S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

మనలో మనం (ఎడిటర్‌తో ముఖాముఖి)

కొయలాడ బాబు, చెన్నై
తమిళనాడులోని తిరువణ్ణామలై ప్రాంతంలో విఖ్యాత తెలుగు రచయత చలం సమాధి శిథిలావస్థలో ఉంది. దాని పరిరక్షణకు తమిళనాడు ప్రభుత్వంతో సంప్రదించి కనీసం ఒక శిలాఫలకమైనా అక్కడ ఏర్పాటుచేయాలి అన్న విషయంలో మన ప్రభుత్వం కాస్త చొరవ చూపిస్తే బాగుంటుంది. అయతే... తమిళనాడు ప్రభుత్వం ఏమైనా అభ్యంతరం చెప్పే అవకాశం ఉందంటారా? మహా రచయతల స్మృతిచిహ్నాలు భావితరాలకు ఒక చరిత్రను పరిచయం చేసే ఆనవాళ్ళు కాబట్టి ఈ విషయంలో ఆ రాష్ట్రంలో ఉన్న ఇతర తెలుగు సంఘాలు కూడా ముందుకు రావలసిన అవసరం ఉందనిపిస్తుంది. ఏమంటారు?
మంచి సూచనే. ఈ విషయంలో మొదటినుంచి మనకు శ్రద్ధ తక్కువ. తెలుగు నాట ఉన్న మహా రచయతల స్మృతిచిహ్నాల్లోనే దిక్కూమొక్కూ లేకుండా ఉన్నవి ఎన్నో ఉన్నాయ. అడిగేవాళ్లు లేకపోవడంతో పాలించేవాళ్లకూ వాటి సంగతి పట్టడం లేదు. ముందుగా మార్పు రావలసింది మనందరి ఆలోచనా విధానంలో.

పుష్యమీసాగర్, హైదరాబాద్
భారతదేశం అవినీతిలో మొదట స్థానంలో వున్నది అని ఓ సంస్థ చేసిన సర్వేలో తేలింది. అందులో న్యాయవ్యవస్థలో వున్నవారికి అధిక భాగస్వామ్యం ఉందట. మరి ఏలినవారేమో అవినీతి అంతం అయ్యంది అని ప్రకటనలు గుప్పిస్తున్నారు. ఏది నిజం? చిత్తశుద్ధి లేని నాయకులకూ, ఎవరెటు పోతే మనకేంటి అనే బాధ్యతా రాహిత్యంలో కొట్టుమిట్టాడుతున్న చదువుకున్న తరానికి - అసలు మన దేశం గురించి ఆవగింజంత అయనా చింత ఉన్నదా?
ఆ చింత ఉన్న మీలాంటివారు దేశం కోసం ఏమి చేస్తున్నారు?

ములుగూరి శ్రీనివాస్ (ఈమెయల్)
వీక్‌పాయంట్ ‘అనువుగాని అమెరికా’లో వాస్తవ పరిస్థితిని చక్కగా విశే్లషించారు. కాకపోతే అమెరికానుండి తిరిగి వచ్చే వారందరికీ మన దేశం ఎంతవరకు ఉపాధి కల్పిస్తుంది అనేది ఓ సమస్య. కాదంటారా?
వారందరికీ ఉపాధి కల్పించటానికి దేశం ఎందుకు పూచీ తీసుకోవాలి? దేశాన్ని అడిగి వారు అమెరికా వెళ్లారా? దేశం కోసమే అక్కడ ఉన్నారా? ఎవరి సమస్యను వాళ్లే పరిష్కరించుకోవాలి.

