S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

పురావస్తు ప్రేమికులు (విలన్స్, స్కౌన్‌డ్రల్స్ అండ్ రాస్కెల్స్)

మారిసన్ దంపతులు ఎప్పుడూ నిజమే చెప్పేవారు. అది ఎంత బాధాకరమైనా సరే. ఇన్‌కంటేక్స్‌ని ఎగ్గొట్టకుండా చెల్లించేవారు. ఓ రోజు స్టాప్ బోర్డ్ దగ్గర తన కారుని ఆపనందుకు మారిసన్ ట్రాఫిక్ కోర్ట్‌కి వెళ్లి పది డాలర్ల ఫైన్‌ని చెల్లించాల్సి వచ్చింది. దానికి వారు ఎంతో బాధపడ్డారు. ఎందుకంటే మిస్టర్ అండ్ మిసెస్ మారిసన్‌లు చట్టాన్ని అతిక్రమించడానికి ఇష్టపడరు.
వారికి అధర్మపరులతో చాలా అనుభవాలు ఉన్నాయి. ఓసారి వాళ్లు మెక్సికోలో కొలంబస్‌కి మునుపటి కాలానికి చెందిన పురాతన విగ్రహాన్ని కొన్నారు. కాని న్యూజెర్సీలో రివర్‌వ్యూ ఊళ్లోని తమ పొరుగాయన ప్రొఫెసర్ బ్లేక్ దాన్ని చూసి చిన్నగా నవ్వి ఆ విగ్రహం పురాతనమైంది కాదని, ఇటీవలే చేయబడిందని చెప్పి, అందుకు అనేక గుర్తులని వారికి చూపించాడు.
తర్వాత వాళ్లు ఇటలీకి వెళ్లబోయే ముందు బ్లేక్ వారికి పురాతన వస్తువులకి చెందిన కొన్ని పుస్తకాలని ఇచ్చాడు. వాటిని వారు పాఠ్యగ్రంథాల్లా చదివి తిరిగి వచ్చేప్పుడు ఇటుస్కాన్ గినె్నని తెచ్చి బ్లేక్‌కి చూపించారు. ఆయన మళ్లీ అసలు గినె్న ఫొటోని చూపించి అది రవెన్నా ఆర్కలాజికల్ మ్యూజియంలో ఉందని చెప్పి, వాళ్లు కొన్న గినె్న నకిలీది అని రుజువు చేసే కొన్ని గుర్తులని చూపించాడు. ఆ నకిలీది నైపుణ్యంగా చేత్తో చేయబడింది కాబట్టి దానికి కొంత విలువ ఉంటుందని కూడా చెప్పాడు. మారిసన్ దంపతులకి పురాతన వస్తువుల మీద ఆసక్తి బ్లేక్ వల్లే కలిగింది.
ఆయన వారి పక్కింట్లోకి మారాక ఆయనకి తోట పని మీద చాలా సలహాలు ఇచ్చారు. బదులుగా ఆ పురావస్తు పరిశోధన ప్రొఫెసర్ వారికి ఆర్కియాలజీని పరిచయం చేశాడు. ఆయన కలర్ స్లైడ్‌ని ప్రదర్శిస్తూ ఈజిప్షియన్ టోంబ్స్‌ని, దక్షిణ భారతదేశంలోని ఆలయాలని, ఇంకా ఎన్నిటినో చూపించాడు. చిన్నప్పుడు ఎప్పుడో స్కూల్లో చదువుకున్న పాఠ్యాంశాలు వాళ్లకి గుర్తుకు వచ్చాయి.
మిస్టర్ మారిసన్ రోమన్స్ ఇంజనీరింగ్ సాంకేతికత పట్ల ఆకర్షించబడ్డాడు. మిసెస్ మారిసన్ విగ్రహాలు, బంగారు ఆభరణాలు, రాళ్లు, రత్నాల పట్ల ఆకర్షితురాలైంది. అలాంటి బ్లేక్ సేకరణ కూడా చూశాక అది రెట్టింపైంది.
