ఈ వారం స్పెషల్

మేడారం పిలుస్తోంది..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేడారం...
ఓ ఆదివాసీ పల్లె..
పట్టుమని వెయ్యిమంది లేని ఆ మారుమూల అటవీప్రాంతం రెండేళ్లకోసారి
భక్తకోటితో పరవశించిపోతుంది...ఆ దృశ్యం ఇప్పుడు మరోసారి ఆవిష్కారమవుతోంది.
భక్తజనప్రపంచం అంతా ఎందుకంత దూరం వెళుతోంది, పరవశించిపోతోంది. అది
ఓ అద్భుతమైన ఘట్టం... పోరాటశక్తికి.. అచ్చమైన భక్తికి అసలు సిసలు ఉదాహరణ.
జాతర గిరిజనులదే అయినా... అన్నివర్గాల భక్తజనం బారులుతీరే చోటు అది..
పన్నుచెల్లించలేని ఆపన్నుల తరపున పోరాడిన ఓ కుటుంబం త్యాగాన్ని తలుస్తూ
అంతా చేరి మొక్కులు తీర్చుకునే యాత్రాస్థలి.
ఈ ఏడాది అక్కడికి కోటిన్నర మంది భక్తులు వస్తారని అంచనా...
తెలంగాణ కుంభమేళాగా చెప్పుకునే మేడారం జాతర వెనుక మహత్తరమైన
పోరాటగాథ ఉంది. ఓ స్ఫూర్తి ఉంది. ఓ తృప్తి ఉంది.

జనం మదిలో...
‘మిషన్ కాకతీయ’. ఇదేమిటో తెలంగాణనాట ఎవరిని అడిగినా చెబుతారు. కరువుకాటకాలతో అల్లాడుతున్న తమ రాజ్యంలో సాగునీటిని అందించి సస్యశ్యామలం చేయడానికి కాకతీయ చక్రవర్తులు తవ్వించిన గొలుసుకట్టు చెరువుల పునరుద్ధరణ కోసం తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమమే ‘మిషన్ కాకతీయ’. కాకతీయ రాజుల ప్రజారంజక పాలనకు గొలుసు కట్టు చెరువులు అద్దం పడుతాయి. ఇది కాకతీయుల పాలనకు నాణానికి ఒకవైపు మాత్రమే. నాణానికి మరోవైపు చూస్తే కాకతీయ రాజుల ఏలుబడిలోనూ ప్రజలు తిరగబడి యుద్ధం చేసిన ఉదంతమే ‘మేడారం’ జాతర. వరుస కరువు కాటకాలతో తినడానికే తిండి లభించని పరిస్థితిలోనూ కప్పం చెల్లించాలని కాకతీయ చక్రవర్తులు ఆదివాసి గిరిజనులపై వత్తిడి చేయడం, ఈ పరిస్థితుల్లో కప్పం కట్టలేం మహాప్రభో అని వారు కాళ్లావేళ్లాబడి వేడుకున్నా ఫలితం లేకపోయింది. ఇక చేసేది లేక కాకతీయ రాజులపై ఆదివాసి గిరిజనులు తిరగబడి యుద్ధానికి దిగారు. అయితే చక్రవర్తులకున్న ఆయుధ సంపత్తి, మహాసేనల ధాటికి తట్టుకోలేక ఆదివాసి వీరులు నేలకొరిగారు. తమపట్ల చక్రవర్తులు మానవత్వాన్ని మరిచి ప్రదర్శించిన దాష్టీకానికి ఆగ్రహించిన ఆదివాసి వనితలు సమ్మక్క, సారలమ్మ అనే వీర వనితలు ఇద్దరు అపరకాళికలుగా విజృంభించి యుద్ధరంగంలో పోరాడి కాకతీయ సేనలను కొంతకాలం పాటు నిలువరించగలిగారు. అయితే కాకతీయులకున్న అపారమైన సైన్యం ధాటికి తట్టుకోలేక చివరకు సమ్మక్క, సారలమ్మ (తల్లీకూతుళ్ళు) జంపన్న (కుమారుడు) నేలకొరిగారు. ఆ యుద్ధంలో అమరులైన తమ వీర మాతలను స్మరించుకోవడానికి ఆదివాసి గిరిజనులు ఆనాదిగా నిర్వహించుకుంటున్న వేడుకనే, కాలక్రమేణ ‘మేడారం’ జాతరగా వినుతికెక్కింది.
