S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

రామాయణం.. మీరే డిటెక్టివ్ 28

పరశు రాముడి వంక చూసి చెప్పాడు.
‘రామా! నీ పరాక్రమం అద్భుతమైందని, నువ్వు శివుని విల్లు విరిచేసావని విన్నాను. ఊహించలేని అది నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది. నేను నా వెంట ఓ మంచి విల్లుని తెచ్చాను. జమదగ్ని నించి నాకు లభించిన ఆ భయంకరమైన వింటిని ఎక్కుపెట్టి, బాణాన్ని పూరించి, నీ బలాన్ని చూపించు. ఆ పని చేస్తే నువ్వు బలమైన వాడివని మెచ్చుకుని నీతో ద్వంద యుద్ధం చేస్తాను’
ఆ మాటలు వినగానే దశరథుడు దిగాలుగా చేతులు జోడించి చెప్పాడు.
‘గొప్ప కీర్తిగల బ్రాహ్మణుడివైన నీకు క్షత్రియుల మీద కోపం పోయింది కదా? బాలురైన నా కుమారులకి అభయం ఇవ్వు. స్వాధ్యాయంలో, వేదాధ్యయనంలో, ఇతర వ్రతాలు చేసే భృగు వంశంలో పుట్టిన నువ్వు శివుడి ముందు శపథం చేసి ఆయుధాన్ని వదిలావు కదా? నువ్వు ధర్మంగా భూమినంతా కాశ్యపుడికి దానం చేసి మహేంద్ర పర్వతంలో ఉంటున్నావు. నువ్వు మా అందరి వినాశనానికి వచ్చావు. రాముడు మరణిస్తే మేమంతా మరణించినట్లే’
పరశురాముడు ఆ మాటలని పట్టించుకోక రాముడితో ఇలా చెప్పాడు.
‘దేవలోకానికి చెందిన విశ్వకర్మ చేత చేయబడ్డ ఈ రెండు ధనస్సులూ గొప్పవి, బలమైనవి. వాటిలో ఓ దాన్ని యుద్ధాన్ని కోరే శివుడికి దేవతలు ఇచ్చారు. త్రిపురాలని నాశనం చేసిన దాన్ని నువ్వు విరిచేసావు. శివధనస్సుతో సమాన బలమైన, ఎదిరించ శక్యం కాని ఈ రెండో విల్లుని దేవతలు విష్ణువుకి ఇచ్చారు. తర్వాత దేవతలు శివ, విష్ణువుల బలాన్ని తెలుసుకోవాలని ఉందని బ్రహ్మని కోరారు. అది తెలియడానికి ఆయన శివ కేశవుల మధ్య విరోధాన్ని కల్పించాడు. దాంతో ఒకరినొకరు జయించాలని శివుడు, విష్ణువు మధ్య గొప్ప యుద్ధం జరిగింది. విష్ణువు చేసిన హూంకారంతో శివుడి విల్లు జడమై పోయి ముక్కంటి కదల్లేకపోయాడు. దేవతలు, ఋషులు, చారణులు అది చూసి ప్రార్థించగా వారిద్దరూ శాంతించారు. విష్ణువే అధికుడని తెలుసుకున్నారు. శివుడు కోపంతో ఆ ధనస్సుని, బాణాలని రాజర్షి దేవరాతుడికి ఇచ్చాడు. రామా! విష్ణువు తన విల్లుని భృగు వంశస్థుడు జమదగ్ని దగ్గర ఉంచమని ఇచ్చాడు. జమదగ్ని దాన్ని మహాత్ముడైన తన కొడుకు, మా నాన్న ఐన రుచీకుడికి ఇచ్చాడు.
మా నాన్న అస్త్ర సన్న్యాసం చేశాక కార్తవీర్యార్జునుడు చెడు బుద్ధితో ఆయన్ని చంపేశాడు. ఈ దారుణం గురించి నాకు తెలీగానే నేను కోపంగా క్షత్రియ జాతికి చెందిన ప్రతీ ఒక్కరిని పుట్టిన వాడిని పుట్టినట్లు అనేకసార్లు చంపేశాను. అలా ఈ భూమినంతా జయించి నేను చేసిన యజ్ఞం చివర్లో మహాత్ముడైన దేవరాతుడికి దానం చేసి తపోబలం గల నేను మహేంద్ర పర్వతం మీద నివసిస్తున్నాను. రామా! గొప్ప పరాక్రమం గల నువ్వు శివ ధనస్సుని విరిచేసావని తెలిసిన వెంటనే ఇక్కడికి వచ్చాను. క్షత్రియ ధర్మాన్ని, మా తాత, నాన్నల ద్వారా నాకు లభించిన ఈ విష్ణు ధనస్సుని తీసుకుని దీన్ని సంధించి నీ శత్రువుల నగరాలని జయించు. నువ్వా పని చేస్తే నీతో నేను యుద్ధం చేస్తాను.
తన పక్కనే ఉన్న తండ్రి మీద గౌరవంతో రాముడు ఎక్కువ మాట్లాడకుండా ఇలా చెప్పాడు.
‘పరశురామా! నీ చరిత్ర విన్నాను. మీ నాన్న విషయంలో రుణం తీర్చుకున్న నిన్ను మెచ్చుకుంటున్నాను. నాకు పరాక్రమం లేదని నువ్వు అవమానిస్తున్నావు కదా? దాన్ని చూడు’
వెంటనే రాముడు పరశురాముడి చేతిలోని విల్లుని, బాణాలని అందుకున్నాడు. దాంతో పరశురాముడి శక్తి మొత్తం రాముడిలో ప్రవేశించింది. వింటిని ఎక్కుపెట్టి, దానికి నారిని కట్టి పరశురాముడితో కోపంగా చెప్పాడు.
