S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

హృదయ సౌగంధికం

నాడు బాల్యపు ముంగాళ్లు
పరికిణీ చెంగనాల
చిత్రవర్ణాల ఉషోదయం ఉగాది
నాడు మొలకెత్తే
నల్లరేగడి మట్టి పరిమళాల్లోంచి
ఉబికివచ్చే రాగోదయం ఉగాది
నేడు ప్రాతర్వాయువు, సౌఖ్యశాయనికతను
ఎద ఆస్వాదించలేనితనం
గుండె కన్ను చెమ్మగిల్లి
కలం చేదు పాట పాడే
జనారణ్యపు ఏకాకితనం
మావి చిగురులు తిని మత్తెక్కిన
కోకిల ఉదయ కుహూ రవాలకు
నెర్రెలిచ్చిన పొలాల్లో
చెట్ల కొమ్మలకి ఉరివేసుకున్న
అన్నదాతల చావుడప్పు ప్రక్క వాయిద్యమవుతుంది
మమతల పరిభాషలతో
పూల నావలా సాగే కుటుంబ ప్రయాణం
అదుపులేని వేగంతో
ఢీకొట్టే మృత్యు శకటాల కింద
ఎర్రెర్రని తురాయి పూల గుత్తులై
చిత్తడిగా నేలను పరచుకుంటుంది
అమాయకపు పారిజాతపు నవ్వులతో
చేరవచ్చిన బాల్యం
కరకు గుండెల కామ పైశాచికత్వానికి బలై
కన్నవారికి బతుకంతా
కాలకూట విషాన్నం కొసరి తినిపిస్తుంది
నాలుగురోడ్ల కూడలిలో
చేయిజాచిన ముడుతలు పడ్డ ముసలితనం
కుక్కలతో కాట్లాడుతూ
విలాసవంతుల ఎంగిలాకుల కెగబడ్డ అనాథ బాల్యం
పాలకంకుల పైరు పచ్చల
రామచిలుకల సేద్యగాళ్లు
వరద బీభత్సానికి ఇసుక మేటలైన దృశ్యం
కడుపు తడిమి అన్నమై
పరచుకొన్న మాతృత్వాన్ని
తెగ నరికిన పుత్ర ఘాతుకత్వం
గుక్కెడు నీళ్ల కోసం మండే ఎండల్లో
బిందె మీద బిందై నదిని ఉస్సురన్న స్ర్తిత్వం
సమాజపు నిలువుటద్దంపై
చితికిన చీలికలై
హృదయాంతరాళాల రసఝరుల్ని
పట్టి ఆపుతున్న వేళ
ఈ ఉగాదికి ఏం పాడమంటావు నేస్తం!
సమ సమాజపు పచ్చిక బయళ్లలో
మధురోహల వీణానాదం
మ్రోయించాలని
నాకూ ఆశగా ఉంది. నిజం!
పూరింటి నట్టింట్లో
పరమాన్నపు పళ్లెరమై
పొగలు కక్కాలని ఉంది
రైతుల ముంగిళ్లలో
బంగారపు నీవార ధాన్యమై
పులకరించాలనుంది
కన్నీటి చారికల పసి తులసివనంలో
గురుకుల విద్యాదీపమై వెలగాలనుంది
ఆకలి లేని గోదారి లంకల్లో
చింతలులేని రెల్లు పూలల్లే
తూగాడాలని ఉంది
కల్లాకపటం లేని
ముత్యమంత కన్నీటి బొట్టుగా
కురవాలనుంది
గుండె గుమ్మానికి
ఆర్ద్రతా సౌగంధిక పుష్పం కట్టి
నిను పిలవాలని ఉంది.

- డా. ఎం.సుధామయి, 9492149532