జాతీయ వార్తలు

చెన్నైలో మరిన్ని ప్రాంతాలను ముంచెత్తిన అడయార్ నది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాన తగ్గినా.. వీడని వరద భయం!
చెన్నై, డిసెంబర్ 3: చెన్నై మహానగరాన్ని గత నాలుగు రోజులుగా ముంచెత్తిన వరుణదేవుడు గురువారం కాస్త కరుణించాడు. గురువారం ఉదయంనుంచి ఆకాశం మేఘావృతమై ఉన్నప్పటికీ వర్షం కురవకపోవడంతో జనం, సహాయక చర్యల్లో నిమగ్నమైన సిబ్బంది కాస్త ఊపిరి పీల్చుకున్నారు. అయితే వారి ఆనందం ఎంతోసేపు నిలవలేదు. పొంగిపొరలుతున్న నగర శివార్లలోని చెంబరంబాక్కం రిజర్వాయర్‌నుంచి బుధవారం రాత్రి భారీ పరిమాణంలో నీటిని విడుదల చేయడంతో నగరంలోని మరికొన్ని ప్రాంతాలకు కొత్తగా వరద ప్రమాదం తలెత్తింది. మరోవైపు గత రెండు రోజులుగా ఉగ్రరూపం దాల్చి ప్రవహిస్తున్న అడయార్ నది కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నదిని ఆనుకుని ఉన్న కొట్టూర్‌పురం, జాఫర్‌ఖాన్ పేట్, నందనం ప్రాంతాల్లో బాధిత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి ఎన్‌డిఆర్‌ఎఫ్, సైన్యం, నేవీ పోలీసు కమాండోలతోపాటుగా అగ్నిమాపక సిబ్బందితో కూడిన ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. గంట గంటకు పెరిగిపోతున్న నది నీటిమట్టం కారణంగా సైదాపేటలోని మారైమలై అడిగల్ బ్రిడ్జి, రోడ్డు కొట్టుకుపోవడంతో అన్నాసాలై (వౌంట్‌రోడ్డు)పై రాకపోకలు నిలిచిపోయాయి. నిన్న రాత్రినుంచి వర్షం కురవకపోయినప్పటికీ నగరానికి తాగునీటిని అందించే రిజర్వాయర్లలో ఒకటైన చెంబరంబాక్కం జలాశయంనుంచి ఏకంగా 30 వేల క్యూసెక్కుల వరద నీటిని విడుదల చేయడంతో నగరం మధ్యలో ఉన్న కోడంబాకం, టి. నగర్, అశోక్‌నగర్ ప్రాంతంలోని రోడ్లన్నీ జలాశయాలుగా మారాయి. (చిత్రం) భారీ వర్షాలకు నీట మునిగిన చెన్నై నగరం ఇంకా కోలుకోలేదు. గురువారంనాడు ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి జయలలిత ఏరియల్ సర్వే చేశారు.
సత్రాలుగా మారిన రైల్వే స్టేషన్లు
చెన్నై నగరాన్ని ముంచెత్తిన వర్ష బీభత్సం పొట్టచేత పట్టుకుని ఇతర రాష్ట్రాలనుంచి నగరానికి వచ్చిన వలస కూలీల పాలిట పెనుశాపంగా మారింది. వర్షాల కారణంగా చేయడానికి పనులు లేక, కనీసం సొంత ఊర్లకు తిరిగి వెళ్దామనుకుని రైల్వే స్టేషన్లకు వచ్చిన ఇతర రాష్ట్రాలకు చెందిన వందలాది మందికి రైల్వే స్టేషనే్ల సత్రాలుగా మారాయి. భారీ వర్షాల కారణంగా రైలు పట్టాలు మునిగిపోవడంతో లోకల్ రైళ్లతోపాటు ఇతర రాష్ట్రాలకు వెళ్లే రైళ్లు కూడా రద్దు కావడం, బైట అడుగుపెట్టే పరిస్థితి కూడా లేకపోవడంతో వారంతా రైల్వే స్టేషన్లలోనే మూడు రోజులుగా తలదాచుకుని బతుకుతున్నారు. రెండు రోజులుగా బిస్కట్లు తిని, నేలపై నిద్రపోతూ గడుపుతున్నామని తాంబరం రైల్వే స్టేషన్‌లో తలదాచుకున్న పశ్చిమ బెంగాల్‌కు చెందిన వలస కార్మికుడు సలీమ్ చెప్పాడు. పెరుంబాక్కం ప్రాంతంలో తాను కన్‌స్ట్రక్షన్ కార్మికుడిగా పని చేస్తున్నానని, వర్షాల కారణంగా పనులు నిలిచిపోవడంతో తిరిగి తన స్వస్థలమైన ముర్షీదాబాద్ వెళ్లాలనుకుని స్టేషన్‌కు వచ్చానని, అయితే రైళ్లన్నీ రద్దుకావడంతో ఎక్కడికీ వెళ్లలేక రెండు రోజులుగా ఇక్కడే తలదాచుకుంటున్నానని అతను చెప్పాడు. తినడానికి కూడా ఏమీ దొరకడం లేదని, అంతేకాదు డబ్బులు కూడా లేవని, కేవలం బిస్కట్లు తిని కడుపు నింపుకొంటున్నానని అతను వాపోయాడు. ఇది ఒక్క సలీమ్ సమస్యే కాదు, పొట్ట చేతపట్టుకుని బీహార్, యుపి లాంటి ఉత్తరాది రాష్ట్రాలనుంచి వచ్చిన వేలాది వలస కార్మికుల బాధ కూడా. చేతిలో డబ్బులు లేక, తినడానికి తిండి దొరక్క వీళ్లంతా ఆదుకునే వారికోసం ఆశగా ఎదురు చూస్తూ ఉన్నంతలో కాస్త సురక్షితంగా ఉండే రైల్వే స్టేషన్లు, బస్టాండ్లలో తలదాచుకుని ఉన్నారు.
