ఈ వారం స్పెషల్

బాహుబలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అతడే ప్రశ్న..
అతడే జవాబు..

ఒకసారి ప్రశ్నించడం అలవాటయిన వ్యక్తి.. ఉన్నచోట ఎప్పుడూ నిలవడు.
అతని సరిహద్దులు పెరుగుతూ
పోతుంటాయి. తెలుగు నేలను దాటి,
దక్షిణాదిని దాటి, దేశాన్ని దాటి
ప్రపంచపు అంచుల వరకూ..
అతను ఏదైనా చేయగలడు.
ఏమైనా సాధించగలడు.
మూలాల్ని శోధించగలడు.
శిఖరాలను ఛేదించగలడు.

- బిగినింగ్ ఒక ప్రశ్న.
- కన్‌క్లూజన్ ఒక సమాధానం.
ఇక్కడితో బాహుబలి శకం ముగిసిందా? ఇదీ ప్రస్తుతం సినీ ప్రపంచాన్ని కుదిపేస్తున్న కొత్త ప్రశ్న. నిజానికి అప్పుడూ ఇప్పుడూ ఎప్పుడూ జక్కన్న ఎలాంటి ప్రశ్నలూ సంధించలేదు. ‘మొదలు’ చూసిన తరువాత మనమే ప్రశ్నవేసుకున్నాం -కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడని. ‘ముగింపు’ చూశాక సమాధానమూ మనమే
వెతుక్కున్నాం -బాహుబలిని కట్టప్ప ఇందుకు చంపాడా? అని. బాహుబలి ఆది, అంతం చూపించేసిన
తరువాత కూడా రాజవౌళి ఎలాంటి ప్రశ్నలూ వేయడం లేదు. ‘వ్వాట్ నెక్స్ట్?’ - అని మనమే
ప్రశ్నించుకుంటున్నాం. ఏం చెబుతాడోననీ మనమే ఎదురు చూస్తున్నాం.

రామాయణం విన్న తరువాత రాముడికి సీత ఏమవుతుంది? అని అడిగిన అమాయకుడిని చూసి జనం నవ్వారు. ‘కట్టప్ప ’ ఊసెత్తితే బాహుబలి ఆడియన్సూ ఇప్పుడలాగే నవ్వుతారు. ఎందుకంటే -బాహుబలిని ఎందుకు చంపాడో? ఎలా చంపాడో? ప్రేక్షకులు చూసేశారు. కాదు, ఊరించి ఊరించి రాజవౌళే చూపించేశాడు. సో.. ఇప్పుడు ఆడియన్స్ మైండ్‌లోవున్న ప్రశ్న ‘కట్టప్ప’ గురించి కాదు. బాహుబలిని ఆవిష్కరించిన రాజవౌళి గురించి. తెలుగు సినిమాను ‘కాకలుతీరిన’ స్థాయికి తీసుకెళ్లిన జక్కన్న -కొత్తగా చెక్కబోయే శిల్పం గురించి. ఆ శిల్పం ఎలా ఉండబోతుందో మనం ఊహించుకోవాలంటే -‘మొదలు’ నుంచి ‘ముగింపు’ వరకూ బాహుబలిపై ఒక్కసారి దృష్టిపెట్టాలి.
***
ప్రశ్న ఎంత గొప్పదో ఇప్పటికైనా ఎవరైనా గుర్తిస్తే బాగుండును. ప్రశ్నంటే భయపడే సమాజం మనది. అడగడానికి భయం. అడిగేవారంటే భయం. అసలు ప్రశ్నంటేనే పెద్ద భయం. కానీ, రాజవౌళిలాంటి వాళ్లు ప్రశ్నించుకుంటారు. ప్రశ్నను ప్రేమిస్తారు. ప్రేమగా ఆహ్వానిస్తారు. ప్రశ్నించారేమోనన్న భ్రమ కల్పిస్తారు. బాహుబలితో రాజవౌళి అదే చేశాడు. ‘కట్టప్ప’ బాహుబలిని ఎందుకు చంపాడన్న ప్రశ్నకు సమాధానం చెప్పడంలోనే వంద ప్రశ్నలు వదిలాడు. దర్శకుడిగా రాజవౌళిది ఏ స్థాయి? జక్కన్న చెక్కబోయే తరువాతి శిల్పం ఏమిటి? హాలీవుడ్ స్థాయికి తీసుకెళ్లిన బాహుబలిపై -సీక్వెల్స్ పరంపర కొనసాగిస్తాడా? ఇలా వేసుకుంటూ పోతే -లెక్కలేనన్ని ప్రశ్నలు. అన్నింటినీ మళ్లీ జక్కనే్న సమాధానం చెప్పాలి.
***
‘శుభం’ కార్డు పడితేనే తెలుగు సినిమా అన్నది మన నమ్మకం. అలా అనుకుంటూనే వందల వేల తెలుగు సినిమాలను అమాయకంగా ఆదరించేశాం. కానీ, ఒక ‘ప్రశ్న’తో సినిమా ముగించి మొట్టమొదటగా షాక్ ఇచ్చాడు దర్శకుడు రాజవౌళి.
