S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

వన్యప్రాణుల స్వర్గసీమ

సువిశాల గడ్డి మైదాన ప్రాంతాలు, అక్కడక్కడ సరస్సులు, పెద్దపెద్ద నీటికుంటలు, ఎటుచూసినా పచ్చదనం... ఇదీ కాన్హా నేషనల్ పార్క్ సోయగం. ఇక్కడి ప్రకృతి సౌందర్యం చూడముచ్చటగా ఉంటుంది. కాన్హా పులుల అభయారణ్యం సుమారు 940 చదరపు కి.మీ విస్తీర్ణంలో విస్తరించిన అతి పెద్ద పెద్దపులుల అభయారణ్యం. ఈ అతిపెద్ద అరణ్యాలలో 850 జాతులకు చెందిన రకరకాల చెట్లు, మొక్కలు ఉన్నాయి. ఎత్తయిన సాల్ చెట్లతో నిండిన ఈ అరణ్య ప్రాంతంలో జీవ వైవిధ్యానికి పేరుగాంచిన ఈ అభయారణ్యాలలో 43 జాతుల క్షీరదాలు, 26 జాతుల సరీసృపాలు, సుమారు 300 జాతుల పక్షులకు ఈ అభయారణ్యం ఆవాసం. క్షీరదాల్లో బారాసిన్ ఘా, స్వామ్ప్ డీర్ అనే అరుదైన దుప్పులు, జింకలతో పాటు నల్లని కృష్ణజింకలు, పెద్దపులులు, చిరుతలు, గార్ అనే అతి భారీ క్షీరదమైన అడవి దున్నలు, స్లోత్‌బేర్స్ అనే నల్లని ఎలుగుబంట్లు, అడవి పందులు, ముళ్లపందులు, అడవి కుక్కలు మనకు కనపడతాయి. అలానే లాన్గర్ అనే కొండముచ్చులు (నల్లని ముఖాలు, పొడవైన తోకలుగల పెద్ద కోతులు) ఇక్కడి చెట్లమీద మనకు దర్శనమిస్తాయి. ఇక సరీసృపాల విషయానికొస్తే త్రాచుపాములు, రస్సెల్స్ వైపర్ అనే పొడపాములు, కట్లపాములు లాంటి విషసర్పాలు, కొండ చిలువలు, రాట్ స్నేక్ లాంటి విషరహిత పాములు, స్కిన్క్ అనే బల్లిలాంటి ప్రాణులు, మెడ భాగం దగ్గర విసనకర్రలా విచ్చుకొనే చర్మం గల తొండ లాంటి బల్లులు కూడా ఉన్నాయి. మానిటర్ లిజార్డ్ అనే ఉడుములాంటి పెద్ద బల్లులు కూడా ఈ అభయారణ్యంలో సంచరిస్తుంటాయి.
ఈ అభయారణ్యంలో ఉన్న సరస్సులు నీటి కొలనులు, మడుగులు, అలాగే గడ్డి మైదాన ప్రాంతాలతో పాటు నీటితో నిండిన చిత్తడి నేలలు సుమారు 300 జాతుల పక్షులతో సందడి సందడిగా ఉంటుంది. నల్లని ఐబిస్ అనే కొంచెం ఒంపు తిరిగిన పొడవైన ముక్కులు గల నల్లని కొంగల్లాంటి పక్షులు, కాటిల్ ఇగ్రెట్, పాన్డ్ హీరాన్ అనే నీటిపక్షులు, కామన్ టీల్, లిటిల్ గ్రీబ్స్ అనే నీటి బాతులు, ఈల వేసినట్లు అరిచే చిన్న నీటి బాతులు, పాలపిట్టలు, గ్రేహార్న్ బిల్, పైడ్ హార్న్ బిల్ అనే కొమ్ము పక్షులు ఇక్కడి ప్రకృతి ఒడిలో స్వేచ్ఛగా విహరిస్తూ జీవనం కొనసాగిస్తుంటాయి. లెస్సర్ ఎడ్జుటెంట్ స్కార్క్ అనే పెద్ద కొంగల్లాంటి పక్షులు అక్కడక్కడ కనబడుతూ సందర్శకుల్ని అలరిస్తాయి.
