S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఒక్క తూటా చాలు..14

విశాఖపట్టణంలోని హిజ్రాలంతా అతన్నొక దైవంలా చూస్తారు. ఎలాంటి అవసరం వచ్చినా తమని ఆదుకునే మనిషి ఉన్నాడన్న భావం వారిలో ఉంది. గంగోత్రిని పెంచి పెద్ద చేసిన హిజ్రా చనిపోయినప్పుడు అక్కడ వారంపాటు కార్యక్రమాలు నిర్వహించాడు. చిన్న, పెద్ద తగవులు తీర్చేది అతనే. కష్టం వస్తే ఆదుకునేది కూడా అతనే! ఎవరికైనా జబ్బు చేస్తే కేర్ హాస్పిటల్‌లో వైద్యం చేయించగలడు. ఎవరైనా తనని కేర్ చెయ్యకపోతే ఓ బుల్లెట్‌తో అంతమొందించగలడు.
తుప్పల మధ్యలోని కాలిబాటలో నడిచి అంతా లోపలికి వెళ్లారు. అక్కడ విశాలమైన స్థలంలో ఓ యాభై గుడారాలున్నాయి. రంగురంగుల కాగితాల తోరణాలు వేలాడుతున్నాయి. నేలంతా శుభ్రం చేసి ఉంది. ఓ రకమైన ఉత్సాహం అందరిలోనూ కనిపిస్తోంది. అంతా స్నానాలు చేసి మంచి బట్టలు కట్టుకున్నారు. బాజా, భజంత్రీల శబ్దం అక్కడ నృత్యం చేస్తోంది. ఇతర చోట్ల నివసించే హిజ్రాలు జుట్టుకి రంగురంగుల రిబ్బన్లు కట్టుకుని వయ్యారంగా వస్తున్నారు. నాసిరకం సెంటు వాసన గుప్పుమంటోంది.
కాస్త ఎడంగా రెండు మేకపోతులు తాడుతో కట్టేసి ఉన్నాయి. ఆ సందర్భం కోసం సంవత్సరం నుండి మేపడం వల్ల బలిసి ఉన్నాయవి. వాటి శరీరం మీదున్న జుట్టు సూర్యకాంతితో మెరుస్తోంది. పసుపు, కుంకుమ ఆ రెండింటి ముఖాలకు పులిమారు.
ఆ ప్రదేశానికి కుడిపక్క వంట కోసం గాడిపొయ్యిలు సిద్ధం చేశారు. బిర్యానీ కోసం తెచ్చిన మసాలా వాసన గుప్పుమంటోంది. ఇద్దరు ఆడవాళ్లు, ఇద్దరు మగవాళ్లు కూరగాయలు తరుగుతున్నారు.
తన కోసం ప్రత్యేకంగా తెప్పించిన మహరాజా కుర్చీలో కూర్చున్నాడు గంగోత్రి. అతని ముందు చెక్క టేబుల్ ఒకటి ఉంది. దాని మీద రమ్ము బాటిల్‌తోపాటు జీడిపప్పు, బాదంపప్పు ప్లేట్లున్నాయి. ఒక హిజ్రా గ్లాసులో రమ్ము పోసి నీళ్లు కలిపింది. గంగోత్రి ముఖంలో తన సొంత ఇంటికి వచ్చిన భావం కదులుతోంది.
‘దొరా! బిజిలీ చెప్పిన మాట వినడంలేదు’ ఓ హిజ్రా చెప్పింది.
‘ఏమయింది దానికి?’ అడిగేడు గంగోత్రి.
‘రోజూ సాయంకాలం పాసింజర్‌కి కాకినాడ వెళ్లి పొద్దున్న అదే పాసింజర్‌కి తిరిగి రావాలి. కాని పది రోజుల నుంచి తన బ్యాచ్‌తో కాకినాడ వెళ్లకుండా పూర్ణా మార్కెట్‌కి వెళుతోంది. ఎవరి మాటా ఖాతరు చెయ్యడం లేదు’ వివరించింది ఆ హిజ్రా.