బాహుబలి -ద బిగినింగ్ సినిమా ఒక ప్రశ్నతో ముగిసింది. బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు? వై డిడ్ కట్టప్ప కిల్ బాహుబలి? కట్టప్పనే బాహుబలికో క్యోం మారా? ఒకటే ప్రశ్న. దేశమంతటినీ పట్టి కుదిపేసింది. బాహుబలి -ద కంక్లూజన్ చూసేశాం కనుక ఇప్పుడింక ఆ టెన్షన్ తీరిపోయింది. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడో తెలిసిపోయింది. జనం తండోపతండాలుగా చిత్రాన్ని చూస్తూ తన్మయులవుతున్నారు. స్క్రీన్ మీదే కాదు, స్క్రీన్ వెనుకా జక్కన్న ‘ట్రిక్’ పని చేసి కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. తెలుగు సినీ చరిత్రలోనే కాదు, భారతీయ సినీ చరిత్రలోనే రికార్డులను బద్దలుకొట్టి అంచనాలకు తగిన చిత్రంగా రికార్డుల రోడ్డుపై పరిగెడుతోంది. ఇప్పుడిక ‘బాహుబలి’ గురించి ఎవ్వరికీ ప్రశ్నలూ అక్కర్లేదు. సమాధానాలు అక్కర్లేదు. కానీ ఇక్కడే మరో ప్రశ్న. బాహుబలి కథ ఇంతటితో ముగుస్తుందా? లేక మరో కొత్త కథకు దారితీస్తుందా? అదీకాదంటే -తెలుగు సినిమా గమనానే్న మార్చేస్తుందా? ఈ ప్రశ్నకు సమాధానం కావాలంటే, రాజవౌళి గతంలోకి వెళ్లాలి. బాహుబలి విజయం భారతీయ సినిమా జగత్తుపై ఎలాంటి ప్రభావం చూపుతుందోనన్న అంశాన్ని అంచనా వేయాలి.
* * *
2015, జులై 10వ తేదీన బాహుబలి -ద బిగినింగ్ ప్రపంచవ్యాప్తంగా విడుదలయింది. అధికారిక లెక్కల ప్రకారం బాహుబలి మొదటి భాగం బడ్జెట్ 180 కోట్ల రూపాయలు. ఈ సినిమా ఎంత పెద్ద సంచలనం అయిందో మనందరికీ (మిగతా 12వ పేజీలో)

(7వ పేజీ తరువాయ)
తెలుసు. భారతదేశపు అది పెద్ద మోషన్ పిక్చర్ అంటూ విడుదలైన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలయి సంచలనం సృష్టించింది. వికీపీడియా ప్రకారం బాహుబలి - ద బిగినింగ్ సినిమా కలెక్షన్లు 650 కోట్ల రూపాయలు.
బాహుబలి మొదటి భాగం ఇంటర్వెల్ సీన్ గుర్తుందా? భల్లాలదేవుడి విగ్రహ ప్రతిష్ట పూర్తయ్యేసరికి అతనికి తన విగ్రహం కన్నా మించి, వేల అడుగుల ఎత్తయిన బాహుబలి బంగారు విఅగహం వెనుకన ఆవిష్కారం అవుతుంది. తెలుగు సినీ దర్శకులు, హీరోలు, నిర్మాతల పరిస్థితీ దాదాపు అదే అయింది. అంతవరకూ హీరో స్టామినా, కాంబినేషన్ క్రేజ్ అంటూ సూపర్ డూపర్ హిట్లు కొట్టిన వారందరి ఇమేజులూ చిన్నవి చేస్తూ వారి వెనుక రాజవౌళి ఒక దర్శక బాహుబలి విగ్రహంలా ఆవిష్కారం అయ్యారు. అంతవరకూ తెలుగు సినిమా రికార్డు కలెక్షన్లు 40 కోట్లూ, 60 కోట్లూ అంటూ జబ్బలు చరుచుకుంటున్న ఫిల్మ్ మేకర్ల ముందు 650 కోట్ల రూపాయల కలెక్షన్లతో మెల్లగా ఫిల్మ్ మేకర్లకే బాహుబలిగా అవతరించారు రాజవౌళి.
అసలు ఇదంతా ఎలా సాధ్యమయింది? ఒక తెలుగు సినిమాతో ప్రపంచాన్ని గెలవవచ్చని రాజవౌళి ఎలా ఆలోచించగలిగారు? అసలు హిట్ అవుతుందో లేదో కూడా తెలియని ఒక ఐడియా మీద కోట్లాది రూపాయల డబ్బు పెట్టుబడిగా పెట్టే నిర్మాతలను ఆయన ఎలా ఒప్పించారు? బాహుబలి ఇంతగా సక్సెస్ సాధిస్తుందని రాజవౌళి ముందే ఊహించారా? ప్లాన్ చేసి హిట్టు కొట్టడం సాధ్యమేనా? ఈ ప్రశ్నలకు సమాధానం కోసం.. ఇంకాస్త గతంలోకి తొంగి చూద్దాం.
