S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

క్రీనీడ

భిన్న సంస్కృతులు, సంప్రదాయాలు, కళలు మేళవించిన పంచరంగుల భారతావని మనది. ఒక్కో ప్రాంతానికి ఒక్కో ప్రత్యేకత. ఒక్కో రాష్ట్రానిది తనదైన అనిర్వచనీయ శైలి. మన సంప్రదాయంలో ప్రతిదీ కూడా ప్రజల్ని ఆకట్టుకొనేది. ‘క్రీడ.. క్రీనీడ’ కవర్‌స్టోరీ మమ్మల్ని ఎంతగానో అలరించింది. తమిళనాట చెలరేగిన జల్లికట్టు వివాదంతో అన్ని రాష్ట్రాలు కూడా తనదైన జంతు క్రీడలను తెరపైకి తెస్తున్నాయన్నది వాస్తవం. కొన్ని రాష్ట్రాలైతే నిషేధాన్ని సైతం ఎత్తివేస్తూ జనరంజకమైన క్రీడలకు పునరుజ్జీవనం కలిగిస్తున్నాయి. చక్కటి వ్యాసాన్ని అందజేసినందుకు ధన్యవాదాలు. ‘సండే గీత’ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఓ చిన్న మాటలో ‘తీర్పు’లు గురించి చాలా బాగా వివరించారు. మన తీర్పుల వల్ల శిక్ష మనకే పడుతుందని, తీర్పులు చెప్పడం న్యాయమూర్తుల పని అని చక్కగా చెప్పారు.
-పి.ఆదిత్యమూర్తి (గొల్లలమామిడాడ)
అపురూపం
‘అమృతవర్షిణి’ శీర్షిక అపురూపం. ఏనాడో మర్చిపోయిన.. నేటి తరానికి తెలీని ఎన్నో సంగతులను మళ్లీ వేదిక మీదికి తెచ్చి మా ముందు పరస్తున్నారు. ‘మా తెలుగు తల్లికీ మల్లెపూదండ’ పాట వెనుక ఇంతటి కథ ఉందని ఎవరూ ఊహించరు. అసలు తెలీదు కూడా. శంకరంబాడి జీవితం ఏవీ సవ్యంగా సాగలేదు. సుఖపడిన ఘడియలు చాలా స్వల్పమే. కానీ ఆయన సిద్ధ సంకల్పుడు. తేటగీతి తెలుగు పద్యానికి ఒరవడి నేర్పిన ఘనుడు - తెలుగు పాటకు సొగసులు అద్దిన మేటి. ఆ పాటని తలచుకొంటే .. సరళమైన మాటలతో సంగీతాన్ని చిలికిస్తూ హాయినిగొల్పే ఆ పాటలో ఏదో నిత్య నూతనత్వం తొణికిసలాడుతూ కనిపిస్తుంది. ఒళ్లు పులకరిస్తుంది. భీమపలాస్ రాగ స్వరాలు పొదిగిన ఈ మాటలు వింటే మనసు పొంగిపోతుంది. సద్భావనల వెల్లువతో గుండె ఆర్ద్రవౌతుంది. చక్కటి వ్యాసాలను అందజేస్తున్న సూరిబాబు గార్కి కృతజ్ఞతలు.
-డా.శివభూషణం (కర్నూలు)
ఆకాశవాణి
‘లబ్ద ప్రతిష్టుల వాణి అలనాటి ఆకాశవాణి’ వ్యాసం ద్వారా ఉషశ్రీ గారి, సి.రామమోహనరావు గారి మాటలను, ఆనాటి విజయవాడ ఆకాశవాణి కేంద్ర వైభోగాన్ని గుర్తు చేశారు. జగ్గయ్యగారు చదివే న్యూస్ వినలేదు గానీ, ఆనాటి పన్యాల రంగనాథరావు గారి కంఠం అద్భుతం. ప్రతి సంఘటననూ కళ్లకు కట్టినట్లు చదివేవారు. ఇక అద్దంకి మన్నార్ గురించి చెప్పనే అక్కర్లేదు. ఇలా చెప్పుకుంటూ పోతే- ఆనాటి ఆకాశవాణి కళాకారులు ఎంతోమంది తమ గాత్రంతో శ్రోతలను అలరించారు. ఆయా సంఘటనలన్నీ మళ్లీ కళ్ల ముందు మెదిలాయి.
