S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

స్టోన్ కటర్

ప్రతీ వారికి ఓ జన్మదినం ఉంటుంది. అలాగే ఓ మరణ దినం కూడా ఉంటుంది. జన్మదినం గురించి అందరికీ తెలుసు. కాని మరణ దినం గురించి వారు పోయాక, కేవలం జీవించి ఉన్నవారికే తెలుస్తుంది. అంతే తప్ప ముందుగా ఎవరికీ తెలీదు. ఇలా చెప్పడం కూడా బహుశ అబద్ధమే అవుతుందేమో? ఓ శిల్పికి మాత్రం కొందరి మరణదినాలు ముందుగానే తెలియడం విచిత్రమైన సత్యం. అమెరికాలోని నార్త్ కరోలినా రాష్ట్రానికి చెందిన అతని పేరు పీటర్ మెన్సిస్.
స్టేన్లీ లాక్‌హార్ట్‌కి ఆఫీస్‌కి ఆ రోజు టెలిగ్రాం వచ్చింది. అతని తండ్రి సైమన్ లాక్‌హార్ట్ మరణించబోతున్నాడని, వెంటనే రమ్మని అతని స్వగ్రామం కేసనేట్ నించి తండ్రి ఫేమిలీ డాక్టర్ జేమ్స్ పంపిన టెలిగ్రాం అది. పట్నంలో స్థిరపడ్డ స్టేన్లీ గతంలో తన తండ్రికి కొన్ని చెక్కులని పంపిస్తే ఆయన వాటిని తన అకౌంట్‌లో డిపాజిట్ చేసుకోకుండా వెనక్కి పంపిస్తూ, తనకి కావాల్సింది కొడుకు తప్ప కొడుకు డబ్బు కాదని ఉత్తరం రాశాడు. అతను తండ్రితో క్రితం రోజు ఫోన్‌లో మాట్లాడినప్పుడు కూడా సైమన్ ఆరోగ్యంగానే ఉన్నాడు.
స్టేన్లీ తన గ్రామం వెళ్తూ వెంట తన ఫేమిలీ డాక్టర్ రిచర్డ్‌ని కూడా తీసుకెళ్లాడు. అతను ఇంటికి చేరుకునేసరికి ఇంటి బయట నిచ్చెన మీద నిలబడి ఇంటికి రంగు వేసే తండ్రిని, పక్కనే ఉన్న డాక్టర్ జేమ్స్‌ని చూశాడు. స్టేన్లీకి ఏం పాలుపోలేదు. ఆ అబద్ధపు టెలిగ్రాంతో మూడువేల మైళ్ల దూరం నించి జేమ్స్ తనని పిలిపించినందుకు మండిపడ్డాడు. తను టెలిగ్రాంలో చెప్పింది నిజమే అని, మర్నాడు అతని తండ్రి మరణిస్తాడని జేమ్స్ చెప్పాడు.
తనకి మర్నాడు మరణించాలని లేకపోయినా అది తప్పదని తండ్రి సైమన్ కూడా చెప్పడంతో నిర్ఘాంతపోయాడు. అతని వెంట వచ్చిన డాక్టర్ రిచర్డ్, సైమన్ లాక్‌హార్ట్‌ని పరిశీలించి ఆయన పరిపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాడని చెప్పాడు. స్టేన్లీ డాక్టర్ జేమ్స్ మీద మళ్లీ అరిస్తే ఆయన ఆ ఊళ్లో సమాధి రాళ్లని చెక్కే శిల్పి పీటర్ మర్నాడు సైమన్ మరణిస్తాడనే సూచనని చేశాడని చెప్పాడు. సైమన్ ఐదేళ్ల క్రితం తన సమాధి రాతిని చెక్కమని పీటర్‌ని కోరితే, అతను దాని మీద జననంతోపాటు మరణం తేదీని కూడా చెక్కాడని, అలా గతంలో ఒకసారి కాదు, రెండుసార్లు కాదు, అనేక సార్లు పీటర్ చెక్కిన మరణ తేదీనే ఆ వ్యక్తులు మరణించారని డాక్టర్ జేమ్స్ చెప్పాడు. అది ఉత్త మూఢ నమ్మకమని, అతను మరణ తేదీని చెక్కడం, వాళ్లు అదే రోజు మరణించడం నిజంగా జరిగి ఉంటే అది కేవలం కాకతాళీయంగా జరిగి ఉంటుందని స్టేన్లీ కొట్టి పారేశాడు. వైద్య శాస్త్రం చదివిన జేమ్స కూడా ఇలాంటి వాటిని నమ్మడాన్ని స్టేన్లీ తప్పు పట్టాడు. ఆయన, ఆ ఊరి ప్రజలు మూఢ నమ్మకాల్లో వందేళ్లు వెనక పడ్డారని దుయ్యబట్టాడు.