రాజవౌళి.. చిన్నప్పుడు
అమరచిత్ర బొమ్మల కథల పుస్తకాలు ఎక్కువ చదివేవారు రాజవౌళి. అవి ఇంగ్లీషు వారి మార్వెల్ కామిక్స్ పుస్తకాల్లా సూపర్ హీరో కథలుకావు. రాజుల కథలు. గుర్రాలూ, కత్తి ఫైట్లూ ఉండే జానపద కథలు. భారతీయ ఇతిహాసాలు. ఇంగ్లీషు వారి సూపర్ హీరో కథలు సింపుల్‌గా ఉంటాయి. హీరోకి సూపర్ పవర్స్ ఉంటాయి. అతను సామాన్యులను రక్షిస్తుంటాడు. మంచి మీద చెడు దాడి చేస్తుంది. అప్పుడు ఆ సూపర్ హీరో జనాన్ని రక్షించి చెడు మీద విజయం సాధిస్తాడు. ఫాంటమ్ అయినా, సూపర్ మాన్ అయినా, స్పైడర్‌మాన్ అయినా, కెప్టెన్ అమెరికా అయినా... దాదాపుగా అవే కథలు. కానీ మన జానపదాలు వేరు. మనకు సూపర్ హీరోలు ఉండరు. తోటరాముళ్లుంటారు.
హనుమంతుడి లాంటి సూపర్‌మాన్లు కూడా రాముడంతటి మనిషికి బంటుగా సేవలందిస్తారు. మన కథల్లో పాత్రలకు శక్తులు ఉండవు. శక్తిమంతమైన పాత్రలుంటాయి. వ్యక్తిత్వం బలంగా ఉంటుంది. పాత్రలకి ధర్మం ఉంటుంది. ధర్మం కన్నా గొప్ప శక్తి ఉండదని ఋజువు చేసే కథలు. ఆ కథలు చదివారు రాజవౌళి.
పెద్దయ్యాక.. దర్శకుడయ్యాక.. సూపర్ హీరోల పాత్రలు కాకుండా బలమైన వ్యక్తిత్వం ఉన్న పాత్రలకే హీరోయిజాన్ని అద్దుతూ సినిమాలూ తీయడం మొదలుపెట్టారు. స్టూడెంట్ నెంబర్ వన్‌లో హీరో జైలుశిక్ష అనుభవిస్తూ కాలేజీలో చదివే ఓ కుర్రాడు. సింహాద్రిలో ఓ ఇంటికి నమ్మినబంటు. సైలో హీరో ఓ సామాన్యుడైన కాలేజీ విద్యార్థి. ఛత్రపతిలో హీరో ఓ శరణార్థి. మగధీరలో హీరో ఒక రాజసేవకుడు. ఈగలో హీరో ఈగే. మర్యాదరామన్నలో హీరో ఓ భయస్థుడు. కానీ వాళ్లందరూ పైకి సామాన్యులయినా బలమైన క్యారెక్టర్లు. వాళ్లు అనుకున్న ధర్మానికి నిలబడి పోరాడేవాళ్లు. బహుశా ఇదే రాజవౌళి నమ్మిన సిద్ధాంతం. బహుశా అదే రాజవౌళి బలం.
రాజవౌళి హీరో పదిమందిని చావచితక్కొట్టేవాడు కాదు. కష్టమైన పరిస్థితులకు ఎదురొడ్డి పోరాడేవాడు. అతను నమ్మిన సిద్ధాంతంతోనే అతను సినిమాలు తీశాడు. ప్రేక్షకులని మెప్పించాడు.
తొమ్మిది సినిమాలు. తొమ్మిదీ వరుస హిట్లు. అతను పదో సినిమాగా ఇంకేదయినా సినిమా తీసినా అంతే హిట్టయ్యేది. కానీ అలా తీస్తే అతను రాజవౌళి ఎందుకవుతాడు? తను చిన్నప్పటి నుంచి చదువుకున్న అమర చిత్ర కథలూ, అతని ఊహల్లో కదలాడిన రాజ్యాలూ, రాజులూ, రాణులూ, యుద్ధాలూ అవీ ఏం కావాలి? కలెక్షన్ల కాకి లెక్కలను లెక్క చేయకుండా, ఇంకేదో చేయాలి. ప్రేక్షకులకు ఒక కొత్త అనుభూతిని ఇవ్వాలి.
నాన్ననడిగితే కథ ఇస్తారు. మంచి ఫిల్మ్ మేకర్‌గా ఇమేజ్ ఉంది. కొంచెం బడ్జెట్ పెట్టగల మార్కెట్ ఉంది. చేతిలో ప్రభాస్ ఉన్నాడు. ఛత్రపతి సినిమా షూటింగ్ సమయంలో ప్రభాస్‌తో రాజవౌళి చెప్పారట. మీతో ఒక పెద్ద సినిమా తీస్తాను డార్లింగ్ అంటూ. ఇది 2005లో మాట. సరిగ్గా పదేళ్ల తరువాత.. ఆ ఆలోచనే బాహుబలి అయింది. బాహుబలి విడుదలయింది.