పాలు, నీరు, కూరగాయలు.. ఏవైనా వంద పైమాటే
చెన్నై, డిసెంబర్ 3: మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కరిసిన వర్షాలు గురువారం కాస్త తగ్గుముఖం పట్టంతో జనం నిత్యావసర వస్తువుల కోసం పెద్ద సంఖ్యలో రోడ్లపైకి వచ్చారు. అయితే వ్యాపారులు ఇదే అవకాశంగా అన్ని వస్తువుల ధరలను విపరీతంగా పెంచేసారు. పాలు, నీళ్లు, కూరగాయలు.. ఇలా ఏది పట్టినా వంద రూపాయల చొప్పున అమ్మేస్తున్నారు. అరలీటరు పాల ప్యాకెట్ 50 రూపాయలు ఇస్తే తప్ప దొరగడం లేదు. అలాగే 15-20 రూపాయలకు దొరికే లీటర్ మినరల్ వాటర్ బాటిల్ వంద రూపాయలకు పైగానే పలుకుతోంది. ఇక కూరగాయల సంగతి చెప్పాల్సిన పనే లేదు. నెల రోజుల క్రితం దాకా కిలో 10-15 రూపాయలకు దొరికిన టమోటా ఇప్పుడు వంద రూపాయలకు పైగానే పలుకుతోంది. ఇక వాహనదారుల అవస్థలు వర్ణనాతీతం. నగరంలోని చాలా పెట్రోలు బంకుల్లో డీజిలు, పెట్రోలు లేకపోగా, స్టాక్ ఉన్న కొద్దిపాటి బంకుల ముందు కిలోమీటర్ల మేర క్యూలు కనిపిస్తున్నాయి.
జయలలిత ఏరియల్ సర్వే
చెన్నై, డిసెంబర్ 3: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత గురువారం ఉదయం చెన్నై నగరం, శివారు ప్రాంతాల్లో వరద పీడిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు. హెలికాప్టర్‌లో వెళ్లిన జయలలిత వర్షబీభత్సానికి సంభవించిన నష్టాన్ని స్వయంగా తిలకించారని అధికారులు చెప్పారు. అనంతరం ఆమె సీనియర్ అధికారులతో సమావేశమై పరిస్థితిని తెలుసుకున్నారు. వాస్తవానికి జయలలిత బుధవారమే ఏరియల్ సర్వే జరపాలని అనుకున్నారు. అయితే వాతావరణం అనుకూలంగా లేదని పైలట్లు చెప్పడంతో ఆమె ఆ ప్రయత్నం విరమించుకున్నారు. చెన్నైలోను, వరద తాకిడికి గురయిన రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లోను తీసుకున్న సహాయక చర్యలను బుధవారం అధికారులు జయలలితకు వివరించారు. వివిధ జిల్లాల్లో సహాయక చర్యలను పర్యవేక్షించే బాధ్యతను ఆమె పన్నీర్ సెల్వం లాంటి సీనియర్ మంత్రులకు అప్పగించారు. అంతే కాకుండా బాధిత ప్రజలకు ప్రభుత్వం సాయం చేరేలా చర్యలు తీసుకోవాలని సీనియర్ ఐఏఎస్ అధికారులను ఆమె ఆదేశించారు.
రాష్టప్రతి ఆవేదన
న్యూఢిల్లీ: చెన్నై జలప్రళయంలో పెద్దఎత్తున ప్రాణనష్టం సంభవించడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ నగర ప్రజలు మొక్కవోని ధైర్యం, ఆత్మస్థైర్యంతో ఈ కష్టాలను అధిగమించగలరన్న ఆశాభావాన్ని వ్యక్తం చేసారు. భారీ వర్షాల కారణంగా చెన్నై నగరంలో పెద్దఎత్తున ప్రాణనష్టం, ఆస్తినష్టం సంభవించడం తనకు తీవ్ర ఆవేదన కలిగించిదని ఆయన అంటూ, ఈ క్లిష్ట సమయంలో తమిళనాడు ప్రజలకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేయడంతోపాటు వారు త్వరగా ఈ కష్టాలనుంచి బైటపడాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నానని గురువారం ఒక సందేశంలో పేర్కొన్నారు.