ఆ వేసవిలో మారిసన్ దంపతులు అయోవాలోని తమ బంధువుల ఇంటికి బదులు మెక్సికోకి వెళ్లారు. ప్రొఫెసర్ బ్లేక్ అక్కడి తన మిత్రులకి, కొలీగ్స్‌కి పరిచయ లేఖలు రాసిచ్చాడు. తవ్వకాలు జరిగే పురాతన ప్రాంతాలని సందర్శించే అపూర్వ అవకాశం లభించబోతున్నందుకు ఇద్దరికీ ఆనందం కలిగింది. పిల్లలు పెద్దవాళ్లై ఉద్యోగరీత్యా వేరే చోట్లకి వెళ్లిపోయాక వాళ్లు విదేశీ పర్యటనలకి డబ్బుని ఖర్చు చేయగలుగుతున్నారు.
‘ఎందుకు అకస్మాత్తుగా మీకు శిథిలాల మీద ఆసక్తి కలిగింది? ఫ్లోరిడాకి వెళ్లి షఫుల్ బోర్డ్‌లో పాల్గొనవచ్చుగా? ఆ శిథిలాల్లో జారిపడి మీ తుంటి ఎముక విరగచ్చు’ పెద్దకొడుకు సూచించాడు.
మారిసన్ నవ్వి ఓ కలర్ స్లైడ్‌ని వేసి అందులో కొండ అంచు మీద గల ఓ పురాతన ఆలయాన్ని చూపించాడు.
‘బావుంది’ కొడుకు మెచ్చుకున్నాడు.
‘అందుకే. పైకి ఎక్కడానికి రెండు వందల మెట్లు ఉన్నాయి. అక్కడ నించి కనపడే దృశ్యం అద్భుతంగా ఉంటుంది’
‘పైకి నడిచి వెళ్తారా?’
‘అవును’
‘చాలా జాగ్రత్తగా ఎక్కాలి’ కొడుకు అసంతృప్తిగా చెప్పాడు.
‘గైడ్ మా వెనకే వస్తాడు. ఆయాసపడుతూ, మధ్యలో విశ్రాంతి తీసుకుంటూ ఎక్కుతాం.’
* * *
ఆ స్ప్రింగ్‌లో వాళ్లు ఏథెన్స్‌లో కొన్ని రోజులు ఆగి అక్కడి తవ్వకాల ప్రాంతాలకి బ్లేక్ రాసిచ్చిన ఉత్తరాలతో వెళ్లారు.
ఆక్రోపోలిస్‌కి వెళ్లి టెంపుల్ ఆఫ్ ఎథీనా ఎదురుగా ఉన్న పెద్ద నల్లబండ రాతి మీద కూర్చుని దాన్ని చూడసాగారు.
‘మిస్టర్ మారిసన్?’ పొట్టిగా, లావుగా ఉన్న ఓ వ్యక్తి వారి దగ్గరకి వచ్చి అడిగాడు.
‘ఎస్?’
అతను నవ్వితే పై వరసలోని బంగారు పన్ను తళుక్కుమంది.
‘మీకు నేను గుర్తులేను. గ్రీస్‌లో చేత్తో అల్లిన అత్యంత అందమైన స్కర్ట్‌లని అమ్ముతాను. పోస్టల్ ఖర్చు లేకుండా ఇంటికి తీసుకెళ్లచ్చు’ అతను చెప్పాడు.
‘మిస్టర్ స్కోపస్. మిమ్మల్ని నేను గుర్తు పట్టాను’ మిసెస్ మారిసన్ చెప్పింది.
‘మీతో మాట్లాడటానికి నా షాప్‌ని మూసేసి మిమ్మల్ని అనుసరించి వచ్చాను. నాలుగు గోడల మధ్య చర్చించేది కాదది’ తల వెనక్కి తిప్పి అటు ఇటు చూసి గొంతు తగ్గించి చెప్పాడు.
