S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

మనలో మనం (ఎడిటర్‌తో ముఖాముఖి)

గోనుగుంట మురళీకృష్ణ, రేపల్లె
గోవు తలని కడిగి పసుపు రాసి, బొట్లు పెట్టి పూజించటం హిందూ సంప్రదాయం. ఆ సమయంలో మొల భాగం (పాలు తీసే భాగం) కడిగి బొట్టు పెట్టనవసరం లేదు. అలాగే పాలు తీసేటప్పుడు పరిశుభ్రత కోసం పొదుగు కడుగుతారు. ఆ సమయంలో తల కూడా కడగనవసరం లేదు. ‘తల కడిగితే మొల కడగరు, మొల కడిగితే తల కడగరు’ అనేది గోవు గురించి చెప్పిన సామెత. మనుషుల గురించి కాదు. మన ప్రాచీన జాతీయాలను, సామెతలను అర్థం చేసుకోకుండా ఒక మహానుభావుడి మీద అందరూ దుమ్మెత్తి పోయటం భావ్యం కాదు.
జనంలో చెప్పే మాట పామరులకు కూడా అర్థమయేలా దురభిప్రాయాలకు తావు ఇవ్వని విధంగా జాగ్రత్త పడటం కూడా అవసరమే. గోరంతను కొండంతగా యాగీ చేసి, హిందూ ధర్మం మీద బండలు వేయటానికి కాచుకు కూచున్న వాళ్లు సమాజంలో, మీడియాలో చాలామంది ఉన్నారు. ఆ సంగతి గ్రహించి, మామూలు కంటే ఎక్కువ జాగ్రత్తపడటం పెద్దల బాధ్యత.

ఎ.వి.సోమయాజులు, కాకినాడ
బ్రాహ్మణ కార్పొరేషన్ వారు ‘అర్చకత్వం నిర్వహిస్తున్న బ్రాహ్మణ బ్రహ్మచారులకు వారి పెండ్లి కొరకు, పెండ్లి కూతురికి లక్ష బహుమతి ఇస్తామనడం’ హర్షదాయకం. వైదిక వృత్తి, అర్చక వృత్తి ఆశ్రయించిన బ్రాహ్మణ బ్రహ్మచారులను పెండ్లాడుటకు అమ్మాయి సిద్ధమవటం లేదు. అలాగే ఆమె తల్లిదండ్రులూ ఇష్టపడటం లేదు. బ్రాహ్మణ కార్పొరేషన్ తీసుకున్న ఈ చర్య ప్రకారం లక్ష నజరానా పెండ్లి కూతురికి అనడం వలన అతి కొద్దిమంది అమ్మాయిలైనా సిద్ధపడ్తే మంచిదే కదండీ?
మంచిదే. కాని అది బ్రాహ్మణ వర్గానికి, హిందూ సమాజానికి సిగ్గుపడాల్సిన విషయం.

పి.లక్ష్మీసుజాత, అద్దంకి
జల్లికట్టు, కోళ్ల పందెలపై ఉద్యమించి నిషేధించాలనే వారు జంతుబలులు, మాంసాహారంపై ఎందుకు ఉద్యమించరని, నిషేధం కోరుకొనే వాదనకు పొంతన ఉందంటారా?
ఉంది. ప్రతిరోజూ లక్షల సంఖ్యలో జంతువులను క్రూరంగా, ఘోరంగా నరికి, యమ యాతన పెట్టి చంపితే నోరు మెదపని వారు, దానిని మాన్పించడానికి పోరాడని వారు... సంవత్సరాని కొకరోజు ఆడుకునే సాంప్రదాయక ఆటల్లో ఏవో కొన్ని జంతువులకు బాధ కలుగుతుందని విలవిలలాడి, జంతు హింస పేరిట ఆపించబోవటం ముమ్మాటికీ హిపోక్రసీ! కోళ్లను కోసుకు తినేవాళ్లు పందేల్లో చచ్చే కోళ్లను చూసి ఏడ్చే ఏడుపులకు విలువ లేదు.

