రాష్ట్రీయం

శివాజీ పాలన దేశానికి మార్గదర్శి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సోషల్ కాజ్ సదస్సులో అనిల్ మహదేవ్ దవే
మరాఠా యోధుడి జీవితాన్ని అధ్యయనం చేయాలి: ఎంవిఆర్ శాస్త్రి
హైదరాబాద్, డిసెంబర్ 12: వ్యక్తిత్వంలోనూ, విలువలలోనూ, పాలనలోనూ, యుద్ధతంత్రంలోనూ ఛత్రపతి శివాజీ ప్రపంచానికి దిక్సూచి వంటివాడని, నేటి సమాజానికి ఆయన యంత్రాంగం, మంత్రాంగం ఎంతో ఉపకరిస్తాయని రాజ్యసభ సభ్యుడు, ప్రముఖ రచయిత అనిల్ మహదేవ్ దవే పేర్కొన్నారు. ఆయన రచించిన ‘శివాజీ, స్వరాజ్-సురాజ్’ గ్రంథ పరిచయ కార్యక్రమాన్ని ‘సోషల్ కాజ్’ సంస్థ శనివారం సాయంత్రం ఉస్మానియా యూనివర్శిటీ దూరవిద్యా కేంద్రంలో ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి ఆంధ్రభూమి సంపాదకులు ఎంవిఆర్ శాస్త్రి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా అనిల్ మహదేవ్ దవే తన గ్రంథాన్ని పరిచయం చేస్తూ యుద్ధతంత్రాల్లో మాత్రమే కాకుండా పరిపాలనా విధానంలో కూడా ఛత్రపతి శివాజీ భారతదేశ రాజుల్లో అగ్రగణ్యుడని, మంత్రిమండలి -విదేశాంగ విధానంతోపాటు పటిష్ఠమైన గూఢచార వ్యవస్థను ఏర్పాటుచేసి ప్రజల కోసమే ప్రభువు అన్న సూత్రం పాటించి ప్రజల సంక్షేమానికి పాడుపడ్డాడని అన్నారు. గెరిల్లా యుద్ధతంత్రం శివాజీతోనే ప్రారంభమైందని, శివాజీ ఆలోచనా సరళి, ధర్మం పట్ల, నైతికత పట్లా, మానవతా విలువల పట్ల ఆయన దృక్పథం ఎప్పటికీ కులమత రాజకీయాలకూ, స్థలకాలమానాలకు అతీతమైనవేనని అన్నారు. ఎన్నడూ తన విజయాలకు చిహ్నంగా తన పేరును ఉపయోగించుకోలేదని, తన పరోక్షంలో సైతం పాలన సజావుగా జరిగేలా వ్యవస్థలను నిర్మించాడని వివరించారు. సంస్థాగతంగా పటుతరమైన ప్రణాళికలతో ముందుకు సాగేవాడని, సాంకేతిక పరిజ్ఞానం పట్ల అమిత ఆసక్తిని ప్రదర్శించేవాడని, ఆయన జీవితం అందరికీ ఆదర్శప్రాయమేనని దవే అన్నారు. సంకీర్ణప్రభుత్వాలకు తొలికర్త శివాజీ అని అన్నారు.
ఆర్‌ఎస్‌ఎస్ జాతీయ సంయుక్త ప్రధాన కార్యదర్శి సహసర్ కార్యవాహ దత్తాత్రేయ హోసబలే మాట్లాడుతూ శివాజీ,స్వరాజ్- సురాజ్ గ్రంథం తెలుగుభాషలోకీ అనువాదం కావాలని అన్నారు. ఈ గ్రంథాన్ని ఏడాది క్రితం లండన్‌లో ఆవిష్కరించారని పేర్కొన్నారు. ‘ఈ పుస్తకం గొప్ప డాక్యుమెంటరీలా ఉంది. శివాజీ చరిత్ర చాలా కొద్దిమందికే తెలుసు. దానికి కారణం పాఠ్య పుస్తకాల్లో ఒక పేరాగా ఉండటమే. యూనివర్శిటీలు, పరిశోధన స్థాయిలో శివాజీ చరిత్ర చేర్చినపుడే అందరికీ ఆయన గురించి తెలుస్తుంది. శివాజీ సాధారణ వ్యక్తే కాదు, గొప్ప పరిపాలనాదక్షుడు. శివాజీలో రాజనీతి, సుపరిపాలన, వ్యూహాత్మక యుద్ధతంత్రంతోపాటు గొప్ప లక్షణాలు ఉన్నాయి. ఆయన గొప్ప రాజ్యాన్ని ఏర్పాటు చేయడమేకాక, యుద్ధరంగంలో తానే ముందుండి సైన్యాన్ని నడిపించాడు. తద్వారా హిందూ రాజ్య నిర్మాణానికి కృషి చేశాడు. అలెగ్జాండర్‌లా గొప్ప పోరాటయోధుడు. విశాల హిందూ రాజ్యానికి తన జీవితాన్ని త్యాగం చేసిన మహోన్నత వ్యక్తి శివాజీ’ అని దత్తాత్రేయ హోసబలే పేర్కొన్నారు.
శివాజీ జీవితాన్ని అధ్యయనం చేయాలి: ఎంవిఆర్ శాస్త్రి
సభకు అధ్యక్షత వహించిన ఎంవిఆర్ శాస్త్రి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ శివాజీ జీవితాన్ని అధ్యయనం చేయాలన్నారు. శివాజీ లోపరహితమైన పాలన అందించారని, ఆనాటి శివాజీ పాలనకూ నేటి పరిస్థితులకు బేరీజు వేసుకుంటే ఉన్న లోపాలను సరిదిద్దుకునేందుకు అవకాశం ఉంటుందని చెప్పారు. శివాజీ జీవితం గురించి మిగిలిన వారు తెలుసుకున్నంతగా మనం తెలుసుకోలేకపోయామని అన్నారు. ప్రజలకు ఎలాంటి పాలన కావాలో అది అమలుచేసి చూపించిన మహాపరాక్రమశాలి శివాజీ అని చెప్పారు. భారత దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేసిన రోజు ఈ దేశానికి మరో శివాజీ వచ్చాడని తాను సంపాదకీయం రాసినట్టు ఆయన గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో సోషల్ కాజ్ అధ్యక్షురాలు డాక్టర్ సోమరాజు సుశీల తదితరులు పాల్గొన్నారు. సమావేశం చివరిలో సభికులు అడిగిన పలు ప్రశ్నలకు అనిల్ మహదేవ్ దవే సమాధానాలు ఇచ్చారు.
(చిత్రం) శివాజీ, స్వరాజ్- సురాజ్ గ్రంథావిష్కరణ కార్యక్రమానికి అధ్యక్షత వహించి ప్రసంగిస్తున్న
ఆంధ్రభూమి సంపాదకులు ఎంవిఆర్ శాస్త్రి గ్రంథ రచయిత అనిల్ మహదేవ్ దవే, ఆర్‌ఎస్‌ఎస్ జాతీయ సంయుక్త ప్రధాన కార్యదర్శి సహసర్ కార్యవాహ దత్తాత్రేయ హోసబలె, సోషల్ కాజ్ స్వచ్ఛంద సంస్థ అధ్యక్షురాలు డాక్టర్ సోమరాజు సుశీల కూడా చిత్రంలో ఉన్నారు.