‘నువ్వు బ్రాహ్మణుడివి, విశ్వామిత్రుడికి బంధువు, నాకు పూజ్యుడు అవడంవల్ల నీ గమనశక్తిని, లేదా నీ తపస్సుతో జయించిన అనేక ఉత్తమ లోకాలని, ఈ రెంటిలో ఒక దాన్ని కొట్టేస్తాను. స్వర్గంలో పుట్టిన ఈ విష్ణు బాణం వృథా కాకూడదు కాబట్టి ఏది నీకు కావాలో కోరుకో’
ఆ అద్భుతమైన విష్ణు ధనస్సుని చూడటానికి బ్రహ్మ, దేవతలు, ఋషులు, అప్సరసలు, గంధర్వులు, సిద్ధులు, చారణులు, కిన్నరలు, యక్షులు, రాక్షసులు, నాగులు వచ్చారు.
రాముడు ఆ ధనస్సుని ఎక్కు పెట్టగానే పరశురాముడి నీరసించి పోవడంతో ఆశ్చర్యంగా చెప్పాడు.
‘నేను గతంలో ఈ భూమి మొత్తాన్ని గురువు దేవరాతునికి ఇచ్చాక ఆయన నన్ను తన దేశంలో ఉండద్దని ఆదేశించాడు. ఆ మాట ప్రకారం నేను రాత్రుళ్లు భూమి మీద ఉండను. కాబట్టి నా గమనశక్తిని కొట్టద్దు. నా తపస్సుతో నేను జయించిన అనేక ఉత్తమ లోకాలని ఆలస్యం చేయకుండా కొట్టు. దీన్ని ఎక్కుపెట్టడం వల్ల నువ్వు మధువు అనే రాక్షసుడ్ని చంపిన విష్ణువే అని గ్రహించాను. యుద్ధంలో నిన్ను ఎదిరించగల వారు ఎవరూ లేరు. మూడు లోకాలకి ప్రభువైన నేను నీ చేతిలో అపజయం పొందినందుకు సిగ్గు పడటం లేదు’
రాముడు బాణాన్ని ప్రయోగించాక తన తప్ఫఃలం రాలిపోగా పరశురాముడు రాముడ్ని స్తుతించి, ప్రదక్షిణం చేసి ఉత్తర దిక్కుకి వెళ్లిపోయాడు. చీకటి తొలగి దిక్కులన్నీ ఎప్పటిలా ప్రకాశించాయి. రాముడ్ని ఋషులు, దేవతలు కీర్తించారు. తర్వాత రాముడు ఆ ఇంటిని, బాణాలని వరుణుడికి ఇచ్చి, వశిష్ఠుడు, ఇతర ఋషులకి నమస్కరించి ఆందోళనతో ఉన్న తండ్రితో చెప్పాడు. ‘పరశురాముడు వెళ్లిపోయాడు. ఇక చతురంగం బలంతో అయోధ్యకి వెళ్దాం’
పరశురాముడు వెళ్లిపోయాక దశరథుడు కొడుకులు మళ్లీ పుట్టినట్లుగా ఆనందించాడు. అంతా అయోధ్యకి చేరారు. పౌరులు రాజమార్గాలని నీళ్లతో తడిపి పూలు చల్లారు. మంగళ వాయిద్యాలని మోగించారు. బ్రాహ్మణులు వారికి ఎదురు వచ్చి స్వాగతం చెప్పారు. కౌసల్య, సుమిత్ర, కైకేయి, ఇతర రాజస్ర్తిలు కోడళ్లైన సీతా, ఊర్మిళ, మాండవి, శృతకీర్తులని చూసి సంతోషించారు. నూతన వధువులంతా గృహ దేవతలని పూజించి, పెద్దలు అందరికీ నమస్కరించారు. బ్రాహ్మణులకి ఆవులని, ధన ధాన్యాలని దానం చేసి తమ భర్తలతో ఆనందంగా కలిసారు.
పరాక్రమవంతులైన రామ, లక్ష్మణ, భరత శతృఘు్నలు పెళ్లి చేసుకున్నాక తండ్రికి అణకువగా ఉన్నారు. కొద్ది కాలానికి దశరథుడు కైకేయి కొడుకు భరతుడితో చెప్పాడు.
‘కేకయ రాజు కొడుకు, నీ మేనమామ ఐన యుధాజిత్తు నిన్ను పంపమని మిథిలలో నన్ను కోరాడు. నిన్ను తీసుకు వెళ్లడానికి వచ్చాడు. కాబట్టి నువ్వు అతనితో వెళ్లు’
తన తండ్రి, రామలక్ష్మణులు, తల్లుల దగ్గర సెలవు తీసుకుని భరతుడు తన మేనమేమ వెంట వెళ్లాడు. రామలక్ష్మణులు తండ్రికి సేవ చేస్తూ ప్రజలని చక్కగా పాలించసాగారు. నియమాలని పూర్తిగా పాటిస్తూ అన్ని పనులని పర్యవేక్షించే రాముడ్ని చూసి దశరథుడు, బ్రాహ్మణులు, నాగరికులు అంతా సంతోషించారు. జీవులకి బ్రహ్మదేవుడు ఎలాగో, సుగుణాల రాశి ఐన రాముడు తన పౌరులకి అలా. రాముడి మనసు సీత మీదే లగ్నమైంది. సీత మనసు నిండా రాముడే నిండి ఉన్నాడు. తండ్రి చేత చేయబడ్డ సంబంధం కాబట్టి రాముడికి సీత మీద ప్రేమ కలిగి, సద్గుణాలు గల అందగత్తె కాబట్టి అది ఇంకా పెరిగింది. ఒకరి మీద మరొకరికి గల ప్రేమ రెట్టింపై ఇంకా పెరగసాగింది. అందంలో దేవతా స్ర్తిలా, లక్ష్మిలా ఉన్న మిథిలలో పుట్టిన జనకుడి కూతురు సీతకి రాముడి మీద గల ప్రేమ కొలతకి అందనిది. అలా దశరథ మహారాజు కొడుకు రాముడు, జనకుడి కూతురు సీతతో కలిసి లక్ష్మీదేవితో కూడిన మహా విష్ణువులా ప్రకాశిచాడు.
(బాలకాండ సమాప్తం)
ఆశే్లష హరికథ విని బయటకి వస్తూండగా ఆయన చెప్పిన కథలో ఏడు తప్పులు ఉన్నాయి అని కొందరు అనుకుంటూ వెళ్లడం విన్నాడు. అది నిజం కూడా.