కాకతీయుల కళాసంపద, చరిత్రపై పరిశోధనలు, అధ్యయనం చేసిన ప్రముఖ చారిత్రకారుడు దివంగత దెందుకూరి సోమేశ్వరశర్మ మేడారం జాతర ఘటనను ఎన్‌కౌంటర్‌తో పోల్చారు. కాకతీయుల హయాంలో వారి సైన్యానికి, ఆదివాసీలకు మధ్య జరిగిన యుద్ధంలో గిరిజన వీర వనితలు సమ్మక్క, సారలమ్మ అసువులు బాసారని, తాము అమితంగా అభిమానించి, ఆరాధించే తమ వీర మాతల త్యాగాన్ని స్మరించుకోవడానికి ఆదివాసులు జరుపుకునే వేడుక మేడారం జాతరగా ప్రసిద్ధి చెందిందని పేర్కొన్నారు.
అయితే ఈ ఆదివాసి వీర వనితల గాథ చరిత్రలో ఎక్కడైనా ఉందా అంటే, దీనికి సంబంధించిన చారిత్రక ఆనవాలు ఎక్కడా కనిపించలేదనే తేలింది. చరిత్ర పుటల్లోకి ఎక్కకపోయినా, సమ్మక్క, సారలమ్మ వీరోచిత పోరాటాన్ని స్మరించుకోవడం తమ విధిగా, తరతరాల వారసత్వంగా ఆదివాసి గిరిజనులు కాపాడుకుంటూ వస్తున్నారు.
ఎవరు వీరు?
అసలు ఎవరీ సమ్మక్క, సారలమ్మ. వీరు గిరిజన దేవతలు. వీరిద్దరు తల్లి కూతుళ్లా, అక్కా చెల్లెండ్లా? అనేది ఇంత వరకు ఏ చరిత్రకారుడు తేల్చి చెప్పలేకపోయారు. అయితే వీరు ఒకరికి ఒకరు ఏమవుతారనే వాదనల జోలికి వెళ్లకుండానే వీరి పట్ల అచంచలమైన భక్తిని చాటుకునే అసంఖ్యాకమైన భక్త జనకోటి వీరి సంపద. సమ్మక్క, సారలమ్మలు వీరమరణం పొందిన స్థలానే్న పరమ పవిత్రంగా భావించి, అక్కడ వెలిసిన (గద్దెలను) దేవతలుగా కొలుస్తున్నారా? అంటే, అదీ లేదు. కాకతీయ సేనలతో జరిగిన యుద్ధంలో వీర వనితలు నేలకొరిగిన స్థలంలోనే జాతర జరుగుతోందా అంటే అది కూడా కాదు. ప్రస్తుతం జాతర జరిగే మేడారానికి సమీపంలోని బయ్యక్కపేట వద్ద వీరు వీరమరణం పొందినట్టు ఆదివాసి గిరిజనుల పూర్వీకులు చెబుతారు. పోనీ ఈ వీర మాతలకు ప్రతీకగా వెలిసిన దేవతా విగ్రహాలను ఇక్కడ పూజిస్తున్నారా అంటే, అదీ లేదు. విగ్రహాలు లేకుండానే రెండు దిమ్మలపై ప్రతిష్టించిన గద్దెలను సమ్మక్క, సారలమ్మలకు ప్రతీకగా భావించి భక్తులు పూజించడం ఇక్కడ మరో విశిష్ట్టత. ఈ ఆదివాసి దేవతలు ఇద్దరికీ మద్యం, మాంసం, అంటు, ముట్టు అంటూ ఏదీ ఉండదు. హిందు సమాజం దేవతలను కొలిచే పూజా విధానాలకు పూర్తిగా భిన్నమైన సంస్కృతీ సంప్రదాయాలు, పూజా విధానాన్ని ఇక్కడ అనాదిగా అనుసరిస్తున్నారు. మొక్కులు చెల్లించడానికి ఇక్కడికి వచ్చే భక్తులు గుక్కెడు మందు, కోడికూరా లేకపోతే సమ్మక్క, సారలమ్మలు మెచ్చరని