-ఎ.వి.సోమయాజులు (కాకినాడ)
స్వాగతం
‘కథాసాగరం’ చదువుతున్నప్పుడు ‘మంచి మనసుకు స్వాగతం’ అనే సినీ గీతి, అలాగే రవీంద్ర కవీంద్రుని ‘చండాలిక’ నృత్య నాటిక ఆంధ్రీకరణ చేసిన శోభానాయుడు ప్రభృతులు నటించిన, భుజంగరాయ శర్మ గారి రచన గుర్తుకు వచ్చాయి. ‘వాసవదత్త’ అనగానే పలువురికి ‘స్వప్న వాసవదత్త’ మనసులో మెదలుతుంది. ఉపగుప్తస్వామి, వాసవదత్తల సంఘటన ‘ది గుడ్ సమారిటన్’ను జ్ఞాపకం చేస్తాయి. సౌభాగ్య గారు కథానిక భూమికి హైలైట్. జంబోగారు రాసిన మాటలు ‘చిన్నమాట’ అయినా భాగస్ఫోరకం. ‘లోకాభిరామమ్’ శీర్షిక చాలా బాగుంటోంది. ఆయా సంఘటనలతో మేమూ మమేకమై పోతున్నాం ఒక్కో సందర్భంలో. ఆయా ప్రాంతాలతో పరిచయం ఉంటే.. ఇంకా మరీనూ. నేడు అరుదై పోతున్న మంచి కథానికా రచయితలకు అది దిక్సూచి. కథాశిల్పం అతి ముఖ్యం.
-సుజాత నాగరాజరావు (చెన్నై)
ఆగే..
రోడ్డు మీద నడిచి వెళ్తూంటే.. ఆ దృష్టి కోణం నుంచీ చూపిన సన్నివేశాలు చదువుతూంటే ఒళ్లు పులకరించింది. అంతలో మరేదో కనపడుతుంది. ఆలోచన అటువేపు వెళుతుంది. అది ముందుకు సాగుతూ అతడినీ నడిపిస్తుంది. ఆలోచనల్లో తేలుతూ నడుస్తూ ఉంటే వెనుక నుంచి హార్న్ అనే బూరా క్రూరంగా వినిపిస్తుంది. నడుస్తున్నది అంచు మీదే అయినా, తాను ట్రాఫిక్ నడుస్తున్న దిశలోనే కదులుతూ ఉండటం అర్థమవుతుంది. అయినా ముందుకు సాగవలసిందే! అన్న మాటలు బాగున్నాయి.
-డి.వి.తులసి (విజయవాడ)
కల్పనా? నిజమా?
‘నమ్మండి ఇది నిజం’ అంటూ ఎక్కడెక్కడి సంఘటనలో.. ఏనాటి సంఘటనలనో మా ముందుకు తెచ్చి మమ్మల్ని ఆశ్చర్యచకితుల్ని చేస్తున్నారు. ఇలాంటివి లోకంలో అసలు జరుగుతాయా? అన్న ఆలోచన వస్తున్నప్పటికీ.. కళ్ల ముందు ప్రత్యక్షంగా ఆనాటి సంఘటనలను చూస్తూంటే నమ్మాల్సి వస్తుంది. జరగబోయేవి రచయితలకి ముందుగా తెలుస్తాయా? లేదా రచయిత ఊహించి రాసినవి తర్వాత జరుగుతాయా? ఇవి అంతుపట్టని ప్రశ్నలు. చరిఅతలో అనేకసార్లు ఇలా జరిగిందని అనుకుంటూనే ఒళ్లు గగుర్పొడుస్తుంది. ఈ వారం టైటానిక్ షిప్ గురించి తెలియజేసినందుకు ధన్యవాదాలు.
-పట్నాల సూర్యనారాయణ (రాజమండ్రి)
ఒక్క తూటా..
ఆదివారం అనుబంధంలో ఏ శీర్షిక ప్రత్యేకత దానిదే. ‘ఒక్క తూటా చాలు’ సీరియల్ ఆద్యంతం ఆసక్తిదాయకంగా ఉంటోంది. ‘అమృతవర్షిణి’ శీర్షికలోని విషయాలు సంగీత విద్వాంసులే కాకుండా సంగీత ప్రియులు, సంగీతాభిమానులు కూడా చదవవలసి ఉంది.
-కె.కళ్యాణి (విజయవాడ)