‘ఇవాళ ఉదయమే మాకు చేత్తో అల్లిన సిల్క్ కార్పెట్ అక్కర్లేదని మీకు చెప్పాను. నాటకీయత మానండి. ధర తగ్గించినా అది మాకు అవసరం లేదు. ప్రొఫెసర్ బ్లేక్ మీ దగ్గర చవకగా దొరుకుతాయని చెప్పిన మాట అబద్ధం. తిరిగి వెళ్లాక ఆ సంగతి ఆయనకి చెప్తాను’ మారిసన్ కోపంగా అరిచాడు.
‘ఇది కార్పెట్ గురించి కాదు. ఇంకో విలువైన వస్తువు గురించి’
‘ఏమిటా విలువైన వస్తువు?’ మిసెస్ మారిసన్ ఆసక్తిగా అడిగింది.
‘తిరుగుబాటు సైనికులు రాజకుటుంబాన్ని పీడించడం గురించి మీకు తెలుసుగా? ఆ కుటుంబ సభ్యులు దాక్కోవాల్సి వచ్చింది. రాజుగారి కజిన్ నా పాత కస్టమర్. డబ్బు కోసం అతను తన పురాతన వస్తువుల్లోంచి ఒకదాన్ని అమ్మాల్సి రావడం విషాదం కాదా?’
అతని నాటకీయతకి ఆ దంపతులకి నవ్వొచ్చింది.
‘అసలు అమ్మడానికి వారికి ఏదైనా ఉండటం నమ్మదగ్గ విషయమేనా?’ మారిసన్ అడిగాడు.
ఆ గ్రీక్ పౌరుడు చిన్నగా నిట్టూర్చాడు.
‘విషాదం ఏమిటంటే, ఈ ఘనమైన గ్రీక్ ప్రాచీన వస్తువు గ్రీస్‌ని వదిలి వెళ్లడం. అతనికి పిల్లలు ఉన్నారు. వారి పోషణ కోసం అతను ఓ విలువైన పురాతన ఉంగరాన్ని అమ్మదలచుకున్నాడు. గ్రీక్ ద్వీపం క్రేట్‌లోని పేలెస్ ఆఫ్ మినోస్ నించి ఈ ఉంగరం పంపబడింది’
‘అది నకిలీది కాదని మాకేమిటి నమ్మకం?’
‘కాదు. ఇది క్రీస్తుకి మునుపు రెండు వేల ఏళ్ల క్రితం నిపుణులైన పనివాళ్లు చేసిన ఉంగరం. దీన్ని మీరు మీ దేశంలోని ఏ మ్యూజియానికి ఇచ్చినా దాన్ని చూసే సందర్శకులు దాని పక్కనే ఉన్న ‘మిస్టర్ అండ్ మిసెస్ మారిసన్ సేకరణ నించి ఉదారంగా ఇచ్చిన బహుమతి’ అని చదువుతారు. అది మీ దేశ ప్రజలకి మీరు చేసే సేవ’
‘సరే. దాన్ని చూపించు’ మారిసన్ అడిగాడు.
‘ఇక్కడ కాదు. దాన్ని నీతో తీసుకువస్తానని అనుకున్నారా? మీరు మా ఇంటికి వస్తే చూపిస్తాను. దాన్ని జాగ్రత్తగా పరిశీలించి నేను చెప్పింది నిజమో, కాదో మీరే తెలుసుకోవచ్చు. ఇది నా చిరునామా. ఉదయం తొమ్మిది దాకా ఇంట్లోనే ఉంటాను. రాత్రిళ్లు రాకండి. ఈ పురాతన నగరంలోని సన్నటి వీధుల్లో భద్రత ఉండదు. ముఖ్యంగా తిరుగుబాటు సైనికుల నించి ప్రమాదం ఉంటుంది’
‘అది అసలుదే అని హామీ ఇస్తారా?’ మారిసన్ అడిగాడు.
‘రాతపూర్వకంగా ఇవ్వలేను. అది నాకు కాని, నా క్లైంట్‌కి కాని మంచిది కాదు. కాని నేను మీకు అసలుదే అని మాట ఇస్తున్నాను’
‘సారీ! మాట సరిపోదు. గుర్తింపు పొందిన పురావస్తు వ్యాపారస్థుడి నించి నాకు రాతపూర్వకంగా హామీ కావాలి’
‘అసాధ్యం. ప్రొఫెసర్ బ్లేక్ పంపిన వారిని నేను మోసం చేస్తానా?’