అంతకు ముందు వరకూ హాలీవుడ్ సినిమాలు రిలీజ్ అవుతున్నాయంటేనే ప్రపంచం ఎదురుచూసేది. కానీ మొట్టమొదటిసారి.. ఒక తెలుగు ఫిల్మ్ మేకర్ తీసిన సినిమా కోసం ప్రపంచమే ఎదురుచూసింది. దీనే్నమనాలి?
ట్రెండ్ మార్చడమంటారా? ట్రెండ్ సెట్ చేయడమంటారా? కొత్త ట్రెండ్ సృష్టించడమంటారా?
* * *
‘ఈగ’ సినిమా 2012లో రిలీజ్ అయింది. రూ.40 కోట్ల బడ్జెట్, వంద కోట్లకు పైగానే కలెక్షన్లు. ఈ సినిమా దక్షిణాదిలో రాజవౌళికి మంచి మార్కెట్ ఏర్పరచింది. వంద కోట్ల బడ్జెట్ వరకూ రాజవౌళికి వెసులుబాటు ఉంది. బహుశా అప్పటికి ఇదే ఆలోచన. బాహుబలి - ద బిగినింగ్ అలాగే మొదలయింది.
దక్షిణాది మార్కెటే టార్గెట్‌గా మొదలుపెట్టి ఉంటారు రాజవౌళి. అందుకే, బాహుబలి మొదటి భాగంలో అందరూ దక్షిణాది తారలే కనిపిస్తారు.
శివుడిగా ప్రభాస్, శివగామిగా రమ్యకృష్ణ, దేవసేనగా అనుష్కశెట్టి, కట్టప్పగా సత్యరాజ్, ఆయుధ వ్యాపారిగా కిచ్చా సుదీప్, కాలకేయగా ప్రభాకర్.. వీళ్లందరూ దక్షిణాది తారలే. భళ్లాలదేవుడు రాణా, అవంతిక తమన్నాలకు మాత్రమే హిందీలో ఇమేజ్ ఉంది. ఎప్పుడయినా సరే, ప్రయత్నంలో నిజాయితీ ఉంటే కచ్చితంగా మంచి ఫలితమే ఉంటుంది. అదే కాలపరీక్షకు నిలబడుతుంది.
ఇంతింతై వటుడింతై అన్నట్టుగా బాహుబలి - ద బిగినింగ్ పూర్తయ్యేసరికి.. అది తెలుగు సినిమా స్థాయిని దాటి, దక్షిణాది సినిమా స్థాయిని దాటి, భారతీయ సినిమా స్థాయికి ఎదిగిపోయింది.
దేశంలోనే అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా ఒక రికార్డు. దేశంలోనే అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాగా మరో రికార్డు. అమెరికా, కెనడా, బ్రిటన్, ఐర్లాండ్, మలేషియా, జపాన్, దుబాయ్.. దేశాలలో తెలుగు, తమిళ వర్షన్లు దుమ్ము రేపే కలెక్షన్లు సాధించాయి. చైనా, ఫ్రాన్స్ భాషల్లో ఈ సినిమా విడుదలై సంచలన విజయాలు సాధించింది. క్రమంగా బాహుబలి - ద బిగినింగ్ ఒక అంతర్జాతీయ భారతీయ సినిమాగా అవతరించింది.
అనుకోకుండా వచ్చే గెలుపుని - అదృష్టం అంటారు.
కష్టపడి సాధించే ఫలితానే్న - విజయం అంటారు.
* * *
కొందరుంటారు. ఎదురుగా నిచ్చెన పెట్టుకుని.. అదెలా ఎక్కాలా అని ఆలోచించే రకం.
ఇంకొందరు. నాలుగు మెట్లెక్కగానే.. కింద వాళ్లని చూసి.. తామే పైనున్నాం అనుకునే రకం.
చాలా అరుదుగా ఉంటారు. మెట్లు ఎక్కడమే కాదు, వాళ్లు నిచ్చెనల మీద నిచ్చెనలు వేసుకుని పైకెళుతూ ఉంటారు.
ఎత్తుకు వెళితే కింద పడిపోతామనే భయం ఉండదు వాళ్లకి. కింద పడమనే నమ్మకమే ఉంటుంది.
ఎవరెస్టు ఎక్కేసినా.. అక్కడే ఎందుకు ఆగిపోవాలి అనుకునేవారు. ఇంకా ఏదో చేయాలని తపించేవారు.
దర్శకుడు రాజవౌళి ప్రస్తుతం అలాంటి ప్రయాణమే చేస్తున్నారు.