గంగోత్రి భృకుటి ముడిపడింది.
‘దాన్నిలా రమ్మను’
క్షణాల్లో బిజిలీ అతని ముందు నిలబడింది.
‘కట్టుబాటు కాదని పూర్ణామార్కెట్‌కి వెళుతున్నావట. ఏమిటి సంగతి?’ అడిగేడు గంగోత్రి.
వౌనంగా ఉండిపోయింది బిజిలీ.
‘దొర అడుగుతుంటే సమాధానం చెప్పవేం?’ అరిచిందో హిజ్రా.
‘నాకు మనువు చేసుకోవాలని ఉంది’ గొంతు విప్పింది బిజిలీ.
‘ఎవర్ని?’ ఆశ్చర్యంగా అడిగేడు గంగోత్రి.
‘పూర్ణా మార్కెట్‌లో ఓ కూరగాయల కొట్లో పనిచేసే కుర్రాడొకడు నేనంటే ఇష్టపడుతున్నాడు’ చెప్పింది.
గంగోత్రి వౌనంగా ఉండిపోయాడు. కామాన్ని చల్లార్చుకోవడానికి ఎన్నో మార్గాలున్నాయి. కానీ పిల్లలు కలగాలంటే మాత్రం ఒక్కటే మార్గం. అవయవాలు సరిగ్గా లేని హిజ్రాలకి సంతానం ఉండదు. అతని బుర్రలో కదిలాయి ఆలోచనలు.
‘అతనొచ్చి మనలో కలుస్తాడా? లేక నువ్వెళ్లి అతనితో ఉంటావా?’ అడిగేడు.
‘మేము వేరు కాపురం పెడతాం’
గంగోత్రి పెదవుల మీద చిరునవ్వు కదిలింది. తాత్కాలిక అవసరాల మీద జీవితం ఆధారపడి ఉండదు. శాశ్వత ప్రయోజనాలు విస్మరిస్తే ఎక్కువకాలం మనుగడ సాగదు.
‘మాకెవరికీ చెప్పకుండా నిర్ణయం తీసుకున్నావా?’ ప్రశ్నించేడు గంగోత్రి.
‘జతగాడితో కలిసి జీవించాలనుకోవడం తప్పా?’ బిజిలీ ఎదురుప్రశ్నించింది.
వయసు మళ్లిన హిజ్రా బిజిలీని కొట్టడానికి ముందుకెళ్లింది. గంగోత్రి వారించాడామెని.
‘ఆ కుర్రాడ్ని తీసుకురా...’ చెప్పాడు బిజిలీతో.
ఆమె సందేహంగా చూసింది.
‘్భయం లేదు.. తీసుకురా’
వెనక్కి తిరిగి కుడి చేతి రెండు వేళ్లు నాలిక్కి ఆనించి ఈల వేసింది బిజిలీ. క్షణాల్లో తుప్పల వెనుక నుంచి వచ్చాడో పాతికేళ్ల యువకుడు. సన్నగా, పొడవుగా చూడటానికి బాగున్నాడతను. హిజ్రాలతోపాటు కూరగాయలు తరిగేవాళ్లు కూడా కళ్లప్పగించి చూడటంతో నిశ్శబ్దం పేరుకుందక్కడ.
‘అబ్బీ... బిజిలీని పెళ్లి చేసుకుంటావా?’ అడిగేడు గంగోత్రి.
‘చేసుకుంటాను..’ జవాబిచ్చాడు కుర్రాడు.
‘నీ తల్లిదండ్రులు ఒప్పుకుంటారా?’
‘నాకెవరూ లేరు’
గంగోత్రి కొన్ని క్షణాలు మాట్లాడలేదు. ముప్పై ఏళ్ల బిజిలీ చాలా అందంగా ఉంటుంది. జాగ్రత్తగా చూస్తే నడుము ఒక్కటే తేడాగా కనిపిస్తుంది. హిజ్రాల్లో పెళ్లి చేసుకుంటానని ముందుకొచ్చిన మొదటి మనిషి బిజిలీ. ఆ పెళ్లి కాదనడానికి కారణం లేనట్టే అవుననడానికి కూడా కారణం లేదు. వాళ్ల సంసారం ఎలా సాగుతుంది. చివరికి వారి జీవితాలు ఏమవుతాయి అనే ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి.
