S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

మా తెలుగు తల్లికీ మల్లెపూదండ..

మాటలే కవికీ మూటలూ
గుండెల మీటలూ
నాదమే కవికీ మోదమూ
మూడవ వేదమూ..
నార్లవారి ఈ పాట కొన్ని దశాబ్దాల క్రితం ప్రముఖ గాయని పి.సుశీల పాడింది. పాటలోని మాటలన్నీ సుశీల కంఠంలోని మాధుర్యంతో తడిసిపోయి గుండె లోతుల్ని తాకే ఈ పాట, నేనెప్పుడు విన్నా ‘అప్పుడే విన్న అనుభూతి’ కల్గుతుంది.
అందుకే అర్థవంతమైన మాటలు, సారవంతమైన సంగీతంతో కలిస్తేనే సార్థకత -
‘పాట పక్షి లాంటిది. మాట మనిషి వంటిది’ అన్నారు దేవులపల్లి కృష్ణశాస్ర్తీ.
పాట, మాట కలిస్తేనే స్వరవర్ణ క్రమం అవుతుంది. అదే లలిత గీతం. పాట చదువుకోవడానికి ఉద్దేశించి కాదు. ఎవరో బాణీ కూర్చాలి. ఎవరో పాడాలి. దానికి జంత్ర వాద్య సమ్మేళనం ఉండాలి. అప్పుడే దానికి సమగ్రత.
పాటలకు సంబంధించినంత వరకూ ప్రతి పాటకూ ఒక ఇతివృత్తం ఉంటుంది. పాడే వారి ద్వారా వ్యక్తపరచవలసిన భావం ఉంటుంది. నేర్చుకున్న బాణీని నేర్చుకున్నట్లుగా, చిలక పలుకుల్లా అప్పజెప్పే గాయకులే ఎక్కువగా ఉంటారు.
భావాన్ని ‘తమది’గా చేసుకోవాలి. గుండె లోతుల్లోంచి ఆ పాట బయలుదేరి రావాలి.
అప్పుడే ఆ పాటకు జవం, జీవం రెండూ వస్తాయి.
సాహిత్య ప్రక్రియలన్నిటిలోనూ, జనానికి చేరువయ్యేది పాటే - ఆలోచనా ప్రవాహంలో తిరుగుతూ కవి హృదయంలో నుంచి అలా వచ్చే పాటలు సమాజ హితమే ధ్యేయంగా ఉంటే అవి నాలుగు కాలాలపాటు సజీవంగా నిలిచిపోతాయనటానికి సాక్ష్యంగా నిలిచే పాటలు చాలా ఉన్నాయి. కళ్ల ముందు నడయాడుతూ మెరుపులా మాయమైన వ్యక్తుల్ని తలచుకున్నప్పుడల్లా మనసు కాసేపు నిశ్చలమై నిలిచిపోతూంటుంది.
మన ఆంధ్ర దేశంలో కవులకు లోటు లేదు. కానీ, కీర్తి కోసం పాకులాడకుండా ‘నేను నా ప్రజలు, నా జాతి, నా దేశం, నా భాష’ అంటూ నిరంతరం తపిస్తూ ప్రజా హృదయాల్లో నిలిచిపోయే కవుల్ని సాధారణంగా ఎవరూ పట్టించుకోరు.