విశ్వాసం. అందుకే మేడారం జాతరలో ప్రత్యేకంగా మద్యం షాపులు పెట్టుకోవడానికి ఎక్సైజ్‌శాఖ తాత్కాలిక లైసెన్స్‌లను ఇస్తుంది. లక్షలాది కోళ్లు, మేక పోతులు, గొర్రె పొట్టేళ్లు జాతరలో అమ్మవార్లకు సమర్పిస్తారు. ఇక్కడ జరిగే జాతరలో మద్యానికి ఎంతటి ప్రాధాన్యత ఉంటుందో, ఒక ఉదంతాన్ని చెప్పుకుంటారు. రాష్ట్రంలో మద్య నిషేధం అమలు జరిగిన సమయంలో మేడారం జాతర వచ్చింది. మేడారం జాతరలో ప్రధాన ఘట్టమైన సమ్మక్కను చిలుకల గుట్ట నుంచి గద్దెకు తీసుకురావడానికి పూజారులు వెళ్లారు. వారి రాకకోసం మేడారంలో లక్షలాది మంది భక్తులు దేవతల ఆగమనం కోసం ఎదురు చూశారు. ప్రతి జాతరకు అక్కడికి జిల్లా కలెక్టర్, ఎస్పీలు వెళ్లి అమ్మవార్లకు స్వాగతం పలకడం ఆనవాయితీ. అయితే అమ్మవార్లు ఎంతకూ చిలుకల గుట్ట నుంచి కిందకు రాకపోవడంతో ఎదురు చూస్తున్న లక్షలాది మంది భక్తులతోపాటు అధికారులకు ఏమి చేయాలో తెలియక తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఏదో లోపం జరిగిందని, గద్దెలకు రావడానికి అమ్మవార్లు సమ్మతించడం లేదన్న సమాచారం అధికారులకు చేరింది. వారు కొందరు గిరిజన పెద్దలను సంప్రదించి అప్పటికప్పుడు ఉన్నతాధికారులను సంప్రదించి కలెక్టర్, ఎస్సీలు మద్యాన్ని తెప్పించి సాకా పెట్టిన తర్వాతనే దేవతలు కొండ దిగి వచ్చారని చెబుతారు. మేడారం జాతర అంటే అట్టడుగు వర్గాల ప్రజానీకానికి నిఖార్సైన నమ్మకం, అసలు సిసలైన ఆదివాసీ గిరిజనుల సంప్రదాయం, సంస్కృతికి ప్రతీక.
అందరికీ 3 రోజులు... గిరిజనులకు నెల రోజులు
ప్రతి రెండేళ్లకోసారి మాఘశుద్ధ పౌర్ణమినాడు మేడారం జాతర ఆరంభమై నాలుగు రోజుల పాటు జరుగుతోంది. గిరిజనేతరులకు ఇది మూడు రోజుల వేడుకే అయినా, గిరిజనులకు మాత్రం ఇది నెల రోజుల పండుగ. ఏటా కాకుండా, రెండేళ్లకోసారి జరగడమేంటనే ప్రశ్న కూడా తలెత్తకపోదు. కొన్ని గిరిజన తెగలు 60 రోజులను నెలగా పరిగణించే సంప్రదాయం ఉందని చెబుతారు. ఈ కారణంగానే మేడారం జాతర రెండేళ్లకోసారి జరుగుతోందంటారు. దాదాపు ఏడెనిమిది శతాబ్దాలుగా గిరిజనుల, గిరిజనేతరుల చేత పూజలందుకుంటున్న సమ్మక్క, సారలమ్మలు ఒక మన ప్రాంతానికే పరిమితం అయిన దేవతలు కాదు. ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన కోట్లాది మంది భక్తుల ఇంట సమ్మక్క, సారలమ్మలు ఇలవేల్పులుగా పూజలందుకుంటున్నారు.
