ఇక వెరైటీ పాత్రలే!
Published Sunday, 8 January 2017తెలుగు, తమిళ భాషల్లో నటిస్తూ తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్ను సొంతం చేసుకున్న భామ నయనతార. నవతరం హీరోలనుంచి అగ్ర నటులతో ఆడిపాడిన ఈ సుందరాంగి ఇకపై మూస పాత్రల జోలికి వెళ్లకుండా వెరైటీ పాత్రలవైపే మనసు మళ్లించింది. గ్లామర్‌తో పాటు వైవిధ్యమైన పాత్రలు పోషించి నటిగా ఓ ఇమేజ్ను ఏర్పరచుకున్న నయనతార కథానాయికకు ప్రాధాన్యమున్న పాత్రల్లో నటించడానికే ఎక్కువ ఆసక్తి కనబరుస్తోంది. ఇటీవల ఇలాంటి కొన్ని చిత్రాల్లో నటించడానికి అంగీకారం కూడా తెలిపిందట. ఈ విషయం గురించి నయనను కదిలిస్తే- ‘‘టాలీవుడ్, కోలీవుడ్ అంటూ తేడా లేకుండా రెండు చోట్లా ఎన్నో రకాల పాత్రలను పోషించాను. చాలా చిత్రాల్లో నాకు నచ్చినవే చేశాను. ఒక దశలో క్యారెక్టర్ నచ్చక పెద్ద ప్రాజెక్టులను సైతం వదులుకున్నా. ఒక నటికి గుర్తింపు రావాలంటే కథానాయిక ప్రాధాన్యమున్న చిత్రాలయితేనే కెరీర్ సాఫీగా సాగుతుందనేది నా గట్టి నమ్మకం. ఇక నుంచి నేను చేయబోయే పాత్రలన్నీ వెరైటీగానే వుంటాయి. ఒకదానికొకటి అస్సలు సంబంధం ఉండదు. మీరే చూస్తారుగా’’ అంటూ చెప్పుకొచ్చింది. అదీ..సంగతీ!!