S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

మనలో మనం (ఎడిటర్‌తో ముఖాముఖి)

సిహెచ్. సాయ ఋత్విక్, నల్లగొండ
ప్రతీ బడ్జెట్‌లో రైల్వే భద్రత పేరిట కొత్త సెస్సులు, సర్‌చార్జీలూ వసూలు చేసే రైల్వేశాఖ ప్రయాణీకుల భద్రత మాత్రం గాలిలో దీపం చందాన మార్చేసింది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో వున్నా వాటిని ఉపయోగించుకోవడంలో రైల్వేశాఖ పూర్తిగా విఫలమైంది. వారి వైఫల్యం కారణంగా ప్రయాణీకులు ప్రాణాలు కోల్పోతున్నా ఆ శాఖ ఎందుకు బాధ్యత వహించడం లేదు? ప్రభుత్వపరంగా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటే ప్రమాదాల సంఖ్య కొంతవరకైనా తగ్గే అవకాశం వుంది కదా?
రైలు ప్రమాదాలకు కేవలం సిబ్బందిని నిందించి ప్రయోజనం లేదు. రైలుపట్టాల పటిష్ఠత, సిగ్నలింగ్ వ్యవస్థ నిర్దుష్టత అంతంతమాత్రం. నిర్వహణ సామర్థ్యం, వివిధ విభాగాల మధ్య సమన్వయం గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. మాటలు ఎక్కువ... చేతలు తక్కువ... మితిమించిన వ్యాపార దృష్టి... ఇంకా ఇంకా....

ఎల్. ప్రపుల్లచంద్ర, ధర్మవరం
మీ దృష్టిలో ఉత్తమ రాజకీయ నేత ఎలా ఉండాలంటారు? మీకు ఎవరంటే ఇష్టం?
అందరూ ఉత్తనేతలే.

ఎన్. రామలక్ష్మి, సికిందరాబాద్
మనవారు బరువు తగ్గించుకోవడానికి విదేశాలకు వెళుతుంటే అదే పనిమీద ఓ ఐదువందల కేజీల వనిత మన దేశానికి రావటమేమిటండి?
విదేశాల్లో చదువులకు మనవాళ్లు ఎగబడుతూంటే మన యూనివర్సిటీల్లో చదువులకు ఎన్నో దేశాలవాళ్లు రావటం లేదా?

ఎమ్మెల్యే రోజాను ఆహ్వానించి అవమానించడం నేరం కాదా? ఇది జాతీయ మహిళా పార్లమెంటు సదస్సు స్ఫూర్తినే దెబ్బతీసింది కదండీ.
ఔను. రచ్చబండ చేసింది.

ఉప్పు సత్యనారాయణ, తెనాలి
మహానటుడు ఎన్టీఆర్ జీవిత చరిత్రను సినిమాగా తెరకెక్కించాలనే ఆలోచన మంచిదే. అయతే ఆ చిత్రంలో హీరో పాత్రలను, వాటి రాజకీయ యుక్తులు, కుయుక్తులను అన్ని కోణాలలో చూపించగల్గటం సాధ్యమేనంటారా?
ముందు విలన్(లు) ఎవరో తేల్చుకుని సినిమా తీస్తే మంచిది.

ఎల్. ప్రపుల్లచంద్ర, ధర్మవరం
దయ్యాల సినిమాలు కూడా హిట్టవుతున్నాయ, అంటే దయ్యాలు వున్నాయంటారా?
ఉన్నాయ. సినిమాలను కొన్ని తీస్తుంటాయ. కొన్ని చూస్తుంటాయ.

సీరపు మల్లేశ్వరరావు, కాశీబుగ్గ, శ్రీకాకుళం జిల్లా
చైనా భారత్‌కు బద్ధ శత్రువు అని తెలుసు కదా. రాష్ట్ర ప్రభుత్వం చైనాతో చేపల వ్యాపారం, ఎర్రచందనం ఒప్పంద వ్యాపారం, అమరావతి నిర్మాణానికి చైనా కంపెనీలను రప్పించడం సబబా?
ఒక్క చంద్రబాబనే ఏమిటి? చైనాతో చెలిమికి దేశంలోని మిగతా రాష్ట్రాలవారూ, ఆ మాటకొస్తే, కేంద్ర ప్రభువులూ అర్రులు చాస్తున్నారు. అనుభవాలు ఎన్ని అయనా చైనా తత్వం మనవాళ్లకు బోధపడటం లేదు.

ఎస్. శ్రీనివాసరావు, ఎమ్మిగనూరు, కర్నూలు జిల్లా
తమిళనాడులో బిజెపివారు తమ స్వలాభాలకు గవర్నర్‌ను వాడుకుంటున్నారంటూ లెఫ్టిస్టు నాయకులు స్టేట్‌మెంట్లు ఇస్తున్నారు. మరి గతంలో రాజీవ్‌గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఎం.జి.రామచంద్రన్ మరణించాక, ఇదే తమిళనాడులో జయలలిత, జానకీ రామచంద్రన్ కుర్చీ కోసం పోటీపడుతుంటే, ఏకంగా తమిళనాడు శాసనసభనే రద్దుచేసి ఎలక్షన్లు పెట్టారు. అప్పుడు ఈ కమ్యూనిస్టులు ఊరుకున్నారేం? అప్పుడు ప్రజాస్వామ్యం కనిపించలేదా?
సమయానుకూలంగా మాట మార్చటమే రాజకీయ మాయావుల ప్రత్యేకత.

మార్టూరు అజయ్‌కుమార్, రామచంద్రాపురం
కొంతమంది ప్రముఖులు మరణానంతరం వారికి పద్మ పురస్కారాలు ఇస్తున్నారు. ఆ ఇచ్చే అవార్డు ఏదో వారు బతికి ఉన్నప్పుడే ఇస్తే వాళ్లూ ఎంతో సంతోషపడేవాళ్లు కదా. చో రామస్వామి నిన్నా మొన్నటి వరకు బతికే ఉన్నారు. అంటే వ్యక్తి మరణిస్తే కానీ వారి ప్రతిభ ప్రభుత్వాలకు తెలియదనుకోవాలా?
అలాగే ఉంది.

vanivatsal@rediffmail.com

రాష్టప్రతి ఎన్నికకు అభ్యర్థిగా అడ్వాని గారి పేరు వెనక్కి పోయ, మురళీమనోహర్ జోషి గారి పేరు ముందుకు వచ్చిందట ఏమిటండి? మోదీజీకి అడ్వాని మీద ఎందుకంత కక్ష?
అదేమో వారిద్దరికే తెలియాలి. ఆ పెద్దాయన పుల్లవిరుపు మాటలు అనకుండా ఉండలేడు. మురళీ మనోహర్ జోషిగారు సామాన్యుడేమీ కాదు. ఆయన రాష్టప్రతి పదవికి అన్నివిధాల తగినవాడే.

**
ప్రశ్నలు పంపాల్సిన చిరునామా
మనలో మనం,
ఆదివారం అనుబంధం, ఆంధ్రభూమి దినపత్రిక,
36 సరోజినీదేవీ రోడ్,
సికిందరాబాద్ - 500003. : email :
sundaymag@andhrabhoomi.net