‘మాట వరసకి అది అసలుదే అనుకుందాం. బిల్ లేకుండా దాన్ని కస్టమ్స్‌లోంచి ఎలా తీసుకెళ్లగలను? అది కొన్నదని రుజువు చేస్తేనే నేను బయటకి తీసుకెళ్ల గలనని మీకు తెలుసు’
‘అది నిజమే. కాని కస్టమ్స్‌లోంచి ఓ చిన్న ఉంగరాన్ని దాచి తీసుకెళ్లడం తేలిక’
‘స్మగ్లింగా? మీకు పిచ్చెక్కిందా?’ మారిసన్ అడిగాడు.
‘కాని మీరు చాలా ధైర్యవంతులు అనుకున్నాను. నేను పొరపడ్డాను’ స్కోపస్ చెప్పాడు.
‘మీరు నన్ను మోసం చేయలేరు. ఇంకో కస్టమర్ని వెతుక్కోండి’ మారిసన్ చెప్పాడు.
అతను చిన్నగా నిట్టూర్చి వెనక్కి తిరిగి గతుకుల రాళ్ల మీద నడుచుకుంటూ వెళ్లిపోయాడు. మిసెస్ మారిసన్ సన్నగా నవ్వి చెప్పింది.
‘అనుభవం లేని ఒకప్పుడు ఇలాంటి మోసపూరిత కథలకి మనం పడిపోయేవాళ్లం’
‘కాని అతను నమ్మకస్థుడై ఉంటే ఆ ఉంగరాన్ని చూసేవాడిని. కాని అతను నిజం చెప్తున్నాడో, లేదో మనకి తెలీదు’
‘ప్రొఫెసర్ బ్లేక్‌కి మనం పేరు పొందిన వ్యాపారస్థుల నించి తప్ప మరెవరి నించీ పురాతన వస్తువులని కొనమని చెప్పాం. కొనాల్సి వస్తే ముందుగా తనకి చెప్పమని ఆయన కోరారు’
వారు ఇద్దరూ సమీపంలోని పార్థెనాన్ టూరిస్ట్ స్పాట్ వైపు నడిచారు.
* * *
మర్నాడు ఉదయం మారిసన్ త్వరగా నిద్ర లేచాడు. అతని భార్య ఇంకా లేవలేదు. టైం చూసుకున్నాక ఈలోగా స్కోపస్ ఇంటికి వెళ్లి ఆ ఉంగరాన్ని చూసి వస్తే? అనిపించింది. డ్రెస్ చేసుకుని నిశ్శబ్దంగా బయటకి నడిచాడు.
ఏథెన్స్ నగరం వీధుల మేప్‌లని చూసుకుంటూ వేగంగ స్కోపస్ ఇంటి వైపు నడిచాడు. అతని ఇంటి ప్రాంతంలోంచి మురుగు వాసన వేస్తూండటంతో చేతిరుమాలని ముక్కుకి అడ్డం పెట్టుకుని, నాలుగో అంతస్థులోని అతని అపార్ట్‌మెంట్ తలుపు తట్టాడు.
‘ఎవరది?’ ఓ కంఠం గుసగుసగా వినిపించింది.
‘మారిసన్’
‘ష్...’
స్కోపస్ తలుపు తెరచి ఆయన లోపలికి రాగానే మూసి, తాళం వేసి చెప్పాడు.
‘మీరు వస్తారని అనుకోలేదు. మంచిది. మా ఆవిడ నిద్రపోతోంది. చప్పుడు చేయకుండా వంట గదిలోకి రండి’
ఇద్దరూ నిశ్శబ్దంగా వంట గదిలోకి వెళ్లాక అతను సొట్టలు పడ్డ రేకు పెట్టెని తెరచి, అందులోని సగం తిన్న బ్రెడ్ ముక్కలని తీశాడు. వాటి కింద ఉన్న ఆఖరి బ్రెడ్‌లో గుచ్చిన ఉంగరాన్ని తీసిచ్చి చెప్పాడు.