* * *
బాహుబలి - ద కంక్లూజన్ ఏప్రిల్ 28, 2017 విడుదలకు ముందే రూ.500 కోట్ల బిజినెస్ చేసేసింది. దక్షిణాదిలో డిస్ట్రిబ్యూషన్ రైట్స్, శాటిలైట్, ఓవర్సీస్ బిజినెస్ ద్వారా ఈ రాబడి వచ్చిందని మార్కెట్ రిపోర్ట్. హిందీ, ఇతర భాషలలో మరొక రూ.500 కోట్లు కలెక్షన్ల రూపంలో సాధించడం ద్వారా వెయ్యి కోట్ల రూపాయల కలెక్షన్లు సాధించే మొట్టమొదటి భారతీయ సినిమాగా బాహుబలి -2 రికార్డు సృష్టించడం ఖాయం అంటున్నారు మార్కెట్ విశే్లషకులు.
ఇప్పటికే తమిళనాట రూ.40 కోట్లు, తెలంగాణా, ఆంధ్ర రాష్ట్రాలలో రూ.130 కోట్లు, కర్ణాటకలో రూ.45 కోట్లు, కేరళ రాష్ట్రంలో రూ.13 కోట్లు బిజినెస్ చేసిందని అంచనా. హిందీలో కరణ్ జోహార్ తన ధర్మా ప్రొడక్షన్స్ బేనర్ మీద ఈ చిత్రాన్ని పర్సంటేజ్ పద్ధతిలో రిలీజ్ చేస్తున్నారు. ఈ లెక్కల సంగతి ఎలా ఉన్నా, బాహుబలి-2 ప్రపంచంలోనే భారతీయ సినిమా విప్లవానికి అంకురార్పణ చేయబోతోంది.
* * *
రాజవౌళి తరువాత ఏం చేయబోతున్నాడు? దీనికి జవాబు చాలా సింపుల్. ఒకసారి ప్రశ్నించడం అలవాటయిన వ్యక్తి.. ఉన్నచోట ఎప్పుడూ నిలవడు. అతని సరిహద్దులు పెరుగుతూ పోతుంటాయి. తెలుగు నేలను దాటి, దక్షిణాదిని దాటి, దేశాన్ని దాటి ప్రపంచపు అంచుల వరకూ.. అతను ఏదైనా చేయగలడు. ఏమైనా సాధించగలడు. మూలాల్ని శోధించగలడు. శిఖరాలను ఛేదించగలడు. ఇప్పుడు బాహుబలి పాట.. బహుశా ఆయనకే వర్తిస్తుంది.
భళిభళి భళిరా భళి! సాహోరే బాహుబలి!!
జయహారతి నీకే పట్టాలి. భువనాలన్నీ జై కొట్టాలి.
గగనాలే ఛత్రం పట్టాలి.
భళిభళి భళిరా భళి! సాహోరే రాజవౌళి!!
(రచయత ఫోన్ నెం: 9704683520)

విజువల్ వండర్స్ వెనుక
అవిశ్రాంత కృషి

ఒక చిత్రం అద్భుత దృశ్యకావ్యం కావాలంటే కెమెరా పనితనంతో పాటు విజువల్ ఎఫెక్ట్స్ కూడా తప్పనిసరి. మరీ ముఖ్యంగా అలనాటి రాజుల కాలపు వాతావరణాన్ని సృష్టించాలన్నా, గుర్రాలు, ఏనుగులు, జలపాతాలు, కొండలు, కోనలు, యుద్ధ సన్నివేశాలు, కోటలు, ద్వారాలు... ఇలా ప్రతి అంశం విజువల్ ఎఫెక్ట్స్‌తో ముడిపడి ఉంటుంది. బాహుబలి-2 చిత్రం ఇంత అద్భుతమైన దృశ్యకావ్యంగా ప్రేక్షకుల ప్రశంసలు అందుకోగలుగుతోందంటే అందుకు కారణం ఈ చిత్రం వెనుక విజువల్ ఎఫెక్ట్స్ టీమ్ జరిపిన అవిశ్రాంత కృషే. కమల్ కన్నన్ నేతృత్వంలో దాదాపు వందకు పైగా విఎఫ్‌ఎక్స్ స్టూడియోలలో ఈ చిత్రానికి సంబంధించిన షాట్స్‌కు ఎఫెక్ట్స్ అందించారు. హైదరాబాద్‌లోని మకుట సంస్థ ప్రధాన కేంద్రంగా ఇంకా లండన్, సైబీరియా, ఉజ్బెకిస్తాన్‌లోని టాష్కెంట్ తదితర నగరాలలోని సంస్థలు కూడా విఎఫ్‌ఎక్స్ అందించాయి. మన దేశంలో దాదాపు అన్ని విఎఫ్‌ఎక్స్ సంస్థలూ బాహుబలి-2 కోసం పనిచేశాయని ఆయన చెబుతున్నారు.