జాతర క్రమం
మొదటి రోజు...ప్రతి రెండేళ్లకోసారి జరిగే జాతరలో భాగంగా ఈ నెల 17వ తేదీ నుంచి 20 వరకు నాలుగు రోజుల పాటు మేడారం జాతర జరుగనుంది. ఈ నెల 17వ తేదీన సాయంత్రం నాలుగు గంటలకు కనే్నపల్లి నుంచి (మేడారానికి సమీపం) సారలమ్మను గద్దెకు తీసుకవచ్చి ప్రతిష్ఠిస్తారు.
రెండవ రోజు...18వ తేదీన సాయంత్రం 5 గంటలకు చిలుకల గుట్ట నుంచి సమ్మక్క దేవతను తీసుకొచ్చి గద్దెపై ప్రతిష్ఠిస్తారు. అప్పటి నుంచే మొక్కులు చెల్లించుకోవడం ప్రారంభం అవుతుంది.
మూడవ రోజు...19వ తేదీన గద్దెలపై కొలువైన సమ్మక్క, సారలమ్మను భక్తులు దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటారు.
నాలుగవ రోజు...20వ తేదీన సాయంత్రం అమ్మవార్ల వన ప్రవేశం జరుగుతుంది.
మేడారం జాతరకు ఏటేటా భక్తుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుండటంతో దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు రద్దీ వల్ల ఇబ్బంది పడాల్సి వస్తుందన్న భయంతో నెల రోజుల ముందు నుంచే మేడారానికి వచ్చి దర్శించుకోవడం ఈ మధ్య మొదలైంది. జాతర జరిగే మాఘ శుద్ధ పౌర్ణమికి ముందు వచ్చే పౌర్ణమి రోజున గిరిజన పూజారులు మండమెలిగే పండుగను నిర్వహిస్తారు. దీనిని గిరిజనులు మాత్రమే జరుపుకుంటారు. ఇది జరిగినప్పటి నుంచి జాతర ప్రారంభమైనట్టుగా భావించి భక్తులు నెల రోజుల ముందు నుంచే మేడారానికి వచ్చి వెళ్లడం గత ఐదారేళ్ళ నుంచి జరుగుతుంది.
బంగారంతో తులాభారం
మేడారం జాతరలోని గద్దెలపైకి దేవతా మూర్తులను తీసుకురావడం అంటే వారి కుంకుమ భరిణెను గిరిజన సంప్రదాయంతో వడ్డెరల పూజారులు గద్దెలపైకి తీసుకురావడమే. కుంకుమ భరిణెలోని బండారిగా పిలిచే పసుపు, బంగారంగా పిలిచే బెల్లం, కుంకుమలు గద్దెకు చేరుకోవడంతో మేడారం జాతర ప్రారంభమవుతుంది. జాతరకు వచ్చే భక్తులు మొదట జంపన్న వాగులో స్నానం ఆచరించి గద్దెల వద్దకు చేరుకోవడం అనవాయితీ. దేవతల కుంకుమ భరిణెలను తీసుకొచ్చే పూజారులకు ఎదురేగే మహిళా భక్తులు (శివసత్తులు) పారవశ్యంతో ఊగిపోతుంటారు. దేవతలు గద్దెకు చేరుకునే దారిలో భక్తులు అడ్డంగా పడుకుంటే కుంకుమ భరిణెతో ఊరేగి వస్తున్న పూజారులు వారిపై నడుచుకుంటూ వెళ్తారు. తమపై నుంచి దేవతలను తీసుకెళ్లే పూజారులు వెళ్తే, తమ జన్మ సార్ధకమైనట్టుగా భక్తులు అనుభూతిని పొందుతారు. దేవతలకు ఎదురేగి కోళ్లను ఎగరేయడం, అవి కింద పడకముందే ఒక్క వేటుకు తల నరికే విధంగా బలి ఇవ్వడం ఇక్కడ ఆచారం. దీనిని ఎదురుకోళ్లు అంటారు. ఈ వేడుకను తిలకించడానికి భక్తులు కిలో మీటర్ల పొడవునా బారులు తీరుతారు.