‘పెళ్లికి ఏర్పాట్లు చెయ్యండి’ చెప్పాడు గంగోత్రి.
అప్పటికప్పుడు వెళ్లి ఓ పంతుల్ని లాక్కొచ్చారు. గోత్రం, సూత్రం లేకుండా దండల మార్పిడితో పెళ్లయింది. ఆ ప్రదేశానికి ఓ మూల ఎలాంటి ఆకారం లేని దేవతకి జంతువుల్ని బలిచ్చారు. అంతా కలిసి వాటి చర్మాలు వొలిచి శుభ్రం చేసి మాంసం ముక్కలుగా తరిగారు. వంటలు ప్రారంభమైనాయి.
వాయిద్యాల హోరులో బూతు పాటలతో నృత్యాలు మొదలయ్యాయి. గంగోత్రి ముందున్న రమ్ము బాటిల్ ఖాళీ అవుతోంది. అతనొక్కడే కదలకుండా కూర్చొని ఆ తంతు చూస్తున్నాడు. విశాఖపట్నంలోని కొన్ని లక్షల మంది ప్రజల్లో ఎవరూ పట్టించుకోని చిన్న గుంపు అది. కుల, మత, వర్గాలతో పనిలేని జీవులు వాళ్లు.
గంగోత్రి ఆలోచనలు చెదరగొడుతూ సెల్ మోగింది.
‘చెప్పు...’ అన్నాడతను.
‘వివేక్‌గాడు కస్టమర్లతో తనే డైరెక్టుగా సంబంధం పెట్టుకుంటున్నాడు’
‘ఏం చేద్దాం?’ అడిగేడు గంగోత్రి.
‘వదిలేద్దామా? వదిలించుకుందామా?’
‘రెండోదే బెటర్..’ చెప్పాడు.
‘చూడు పిన్నమ్మా...’ అంటూ గెంతుతున్న హిజ్రా మీదకి దృష్టి సారించేడు గంగోత్రి. ఆ పాట తన పదేళ్ల వయసులో మొదటిసారి విన్నట్టు గుర్తొచ్చింది.
* * *
స్మార్ట్‌గా సెల్యూట్ చేశాడు యుగంధర్.
‘ప్లీజ్.. టేక్ యువర్ సీట్’ చెప్పాడు కలెక్టర్.
ఉదయం పదకొండు గంటలయింది సమయం. కలెక్టర్ ఛాంబర్ విశాలంగా, ప్రశాంతంగా ఉంది. కేప్ తీసి ఓ కుర్చీలో కూర్చున్నాడు యుగంధర్.
‘యుగంధర్ అంటే ఏభై ఏళ్లు ఉంటాయనుకున్నాను’ నవ్వేడు కలెక్టర్.
‘మా నాన్నగారు వయసులో ఉన్నప్పుడు డిటెక్టివ్ నవలలు ఎక్కువగా చదివేవారట. అందుకే నాకాపేరు పెట్టారు. దానికి తగ్గట్టుగా నేను డిపార్ట్‌మెంట్‌కి వచ్చాను సార్!’ చెప్పాడు యుగంధర్.
తన ముందున్న ఫైల్స్ నుంచి ఓ ఫైల్ యుగంధర్ ముందుకి నెట్టి చెప్పాడు కలెక్టర్,
‘రాజరాజేశ్వరి మరణం గురించి పేపర్‌లో ప్రకటించాం. వారసులు ఎవరైనా ఉంటే కాంటాక్ట్ చెయ్యమని కోరాం. ఇంతవరకూ ఎవరూ రాలేదు’
యుగంధర్ ఫైలు తెరిచాడు. అందులో రాజరాజేశ్వరి మరణం గురించి పత్రికలకి ఇచ్చిన ప్రకటన కటింగ్స్‌తోపాటు తను పంపిన రిపోర్టు కాపీ ఉండటం గమనించాడు. ఓ ప్రకటన పూర్తిగా చదివేక కలెక్టర్ వైపు చూశాడు.