బారాసింఘా దుప్పులు, స్వాంప్‌డీర్ అనే అరుదైన దుప్పులు పాటు సాంబార్ అనే పెద్ద దుప్పులు, బ్లాక్‌బక్ అనే నల్లని అందమైన దుప్పులు, బార్కింగ్ డీర్ అనే మొరిగే జింకలు, చౌసింఘా అనే నాలుగు కొమ్ముల జింకలు, అరుదైన బాగా చిన్నవైన మూషిక జింకలు సైతం ఈ అరణ్యంలో అక్కడక్కడ దర్శనమిస్తాయి. చీటల్ అనే మచ్చల జింకలు కూడా ఇక్కడ ఎక్కువగానే కనబడతాయి. స్వాంప్ డీర్ అనే దుప్పులు గుంపులు గుంపులుగా నీటి మడుగుల్లో పెరిగిన మొక్కల్ని ఒకలాంటి గడ్డిని తింటున్న దృశ్యాలు సందర్శకులకు కనువిందు చేస్తాయి. ఈ పార్కులో దుప్పులు, జింకలు చాలా ఎక్కువ సంఖ్యలో ఉండటంవల్ల జీప్ సఫారీ చేస్తూ అడవిలోకి వెళ్లిన ప్రతిసారీ దర్శనమిస్తాయి. కాన్హా నేషనల్ పార్కుకి వచ్చే సందర్శకుల్లో ఎక్కువ భాగం పెద్దపులుల్ని చూసేందుకే వస్తారు.
మండు వేసవిలోనూ కన్హా అభయారణ్యం పచ్చదనంతో అలరారుతుంటుంది. పచ్చని ఆకులతో దర్శనమిచ్చే ఎత్తయిన చెట్లు సందర్శకులను ఆశ్చర్యానికి గురిచేస్తాయి. మండిపోయే ఎండాకాలంలోనూ కన్హా అభయారణ్యంలోని ప్రకృతి శోభకు ఎవరైనా ఆనంద పరవశులు కావాల్సిందే. సాధారణంగా భారత్‌కు వచ్చే విదేశీ యాత్రికులు ఎండాకాలంలో సందర్శించడానికి జంకుతారు. ఇక్కడి ఎండల వేడికి భయపడి శీతాకాలంలో మాత్రమే సందర్శనకు వస్తాయి. కానీ అందుకు భిన్నంగా కాన్హా అభయారణ్యంలో మే నెలలోనూ విదేశీ యాత్రికులు కనిపించడం విశేషం. కాన్హా అభయారణ్యం సమీపంలోని ఆధునిక సౌకర్యాలు కలిగిన రిసార్ట్స్ ఉండటం విదేశీ యాత్రికులకు అనువుగా మారింది. పెద్దపులులు, బారా సింఘా అనే దుప్పుల గురించి, ఇతర వన్యప్రాణుల గురించి పరిశోధనల నిమిత్తం ఇక్కడికి వచ్చేవాళ్లు కొన్ని వారాలపాటు, అవసరమైతే కొన్ని నెలలపాటు ఇక్కడే ఉంటారు. విదేశీ పరిశోధకులు, ఫొటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లు ఇక్కడ ఎక్కువగా కనిపిస్తారు. అరుదైన, అపురూపమైన వన్యప్రాణుల జీవనశైలిపై పరిశోధనలు చేస్తూ రోజుల తరబడి ఇక్కడే బస చేస్తారు. మధ్యప్రదేశ్ ప్రభుత్వ సహకారం, ఫారెస్టు సిబ్బంది కృషి ఫలితంగా కాన్హా నేషనల్ పార్క్ ఎన్నో దశాబ్దాలుగా సందర్శకులను ఆకట్టుకుంటూనే వుంది. 1970ల కాలంలో బారాసింఘా దుప్పులు 60 వరకు ఉండగా, 2015 నాటికి అవి 700కు పెరిగింది. అలాగే అప్పట్లో 50 నుంచి 60 వరకు వున్న పెద్దపులుల సంఖ్య 2014 నాటికి 105కు పెరగడం విశేషం. కాన్హా నేషనల్ పార్కును సందర్శించాలనుకునేవారు ప్రణాళికాబద్ధంగా వెళ్లాలి. ఒక్కరోజులో హడావిడిగా చూసొద్దామనుకుంటే నిరాశ తప్పదు. రెండు మూడు రోజులు ఉండేలా ప్రణాళికను వేసుకుంటే కాన్హా అందాలు మధురస్మృతిలా మిగిలిపోతాయి.

- జి.రత్నకుమార్