బాహుబలి-2 సినిమాలో దాదాపు 2500 విజువల్స్ ఎఫెక్ట్స్ షాట్లు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా 35 విఎఫ్‌ఎక్స్ స్టూడియోలలో వందలాదిమంది టెక్నాలజీ ఆర్టిస్టులు ఈ మహాయజ్ఞంలో పాలుపంచుకున్నారు. వారందరినీ సమన్వయపరుస్తూ అనుకున్న ఫలితాలను సాధించడానికి విఎఫ్‌ఎక్స్ సూపర్‌వైజర్ కమల్ కన్నన్ నిద్రాహారాలు లేకుండా కృషి చేశారు. ఇప్పుడు ఈ చిత్రానికి ప్రపంచమంతటా చక్కని ఆదరణ లభిస్తుండటంతో ఆయనతో పాటు విఎఫ్‌ఎక్స్ టీమ్ అందరూ హాయిగా ఊపిరి పీల్చుకుంటున్నారు.

లేటెస్ట్ లెసన్

బాహుబలి..
ఇండస్ట్రీకి ఓ లెసన్. సినిమా మేకర్స్‌కు ఓ సబ్జెక్టు.
అసలు బాహుబలి అంటే ఏమిటి?
ఒళ్లు గగుర్పొడిచే కోటగోడలు, ఎత్తయిన ప్రాకారాలు, కొండలు, నదులు, ప్రవాహ ఝరులా?
రణం, ప్రణయం, ప్రళయం, ప్రమాణం, సాహసం, ఉద్వేగం, ఆవేదన, ఆలోచన, ఎత్తుకు పైఎత్తులు, ఆధిపత్య పోరులు, అంతర్యుద్ధాలు ఇలా... రీలు రీలుని కుదిపేసే భావోద్వేగాలా?
తెలుగు సినిమా కలలో కూడా ఊహించని విజువల్స్‌ని ఊహించి, దానికి నిర్మాతలని ఒప్పించిన రాజవౌళి మేధో ప్రయాణమా?
ఈ అంశాలేనా చాలాకాలంగా సినిమాలు చూడటం మానేసి సీరియల్స్‌కే అంకితమైన వారినీ థియేటర్స్‌వైపు ప్రయాణం చేయించింది.
***
బాహుబలి చిత్రం ఇంతలా ఆకట్టుకోవడానికి కారణం? బలమైన పాత్రలు, వాటి చర్యలని దర్శకుడు ప్రజెంట్ చేసిన తీరు అంటారు స్క్రీన్‌ప్లే రైటర్లు. శివగామి, కట్టప్ప, అమరేంద్ర బాహుబలి, బాహుబలి, భళ్లాల దేవుడు.. ఇలా ఏ పాత్రకు ఆ పాత్రే మిగతా పాత్రలకు ఛాలెంజ్‌లు వదులుతూ తెరపై తిరుగుతుంటే ఆ విజువల్స్ మనని వెంటాడి, మళ్లీ మళ్లీ చూడమని, రిపీట్ ఆడియన్‌గా మారమని ప్రేరేపించాయని చెప్తారు ఇంకొందరు. వీటిలో నిజముండవచ్చు, లేకపోనూవచ్చు. కానీ బాహుబలి మాత్రం ఇండస్ట్రీకి తప్పకుండా నేర్చుకోవాల్సిన ఓ లెసన్. సినిమా కోసం చాలాకాలంగా ఎదురు చూస్తున్న వాళ్లు ఇప్పటికే చూసేశారు. కాస్త జనం తగ్గాక చూద్దామనుకునేవాళ్లు వారం అటూఇటూగా చూస్తారు. రివ్యూలు చదువుతారు. కాబట్టి సినిమానుంచి ఇండస్ట్రీ జనం నేర్చుకోవాల్సిన పాఠాలు చూద్దాం. ఎందుకంటే ఇండస్ట్రీ వాళ్లకు అర్థమయ్యేది అర్థమయితేనే, మనకి మరిన్ని మంచి లేదా గొప్ప సినిమాలు వస్తాయి.
మీకు గుర్తుందో లేదో... బాహుబలి తొలి భాగం రాకముందు ఓ స్తబ్దత. అయితే సినీ పరిశ్రమలో ప్రవేశించింది. ధియేటర్స్ దగ్గర జనం ఉండటం లేదు. వచ్చిన ప్రతి సినిమా ఫ్లాప్ అయి, వచ్చినంత వేగంగా వెళ్లిపోతోంది. చిన్న సినిమా ఆడటం లేదు. పెద్ద హీరో సినిమా ఆడటం లేదు. ఏ సినిమా, ఏ కథ తీస్తే జనం చూస్తారో అర్థం కాక మేకర్స్ తలలు పట్టుకుంటున్న సంధికాలం అది. ఈ పరిస్థితుల్లో ఆ స్తబ్దతను నిశ్శబ్దంగా ఛేదించి బాహుబలి మళ్లీ పరిశ్రమను కళకళలాడేలా చేసింది. సరైన సినిమా తీస్తే... డబ్బులు కుంభవృష్టిలా కురుస్తాయని నిర్మాతలకు వెన్నుతట్టి మరీ ధైర్యాన్ని ఇచ్చాడు బాహుబలి. ఇది బాహుబలి మొదటి విజయం.