ఎం.కనకదుర్గ, తెనాలి
ఎటువంటి క్రియాశీలకమైన కార్యకలాపాలు సాగించని, ప్రభుత్వాలకు అర్థవంతమైన దిశా నిర్దేశం చెయ్యని లెజిస్లేటివ్ కౌన్సిల్ (శాసన మండళ్లు) నేటి ఆర్థిక మాంద్యంలో అవసరం అంటారా? అసెంబ్లీ ప్రతినిధులతో సమానంగా జీతాలు, సౌకర్యాలు పొందే ఎం.ఎల్.సి.లు వెలగబెట్టే నిర్వాకం ఏమిటో అర్థం కావడంలేదు. దేశంలో చాలా రాష్ట్రాలలో కౌన్సిళ్లను రద్దు చేసే ప్రతిపాదనలు ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉన్నాయని చదివాను.
ఆ మాటకొస్తే... ప్రజలు ఎన్నుకునే అసెంబ్లీ, పార్లమెంట్లు ఊడబొడుస్తున్నదీ ఏమీ లేదు. ప్రజా సమస్యలను, శాసన ప్రతిపాదనలను సాకల్యంగా చర్చించటం వాటివల్ల కాదని ఎప్పుడో తేలిపోయింది. తిట్లకు, కొట్లాటలకు, అంతులేని గలభాలకు దిగి సభను అడ్డుకోవడమే లెజిస్లేటర్ల, పార్లమెంటేరియన్ల ప్రతిభకు కొలమానం అనుకునే దుర్గతి పట్టాక చట్టసభల పనితీరు గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఏనాడో వారికి రుణమున్నాం. వేల కోట్ల ప్రజాధనంతో వారిని మేపుతున్నాం. అంతే.

వేదుల జనార్దనరావు, వంకావారిగూడెం, ప.గో.జిల్లా
బహుళ జాతి ఆన్‌లైన్ సంస్థ ‘అమెజాన్’ వస్తువుల ప్రచారంలో జాతీయ పతాకాన్ని అవమానపర్చేలా మహాత్మాగాంధీ చిత్రాలను చెప్పులపైన వేయడాన్ని ఖండించని కాంగ్రెస్ నేతలు ఖాదీ భాండార్ క్యాలెండర్‌లో మహాత్మాగాంధీ ఫొటో స్థానంలో ప్రధాని నరేంద్ర మోదీ చిత్రంపై ఆందోళనలు చేయడం వెనుక ఆంతర్యమేమిటి?
రాజకీయ ద్వేషం. తాము ఏనాడో తలదీపం పెట్టిన గాంధీకి ఇటాలియన్ల పార్టీయే వారసురాలని జనాన్ని నమ్మించాలని చూసే దుస్సాహసం.

సి.ప్రతాప్, శ్రీకాకుళం
ఈ మధ్య రాష్ట్రంలో వివిధ ప్రదేశాల దర్శనం కోసం వెళ్లినప్పుడు నగదు రహిత లావాదేవీల ఆచూకీ ఎక్కడా కనిపించలేదు. పెద్ద హోటళ్లు తప్పితే స్వైపింగ్ మెషీన్ల జాడే లేదు. అన్ని ప్రదేశాలలో నగదు కావాలని ఒత్తిడి చేస్తున్నారు. ఎటియంలు పని చెయ్యక, చిల్లర దొరకక నానా ఇబ్బందులు పడ్డాము. రెండేళ్లలో నగదు రహిత లావాదేవీలు అంటూ ఊదరగొడుతున్న ప్రభుత్వాలు క్షేత్ర స్థాయిలో ప్రజల సమస్యలను పట్టించుకున్నట్లు అనిపించడం లేదు.
ప్రభుత్వం చెవికి ఎక్కేంతలా ప్రజల నుంచి నిరసన లేదు. తమ సంస్కరణను జనం తెగ మెచ్చుకుంటున్నారనే సర్కారు వారు అనుకుంటున్నారు.

కొలుసు శోభనాచలం, గరికపర్రు, కృష్ణాజిల్లా
పెద్ద నోట్ల రద్దుతో అవినీతి, ఉగ్రవాదం అరికట్టవచ్చుననే అభిప్రాయం నెమ్మదిగా బలపడుతుందని నా అభిప్రాయం. మీరేమంటారు?
మీరు గొప్ప ఆశావాదులంటాను.
*

ప్రశ్నలు పంపాల్సిన చిరునామా
*

మనలో మనం,
ఆదివారం అనుబంధం, ఆంధ్రభూమి దినపత్రిక, 36 సరోజినీదేవీ రోడ్,
సికిందరాబాద్-500003.

email : sundaymag@andhrabhoomi.net