‘దాచడానికి ఇది మంచి చోటు కదా?’
మారిసన్ అనాసక్తిగా దాన్ని అందుకుని మురికిగా ఉన్న చిన్న కిటికీ దగ్గరకి నడిచి దాన్ని చూశాడు. గుండ్రంగా ఉన్న ఆ వెండి ఉంగరానికి విలువైన రాళ్లు అమర్చి ఉన్నాయి. చేతి రుమాలని తీసి కిటికీ అద్దం మీది దుమ్ముని కొద్దిగా తుడిచాడు. దాంతో బయట నించి వెలుతురు బాగా పడి ఉంగరం మీద చెక్కిన కూర్చున్న కోతి బొమ్మ కనిపించింది. అది మిడ్ మినోవన్ పీరియడ్‌కి చెందినదిగా గుర్తించాడు. చూసే కొద్దీ అది నిజంగా ప్రాచీనమైంది అన్న భావన కలిగింది.
‘బావుంది. చక్కగా నకిలీది చేశారు’ చెప్పాడు.
‘అది నకిలీది కాదని మీకు తెలుసు. ఏభై వేల డ్రాక్‌మాస్ ఇస్తే ఇది మీది అవుతుంది’
మార్సన్ మనసులోనే వేగంగా లెక్క కట్టాడు. తన పేర, తన భార్య పేర గల ట్రావెలర్స్ చెక్స్‌ని ఖర్చు చేస్తే ట్రిప్‌కి సరిపడే డబ్బు ఇంకా ఉంటుంది.
‘ఇది నిజంగా నిజమైందే ఐతే దీని విలువ ఇంకా ఎక్కువే ఉంటుందిగా?’ మారిసన్ అడిగాడు.
‘కాని మీరు అంతకు మించి చెల్లించలేరని నాకు తెలుసు. తిరుగుబాటుదారులని పడగొట్టి తిరిగి రాజకుటుంబం అధికారంలోకి వచ్చేదాకా దీని యజమానికి ఆ డబ్బు సరిపోతుంది’
గతంలో మోసపోయిన మారిసన్ సందేహించాడు.
‘నా భార్య లేచినట్లుంది. దీన్ని ఆమె చూడకూడదు. దయచేసి డబ్బు చెల్లించి వెళ్లండి’ స్కోపస్ ఆదుర్దాగా చెప్పాడు.
ట్రావెలర్స్ చెక్స్ మీద సంతకం చేసి స్కోపస్‌కి ఇచ్చి మారిసన్ ఎడమ చేతికి పెట్టుకున్న ఉంగరంతో రెండు నిమిషాల తర్వాత తన హోటల్ వైపు గబగబా నడిచాడు.
‘గ్రీస్‌లో ఈ విలువైన ఉంగరాన్ని పెట్టుకుని తిరగడం మంచిది కాదు’ అతను హెచ్చరించాడు.
దాన్ని మారిసన్ పాటించాడు.
ప్రొఫెసర్ బ్లేక్ దాన్ని పరిశీలించి పురాతనమైందని చెప్పేదాకా తను దాన్ని కొన్న సంగతి తన భార్యకి చెప్పదలచుకోలేదు. కాబట్టి దాన్ని కస్టమ్స్ ఇన్‌స్పెక్టర్ నించే కాక తన భార్య నించి కూడా దాచాలి. అది ఇంకాస్త కష్టమైన పని. వజ్రాలైతే టూత్ పేస్ట్ ట్యూబ్‌లో దాచచ్చు. ఉంగరం ఎక్కడ దాచాలి? తన బూటు అడుగు భాగంలో రహస్య అర లేదు.
