S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ప్రాప్తమున్న చోట ఫలమేల తప్పురా

మనకు ముందు ఎన్నో యుగాలు వెళ్లిపోయాయి. ఇప్పుడు కలియుగం ప్రథమ పాదంలోనే వున్నాం. కలి లక్షణాలు అనుభవిస్తూనే ఉన్నాం. గడచిన యుగాల్లో ఏవేవో జపతపాలు, యజ్ఞాలు చేసి ముక్తిని పొందారు. కానీ ఈ యుగానికి అనువైనది కేవలం భగవన్నామాన్ని ఉచ్చరించడమే నామ సంకీర్తన చేయటం తప్ప, ప్రత్యామ్నాయాలేమీ లేవు.
శ్లో. యదనపగత దుఃఖం దేహజం, చిత్తజం వా
తదప నయతి సద్యః శుద్ధ సంగీత విద్యా
కలి కృత సమయే కిం, సాధనం సజ్జనానాం
కిమపి యది సమస్తం తత్పతే హీనసారమ్‌॥
(సంగీత రహస్య గ్రంథం - అనే ప్రాచీన
సంగీత గ్రంథం)
శారీరక దుఃఖమైనా, మానసిక దుఃఖమైనా, ఏ సాధనం చేత కూడా తొలగకపోతే, ఆ దుఃఖం అంతా సంప్రదాయ సంగీతంతో వెంటనే తొలగిపోతుంది.
కలి చేత పీడింపబడుతున్న ఈ కాలంలో దుఃఖాన్ని తొలగించడానికి ఏ సాధనాలూ లేవు. ఒకవేళ, ఏవేవో పూజలు, వ్రతాలు, యాగాలు, యజ్ఞాలు ఉన్నాయని ఎవరైనా అనుకున్నా తీరా అవి ఫలాన్నిచ్చే సమయంలో సంప్రదాయ సంగీతానికున్నంత శక్తిని కలిగి యుండవు.
అందువల్ల ఈ ఘోర కలిలో దుఃఖ నివారణ కోసం సంప్రదాయ సంగీతాన్ని ఆశ్రయించవలసినదే.
సంగీతాన్ని నమ్ముకుంటే కనిపించేది దైవం. అమ్ముకుంటే కనిపించేది ఆకర్షణ.
‘ఎంత మాత్రమున ఎవ్వరు తలచిన అంత మాత్రమే నీవు’ అని అన్నమయ్య చెప్పినట్లు, ఎవరెంత పాడితే అంతే సుఖాన్నిచ్చేది.. అంతే తృప్తినిచ్చేది సంగీతం.
ఇష్టమైతే కష్టపడి నేర్చుకునే వారికి సాధనా బలం తోడైతే దైవం వైపునకు లాగుతుంది మనసు. తేలికైన మార్గాల్లో పాడేసుకుంటూ అదే సంగీతం అనుకునే వారికి తెలియవలసినవన్నీ మిగిలే ఉంటాయి. కొన్ని తలుపులు మూసుకునే ఉంటాయి. సంగీతం సంపూర్ణంగా నేర్చేసుకుని, ‘కడిగిన ముత్యం’లా ఇవతలకు రావడం’ అంటూ ఉండదు.
‘కలౌ సంకీర్తనమ్’ అన్నంత మాత్రాన సంగీతం పాడే వారందరికీ ఫలితం ఒకేలా ఉంటుందా? కొందరు గురువులకు అంతా చెప్పాలన్న మనస్సు ఉండదు. కొందరు సూచనలిచ్చి వదిలేస్తారు. స్వర లిపితో (నోషన్) వివరంగా స్వరాన్ని స్వర స్థానాన్ని శిష్యుడు గుర్తెరిగేలా చెప్పగలిగే గురువులతోనే సంగీత స్వరూపం బోధపడ్తుంది. ఏదయినా సమగ్రంగా నేర్చుకోవాలనే స్థిర సంకల్పం ఉండాలి. నేర్చుకోవడం ఎంత ముఖ్యమో, చెప్పడం తెలియడం అంతే ముఖ్యం. శిష్యుడికి గ్రహించే శక్తి ఉండాలి. గురువుకు చెప్పాలని ఉండాలి. గురువు చెప్పనిది వెదుక్కోగలగాలి. తనకు దక్కినది నలుగురికీ పంచాలి.
మూలాధారం నుంచి పుట్టే నాదం ఉనికిని పట్టుకోవడం అందరి వల్లా కాదు. అదే దొరికితే సద్గురువు చిదానంద స్వరూపులై పోతారు. ‘ప్రాప్తం’ అంటూ ఉంటే ప్రయత్నం చేయాలనే సంకల్పం బలంగా ఏర్పడేలా భగవంతుడే ఏర్పాటు చేస్తాడనటానికి ఉదాహరణలున్నాయి.
ఇద్దరు విద్వాంసుల్ని ఉదహరిస్తాను.
