర్త వదిలేశాక తండ్రి ఇచ్చిన సింగిల్ బెడ్‌రూమ్ ఫ్లాట్‌లో ఉంటున్న మంజులత గయ్‌మంటూ వచ్చింది. ఆవిడ నోటికి ఝడిసి ఒక్కరూ ఆవిడ జోలికి వెళ్లరు.
‘ఏడీ ఆ చెత్త గాడిద..’ అని ఇంట్లోకి జొరబడి అరిచింది.
‘ఏం చేసాడు?’ బిక్కచచ్చిపోతూ అడిగింది సంగీత.
‘ఏం చేసేడా? మా పిల్లని బతకనివ్వడం లేదు... ఇప్పుడే బాల్కనీ గోడ మీద బుక్ పెట్టుకుని చదువుకుంటుంటే... పుస్తకం తోసేసి పారిపోయాడు. నిన్నటికి నిన్న పిల్లది నూడిల్స్ తింటుంటే ‘యాక్’ బురద పాములంటూ’ డోక్కుంటే పిల్ల దానికి నిజంగా వాంతులట్టుకున్నాయ్. మొన్నటికి మొన్న స్కూల్లో చంటిదాని జడకి చాంతాడంత పురికొసతో పీట ముడివేసి ఆ తాడుని పక్క క్లాస్‌రూమ్ కిటికీకి కట్టాడట. పిల్ల గొంతుక్కోసిన మేకలా అరిచిందట.. మా రమ పేరు మీ వెధవకి ‘రమ్’లా అనిపిస్తోందట. చెండా లూడగొట్టీగల్ను రాలుగాయికి’ అంది పొగలు కక్కే వేడివేడి ఊపిరిలొదుల్తూ. ఆవిడ బాగోతం మొదలెట్టిందంటే.. వదలదు.. జనాలు రావాల్సిందే గుంపులుగా.. డ్రామా సాగవల్సిందే! ఆవిడిలా వెళ్లగానే..
‘అయిపోయాడు’ అన్నాడు మూగిన జనంలో ఒకతను.
‘వాడు దొరికినప్పుడు కదా?’ అన్నాడు తెగ సంబరంగా రాంప్రసాద్. ఖంగు తిందామాటకి సంగీత. పిల్లాడినలా వెనకేసుకు వస్తున్న మొగుణ్ణి చూసి. వెళ్తూ వెళ్తూ అరుస్తూనే ఉంది మంజులత. నెల రోజులుగా ఇదే వరస. గోపిగాడి అల్లరివల్ల మొత్తం అపార్ట్‌మెంట్ అంతా గోలగోల... ఆవేశం చల్లారాక మళ్లీ వచ్చి వార్నింగ్ ఇచ్చింది మంజులత. తల పట్టుకుంది సంగీత.
* * *
నర్సరీ. పూల మొక్కల సోయగాలు తనివితీరా చూశాక కొత్తగా కొన్న ఫ్లాట్‌కి ఇల్లాలు మనోరమ కోరిక మేర గులాబీ మొక్కలు కొని కాలనీలో పిల్లల ప్లేగ్రౌండ్ పక్కనుంచి మలుపు తిరిగితే ఇల్లు చేరుతాననగా ఓ ఎనిమిదేళ్ల కుర్రాడు పరిగెత్తుకుంటూ వచ్చి ‘్ఢ’ కొట్టబోయి ‘నీ...’ అంటూ దీర్ఘం తీసి, ‘ఔటయిపోయాను కదురా ముసిలోడా!’ అని అరిచి పారిపోయాడు. సాక్షాత్తు వాడే గోపి. చదివేది నాలుగో తరగతి. కృష్ణమూర్తి భార్య మనోరమ గోపి అన్నయ్య ప్రశాంత్‌కి క్లాస్ టీచర్. కృష్ణమూర్తి రాగానే అపార్ట్‌మెంట్ ప్రెసిడెంట్ సబ్జెక్ట్‌లో వీక్‌గా ఉన్న పిల్లలకి ట్యూషనన్లు చెప్పమని అడిగాడని తను ఒప్పుకోకుండా సండే మాత్రం పిల్లలకి ఏ డౌట్స్ ఉన్నా క్లియర్ చేస్తానని అన్నానని చెప్పింది.