కిందటి వారం ప్రశ్నలకు జవాబులు

1. కేకయ రాకుమారుడు వచ్చాడు అని హరిదాసు చెప్పాడు. కాని అతని పేరు యుధాజిత్తు అని చెప్పలేదు.
2. భరతుడు శ్రుతకీర్తి చేతిని పట్టుకుని, శత్రుఘు్నడు మాండవి చేతిని పట్టుకుని పెళ్లి చేసుకున్నారని హరిదాసు చెప్పాడు. నిజానికి భరతుడు
మాండవి చేతిని పట్టుకుని, శతృఘు్నడు శ్రుతకీర్తి చేతిని పట్టుకుని పెళ్లి చేసుకున్నారు.
3. విశ్వామిత్రుడు వెళ్లింది హిమాలయాలకి. ఇది హరిదాసు చెప్పలేదు.
4. పక్షులు అనుకూలంగా, మృగాలు ప్రతికూలంగా ఉన్నాయి అని హరిదాసు చెప్పడం తప్పు. పక్షులు ప్రతికూలంగా,
మృగాలు అనుకూలంగా ఉన్నాయి.
5. పరశురాముడి దగ్గర విల్లు, బాణాలు కూడా ఉన్నాయి. ఇది హరిదాసు చెప్పలేదు.
6. పూర్వం కార్తవీర్యార్జునుడు చంపింది పరశురాముడి తల్లిని కాదు. అతని తండ్రిని.
7. బాలకాండలోని ఆఖరి సర్గ 77,78 కాదు. హరిదాసు తప్పు చెప్పాడు.

మీకో ప్రశ్న

పరశురాముడి నివాస స్థలం
మహేంద్ర పర్వతం ఏ రాష్ట్రంలో ఉంది?

గత వారం ‘మీకో ప్రశ్న’కి జవాబు

మిథిలా నగరానికి గల
ఇంకో పేరు ఏమిటి?
జనక్‌పూర్

మల్లాది వెంకట కృష్ణమూర్తి