స్వయంగా వచ్చి చూడమని జేమ్స్ చెప్తే, అంత హాస్యాస్పదమైన విషయం జీవితంలో ఎన్నడూ చూడలేదని స్టేన్లీ విసుక్కుంటూ సెప్టెంబర్ 6, 1957న పీటర్ దగ్గరికి వెళ్లాడు. అతను చెక్కిన సైమన్ సమాధి రాయిని డాక్టర్ జేమ్స్ చూపించాడు. ‘సైమన్ లాక్ హార్ట్ బార్న్ జులై 10, 1883, డైడ్ సెప్టెంబర్ 7, 1957’ అని ఆ రాతి మీద చెక్కి ఉంది. తన చిన్నప్పుడు ఒకామె మరణ తేదీని ఆ శిల్పి ముందే చెక్కిన ఉదంతం స్టేన్లీకి గుర్తొచ్చింది. ఐనా తండ్రి, డాక్టర్ కలిసి తన మీద ప్రాక్టికల్ జోక్ వేశారని స్టాన్లీ భావించాడు. పీటర్‌తో అతను ఆ తారీఖు చెక్కడం మోసం అని, తన తండ్రి తనని రప్పించడానికి అలా కోరి చెక్కించాడనే నిజాన్ని తన ముందు ఒప్పుకోవడానికి ఎంత కావాలని అడిగాడు. ఐదు వందల డాలర్లకి చెక్‌ని కూడా రాసిచ్చాడు. కాని పీటర్ దాన్ని చింపేసి డబ్బు నిజాన్ని అబద్ధం చేయలేదని, తను తనకి తెలీకుండానే కొన్ని రాళ్ల మీద పేర్లు చెక్కేప్పుడు మరణ తేదీని చెక్కుతున్నానని, తను చెక్కిన రాతిని వంద ముక్కలు చేసినా సరే అతని తండ్రి మర్నాడు మరణించడం తథ్యం అని, తనని విసిగించకుండా వెళ్లమని కసిరాడు. తన తండ్రికి ఫోన్ చేసి అది అబద్ధం అని చెప్పమని కోరితే ఒక్క ఫోన్ కాల్ వచ్చే మరణాన్ని ఆపలేదని పీటర్ నిరాకరించాడు.
మర్నాడు స్టేన్లీ నిద్ర లేచేసరికి బయట ఆదుర్దాగా వేచి ఉన్న తన వెంట తెచ్చిన డాక్టర్ రిచర్డ్ చెప్పాడు.
‘పది నిమిషాల క్రితం మీ తండ్రి సైమన్ గుండె హఠాత్తుగా బిపి రెయిజ్ అయిన వారి గుండెలా కొట్టుకుంటోంది. కాని ఆశ్చర్యంగా బిపి లేదు. ఇది మంచి సూచన కాదు’
స్టేన్లీ వెంటనే తండ్రి దగ్గరికి వెళ్లాడు. మంచం మీద పడుకుని ఉన్న ఆయనకి అది సైకోసిమాటిక్ సూచన మాత్రమే అని, ఆయన జీవించే ఉంటాడని స్టేన్లీ ధైర్యం చెప్పసాగాడు. కాని సైమన్ తన రాసిన విల్లు గురించి చెప్పి, కొడుకు కళ్ల ముందే కొద్ది నిమిషాల్లో తుది శ్వాస వదిలాడు.
మర్నాడు స్థానిక దినపత్రికల్లో ఈ వార్త వెలువడింది. అన్నీ సరిపోవడంతో ఆ శిల్పి చెక్కిన సమాధి రాతినే సైమన్‌కి వాడారు. స్టేన్లీ మాత్రం ఆ శిల్పే తన తండ్రిని హత్య చేశాడని పోలీసులకి ఆరోపించాడు. కాని వారు శిల్పి చేసింది చట్టవ్యతిరేకం కాదని ఫిర్యాదు తీసుకోడానికి నిరాకరించారు.
స్టేన్లీ ఆ ఊళ్లోంచి తిరిగి వెళ్తూ పీటర్‌ని కలిసి అతనికి కోరినంత డబ్బు ఇస్తానని, ఇక మీదట మరణ తేదీని చెక్కడం ఆపమని కోరాడు. కాని తనకి అంతర్గతంగా వినిపించే ఆ సూచనని విస్మరించి వాటిని చెక్కకుండా ఉండలేనని అతను జవాబు చెప్పాడు. వారి మధ్య వాదన పెరిగి కోపం పట్టలేక స్టేన్లీ అతను వాడే సుత్తితో పీటర్ తల మీద కొట్టి చంపాడు. ఆ శిల్పి ముందే చెక్కి ఉంచుకున్న తన సమాధి రాతి మీది మరణ తేదీ ఆ రోజే! అంతే కాదు. పీటర్ స్టేన్లీ సమాధి రాయిని కూడా మరణ తేదీతో చెక్కి ఉంచాడు. ‘స్టేన్లీ లాక్‌హార్ట్ బార్న్ 3 సెప్టెంబర్ 1921: మరణం 14 డిసెంబర్ 1958’
పీటర్ మెన్సిస్‌ని హత్య చేసినందుకు స్టేన్లీకి విధించిన మరణ శిక్షని 14 డిసెంబర్ 1958న అమలు చేశారు.
ఈ రోజుకి కూడా ఆ సమాధి రాతిని చూడటానికి కొందరు పర్యాటకులు ఆ శ్మశానం దగ్గర ఆగుతూంటారు. చిన్న సావనీర్ దుకాణం కూడా అక్కడ పని చేస్తోంది.

- పద్మజ