పి. రామకృష్ణ, రాజమండ్రి
తిరుమల బ్రహ్మోత్సవాలకి కనిపించే వందలాది అర్చక స్వాములు మామూలు రోజుల్లో అగుపడరేం? సదా స్వామివారి సేవ చేయాలని రూలు లేదా? ప్రధాన అర్చకులు విఐపిలకి దర్శనం చేయంచి ఫొటోలు దిగవచ్చా?
గెస్ట్‌హౌస్‌లకు పోయ ఘరానా భక్తులను సేవించి తరించే అర్చకులూ ఉన్నారు. వారి సంగతి వెంకటేశ్వర స్వామి చూసుకోగలడు.

తెలుగుదేశం మంత్రులు తరచూ ‘మా ముఖ్యమంత్రిగారు’ అని చంద్రబాబుని అంటారు. చంద్రబాబు ప్రజలందరికీ ముఖ్యమంత్రా లేక తెలుగుదేశం మంత్రులకేనా?
ఆయన వారికి ముఖ్యమంత్రి కాడా?

ఎ.వి.సోమయాజులు, కాకినాడ
కెసిఆర్‌కు గొప్ప స్వాగతం పలికిన తిరుపతి వాసుల సంస్కారం గొప్పది కదండీ!
తిరుపతిలో ఘన స్వాగతం ఇప్పించిన కెసిఆర్ అభిమానుల కార్యదక్షత గొప్పది.
కెసిఆర్ గారు వెంకటేశ్వరస్వామివారి మొక్కు తీర్చుకుంటున్నారు, మరి ప్రజల కోరికలు తీర్చరా అని కమ్యూనిస్టు నేత కారత్ అనడం బాగుంది. ఒక కమ్యూనిస్టు ఈమాత్రం అనడంలో అర్థముంది. కాని బిజెపి తెలంగాణ నేత ప్రజల సొమ్ముతో మొక్కులు తీర్చుకుంటున్నారని అనడంలో అర్థముందా?
దీనిపై లేచింది అర్థంలేని రాద్ధాంతం అనడంలో సందేహం లేదు. కాని దేని కోసం ఉద్దేశించిన ఏ పద్దులోంచి ఆ డబ్బును ఖర్చుపెట్టారు అని ముఖ్యమంత్రిని అడిగే హక్కు అందరికీ ఉంది.

ఎస్. అంజయ్య, హైదరాబాద్
రాజకీయ పార్టీ తమ ఎన్నికల మేనిఫెస్టోలో అసాధ్యమైన వాగ్దానాలు ప్రకటించి, ప్రభుత్వ ఏర్పాటు తర్వాత ఎన్నికల హామీల అమలు విఫలమైతే, ఓటరు చేసిన ఫిర్యాదుపై ఎన్నికల సంఘం చర్య తీసుకోగలదా? పిల్ దాఖలు చేస్తే న్యాయస్థానం విచారణ వీలున్నదా?
లేదు. అదే మన వాగ్దాన కర్ణుల ధీమా.

కె.హెచ్.శివాజీరావు, హైదరాబాద్
రాజశేఖరరెడ్డిగారు 2009లో దుర్మరణం చెందాక జగన్ తనకు కూడా ముఖ్యమంత్రి పదవి వస్తుందని ఆశించారు. ఇప్పటికీ తాను ముఖ్యమంత్రినని ఊహాలోకంలో విహరిస్తున్నారు. ఇటీవల పోలీసు ఉన్నతాధికారి తనను అరెస్టు చేస్తానంటే ముఖ్యమంత్రిని ఎలా అరెస్టు చేస్తారని ఎదురుతిరిగారు. ఆశ ఉండొచ్చు, తప్పు లేదు కానీ దురాశ కాకూడదు!
అందని అధికారాన్ని ఊహాలోకంలోనైనా అనుభవించనివ్వండి.
*

ప్రశ్నలు పంపాల్సిన చిరునామా

మనలో మనం,
ఆదివారం అనుబంధం, ఆంధ్రభూమి దినపత్రిక,
36 సరోజినీదేవీ రోడ్,
సికిందరాబాద్ - 500003.

: email :
sundaymag@andhrabhoomi.net