S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

మృత్యుఘోష

యుద్ధాలు, అంతర్యుద్ధాలు, అస్థిరత, రాజకీయ వేధింపులు, ఆర్థిక మాంద్యం, పేదరికం - కారణాలు ఏమైతేనేం కొన్ని దేశాలు అస్థిరతకు చిరునామాగా మారిపోయాయి. సామాన్య ప్రజల సాధారణ జీవనాన్ని అసాధారణ రీతిలో ఛిద్రం చేసేశాయి - అంటూ సాగిన కవర్‌స్టోరీ ఆలోచింపజేసేదిగా ఉంది. అలాగే ‘ఒక్క తూటా చాలు’ సీరియల్ ఆద్యంతం సస్పెన్స్ థ్రిల్లర్‌ని తలపింపజేస్తోంది.
-కొప్పల కాశీ విశే్వశ్వరరావు (విశాఖ)

మంచు ఎడారి
ఎడారి ఓడ అని పిలిచే ఒంటెలు సాధారణంగా ఎడారి ప్రాంతంలో కదా అనిపిస్తాయి. కానీ ఇక్కడ మంచు ఎడారి ఓడని చూస్తే నిజంగానే ఆశ్చర్యం వేసింది. మండుటెండల్లో ఉండాల్సిన ఒంటె ఇలా మంచుతోనూ కనిపించడం విశేషం. ‘అవీ-ఇవీ’ శీర్షికన అందిస్తున్న బిట్స్ కనువిందు చేస్తున్నాయి. తెలీని ఎన్నో విశేషాలను తెలియజెప్తోందీ శీర్షిక. అలాగే ‘అక్షరాలోచనలు’లో ప్రకృతి కవ్విస్తోంది కవిత మమ్మల్ని ఎంతగానో అలరించింది.
-కొలపాక శ్రీనివాస్ (బెల్లంపల్లి)

ఇంద్రజాలం
జనవరి 22, ఆదివారం అనుబంధంలో ‘ఓ చిన్న మాట’ శీర్షికన అందించిన ‘ఇంద్రజాలం’ కతనం బాగుంది. కథల్లో కన్పించే ఇంద్రజాలం నిజ జీవితంలో ఉండదు. కానీ ఆ ఇంద్రజాలం మనందరిలో ఉంటుంది. అది ఉన్నవాళ్లు ఎప్పుడూ బీదవాళ్లుగా కన్పించరు. దానే్న ‘ప్రేమ’ అంటారు. ప్రేమించే గుణం ఉన్నవాళ్లు ఎవరూ బీదవాళ్లు కారు. కాలేరు కూడా అన్న మాటలు మమ్మల్ని ఎంతగానో అలరించాయి. జీవిత సత్యాల్ని వెల్లడిస్తున్న ఈ శీర్షికలంటే మాకెంతో ఇష్టం.
-పట్నాల సూర్యనారాయణ (రాజమండ్రి)

రుతువు కొమ్మ
‘అక్షరాలోచనలు’ శీర్షికన ప్రచురిస్తున్న కవితలు మమ్మల్ని ఆనంద డోలికల్లో విహరింపజేస్తున్నాయి. ‘మట్టి రంగు బొమ్మలు’ కవిత నేటి వాస్తవాల్ని వెల్లడించింది. రుతువు కొమ్మల మీద రాగాలు పాడే మట్టిగువ్వలు - వాక్యం బాగుంది. వచ్చి పడింది ప్రపంచీకరణ వరద! యిప్పుడు ఊళ్లు, వరద నీటికి కరిగిపోయిన మట్టి రంగు బొమ్మలు! అనటం మరింత నచ్చింది.
-డి.వి.తులసి (విజయవాడ)

పరమ సత్యం
వాహనాన్ని ఎలా అయితే అప్పుడప్పుడు సర్వీసింగ్ చేయిస్తామో అలాగే మన శరీరాన్నీ మనసునీ అప్పుడప్పుడు డాక్టర్ చేత సర్వీసింగ్ చేయించుకోవాలని ‘ఓ చిన్న మాట’గా పరమ సత్యాన్ని చెప్పారు. కుడి ఎడమైతే ఫరవాలేదని కవి పాట రాసినా ఫరవా ఉందని జాగ్రత్తగా ఆలోచించాలని గోపాలంగారు ఆసక్తికరంగా చెప్పారు. నమ్మండి ఇది నిజం అంటూ చెప్పిన మృత్యుగృహం కథ చక్కని సస్పెన్స్‌తో బాగుంది. బంగారం కంటే రాగి విలువైనది, ఉపయోగకరమైందని చెప్పిన విషయాలు ఆశ్చర్యపరిచాయి. అలాగే బెల్లం మన దేశంలోనే ఎక్కువగా ఉపయోగిస్తారని చెప్పడం కూడా.
-హెచ్.పవన్‌పుత్ర (రామారావుపేట, తూ.గో.జిల్లా)