ఒకరు.. సోదరి సంగీతం నేర్చుకుంటూ ఉండగా ప్రక్కనే కూర్చుని వినడంతో సంగీతం పట్ల వ్యామోహాన్ని పెంచుకున్న మహా విద్వాంసుడు శ్రీపాద పినాకపాణి. రెండవ వారు డి.కె.జయరామన్.
వాతావరణాలు వేరుగాని, యిద్దరి ప్రయత్నమూ ఒకటే. లక్ష్యం ఒక్కటే. సాధన కూడా అంతే.
దేవుడూ, దేవాలయమూ అనగానే వెళ్లి ఏదో ఓ కొబ్బరికాయ కొట్టి రెండు నమస్కారాలు పెట్టి రావడం బహు తేలిక. కానీ భగవంతుణ్ని విధిగా చూడాలనే కోరిక బలీయంగా ఉన్నవారి సంగీత సాధన అంత తేలిగ్గా ఉండదు. చాలా వేరుగా ఉంటుంది. సంగీతంతో అలా వెతుక్కుంటూ వెళ్తూనే ఉంటారు - గమ్యం చేరేవరకూ వారి గమనం ఆగదు. ఆ లక్ష్యం వున్న వాళ్లకి ప్రేరేపణ, దానిక్కావలసిన బలం.. అన్నీ వాడే (దైవమే) సమకూరుస్తాడు. అదే ప్రాప్తం అంటే. ఒక్కోసారి ప్రయత్నం లేకుండా సిద్ధించేది కూడా ప్రాప్తమే. ‘ఏ దేశమేగినా ఎందుకాలిడినా, పొగడరా నీ తల్లి భూమి భారతిని’ అన్నట్లు మన తెలుగువాడైన త్యాగయ్య పూర్వీకులు తంజావూరు వెళ్లి స్థిర పడటంతో తమిళలకు త్యాగరాజు సంగీతం ప్రాప్తమైంది. అక్కడే వున్నప్పటికీ మన తెలుగు భాషలోనే కీర్తనలు పాడుకోవడం మనం చేసుకున్న అదృష్టం.. కాక మరేమిటి?
పినాకపాణి గారికి చిన్నతనం నుండి సంగీతాభిలాష కలగటానికి ప్రధాన కారణం ఆయన సోదరి. సోదరి సంగీతం నేర్చుకున్నప్పుడు ప్రక్కనే కూర్చుని ఆ కీర్తనలన్నీ వింటూ, నేర్చేసుకుని పాడుతూంటే తండ్రి కామేశ్వర్రావుగారిని పిలిచి ఆ సంగీతం మాస్టారు ‘మీ పిల్లవాడికి సంగీతం నేర్పించండి. కంఠం బాగా పలుకుతోంది’ అన్నారు. ఆయన సంగీత యాత్రకు అదే నాంది. మెడిసన్ పూర్తి చేసి వైద్య వృత్తి చేపట్టినా, భగవద్దత్తంగా ప్రాప్తించిన సంగీతం ఆయన్ని వదలలేదు. ఈయన సంగీతాన్ని విడిచిపెట్టలేదు.
రాజమండ్రిలో మైసూర్ బి.లక్ష్మణరావు గారనే సంగీతం పాడగల మాస్టార్ని ఆశ్రయించారు.
ఎనె్నన్నో సంగీత కచేరీలకు తీసుకెళ్తూ, విద్వాంసుల గానం దగ్గరుండి వినిపించిన సద్గురువు లక్ష్మణరావు. అంతేగాదు తెలియని కీర్తనలు ఆ విద్వాంసుల్ని అడుగుతూ వ్రాసుకోవడం కూడా నేర్పిన అసలైన గురువు.
పాల్ బ్రంటన్, కావ్య కంఠ గణపతి లాంటి మహానుభావులకు భగవాన్ రమణ మహర్షిని చూడగానే సందేహ నివృత్తి ఎలా అయ్యేదో, సంగీత ఋషియైన పాణిగారిని చూస్తే అలా అనిపించేది నాకు - ఎదురుగా కూర్చుని 200 కీర్తనలు పాఠం చేయగలిగాను. ఆయనతో రెండు దశాబ్దాల పరిచయంతో, నాకుగా నేను, నా పాటలోని లోపాల్ని గ్రహించగలుగుతూ సరిదిద్దుకోగలిగాను. ఎక్కడో మూల, కర్నూలులో తన సంగీతం తాను పాడుకుని ఆనందిస్తూ రివార్డులూ ఎవార్డులూ పొగడ్తతో, సభలూ, సత్కారాలూ లాంటి వాటికి బహు దూరంగా వున్నా వరుసగా ఒకదాని వెంట మరొకటి, అవన్నీ ఆయన్ని వెతుక్కుంటూ వచ్చి పడ్డాయి.
అన్నమయ్య చెప్పినట్లు త్రికరణ శుద్ధిగ చేసిన పనులకు దైవము మెచ్చును, లోకము మెచ్చును’ అనేందుకు సాక్ష్యం ఆయనే.