‘మా తెలుగు తల్లికీ మల్లెపూదండ
మా కన్నతల్లికీ మంగళారతులు
కడుపులో బంగారు కనుచూపులో కరుణ
చిరునవ్వులో సిరులు దొరలించు మా తల్లి॥
అనే ఈ పాట మన రాష్ట్ర గీతం. ఈ గీత రచయిత శంకరంబాడి సుందరాచారి, మన రాష్ట్ర కవి. మొదటిసారి, టంగుటూరి సూర్యకుమారి గొంతులో ఈ పాట విన్నాను. రేడియోలో ఉద్యోగం చేసే రోజుల్లో లలిత గీతాలతో ప్రత్యేక కార్యక్రమాలు చేస్తూండేవాణ్ణి. తరచుగా ఈ పాట వినిపిస్తూ అద్భుతమైన పాటను అందించిన కవిని మనసులోనే అభినందిస్తూ ఉండేవాణ్ణి. సుందరాచారికి మిత్రుడైన పులికంటి కృష్ణారెడ్డితో ఈ కవిని గురించి ప్రస్తావించాను. ఆయన కళ్లనీరు తిరిగింది - కారణం? కృష్ణారెడ్డి, సుందరాచారి కవి మిత్రులు - వారి మైత్రీబంధాన్ని ఓ గంటన్నరసేపు చెప్పాడు. ఇద్దరూ చిత్తూరు జిల్లా వాసులే.
సరళమైన మాటలతో సంగీతాన్ని చిలికిస్తూ హాయిని గొల్పే ఆ పాటలో ఏదో నిత్య నూతనత్వం తొణికిసలాడుతూ కనిపిస్తుంది చూడండి. ఒళ్లు పులకిస్తుంది.
ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు తమ్ముని కూతురు సూర్యకుమారి.
‘మా తెలుగు తల్లికి మల్లెపూదండ’ పాడి పేరు సంపాదించిన సూర్యకుమారి.. గ్రామఫోన్ రికార్డులిచ్చిన మొట్టమొదటి గాయని.
ఈ పాటకు బాణీ ఎవరు కూర్చారో తెలియదు కానీ మాటల్లోని భావాలకు తగ్గ రాగం, చక్కగా కుదిరి మళ్లీమళ్లీ వినాలనిపించేలా ఉంటుంది.
ఒక పాట ప్రసిద్ధమవ్వాలంటే కవి, గాయకులూ ఇద్దరూ కారణమే. ఒకరు లేకపోతే మరొకరు లేరు.
బాలబాలికలెల్లరు భక్తిపాడ
పండిత కవులు సంప్రీతి ప్రస్తుతింప
శంకరంబాడి సుందరాచారి నెంతు! అన్నారు డా.జానమద్ది హనుమచ్ఛాస్ర్తీ. శంకరంబాడి సుందరాచారి రాసిన ఈ పాట సూర్యకుమారికి ఎంతో పేరు తెచ్చింది.
గలగలా గోదారి కదలిపోతుంటేను
బిరబిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటేను
బంగారు పంటలే పండుతాయి
మురిపాల ముత్యాలు దొరలుతాయి...’
భీమపలాస్ రాగస్వరాలు పొదిగిన ఈ మాటలు వింటే మనసు పొంగిపోతుంది. సద్భావనల వెల్లువతో గుండె ఆర్ద్రవౌతుంది.
ప్లేబాక్ సిస్టమ్ ఇంకా లేని రోజుల్లో ఆమె పాడిన దేశభక్తి గీతాలు, లలిత గీతాలు అప్పట్లో గ్రాంఫోన్ రికార్డులు అందరిళ్లలోనూ వుండేవి. ఆమెను గుర్తుకుతెచ్చే.. ‘శతపత్ర సుందరి, ఎవరు విన్నారెవరు కన్నారు, ఉదయమ్మాయెను స్వేచ్ఛా భారతి’ మ్రోయింపు జయభేరి, మాదీ స్వతంత్ర దేశం... మొదలైన పాటలు బాలాంత్రపు రజనీ కాంతరావుగారి సృష్టే. బసవరాజు అప్పారావు, అడివి బాపిరాజు, దేవులపల్లి, శ్రీశ్రీ లాంటి భావ కవుల పాటలకు ప్రాణం పోసిన చక్కని మధుర గాయని.