ఇలా ఉండగా కొందరు మగవాళ్లు ఆడవాళ్ల వేషధారణతో సమ్మక్క, సారలమ్మలకు మొక్కు తీర్చే ఆచారం కూడా ఇక్కడుంది. వీరిని ‘ఆచారవంతులు’గా పిలుస్తారు. దేవాలయాల్లో మొక్కులు తీర్చేందుకు హుండీలో వేసినట్టుగా ఇక్కడ డబ్బు, నగలను కానుకలుగా కాకుండా, ఎక్కువగా పసుపు కుంకుమలు, కొబ్బరికాయలు, బెల్లాన్ని (బంగారం) కానుకలుగా సమర్పిస్తారు. అలాగే మరికొందరు సమ్మక్క సారలమ్మలకు కోడెలను కానుకలుగా సమర్పించుకుంటారు. సంతానం లేని వారు సంతానం కోసం వరాలు పడుతుంటారు. తల్లి దీవెన వల్ల సంతానం కలిగిన వారు తమ పిల్లలనే త్రాసులో కూర్చోబెట్టి వారికి నిలువెత్తు బంగారాన్ని (బెల్లం) తులాభారంగా సమర్పిస్తారు.
చారిత్రక నేపథ్యం..
కాకతీయుల సామ్రాజ్యంలో భాగమైన మేడారం ప్రాంతంలో వరుసగా వచ్చిన కరువు కాటకాలతో ఇక్కడి ప్రజానీకం బుక్కెడు తిండికి నోచుకోని తరుణంలో కప్పం చెల్లించలేదన్న ఆగ్రహంతో కాకతీయ చక్రవర్తి ప్రతాపరుద్రుడు, ఏమాత్రం కరుణ చూపకుండా కర్కశంగా గిరిజన రాజుల ఏలుబడిలో ఉన్న మేడారం రాజ్యంపై యుద్ధం ప్రకటించారు. ఈ ప్రాంతాన్ని పాలించే గిరిజన సామంత రాజైన పగిడిద్దరాజు విధిలేని పరిస్థితుల్లో కాకతీయులతో యుద్ధానికి తలపడాల్సి వచ్చింది. కాకతీయుల సేనల పరాక్రమ, పోరాట పటిమ, ఆయుధ సంపత్తిని ఎదుర్కోలేని పగిడిద్దరాజు, కుమారుడు గోవిందరాజు, ఓటమి అంచులకు చేరారు. ఈ విషయం తెలుసుకున్న పగిడిద్దరాజు భార్య సమ్మక్క, కూతురు సారలమ్మలు యుద్ధరంగంలోకి దూకారు. వీరిద్దరు అపరకాళికల్లా విజృంభించి కాకతీయ సైన్యంతో వీరోచితంగా పోరాటం చేసి యుద్ధ్భూమిలోనే అసువులు బాసారు.