‘మంచి పని చేసావ్! ట్యూషన్లు మొదలెడితే ఫీజులు, వాటి బేరీజులు, వాటికి తగ్గ మార్కులు రాలేదనే నిలదీయడాలు.. ఇదంతా తలనొప్పి’ అన్నాడు కృష్ణమూర్తి.
ఎదురు ఫ్లాట్‌లో కొచ్చిన రామ్‌ప్రసాద్, సంగీతల ఉద్యోగాల ఒత్తిడిలో పిల్లల్ని పట్టించుకోలేక పోతున్నామని ఒకసారి ఇంటికొస్తామని అన్నారని మనోరమ చెప్తుండగానే వచ్చారు. ట్యూషన్ చెప్పడం వీలుకాదని మృదువుగా చెప్పిన మనోరమని చిన్నవాడు గోపిని మాత్రమే ఒక కంట కనిపెట్టి ఉండమని బతిమాలింది సంగీత. సంగీత మొహంలో దిగులు చూసి.
‘వస్తూ ఉండమనండి... చూద్దాం!’ అంది మనోరమ.
అలా వచ్చిన గోపీ కృష్ణమూర్తికి మాలిమి అయి ‘తాతా’ అనే పిలుపు దాకా వచ్చాడు. వాడు కబుర్లపోగు. ఎలా చదువు ఎగ్గొట్టాలా అని చూస్తాడు. ఒకసారి డౌట్స్ ఉన్నాయని ఇంట్లో చెప్పి ఇప్పుడే వస్తానంటూ బాగ్‌ని చదువు పేరుతో మనోరమ ఇంట్లో పడేసి బాగా పొద్దుపోయి చీకటి పడేవరకు ఆడుకుని ఒళ్లంతా మురికితో.. మసితో వచ్చి బాగ్ ఇమ్మని అడిగితే పేరెంట్స్‌ని తీసుకొచ్చి క్షమాపణ అడిగేవరకు ఇవ్వలేదు మనోరమ.
* * *
కృష్ణమూర్తి ఇంట్లో పెద్ద బాల్కనీలోని పూలతోటలో చిన్న మొక్కకి గులాబి పూసింది. ఆ పూవు చిరుగాలికి సన్నగా తల ఊపుతోంది. తొలి కిరణమొకటే ఆ మొక్క కాండం మీద కేంద్రీకృతం అవడంవల్ల ఆ కాండం అంతా దేదీప్యమానంగా వెలుగుతోంది. మనోరమ, మూర్తిలు అక్కడే కాఫీ తాగుతుంటే గొప్ప హుషారుగా ‘తాతా’ అంటూ వచ్చేశాడు గోపి. ఉదయ కిరణాలు వాడి మీద పడి వాడి ఒళ్లంతా కూడా మిలమిలలాడిపోతోంది.
‘తెల్లారిందా?’ అంది మనోరమ ‘అల్లరి మొదలా?’ అన్న అర్థంతో...
‘ఆహా! నిన్న పిల్లి పిల్లల్ని పెట్టింది. రెండు తెచ్చి మంచం కింద పెట్టాను. ఇల్లు తుడవడానికి వెళ్తే మంచం కింద ‘పెద్ద పిల్లి’ గుర్రుమందిట. అమ్మకి భయం వేసి నా మీద సుప్రభాతం పాడుతోంది’ నవ్వాడు గట్టిగా.