‘ఈ కేసు మీరు దర్యాప్తు చేశారు. రాజరాజేశ్వరికి వారసులు ఉండే అవకాశం లేదా?’
‘నాకు తెలిసినంతవరకూ రాజరాజేశ్వరి మన రాష్ట్రానికి చెందిన మనిషి కాదు. ఎందుకంటే ఆమె భర్త బలరామ్ సాహు ఒరిస్సా వాడు. ఏదో కారణంతో వాళ్లు విశాఖపట్నం వచ్చి స్థిరపడ్డారు. బలరామ్ సాహు ఏమయ్యాడో ఎవరికీ తెలియదు. రాజరాజేశ్వరి మాత్రం చాలా సంవత్సరాల నుంచి ఒంటరిగా జీవిస్తోంది. చుట్టుపక్కల వాళ్లు చెప్పిన దానిని బట్టి ఆమె ఎప్పుడూ బయటకు రాలేదు’
‘ఇంట్లోంచి బయటకు రాకుండా ఎలా జీవించింది?’ ఆశ్చర్యంగా అడిగేడు కలెక్టర్.
‘తెలియదు సార్! ఈ కేసులో క్రైం అంటూ ఏమీ లేదు కాబట్టి లోతుగా దర్యాప్తు చెయ్యలేదు’ నిజాయితీగా చెప్పాడు యుగంధర్.
‘క్రైం లేదు నిజమే! కాని రాజరాజేశ్వరి కొంత ఆస్తి వదిలి వెళ్లింది. దానిని ఆమె వారసులకి అప్పగించే బాధ్యత మనకి ఉంది కదా?’
‘ననే్నం చెయ్యమంటారు చెప్పండి. నా పరిధిలో నేను ఎంతవరకూ చెయ్యాలో అంతవరకూ చేశాను. మీకు తెలుసు. తీరిగ్గా దర్యాప్తు చేసేంత సమయం మాకు ఉండదని. ఉదయం స్టేషన్‌కి వస్తే రాత్రికి మా బుర్ర పూర్తిగా పాడైపోతుంది. బస్సు అద్దాలు పగులగొట్టి ప్రభుత్వానికి నష్టం కలిగించొద్దంటే రాజకీయ పార్టీలకు కోపం. రూపాయి పెట్రోలు ధర పెరిగితే తెల్లారేసరికి ధర్నాలు, రాస్తారోకోలు. ఆ పార్టీల చరిత్రలో ఇన్నిసార్లు ధర్నాలు చేస్తే ఎప్పుడైనా పెరిగిన ధర తగ్గిందా అంటే కోపం. ఈ దేశాన్ని రాజకీయ నాయకులు నాశనం చేస్తున్న దానికంటే సారాయికి, రూపాయికి ఓటు అమ్ముకునే సామాన్యుడు ఎక్కువ నాశనం చేస్తున్నాడు సార్!’ ఆగేడు యుగంధర్. తను హద్దుదాటి మాట్లాడుతున్నట్టు గుర్తించి,
‘సారీ సార్! కాస్త కంట్రోల్ తప్పాను..’ చెప్పాడు.
చిన్నగా నవ్వి అన్నాడు కలెక్టర్.