హోటల్ గదికి తిరిగి వెళ్లేసరికి భార్య హెయిర్ డ్రెసర్ దగ్గరికి వెళ్తున్నట్లుగా రాసిన కాగితం కనిపించింది. అతను టూత్ బ్రష్ హేండిల్‌ని ఉపయోగించి షూ పాలిష్ పెట్టెలోంచి కొంత పాలిష్‌ని బయటకి తీసి ఉంగరాన్ని ఉంచాక పైన మళ్లీ పాలిష్‌ని రుద్దాడు. తర్వాత బ్రష్‌కి అంటిన పాలిష్‌ని శుభ్రంగా కడిగేశాడు. కస్టమ్స్ ఇన్‌స్పెక్టర్ ముందు నిబ్బరంగా ఉండగలడమే ఇప్పుడు తను చేయాల్సింది. తర్వాత దిన పత్రికని తెరిచాడు.
మధ్యాహ్న భోజన సమయానికి మిసెస్ మారిసన్ కొత్త హెయిర్ స్టైల్‌తో వచ్చింది.
‘వెళ్లి నీ ట్రావెలర్స్ చెక్‌ని మార్చుకుందాం పద. నావన్నీ ఖర్చయ్యాయి’
ఆవిడ తల ఊపింది.
మారిసన్ ఆవిడ ట్రావెల్ చెక్స్‌ని, పర్స్‌లోంచి నోట్లని, పేంట్ జేబుల్లోంచి నాణాలని తీసి జాగ్రత్తగా లెక్కపెట్టి చెప్పాడు.
‘ఇది హోటల్ బిల్స్‌కి, ఎయిర్‌పోర్ట్‌కి టేక్సీకి సరిపోతుంది. ఈ మధ్య నువ్వు మనవల గురించి ఎక్కువగా మాట్లాడుతున్నావు. మనం ఇక ట్రిప్‌ని ముగించి ఇంటికి వెళ్లాలి’
‘అది నిజమే. వాళ్లు మనల్ని మర్చిపోతారని నాలో భయం మొదలైంది’ ఆవిడ చెప్పింది.
ఆయన ఎయిర్ ఒలింపియాకి ఫోన్ చేసి టిక్కెట్లని కన్‌ఫం చేశాడు.
* * *
వాళ్లు కెన్నడీ ఎయిర్‌పోర్ట్‌లో విమానం దిగేసరికి మారిసన్ గుండె వేగంగా కొట్టుకోసాగింది. తర్వాతి గంటలో జరగబోయే దాన్ని అతను అప్పటికే ఎన్నోసార్లు ఊహించుకున్నాడు. ఆ కస్టమ్స్ ఆఫీసర్ కఠినంగా ఉన్నాడు. అందరివీ, అన్నీ నిశితంగా పరిశీలిస్తున్నాడు. మిసెస్ మారిసన్ హేండ్‌బేగ్‌లోని తెల్లటి పొడిని చూసి అడిగాడు.
‘ఇదేమిటి?’
‘సబ్బు పొడి’
బాత్ టబ్ నీళ్లల్లో కలిపే ఆ పేకెట్ లీక్ అయిందని ఆవిడ గ్రహించింది.
అతను వేలిని తడి చేసుకుని కొంత పౌడర్ని అద్దుకుని రుచి, వాసన చూసి నవ్వుతూ చెప్పాడు.
‘సబ్బు పొడే. మీ బేగ్ ఓ పట్టాన శుభ్రం కాదు’
అతను వెళ్లచ్చు అని చెప్పాక మారిసన్ ఊపిర పీల్చుకున్నాడు. కొద్ది దూరం వెళ్లాక మిసెస్ మారిసన్ గొంతు తగ్గించి చెప్పింది.
‘నేను హెరాయిన్‌ని స్మగుల్ చేస్తున్నానని అనుకున్నట్లు ఉన్నాడు. ఏ స్మగ్లరూ అలా నిర్లక్ష్యంగా పొడి రాలేలా పేక్ చేయడు అని అతనికి తెలీదా?’
* * *
మర్నాడు భార్య ఇల్లు సర్దడంలో నిమగ్నమై ఉన్నప్పుడు మారిసన్ పక్కింట్లోని ప్రొఫెసర్ బ్లేక్ దగ్గరికి ఉంగరంతో రహస్యంగా వెళ్లాడు. ఉంగరం గురించి మారిసన్ చెప్పగానే ఆయన నిరసనగా చెప్పాడు.