వాడి నవ్వు చూస్తూ ‘బ్రష్ చేసుకోకుండా వచ్చావు కదూ?’ అందో, లేదో ఒక్కటే పరుగు. తుర్రుమని కిటికీలోంచి ఇంట్లోకొచ్చి ఇంకో కిటికీలోంచి పారిపోయే పిచుకల ఆటలా క్షణంలో వచ్చి మనోరమ కొంగుకి మొహానికి ఉన్న తడిని పరపరా తుడిచిపారేశాడు. ‘గులాబి తెంపుతా’ అంటూ సిద్ధమయి, వారించేలోగా కొయ్యడంరాక కొమ్మ వంచి పట్టి పీకడంతో ముల్లు గుచ్చుకుంది. ‘అబ్బా’ అంటూ చేతిని వెనక్కి లాక్కుని చూసుకున్నాడు. జివ్వుమని రక్తం పొంగింది. మనోరమ అస్సలు రియాక్ట్ అవకుండా ఒక నాప్‌కిన్ అందింది. మూర్తి హాల్లోకి తీసుకెళ్లి వాడి వేలికేదో పూసి టీవీ పెట్టాడు. ఈలోగా సంగీత నాలుగుసార్లు ‘గోపీ’ అని పిలవడం, వీడు నిమ్మకు నీరెత్తినట్టు కూర్చోవడం చూసి.
‘మీ అమ్మ పిలుస్తోంది!’ అంది మనోరమ. తనని కాదన్నట్టు ఓసారి ఆవిడ వేపు చూసి తల తిప్పేశాడు.
‘నినే్న’ అంది వెళ్లమన్నట్టు.
‘వినపడింది’ అన్నాడు వాడు అస్సలు కదలకుండా.
‘మరి కదలవేం?’ అడిగింది గట్టిగా.
‘ఏం? ప్రశాంత్‌గాడాని పిలవొచ్చుగా? నాకే అన్ని పనులు చెప్తుంది’ అన్నాడు. మనోరమ ఠక్కున టీవీ ఆపేసి, తనకంటే పెద్దవాళ్లని గౌరవించాలని, పేరెంట్స్ పిలిస్తే వెంటనే వెళ్లాలని చెప్పింది.
గోపి లేచి కాల్తో తలుపుని ఒక్క తన్ను తన్ని వెళ్లిపోయిన వాడు మళ్లీ రాలేదు.
మూడు రోజుల తర్వాత తమ ఇంటికి వచ్చిన గోపి అన్న ప్రశాంత్ తెలివితేటలకి మురిసిపోయిన కృష్ణమూర్తి మొక్కలకి గెత్తంవేస్తూ ఆ అబ్బాయికి మొక్కలలో ఔషధ గుణాల గురించి చెప్తుంటే గోపి కూడా వచ్చి వినడం చూశాడు. తులసి మొక్క ఆకులని బాగా నలిపి వాసన చూస్తే శ్వాస సంబంధమైన సమస్యలు తగ్గుతాయని.. రసాన్ని తాగితే రక్తశుద్ధి జరుగుతుందని.. ఆ చెట్టు ఇంట్లో ఉంటే స్వచ్ఛమైన ప్రాణ వాయువు అందుతుందని చెప్తుంటే గోపి కూడా ఎంతో బాగా విన్నాడో వర్ణించి చెప్తున్నాడు కృష్ణమూర్తి. ఆ మాటలు వినీ వినగానే ఠక్కున బాల్కనీలోకి వెళ్లి వచ్చిన మనోరమ ‘అనుకున్నా’ అంది. ఏమయిందని అడిగాడు మూర్తి.
‘తులసి మొక్కల కుండీలు పట్టుకుపోయాడు మీ గోపీ చూసుకోండి’ అంది నవ్వుతూ.
మూర్తికి కోపం ముంచుకొచ్చి సంగీత రాగానే చెప్తే మంచం కింద ఎప్పుడూ దాచే గోపి సామాన్ల దగ్గర్నుంచి తెచ్చి ఇచ్చింది తల కొట్టుకుంటూ. ఆ రాత్రి పది దాటాక బెల్లు కొట్టి వచ్చిన గోపి ‘తను ఆడుకోడానికి వెళ్లినప్పుడు మొక్కలు తీసుకెళ్లిపోవడాన్ని ఒప్పుకోనంటు’ వాదనకి దిగాడు. మనోరమ వాడి వితండ వాదనకి ఒక్క చూపు చూడగానే గోడ వైపు తల తిప్పి నించున్నాడు.