1983 సంవత్సరంలో కర్నూలులో కంచి మహాస్వామి వారు ‘చాతుర్మాస్య దీక్ష’లో వున్నప్పుడు, యం.ఎస్.సుబ్బులక్ష్మి పాణిగార్ని కూడా దర్శనం చేసి, ఆయన పాట వినే అవకాశం కలిగింది.
నిశే్చష్టురాలై పాట విని రెండు చేతులూ ఎత్తి నమస్కరించి పాదాభివందనం చేసి వెళ్లిపోయింది. మద్రాసు మ్యూజిక్ ఎకాడమీ వారితో ‘ఆ సంగీత ఋషిని - సంగీత కళానిధి’తో సత్కరించుకోవాలి. అదే మనం ఆయనకు ఇవ్వతగిన గౌరవం’ అని చెప్పింది.
సంగీత కళానిధియై, కళాప్రపూర్ణుడై, పద్మభూషణుడై సంగీత లోకంలో గురువుకు గురువయ్యారు.
ఒకప్పుడు ఆడవారు బయటకు వెళ్లి సంగీతం నేర్చుకోవడాన్ని పెద్దలు ఒప్పుకునేవారు కాదు. కట్టుబాట్లని కాదని, కావాలని, పట్టుబట్టి నేర్చుకున్న గాయనీమణి డి.కె.పట్టమ్మాళ్. ఎక్కువగా దీక్షితుల వారి సంప్రదాయంలోని కృతులను సేకరించుకుని, అంబి దీక్షితర్ దగ్గర స్వయంగా నేర్చుకుని దేశంలోనే అత్యున్నత గౌరవం పొందిన విద్వాంసురాలు.
ఆమె సంగీతాభ్యాసం చేసే రోజుల్లో, సంగీతాభిరుచి కలిగిన సోదరుడు జయరామన్ కూడా ఆమె ప్రక్కన కూర్చుని కీర్తనలు పాడటం ప్రారంభించి, అక్కతో కలిసి సహకారం పాడేవారు - మహా విద్వాంసుడై మన్ననలు పొందాడు. స్వయంగా పాడటం ప్రారంభించి మంచి సంప్రదాయాన్ని సంపాదించాడు.
సోదరితో కూర్చుని ఆమెతో కలిసి పాడిన జయరామన్ సంప్రదాయ సంగీతానికే అర్థం చెప్పగలిగే స్థాయికి వెళ్లారంటే ప్రాప్తం ఉంది. దక్కవలసిన ఫలితం దక్కింది.
త్యాగరాజ కీర్తనలు ఎన్నో వందలాది ఉన్నాయి. కానీ మనకు దొరికినవి కొనే్న. విద్వాంసులకు తెలియనివీ, మనం విననివీ ఇంకా ఉన్నాయి. దొరికిన కీర్తనలు పాడేందుకే సమయం దొరకదు.
త్యాగరాజ స్వామికి ప్రియ శిష్యుడైన వాలాజీపేట వెంకట రమణ భాగవతార్, కుమారుడు కృష్ణస్వామి ప్రతిరోజూ పాడినవి మళ్లీ పాడకుండా పదేసి కీర్తనలు పాడితే గాని, మధ్యాహ్నం భోజనం చేసేవాడు కాదు. అంటే కనీసం మూడు వేలకు పైగానే ఉండాలి. అన్నమయ్య ఏకంగా 32000 కీర్తనలు రాశాడు - దొరికినవి చాలా కొనే్న.
తెలిసిన కీర్తనలు - సంప్రదాయసిద్ధంగా నేర్చుకుని పాడేందుకే జీవితకాలం సరిపోదు. ఆ మహానుభావుడు అనే్నసి కీర్తనలు ఎలా వెలువరించగలిగాడు? సమాధానం దొరకని సందేహం. మన సంస్కృతీ సంప్రదాయం పట్ల గౌరవంతో ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తూ ప్రతి జిల్లా కేంద్రాల్లోనూ సంగీత, నృత్య కళాశాలలు నడుపుతోంది. మహావిద్వాంసులున్నారు. అకుంఠిత దీక్షతో విద్యార్థులకు, వారికి వీలైన సమయాల్లోనే, అంకిత భావంతో బోధిస్తున్నారు. కానీ విద్వాంసులెందరు తయారవుతున్నారు? అక్కడ ఏం బోధిస్తున్నారు? ఎలా చెపుతున్నారు? అనే వాటికి సమాధానం ఉండదు. దొరకదు. ఎక్కడుంది లోపం? సంగీతానికి కాల వ్యవధి లేదు. కానీ, ఏదీ తనంతట తాను వచ్చి పడదుగా? నేర్చుకోవాలనే ఉబలాటం ఒక్కటే సరిపోదు. అర్హత ఉండాలి. ఎవరి లోపాలు వారే తెలుసుకోవాలి. సంగీత కచేరీలు తప్పని సరిగా వింటూండాలి. సంగీత సంబంధమైన విషయాలు సేకరించాలి - తెలుసుకోవాలి.
*

- మల్లాది సూరిబాబు 9052765490