‘స్కోపస్? వాడో దొంగ. మీకు అతని అడ్రస్ ఇచ్చినప్పుడు అతని దుకాణంలో దొరికే చేత్తో అల్లిన వాటినే కొనమని, విలువైనవి ఏవీ అతని దగ్గర కొనద్దని చెప్పాగా?’
‘దీని విలువ చెప్పండి’ ఉంగరాన్ని ఇస్తూ చెప్పాడు.
ప్రొఫెసర్ ఆ ఉంగరాన్ని జాగ్రత్తగా పరిశీలించి సన్నగా ఈల వేశాడు. భూతద్దం కింద దాన్ని ఉంచి అటు, ఇటు తిప్పి చాలాసేపు పరీక్షించాక చెప్పాడు.
‘వెంటనే చెప్పలేను. కొద్ది రోజుల్లో చెప్తాను’
దాన్ని ఆయన తన చేతిరుమాల్లో కట్టుకుని పేంట్ జేబులో ఉంచుకున్నాడు.
లంచ్ చేస్తూండగా మిసెస్ మారిసన్ అడిగింది.
‘ఎక్కడికి వెళ్లారు?’
ఆయన వెంటనే అబద్ధం తట్టక ఆ ఉంగరం గురించి చెప్పాడు. ఆవిడ తన భర్త తనకో ప్రాచీన ఉంగరాన్ని బహుమతిగా కొన్నందుకు సంతోషించింది.
* * *
కొద్ది రోజుల తర్వాత ప్రొఫెసర్ బ్లేక్ ఆ దంపతులని తన ఇంటికి పిలిచి చెప్పాడు.
‘మీకో శుభవార్త. స్కోపస్ నేను అనుకున్నంత దొంగ కాదు. మీకు అసలు ఉంగరానే్న అమ్మాడు. నిజానికి దీని ధర మీరు చెల్లించిన దానికన్నా మూడు రెట్లు ఉంటుంది. దీన్ని మ్యూజియానికి విరాళంగా ఇవ్వద్దు. ఎందుకంటే ఇది దొంగిలించబడిందని రిపోర్ట్ చేయబడింది. అన్ని దేశాల్లోని మ్యూజియాలకీ ఈ సంగతి తెలుసు’
‘మ్యూజియానికి ఇచ్చే ఉద్దేశం లేదు. అమ్మయ్య, నాలోని వత్తిడి తగ్గింది’ మారిసన్ చెప్పాడు.
వాళ్లిద్దరికీ ఆ ఉంగరాన్ని ఇస్తూ బ్లేక్ చెప్పాడు.
‘ఈ రాత్రి మీరు షాంపేన్ ఓపెన్ చేస్తే నన్నూ పిలవండి’
వాళ్లు ఆనందంగా వెళ్లాక ప్రొఫెసర్ కొన్ని నిమిషాలు ఆలోచనగా కూర్చుని లేచి డ్రాయర్ తెరచి అందులోంచి ఓ చిన్న పెట్టెని తెరచి చూశాడు. అందులోని వెండి ఉంగరం మారిసన్ గ్రీస్ నించి తెచ్చిన అసలు ఉంగరం. వాళ్లకి నకిలీ ఉంగరాన్ని ఇచ్చాడు. స్కోపస్, బ్లేక్ మధ్య జరిగిన రహస్య ఒప్పందం ప్రకారం ఆ ఉంగరాన్ని మారిసన్ దంపతులు ఆయన చేతికి మట్టి అంటకుండా స్మగుల్ చేసి తెచ్చారు. ఆ దంపతులకి తమ డబ్బు వృధా కాలేదనే ఆనందం, తనకి ఉచితంగా ఐదు వేల పౌన్ల ఉంగరం దొరికిందనే ఆనందం కలిగాయి.
*

లిబ్బీ మేక్‌కాల్ కథకి స్వేచ్ఛానువాదం

మల్లాది వెంకట కృష్ణమూర్తి