‘రాత్రి పదింటికి ఎక్కడట వీడు ఆడుకున్నది?’ అంది మూర్తితో.
‘వెనె్నల్లో... కాలనీ పిల్లలతో’ అన్నాడు వాడు పెంకిగా.
మూర్తి వైపు తిరిగి మనోరమ ‘వాడి’గా ఇలా అంది.
‘క్రమశిక్షణ లేని వాడితో మాట్లేంటి మీకు?’ అని.
గోపి నెమ్మదిగా చిన్న అడుగులేస్తూ ఇంటి వైపు తిరిగాడు. వాడు వెళ్ళాక -
‘ఏ లెక్కయినా క్షణాల్లో చెప్తున్నాడు తెలుసా?’ అన్నాడు అబ్బురపడుతూ.
‘అవును. వీడి లెక్కల టీచరు సరస్వతే.. క్షణాల్లో ఆన్సర్లు చెప్తాట్ట. రాయడం బద్దకం. దానివల్లే అన్నీ అత్తెసరు మార్కులు. ఆటలో - పరుగుపెట్టాడంటే వీడిదే గెలుపు. సైన్సు అంటే ప్రాణంట. మొన్నోసారి తెలుగు టీచర్ ‘అతిశయోక్తి’ అనే పదం మీద ఉదాహరణ చెప్పమంటే.. తెగ నవ్వుతూ ‘మీరు ఆకాశంలో చుక్కలు లెక్కెట్టేసానంటే మేం నమ్మడం లాంటిది’.. అన్నాట్ట. ఆవిడ ‘ఎంత పొగరు వెధవన్నర వెధవకి’ అంది. కాని నేను వాడి తెలివినే చూస్తున్నాను’ అంది మనోరమ.
* * *
ఒకసారి మనోరమకి లక్కీగా దొరికిందని చందనం మొక్క ఇచ్చి.. కొన్నాళ్లు పోయాక అపార్ట్‌మెంట్ ఖాళీ జాగాలో పాతమన్నాడు నర్సరీ అప్పన్న. చందనం చెట్టున్న పరిసరాల్లో ఆ వృక్ష సుగంధం మిగిలిన వృక్షాలకు సోకినట్టు సత్సాంగత్యంతో చక్కని స్నేహం పిల్లల్లో పరిమళిస్తుందని ఆమె సెలవుల తరువాత తన పాఠం చెప్తున్నప్పుడు చెప్పదలుచుకుంది. మంచి బుద్ధి అలవడడానికి సహవాసమే ప్రధాన కారణం గనుక! ‘నర్సరీ, చిన్ని స్కూలు, ఈ రంగురంగుల పూలు, పూవు లాంటి నవ్వుల బాలబాలికలు.. వాళ్ల అమాయకత్వం. ఎంత మైమరపు!? దూరంగా గ్రౌండ్‌లో ‘నాటవుట్! నాటౌట్’ అని గోపి అరుస్తున్నాడు. పిల్లలకి శారీరక శ్రమ లేకపోతే ఒళ్లు పెరిగి జబ్బులు రావడం ఖాయం. కాని ఈ క్రికెట్ పిచ్చి అంటగట్టడం మాత్రం దారుణం’ లోలోపలి ఆలోచనల్ని అనుకోకుండా బయటికి అనేసింది మనోరమ.
‘అవునవును’ అన్నాడు నవ్వుతూ ఆమెని చూసి కృష్ణమూర్తి. మనోరమ చురుగ్గా చూసింది. మూర్తికి కూడా క్రికెట్ పిచ్చి మరి.