‘సమాజం పట్ల బాధ్యత కలిగిన వ్యక్తిగా మీరు స్పందించారు. అయితే కొన్నింటిని ఆపే శక్తి మనకి లేదు. ఉదాహరణకి ఒక విషయం చెబుతాను. ఇక్కడ కలెక్టర్‌గా చార్జి తీసుకున్న మొదటి రోజు ఎవరూ లంచాలు తీసుకోవద్దని హెచ్చరించాను. నేను హెచ్చరించానని లంచాలు తీసుకోవడం మానేశారా? మనిషిలో మార్పు రానంత కాలం సమాజంలో మార్పు రాదు. మన పని నిజాయితీగా చేసుకుపోవడం ఒక్కటే మనం చెయ్యగలిగింది. అది సరే, రాజరాజేశ్వరి వారసుల్ని కనుక్కునే బాధ్యత మీరు తీసుకోండి’
‘ఈ కేసు దర్యాప్తునకు ఎక్కడెక్కడో తిరగాలి సార్! అంత సమయం దొరక్కపోవచ్చు’
‘ఓ పదిహేను రోజులు మిమ్మల్ని ఫ్రీగా వదలమని మీ కమీషనర్‌కి చెబుతాను. ఏమంటారు?’ అడిగేడు కలెక్టర్.
‘మీ ఇష్టం సార్!’
అప్పటికప్పుడు పోలీసు కమిషనర్‌తో మాట్లాడాడు కలెక్టర్.
‘ఖర్చుల కోసం కొంత సొమ్ము శాంక్షన్ చేస్తాను. ఇంకా అవసరమైతే మీ పాకెట్ మనీ ఉపయోగించండి. దాన్ని మీకు తిరిగి చెల్లిస్తాం. కలెక్టరేట్ గుర్తింపు కార్డు తీసుకెళ్లండి. దర్యాప్తు సమయంలో మీకు ఉపయోగపడవచ్చు. అంతగా అవసరమైతే నన్ను కాంటాక్ట్ చెయ్యండి’
ఎమర్జెన్సీ ఫండ్ నుంచి డబ్బు డ్రా చెయ్యడం, గుర్తింపు కార్డు ఇవ్వడం అంతా ఓ గంటలో పూర్తయింది.
‘రేపటి నుంచే మీ దర్యాప్తు ప్రారంభించండి’
కలెక్టర్‌కి మరోమారు సెల్యూట్ చేసి అక్కడ నుంచి బయలుదేరాడు యుగంధర్. తిన్నగా ఆఫీస్‌కి వెళ్లి కమీషనర్‌ని కలిసి వివరాలు చెప్పాడు. కంట్రోలు రూము ఇన్‌స్పెక్టర్ని తాత్కాలికంగా పెందుర్తి పంపారు. అతనికి స్టేషన్ ఛార్జి అప్పగించి బయటకొచ్చాడు యుగంధర్.
బైక్ స్టార్ట్ చేసి కొత్తవలస వైపు పోనిచ్చాడు. ఆరేడు కిలోమీటర్లు వెళ్లాక కుడివైపు మట్టి రోడ్డులోకి తిప్పి ఓ చిన్న గ్రామంలోకి ప్రవేశించాడు. రామాలయం దగ్గర కూర్చున్న మనుషుల దగ్గర ఆగి తనకి కావాల్సిన సమాచారం తెలుసుకుని కాస్త ముందుకెళ్లి ఓ పాక ముందు బండి ఆపాడు.
‘రమణయ్య అంటే ఎవరు?’ గడ్డి పోగేస్తున్న మనిషిని అడిగేడు.
‘నేనేనండి...’ చెప్పాడు నలభై ఏళ్ల వ్యక్తి.
‘పెందుర్తి వెంకటేశ్వర స్వామి గుడి ప్రాంతంలో ఇళ్లకి పాలు పోసేది నువ్వేనా?’
‘అవునండి. మీరెవరండి?’ అడిగేడు రమణయ్య.
‘పోలీసుస్టేషన్ నుండి వస్తున్నాను. నువ్వు పాలుపోసే రాజరాజేశ్వరమ్మ చనిపోయింది తెలుసా?’ ప్రశ్నించేడు మఫ్టీలోని యుగంధర్.
‘తెలుసండి’ అని చెప్పి, పాకలోంచి కుర్చీ తెచ్చి వేశాడు.
‘రాజరాజేశ్వరమ్మకి ఎంతకాలం నుంచి పాలు పోస్తున్నావ్?’ కుర్చీలో కూర్చుని అడిగేడు.

(మిగతా వచ్చే వారం)

-మంజరి 9441571994