అయితే మరో కథ ప్రాచుర్యంలో ఉంది. సమ్మక్క యుద్ధ్భూమి నుండి వైదొలిగి మేడారానికి ఈశాన్యం వైపుగల చిలుకల గుట్ట వైపు వెళ్లగా, కొందరు కోయ సైనికులు ఆమెను అనుసరించినప్పటికీ, కొండ మలుపుల్లో అదృశ్యమైపోయింది. ఎంతకు ఆమె జాడ తెలియరాలేదు. అయితే గుట్టమీదగల నాగవృక్షం సమీపంలో ఒక పుట్ట దగ్గర పసుపు, కుంకుమ గల భరిణి వారికి కనిపించింది. అదే సమ్మక్క గుర్తుగా భావించి కోయదొరలు నిద్రాహారాలు మాని సమ్మక్క తిరిగి వస్తుందనే ఆశతో వేచి చూసినా ఫలితం లేకపోయింది. అప్పటి నుండి మాఘశుద్ధ పౌర్ణమి రోజున ప్రతిరెండేళ్లకోసారి గిరిజనులు సమ్మక్క, సారలమ్మలకు మొక్కులు చెల్లించి, భక్తిప్రపత్తులతో జరుపుకునేదే మేడారం జాతర. *

దేవతల ఆగమనం...ఆద్వితీయం!
మేడారం జాతరలో ప్రధాన ఘట్టం సమ్మక్క, సారలమ్మ దేవతలను గద్దెపైకి తీసుకురావడం. భక్తుల ఈ అనుభూతి అనిర్వచనీయం. లక్షలాది మంది భక్తులు తమ హృదయంలో సమ్మక్క-సారలమ్మను నింపుకొని మొక్కులు చెల్లించే దృశ్యాన్ని కళ్లారా చూడాలి తప్ప వర్ణించలేం. సమ్మక్క, సారలమ్మ పూజారులను (వడ్డెరలు) ఒప్పించి అమ్మవార్లను గద్దెకు తీసుకురావడం అధికార యంత్రాంగం విధిగా అనాదిగా వస్తున్న ఆచారం. ఇంటి ఆడబిడ్డను వివాహానంతరం అత్తవారింటికి పంపించడానికి తల్లిదండ్రులు పడే వ్యధాభరిత ఘట్టాన్ని తలపించేలా సమ్మక్క, సారలమ్మలను గద్దెలపైకి తీసుకెళుతూ పూజారులు తల్లడిల్లుతారు. ఆ సమయంలో దేవతల ఆగమనం కోసం పడిగాపులు కాసే లక్షలాది మంది భక్తులకు దర్శన భాగ్యం కల్పించేందుకు అధికారులు పూజారులను బతిమాలి ఒప్పించి తీసుకొస్తారు. గిరిజన సంప్రదాయక వాయిద్యాలతో సమ్మక్క, సారక్కలను తీసుకొచ్చే ఆ ఘట్టం మహోద్విగ్నంగా ఉంటుంది. ఈ ఘట్టం వెనకనున్న కథనం అత్యంత ఆసక్తికరంగా ఉంటుంది. సమ్మక్క, సారమ్మలు కుంకుమ భరిణె రూపంలో కొలువుదీరారని గిరిజనుల నమ్మకం. ఈ కుంకుమ భరిణెలను వెదురు బుట్టల్లో భద్రంగా దాచి చిలకలగుట్ట పై ఉండే ఆలయంలో పెడతారు. చిలకలగుట్టకు నలువైపులా ఈటెలు ధరించిన వడ్డెలు కాపలాగా ఉంటారు. ముందుగా సారలమ్మ, మరుసటి రోజు సమ్మక్కను గద్దెపై ప్రతిష్ఠిస్తారు. అమ్మవార్లు గద్దెపైకి చేరగానే లక్షలాది మంది భక్తులు మొక్కుబడులు సమర్పిస్తారు. దండకారణ్యంలోని మేడారానికి ఎన్నో ప్రయాసలుపడి పిల్లాపాపలతో తరలివచ్చేది మూడు రోజుల జాతరలో ఈ ప్రధాన ఘట్టాన్ని చూడటం కోసమే. శబరిమలలో అయ్యప్పస్వామి జ్యోతి దర్శనం లాంటిదే ఈ ఘట్టం. వనదేవతలు గద్దెలపై కొలువు తీరగానే భక్తులు తమ పిల్లాపాపలకు తల వెంట్రుకలు తీయడం, బంగారంతో (బెల్లం) తులాభారాలు ఇవ్వడం ద్వారా మొక్కులు తీర్చుకుంటారు.