‘అసలు మనకి ఇల్లు అక్కర్లేదు.. నీకు నర్సరీ, స్కూలు.. నాకేమో క్రికెట్ గ్రౌండు ఉంటే చాలు!’ అన్నాడు. కన్నీళ్లతో నవ్వింది మనోరమ.
‘మొదట్లో నాకు పిల్లలు పుట్టనందుకు గిలగిలలాడాను.. స్కూలు ఉద్యోగమే నాకు ఓదార్పు నిచ్చింది.. మీరే చెప్పండి. ప్రతి తల్లి తన పిల్లల్ని మాత్రమే అపురూపంగా చూస్తూ... వాళ్ల పెంపకంలో ఆనందం మాత్రమే అనుభవిస్తుంది.. అదే నాలాటి టీచర్లకి విద్యార్థులందరూ పిల్లలే... వాళ్ల చిలిపి అల్లర్లని ఆస్వాదిస్తూ... అమాయకత్వానికి మురిసిపోతూ... భావి భారత స్ఫూర్తి ప్రదాతలుగా తీర్చిదిద్దడంలో ఈ చిన్ని మొక్కలు మొత్తం లోకానికి ఉపయోగపడేలా తీర్చిదిద్దడంలో నా చెరుూ్య ఉందంటే... ఆ తృప్తి ఎంత గొప్పది?’ అంది. ఆమె చెప్పుకుపోతోంది.
‘నిజానికి గోపి తెలివైనవాడు. ఒక్కసారి చెప్తే చాలు ఇట్టే పట్టేస్తాడు. బట్టీ పద్ధతే లేదు వాడి దగ్గర... ఒకసారి తెలుగు క్లాస్‌లో ‘గురుకులం’ పాఠం పూర్తయ్యాక డౌట్స్ అడగమంది టీచర్.
‘పూర్వం గురుకులాలు ఉండేవిట కదా? ఎంచక్కా మాస్టార్లు కళ్లు మూసుకుని పడుకుని పాఠం చెప్తున్నంత సేపు కాళ్లు పిసకమనేవారట కదా పిల్లల్ని? అదే నేనయితే పీక పిసికేవాడిని’ అన్నాడట. మా స్ట్ఫా రూమంతా నవ్వులతో నిండిపోయిందని మనోరమ చెప్తుంటే మూర్తి ఒకటే నవ్వు.
‘వీడిని సరైన దారిలో పెడితే చక్కని జ్ఞానం అబ్బుతుంది. కాని ఒక్కోసారి మితిమీరిన అల్లరి చేయడం. ఒకటే వాగుడు. ఏం మాట్లాడుతున్నాడో వాడికే తెలియకపోవడం. దీనికంతా కారణం మొట్టమొదటిది పెద్దల పట్ల గౌరవం, భయం ఉండాలని తెలియకపోవడం, ఇంట్లో ఒక క్రమపద్ధతి లేకపోవడం... అసలు ముఖ్యమైనది ఇంటికి రథచక్రాలైన తల్లిదండ్రుల మధ్య అవగాహన, సఖ్యత, ఉండాల్సిన ప్రేమా, పాటించాల్సిన నియమ నిబంధనలు కొరవడడం.. భార్యా భర్తల్లో నేను గొప్ప అంటే నేననే అహం.. ఇలా తీగ లాగిన కొద్దీ కదిలే డొంకలు.. అస్తవ్యస్త కాపురాలు.. ఆ ప్రభావం చిట్టి పొట్టి ఈ ‘నర్సరీ’ మొక్కల మీదా పడేది? కాసిన్ని నీళ్లు పోస్తే... మొదట్లోనే పురుగు పట్టకుండా గోరంత వేపనీరు పిచికారి చేస్తే ఏపుగా నిటారుగా ధీటుగా ఎదిగే పసివాళ్లని ఈ ఆధునీకరణే మింగేస్తోంది..’ మనోరమ చాలా బాధపడుతూ అంది.
