S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

తీర్పులు

ఈ మధ్య ఓ మిత్రుడు భోజనానికి పిలిస్తే వాళ్లింటికి భోజనానికి వెళ్లాను. భోజనం కన్నా ముఖ్యమైంది అతనితో కాస్సేపు మాట్లాడుకోవడానికి అవకాశం చిక్కుతుందని వెళ్లాను.
ఓ అతిథిని భోజనానికి పిలిచినప్పుడు తీసుకోవాల్సిన శ్రద్ధ వాళ్లు తీసుకోలేదు. ఎవరింటికైనా భోజనానికి వెళ్లినప్పుడు ఏవో ప్రత్యేకమైన వంటకాలు ఉంటాయని ఊహిస్తాం. మా మిత్రుడు భోజనానికి పిలిచాడు కానీ ఎలాంటి శ్రద్ధ తీసుకోలేదు. సహజంగానే మనస్సు చివుక్కుమంది. అనవసరంగా భోజనానికి వెళ్లానని కూడా అన్పించింది. కలిసినట్టు ఉంటుందని, మాట్లాడుకుంటున్నట్టు ఉంటుందన్న అభిప్రాయం పోయి సరిగ్గా భోజనం పెట్టలేదన్న అభిప్రాయానికి వచ్చాను. నేను ఎవరినైనా భోజనానికి పిలిస్తే మా ఆవిడ తీసుకునే శ్రద్ధతో పోల్చి వాళ్ల పట్ల ఓ నిర్ణయానికి వచ్చాను. వాళ్లు అతిథులను సరిగ్గా చూసుకోరనే నిర్ణయం మా ఆవిడ దగ్గర ప్రకటించాను.
ఈ నిర్ణయాలు తీర్పులు ప్రకటించడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. అయినా ఇలాంటి తీర్పులు రోజూ ఎన్నో ప్రకటిస్తూ ఉంటాం. ఒక వ్యక్తి మనకు తారసపడినప్పుడు, ఎవరినైనా కలిసినప్పుడు ఆ వ్యక్తుల గురించి ఏవో నిర్ణయాలు, తీర్పులు ప్రకటిస్తూ ఉంటాం. ఇలాంటివి స్నేహితుల గురించే కాదు తోటి ఉద్యోగుల గురించి కూడా చేస్తూ ఉంటాం. ఈ నిర్ణయాలు ప్రకటించడం ద్వారా శిక్ష మనకే పడుతుంది. అదే సంతోషం లేకుండా పోవడం, బాధ కలగడం.
మన గురించి మన తీర్పుల వల్ల, ఇతరుల గురించి మన తీర్పుల వల్ల పోలికలు, వ్యతిరేక భావనలు, కోపం లాంటివి కలిగి సంతోషం లేకుండా పోతుంది.
ఇతరులని తప్పు పట్టడం వల్ల మనకు ఒరిగేదేమిటీ? తప్పులు, పొరపాట్లు సహజం. మన అభివృద్ధిలో అవి ఒక భాగం కాదా? ఇతరుల పొరపాట్ల నుంచి మనం ఎన్నో నేర్చుకోవచ్చు. అంతేకానీ ఇతరుల పొరపాట్లని సమీక్షిస్తూ మనల్ని మనం బాధ పెట్టుకోవడం ఎందుకు..? మనల్ని మనం అభివృద్ధి చేసుకోవడానికి ఇతరుల పొరపాట్లని తప్పులని ఉపయోగించుకోవచ్చు.
ఇతరులని విమర్శించడం కన్నా వాళ్ల గురించి కొంచెం సానుకూలంగా ఆలోచిస్తే మంచిదని అన్పిస్తుంది. ఎదుటి వాళ్ల పొరపాట్ల వల్ల, తప్పుల వల్ల కలిగిన అసౌకర్యం కన్నా వాటి గురించి ఆలోచించడంతో ఎక్కువ కష్టం కలుగుతుంది.
మన తీర్పుల వల్ల శిక్ష మనకే పడుతుంది. ఏదైనా మారాలని కోరుకుంటున్నప్పుడు మనం మారడమే మంచిది. ఇతరుల పొరపాట్లని సరిచేసే, పరిస్థితి మన చేతిలో లేనప్పుడు తీర్పులు ప్రకటించి ఫలితం ఏమిటి?
ఇలాంటి తీర్పుల వల్ల అసహనం, అసంతృప్తి పెరుగుతాయి తప్ప మరేమీ ఉపయోగం లేదు.
తీర్పులు చెప్పడం న్యాయమూర్తుల పని.
మనకెందుకు?