కొండదేవర స్వరూపం..
మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర వీర వనితలకు సంబంధించి అనేక జానపద గాథలున్నాయి. వీటిలో 7వ శతాబ్దంలో దండకారణ్యంలోని మేడారం నుండి కోయదొరలు ఒకరోజు దట్టమైన అడవుల్లోకి వేటకు వెళ్లగా పెద్ద పులుల కాపలా మధ్య దేదీప్యమానంగా ఒక పసిపాప కనిపించింది. ఆ దృశ్యం చూసి ఆశ్చర్యానికి గురైన కోయ దొరలు గూడెం పెద్దలను రప్పించి ఆ పసిపాపను పల్లకిలో మేళతాళాలతో గూడేనికి తీసుకెళ్లారు. ఆ పసిపాప మేడారానికి వచ్చినప్పటి నుండి ఆ ప్రాంతం సుభిక్షంగా వర్ధిల్లింది. అడవిలోని విషసర్పాలు, క్రూరమృగాల గుంపుమధ్యలో గద్దెపై పసిపాప ఉండటాన్ని కోయదొరలు చూశారు. కొండదేవర సాక్షాత్తు పసిపాప రూపంలో అవతరించిందని భావించి మాఘశుద్ధ పౌర్ణమి రోజు ఆ పాపకు సమ్మక్క అని నామకరణం చేశారు. పులులు, సింహాలు, జంతువులపై స్వారీ చేయడం, దీర్ఘరోగాలను నయం చేయటం, వృద్ధులు, అనాధలకు సహాయ పడటం, సంతానం అనుగ్రహించడం వంటి అతీతమైన మహిమల వల్ల సమ్మక్క కీర్తి నలుదిశలా వ్యాపించింది. అనంతరం ఇప్పటి కరీంనగర్-వరంగల్-ఖమ్మం సరిహద్దులోని దండకారణ్యం ప్రాంత రాజ్యాన్ని పరిపాలించే కోయ చక్రవర్తి మేడరాజు మేనల్లుడు పగిడిద్ద రాజుతో సమ్మక్కకు వివాహం జరిగింది. ఈ దంపతులకు సారలమ్మ, నాగులమ్మ అనే ఆడ శిశువుతో పాటు జంపన్న అనే మగ శిశువు కూడా కలిగాడు.క్తులు దేవతల ఆగమనం కోసం ఎదురు చూశారు. ప్రతి జాతరకు అక్కడికి జిల్లా కలెక్టర్, ఎస్పీలు వెళ్లి అమ్మవార్లకు స్వాగతం పలకడం ఆనవాయితీ. అయితే అమ్మవార్లు ఎంతకూ చిలుకల గుట్ట నుంచి కిందకు రాకపోవడంతో ఎదురు చూస్తున్న లక్షలాది మంది భక్తులతోపాటు అధికారులకు ఏమి చేయాలో తెలియక తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఏదో లోపం జరిగిందని, గద్దెలకు రావడానికి అమ్మవార్లు సమ్మతించడం లేదన్న సమాచారం అధికారులకు చేరింది. వారు కొందరు గిరిజన పెద్దలను సంప్రదించి అప్పటికప్పుడు ఉన్నతాధికారులను సంప్రదించి కలెక్టర్, ఎస్సీలు మద్యాన్ని తెప్పించి సాకా పెట్టిన తర్వాతనే దేవతలు

గట్టమ్మను దర్శించుకున్నాకే...