హిమాలయాల అంత ఎత్తు వైశాల్యం పెరిగిన మనోరమ వైపు తృప్తిగా హాయిగా చూశాడు మూర్తి.
* * *
హాఫ్ ఇయర్లీ పరీక్షలు జరిగి సెలవులు పూర్తయిపోయాయి. మర్నాడే రీ-ఓపెనింగ్. మధ్యాహ్నం కావచ్చింది. సోఫాలో కృష్ణమూర్తిని ఆనుకుని కూర్చుని టీవీలో కార్టూన్ నెట్‌వర్క్ చూస్తున్నాడు గోపి. భోజనాల టైం అయిందని రామ్‌ప్రసాద్ రెండుసార్లు వచ్చి రమ్మని పిలిచాడు గోపిని.
‘వస్తానే్ల!’ అన్నాడు వాడు.
‘రారా గోపీ.. ఆకలేస్తోంది!’ అన్నాడూ తనూ పిల్లవాడి పక్కన సోఫాలో కూర్చుని ఓపికగా.
‘వస్తానని చెప్పాను కదు ‘బే’!’ అన్నాడు గోపి. మనోరమ విస్తుపోయింది.
‘రమ్మన్నానా?’ అన్నాడు ఈసారి గొంతు పెంచి రామ్‌ప్రసాద్ మందలింపుగా.
‘నీయబ్బ! వస్తానని చెప్పాను కదు బే! పో ఇక్కడ్నించి’ అన్నాడు వాడు.

మనోరమ ఠక్కున లేచి చెంప ఛెళ్లుమనిపించింది. గోపి చెంప పట్టుకుని ఒక్క పరుగులో వాళ్లింటికి పరుగు తీశాడు. రామ్‌ప్రసాద్ కోపంగా మనోరమ వైపు చూస్తూ ఏదో అనబోయాడు. ఒక్క మాట కూడా మాట్లాడనివ్వకుండా ఒక్క చూపుతో ఆపింది మనోరమ.
‘అది మీ భాషే మహాశయా! మిమ్మల్ని చూసి నేర్చుకున్నదే! ఈ రోజు ఇది మాట్లాడాడు. రేపు దీని తాత లాంటిది మాట్లాడతాడు. ఇంకాస్త పెద్దయ్యాక ఇప్పుడుండే భయభక్తులు, గౌరవం పోయి నువ్వెంత? అన్నా అంటాడు. ఇప్పుడు కేవలం అనుకరిస్తున్నాడు. కాస్త ముదిరాక అనుసరిస్తాడు. మనని బట్టే మన పిల్లలు. ఇంక బయల్దేరండి!’ అంది వీధి గుమ్మం చూపెడుతూ.
తెల్లవారింది. మనోరమ తమ బాల్కనీ నర్సరీలో ఒక మొక్క వొంగిపోతుంటే ఒక చిన్న కర్రముక్కని మట్టిలోకి జొప్పించి పాతి సన్నని తెల్లదారంతో ఆ మొక్కని కర్రకి చేర్చి రెండు మూడుచోట్ల సున్నితంగా ముడులు వేసింది. కాస్త బలం పుంజుకున్నాక నిటారుగా నిలబడగలదని తెలిసాక సులువుగా ముడులను విప్పేట్లు. స్కూలు కెళ్లడానికి రెడీ అయి తలుపు తీయగానే ఎదురుగా నీట్‌గా తయారైన గోపి, తలవంచుకుని రామ్‌ప్రసాద్ ఉన్నారు.
ఒక్క క్షణం తటపటాయించిన మనోరమ గోపికి తన చేయి అందించింది. వాడా చేతిని గట్టిగా పట్టుకున్నాడు.

బులుసు సరోజినీదేవి,
ఎఫ్-1, బాబి ఎన్‌క్లేవ్, జగన్నాథరాజు నగర్, రోడ్ నెం.3, వెంకోజిపాలెం, విశాఖపట్టణం - 530 022. ఫోన్ : 9866190548

- బులుసు సరోజినీదేవి