టీవీ మీడియా, వెబ్ మీడియా పెరిగిపోయిన ఈ రోజుల్లో పనిగట్టుకుని ధియేటర్‌కు రావాలంటే... ధియేటర్‌లో మాత్రమే చూడగలిగే విజువల్స్ ఉంటేనే అది సాధ్యం అని అప్పట్లో స్పీల్‌బర్గ్ హాలీవుడ్‌లో నిరూపించినట్లుగానే, ఇక్కడ రాజవౌళి ఆ పని చేశారు. ఫ్యామిలీ డ్రామాలన్నీ ఇక టీవీ తెరకో, వెబ్ సిరీస్‌లు అంటూ వెబ్ మీడియాకో తరలిపోవాల్సిన సమయం వచ్చేసిందని ఆయన సినిమాతో తేల్చి చెప్పేశాడు. ప్రేక్షకుడు డబ్బులు, అంతకుమించి వాల్యూ కలిగిన డబ్బుని మనం తీసిన సినిమా మీద ఇనె్వస్ట్ చేయాలంటే అందుకు తగ్గ కంటెంట్, విజువల్స్ తెరపై ఉండాల్సిందేనని మేకర్స్ అర్థం చేసుకోవాలని ఈ సినిమా చెప్పింది.
అలాగే ఈ తరహా చిత్రాలు అంటే రాజులు, రాజ్యాలు నడిచే పీరియడ్ చిత్రాలకు బాహుబలి ఓ బెంచ్‌మార్క్‌లా మారి ఓ స్టాండర్డ్ ఏర్పరిచింది. రాజుని చూసిన కళ్లతో మొగుడ్ని చూస్తే మొట్టబుద్ధవుతుంది అన్నట్లు... బాహుబలిని చూసిన కళ్లతో మిగతా సినిమాలు ఇంతకన్నా హైఫైగా తీయకపోతే చాలా పూర్‌గా కనబడతాయి. ఇక ఏదో తీసేద్దామనుకునే భారీ చిత్రాలకు ఇది చెల్లుచీటీ పాడింది. ఈ సినిమా రిలీజయ్యాక ఇలాంటి భారీ బడ్జెట్ చిత్రాలు విజయ్, పులి వంటివి డిజాస్టర్ అవటం గమనించవచ్చు. వాస్తవానికి ఇది టెక్నీషియన్స్, డెరెక్టర్స్‌ని భయపెట్టే అంశం. కానీ ఈ స్థాయి పోటీతోనే మరింత టెక్నికల్ స్టాండర్డ్ చిత్రాలు వచ్చే అవకాశం కలుగుతుంది. తెలుగు సినిమా అంతర్జాతీయ స్థాయిని అందుకుని మార్కెట్‌ని పెంచుకోగలుగుతుంది.
ఇక మార్కెట్‌పరంగా ఈ సినిమా ఎల్లలు చెరిపేసింది. బాహుబలి తన బాహువులతో మొత్తం ఇండియా మార్కెట్‌ని చుట్టేయడమే కాక అంతర్జాతీయ మార్కెట్‌లోకి కూడా అడుగుపెట్టి సక్సెస్ అయింది. సరైన సినిమా మన చేతిలో వుంటే ఏ స్థాయిలో దాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేసి, ఎంత డబ్బు సంపాదించవచ్చో ప్రత్యక్షంగా ప్రూవ్ చేసింది. ఇప్పుడు మిగతా హీరోలు కూడా ఇతర రాష్ట్రాల్లో తమ పాగా వేయటానికి ప్రయత్నిస్తున్నారు. తమ మార్కెట్‌ని పెంచే పనిలో పడ్డారు. ఇది మార్కెట్ పరంగా బాహుబలి సాధించిన విజయం.
అంతేకాదు... పబ్లిసిటీ పరంగా ఈ సినిమా కొత్త పుంతలు తొక్కింది. హాలీవుడ్ మ్యాగజైన్స్‌లో సైతం తమ సినిమా రివ్యూలు వచ్చేలా స్ట్రాటజీగా ముందుకు వెళ్లింది. రెగ్యులర్‌గా చేసే పబ్లిసిటీకి దూరంగా జనం ఎప్పుడూ తమ సినిమా గురించే మాట్లాడుకునే క్యూరియాసిటీని క్రియేట్ చేసింది. సోషల్ మీడియాలో పెట్టే విభిన్నమైన పోస్టులద్వారా మీడియాకు యాడ్స్ రూపంలో ఖర్చు పెట్టకుండా అత్యంత ఎక్కువ పబ్లిసిటీ సాధించింది ఈ మధ్యకాలంలో ఈ సినిమానే.