జ్ఞాపకాల తోట
‘జ్ఞాపకాల తోటలో’ అన్న శీర్షికలో మల్లాది సూరిబాబు గారు ఎన్నో ఆసక్తికర విషయాలు చెప్పారు. ముఖ్యంగా అలనాటి కృష్ణ పాత్రధారి కొచ్చర్లకోట సత్యనారాయణను మళ్లీ గుర్తు చేశారు. ఆయన చేసిన కృష్ణ జరాసంధ అప్పట్లో బాగా పేరు తెచ్చుకొన్నది. ఘంటసాల, మంగళంపల్లి ఇద్దరి గానంలో ‘అ’కారమే వినిపిస్తుంది. వికారాలు ఉండవని చక్కగా చెప్పారు. అలాగే పాతకాలపు పెళ్లి భోజనాల గురించి ఆయన హృద్యంగా చెప్పారు. అప్పటి పంక్తి భోజనాలకూ.. ఇప్పటి బఫే భోజనాలకూ ఎంతో తేడా.
-కాకుటూరి సుబ్రహ్మణ్యం (కావలి)

ఉదయ రాగం
బిథొవెన్ ఓసారి పియానో దగ్గర కూర్చుని సంగీత రచన చేసుకుంటున్నాడు. ఇంతలో ఎవరో స్నేహితులు వచ్చారు. వాళ్లని చూసి ‘బిథొవెన్’ సంగీత రచన చేసిన నొటేషన్ కాగితాల్ని మూసేసి, పియానో మీద ఆ వ్రాసిన సంగీతం వాయించి ‘దీనివల్ల మీకు ఎటువంటి అనుభూతి కల్గుతోంది’ అని అడిగాడట. ‘ఇద్దరు ప్రేమికులు కలుసుకుని తిరిగి ఎడబాటు పొందినట్లుంది’ అని అందరూ ముక్తకంఠంతో చెప్పారట. వెంటనే ‘బిథొవెన్’ మూసి పెట్టి ఉంచిన, తాను తయారుచేసిన నొటేషన్ కాగితం వాళ్లకు చూపించాడు. దాని టైటిల్ ‘రోమియో అండ్ జూలియట్’ అని రాసి ఉంది. దీన్నిబట్టి మాటకు ఎంత శక్తి ఉందో, నాదానికీ అంత శక్తీ ఉన్నట్లేగా? ఈ సంఘటన చదువుతూంటే ఒళ్లు గగుర్పొడిచింది. సంగీతం గురించీ.. గాయనీ గాయకుల గురించి ఎంతో చక్కగా వివరిస్తున్నందుకు ధన్యవాదాలు.
-ఎన్.రామలక్ష్మి (సికిందరాబాద్)

శరణు శరణు
ఈ వారం ‘శరణు శరణు’ కవర్‌స్టోరీ ఆలోచింపజేసేదిగా ఉంది. శరణార్థుల గురించి వాస్తవాలను కళ్ల ముందుంచారు. తొలి దశలో ఉదారంగా వ్యవహరించినా కాలక్రమేణా శరణార్థులను పట్టించుకోవటం తగ్గించేస్తున్నాయి చాలా దేశాలు. కొన్ని దేశాలు సరిహద్దులను మూసివేస్తే, మరికొన్ని దేశాలు నిత్యావసరాల పంపిణీ, సౌకర్యాల కల్పనలో చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నాయి. శరణార్థుల స్థితిగతులను చూస్తూంటే కళ్ల వెంట నీళ్లొస్తున్నాయి. బాధాతప్త జీవితాలను కళ్ల ముందుకు తెచ్చినందుకు ధన్యవాదాలు.
-ఎ.వి.సోమయాజులు (కాకినాడ)