మేడారం జాతరకు వెళ్లే భక్తులు, మొదట గట్టమ్మ తల్లిని దర్శించుకోవాల్సిందే. లేకపోతే తిప్పలు తప్పవని భక్తుల నమ్మకం. వరంగల్ నుంచి మేడారం వెళ్లే దారిలో (వరంగల్-ఏటూరునాగారం రోడ్) ములుగు పట్టణానికి వెళ్లడానికి ముందు రోడ్ పక్కనే గట్టమ్మగుడి ఉంటుంది. గట్టమ్మకు ముందుగా మొక్కులు చెల్లించకుండా వెళ్తే గట్టమ్మ ఆగ్రహానికి గురికాకతప్పదని భక్తుల నమ్మకం. మేడారం జాతర పనులు ప్రారంభించడానికి ముందు వరంగల్ జిల్లా అధికారులు కూడా ముందుగా గట్టమ్మకు పూజలు నిర్వహించడం అనవాయితీగా వస్తుంది.

సమ్మక్క చందావారి ఆడపడుచు...
లక్షలాదిమంది భక్తుల ఆరాధ్య దేవత సమ్మక్క తల్లి గిరిజన తెగ చందావారి 5వ గోత్రానికి చెందిన ఆడపడుచని గిరిజన పూర్వీకులు చెబుతారు. సమ్మక్కది మేడారానికి సమీపంలోని బయ్యక్కపేట పుట్టినిల్లుగా చెబుతారు. ఈ కారణంగానే మేడారం జాతర మొదట బయ్యక్కపేటలోనే జరిగేదని, కాలక్రమేణ అది మేడారానికి మారినట్టు చెబుతారు. సమ్మక్క బాల్యంలో ఎక్కువ సమయం అడవిలోనే గడిపేదని, క్రూరమృగాల మధ్యలో గడుపుతూ పెద్దపులిపై సవారి చేస్తూ వనమంతా తిరిగేదని చెబుతారు. ఇది గ్రహించిన సమ్మక్కను పెంచిన తల్లిదండ్రులు ఏ ప్రమాదం జరుగుతుందేమోనన్న భయంతో ఆమెను ఇంట్లోనే నిర్బంధించారని, ఆ సమయంలో గిరిజన పూజారులకు అమ్మవారు కలలోకి వచ్చి, ఆ బాలిక అవతారమూర్తి అని, నిర్బంధించవద్దని చెప్పినట్టు చెబుతారు. తనను చిలుకలగుట్టపై వదిలేస్తే ఆడుకుంటానని సమ్మక్క చెప్పడంతో అక్కడ వదిలేసినట్టు చెబుతారు. చిలుకలగుట్టపై వదిలేసిన తర్వాత సమ్మక్క కనిపించకుండా పోయిందని, అయితే గుట్టపైనున్న ఒక గుహ వద్ద నిలబడితే సమ్మక్క మాటలు వినిపించేవని చెబుతారు. గుహ వద్దకు వెళ్లగానే అందులోంచి ఒక పాము బయటికి వచ్చి వెళ్లిన వారిని కూర్చోమని చాప పరిచేదని చెబుతారు. కొంతకాలానికి తనకు జంతుబలి ఇవ్వాలని కోరడంతో అప్పటి నుంచే పూజలు ప్రారంభం అయినట్టు చెబుతారు. ఇప్పటికీ సమ్మక్క గుహలో జ్ఞానముద్రలో ఉందన్నది చందావంశీయుల నమ్మకం. బయ్యక్కపేటలోని వడ్డెర పూజారులు (చందావంశీయులు) ఆర్థికంగా చితికిపోవడంతో సమ్మక్కను కొలవడం మానేయడంతో సమ్మక్కనే మేడారానికి తరలివెళ్లి అక్కడ గద్దెలపై కొలువుదీరినట్టు చెబుతారు. గతంలో బయ్యక్కపేటలో ఏర్పాటు చేసిన గద్దెలు, పుట్ట ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉంది.

-వెల్జాల చంద్రశేఖర్