1937లో ‘విప్రనారాయణ’ అనే తమిళ చిత్రంతో సూర్యకుమారి చలనచిత్ర జీవితం ఆరంభమై, 1947 నుంచీ 1951 వరకూ తమిళ సినిమాల్లో నటించింది. బళ్లారి రాఘవతో తెలుగులో నటించిన మొదటి తెలుగు చిత్రం ‘రైతుబిడ్డ’ (1939). బళ్లారి రాఘవ, సిఎస్‌ఆర్, గిడుగు సీతాపతి ఇందులో ప్రధాన నటులు. 1944 నుంచి ఎన్నో సంఘ సేవా కార్యక్రమాల్లో పాల్గొంది. ఎన్నో అనాథాశ్రమాలకు, సేవాశ్రమాలకు ఆర్థిక సహాయం చేసింది. 1973లో ‘హెరాల్డ్ ఎల్విన్’ను వివాహం చేసుకుని లండన్‌లో స్థిరపడిపోయింది.
ఎవరెవరి జీవితాలు ఏయే దశలో ఎనె్నన్ని మలుపులు తిరుగుతాయో ఎవరూ చెప్పలేరు. మనిషి జీవితం.. కొన్ని అనుభవాల రాశి. తన అనుభవాలే తనకు గురువుగా తోచి తనకు తాను మార్చుకుని బాగుపడవచ్చు. కానీ ఆశ్చర్యం ఏమంటే తన అనుభవాల ద్వారా విషయం తెలుసుకుంటాడు. కాని ‘తనను’ మార్చుకొనలేడు.
దీనికి అడ్డం వచ్చేవి అతని గత జన్మల వాసనలు. అతని ప్రారబ్దం చేత ఘటనలు, ఘట్టాలు అనుభవాలు జరుగుతూండగా, వాటివల్ల కలిగిన తెలివిడి వల్ల తనలో మార్పునకు అడ్డం పడుతూండేవి ఈ వాసనలు. దీనికి సాక్షి శంకరంబాడి. ‘మా తెలుగు తల్లికి మల్లె పూదండ’ పాట పాడిన సూర్యకుమారి కీర్తికి కారణం సుందరాచారి - ఈయన జీవితం చాలా విచిత్రం. డా.తిమ్మావజ్జల త్యాగరాజమూర్తి ఆయన రచనలపై సిద్ధాంత వ్యాసమే రాశారంటే సుందరాచారి ఎంతటి ప్రతిభాశాలియో ఆలోచించండి.
కొందరి కవుల రచనలు వింటే చెప్పని అంశాలు కూడా బుర్రలో మెదుల్తాయి. సుందరాచారి, తన బాల్యమిత్రుడైన కపిస్థలం శ్రీరంగాచార్యుల వారితో కలిసి పద్యాలు చెప్పేవారు. ఆ రోజుల్లోనే తిరుపతిలో ఈ ఇద్దరూ చాలా ప్రసిద్ధి చెందిన జంట కవులు.
గాంధీ నిర్యాణం వేళ సుందరాచారి మనఃక్లేశంతో రాసిన పాట ‘బలి బలి బలి భారతవీరా బలిదానంబిది భారత వీరాంబ విధానంబిది’ గేయం జాతి హృదయాన్ని కదిలించిందని డా.జానమద్ది వారు చెప్పారు.
సుందరాచారి కవిత్వం, ఒక్కటే కాదు బహుముఖ ప్రతిభ వున్నవాడు. సంగీతం, చిత్రలేఖనం, నటన, సంఘ సంస్కరణాది ఎన్నో విషయాలలో అపారమైన ఆసక్తి ఉండేది. కర్ణాటక సంగీతం మక్కువగా వినేవారు.
కవిత్వం అంటే అదేదో బ్రహ్మ పదార్థంలా భావించే వారి కోసం మన తెలుగు భాషలోని గొప్పదనాన్ని, తీయదనాన్ని, సౌకుమార్యాన్ని తేటతేట మాటలతో తేట గీతుల్లో సరళంగా అల్లి విద్యాలయాల్లో ప్రచారం చేయాలనేది ఆయన మహా సంకల్పం. వందలాది స్కూళ్లకు వెళ్లి తన వాక్చాతుర్యంతో విద్యార్థులకు ఇష్టుడై, వారి ప్రేమను చూరగొన్న శంకరాచారి రచనలు, మహాకవులను సైతం విస్మయపరిచాయి.
శ్రీపాద కృష్ణమూర్తి శాస్ర్తీ, రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ మొదలైన వారి ప్రశంసలందుకున్న కవి.
కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ, గడియారం వేంకట శేషశాస్ర్తీ, పుట్టపర్తి నారాయణాచార్యులు, రాజశేఖర శతావధాని లాంటి పెద్దపెద్ద కవుల నీరాజనాలు అందుకున్న శంకరంబాడి జీవితం ఏమీ సవ్యంగా సాగలేదు. సుఖపడిన ఘడియలు చాలా స్వల్పమే. కాని ఆయన సిద్ధ సంకల్పుడు. తేటగీతి తెలుగు పద్యానికి ఒఱవడి నేర్పిన ఘనుడు - తెలుగు పాటకు సొగసులు దిద్దిన మేటి.
‘అమరావతీ గుహల అపురూప శిల్పాలు
త్యాగయ్య గొంతులో తారాడు నాదాలు
తిక్కయ్య కలములో తియ్యందనాలు
నిత్యమై, నిఖిలమై, నిలిచి యుండేదాక
రుద్రమ్మ భుజశక్తి, మల్లమ్మ పతిభక్తి
తిమ్మరసు ధీయుక్తి, కృష్ణరాయల కీర్తి
మా చెవుల రింగుమని మారుమ్రోగే దాక
నీ పాటలే పాడుతాం, నీ ఆటలే ఆడుతాం
జై తెలుగు తల్లీ!’ అని ఎలుగెత్తి చేసే బృందగానం ఎప్పుడు విన్నా ఒక్కసారి, ఒళ్లు గగుర్పొడుస్తుందా? లేదా? చెప్పండి?!
బహుళ గ్రంథ రచనలు చేసి, మహాకవుల ప్రశంసలందుకున్న సుందరాచారి జీవితమంతా సమస్యల వలయమే. జీవనోపాధి కోసం ఆయన ఎత్తని అవతారమంటూ లేదు. స్వాభిమానం ఎక్కువ. పరమ స్వతంత్రుడు. ఒకవైపు కట్టుకున్న భార్యకు మానసిక స్థిమితం లేదు. మనోవ్యాధి పీడితయైన భార్యకు చికిత్సతోనే గడిచింది. కొన్నాళ్లకు ఓ పుత్రిక పుట్టింది. ఐదేళ్ల వయసుకే గతించింది. మరికొంత కాలానికి సతీమణి కూడా గతించింది. ఏకాకిగా బ్రతుకు పోరాటంలో విసిగిపోయాడు. ఆంధ్రపత్రిక నడిపే దేశోద్ధారక కాశీనాధుని నాగేశ్వరరావు పంతులు గారి దగ్గర ప్రూఫ్‌రీడర్‌గా చేరాడు. ‘కళావని’ శీర్షికలో వైవిధ్యంగల అనేక వ్యాసాలు రాశారు. చిత్తూరు నాగయ్య ప్రోత్సాహంతో (చిత్తూరు జిల్లా వాసి కావడం వల్ల) హెచ్‌ఎంవి కంపెనీలో కవిగా కొన్ని నాటకాల సెట్లు రాశారు. 1946లో హెచ్.ఎం.రెడ్డిగారి నిర్వహణలో ‘దీనబంధు’ చిత్రంతో సినిమా రంగ ప్రవేశం చేశారు. ఆ చిత్రంలో నౌకా విహారానికి తగిన పాట వ్రాయమని కోరితే ‘మా తెలుగుతల్లికి...’ అనే పాట రాసిచ్చారు. పారితోషికంగా వంద రూపాయలు ఇచ్చారు. కానీ అది సన్నివేశానికి తగ్గట్టు లేదన్నారు. ఆ పాటలో సాహిత్యానికి ముగ్ధురాలైన టంగుటూరు సూర్యకుమారి ఆ గీతాన్ని సర్వహక్కులతో రూ.116/-కు కొని గ్రామఫోన్ రికార్డు ఇచ్చారు. 1975 ఏప్రిల్ 12న ఉగాది రోజు హైదరాబాద్‌లో మొదటి ప్రపంచ తెలుగు మహాసభలు జరిగాయి. ప్రారంభోత్సవానికి లండన్ నుంచి సూర్యకుమారిని పిలిచారు. సకల రాజోచిత మర్యాదలందుకుంటూ వేదికపైకి వచ్చి ‘మా తెలుగు తల్లికి...’ పాట పాటేసి చక్కా వెళ్లిపోయింది. భారతదేశానికి జనగణమన’ జాతీయ గీతమైనట్లే, ‘మా తెలుగు తల్లికి...’ పాట మన రాష్ట్ర గీతమైంది ఆరోజే. ప్రతి విద్యాలయంలో ఉదయం ఈ గీతాన్ని పిల్లల చేత పాడించి తరగతులు ప్రారంభించాలని తీర్మానం కూడా చేశారు అట్టహాసంగా.
‘అల నన్నయకు లేదు, తిక్కనకు లేదు ఆ భోగమని’ విశ్వనాథ గారన్నట్లుగా ‘ఈ భాగ్యం రాయప్రోలుకు దక్కలేదు. కృష్ణశాస్ర్తీకి దక్కలేదు. మా గురువు గారికి దక్కింది’ అన్నారు మధురాంతకం రాజారాం. అంతవరకూ బాగానే వుంది.
దురదృష్టం ఏమంటే ‘దేశ భాషలందు తెలుగు లెస్స’ అని వల్లె వేస్తూ, మన తెలుగు భాషాభివృద్ధికి, ఔన్నత్యానికి చేపట్టివలసినవీ, ఉద్ధరించవలసినవీ చర్చించే సంరంభంలో మునిగిపోయిన మేధావులకు ఈ పాట రాసిన శంకరంబాడి అక్కడే నడయాడుతున్నా గుర్తించలేకపోయారు. అసలా పాట రాసిన కవి ఎవరో ఆరా తీసే ఓపిక కూడా ఎవరికీ లేకపోవడం చాలా ఆశ్చర్యం కలిగించదూ?
ఒకసారి జవహర్‌లాల్ నెహ్రూ ప్రధానిగా వున్న ఆ రోజుల్లో మాలల సంక్షేమం గురించి ‘శంకరంబాడి ఆంగ్లంలో రాసిన గేయం వినిపించే అవకాశం కలిగింది. ఆ గేయంలోని భావాలు నెహ్రూని ముగ్ధుడ్ని చేశాయి. వెంటనే రూ.500లు చెక్కు చేతికిచ్చి మనసారా అభినందించిన సన్నివేశాన్ని తన జీవితంలో మరపురానిదిగా చెప్పుకుంటూ బ్రతికిన సుందరాచారికి ఎటువంటి గౌరవం దక్కాలి? సినిమా వాసన లేకుండా స్వచ్ఛంగా, శుద్ధమైన బాణీలో తెలుగుతనం ఉట్టిపడే ఈ పాట, కనీస సంగీత జ్ఞానం వుంటే గాని అందరూ పాడలేరు. విద్యాలయాల్లో రోజూ పాడించటం సంగతి అలావుంచండి. కనీసం రాష్ట్రావతరణ దినోత్సవం రోజైనా ఈ పాటను, ఈ పాట రాసిన కవినీ తలుచుకుంటే చాలు. అదే ఆయనకు మనమిచ్చే పెద్ద నివాళి.
*

చిత్రాలు.. శంకరంబాడి సుందరాచారి, సూర్యకుమారి

- మల్లాది సూరిబాబు 9052765490