ప్రపంచం రోజురోజుకీ టెక్నికల్‌గా మారిపోతోంది. దాన్ని అందిపుచ్చుకోవడం బాహుబలి టీమ్ ముందు ఉంది. వర్చువల్ రియాలిటీ ద్వారా ప్రేక్షకులకు కొత్త అనుభూతి కలిగించే ప్రయత్నం చేయడం అందులో భాగమే. అసలు వర్చువల్ రియాలిటీ అంటే ఏమిటంటే... సినిమాలో ఉన్న క్యారెక్టర్‌లా ఆ సీన్‌లో వుండి చూస్తున్నట్లు అనుభూతి కలిగించేది వర్చువల్ రియాలిటీ. ఇంకా చెప్పాలంటే మహిష్మతి ప్రపంచంలోకి తీసుకువెళ్లి అక్కడనుంచి చూస్తున్న ఫీలింగ్ కలిగించే ప్రయత్నం చేశారు. ఇలా తాము ఎంత అడ్వాన్స్‌డ్‌గా ఉన్నారో ఎప్పటికప్పుడు ప్రపంచానికి తెలిసే ప్రయత్నం చేశారు. ఇది సినిమాపై మరింత ఆసక్తి కలిగించి, టీమ్‌పై గౌరవం పెంచే స్ట్రాటజీ. ఆ సినిమాకు వచ్చిన హైప్‌ను క్యాష్ చేసుకోవడంలో ఎన్ని మార్గాలు ఉన్నాయో, అన్ని మార్గాలు వాడేసింది ఆ టీమ్. ఆఖరికి ఆ డిజిటల్ కంటెంట్ కూడా బాహుబలి పేరిట పెట్టిన సంస్థే చూసుకుంటోంది తప్ప బయటవారికి ఇవ్వలేదు. ఆన్‌లైన్‌లో బాహుబలి రెప్లికాలు అమ్ముతున్నారు. బాహుబలిలో వాడిన ఆయుధాల నమూనాలు, ప్రభాస్, రానా, తమన్నాల పోస్టర్లు, టీషర్ట్‌లు, కీచెయిన్‌లు ఇలాంటివి అన్నీ ఆన్‌లైన్ స్టోర్‌లో అమ్మకాలు సాగిస్తే ఎలా వుంటుంది అని ప్లాన్ చేస్తున్నారు. దీంతో సినిమాకు పబ్లిసిటీ చేసినట్లు ఉంటుంది. మరోపక్క అదనపు ఆదాయం వస్తుంది.
అలాగే కష్టపడి తయారుచేసిన బాహుబలి పాత్రలు, సినిమాపై నిరంతర ఆదాయం తెచ్చుకునే మార్గాలు అనే్వషించటం కూడా తెలుగు తెరకు కొత్తే. హాలీవుడ్‌లో పెద్ద సినిమాలకు డిజైన్ చేసినట్లుగానే... టీవీ సీరీస్, యానిమేషన్స్, ఇతర రూపకాల్లో ఈ కథని కొనసాగిస్తూ డబ్బు చేసుకునే ఆలోచన తిరుగులేనిది. పెద్ద నిర్మాతలు కేవలం ఒక సినిమాకు డైరెక్టర్. హీరోని ఎంపిక చేయడంతోనే సరిపెట్టకుండా ఇలా... కథ నుంచి జాగ్రత్తలు తీసుకుని తెరకెక్కిస్తే వారికీ కొత్త ఆదాయ మార్గాలు దొరుకుతాయి.
కేవలం సినిమాగానే కాకుండా పుస్తక రూపంలో కూడా అందర్నీ ఆకర్షించడానికి బాహుబలిని ముస్తాబు చేశారు. సినిమా కేవలం రెండు భాగాలుగా వస్తున్నప్పటికీ పుస్తకాన్ని మాత్రం మూడు పార్టులుగా విడుదల చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా మొదటి పుస్తకాన్ని ఇప్పటికే విడుదల చేశారు. నిజానికి ఇప్పుడు విడుదలైన పుస్తకం బాహుబలి పార్ట్-1 కాదు. బాహుబలి ది బిగినెంగ్ కంటే ముందు జరిగిన సంఘటనలకు ఊహారూపమే ఈ పుస్తకం. అంటే... శివగామి ఎలా బలమైన శక్తిగా ఎదిగింది. శివగామి జీవిత విశేషాలన్నీ ఇందులో ఉంటాయన్నమాట. ఈ పుస్తకం తర్వాత రెండో సిరీస్‌గా మనం ఇప్పటికే కంక్లూజన్ సినిమా వస్తుందన్నమాట. ఆనంద్ నీలకంఠన్ ఈ 3 పుస్తకాన్ని రచిస్తున్నాడు. అంటే పుస్తకాల రూపంలోనూ బాహుబలిని లైవ్‌గా ఉంచుతున్నారు. దానినుంచి ఆదాయం వచ్చే ప్లాన్ చేశారు. త్వరలోనే ‘బాహుబలి - బ్యాటిల్ ఆఫ్ ది బోల్డ్’ పేరుతో కామిక్ బుక్ కూడా విడుదల కాబోతోంది. ఇప్పటికే బెంగళూరులో జరిగిన కామిక్ కాన్‌లో ఆ పుస్తకానికి సంబంధించిన కవర్ పేజీతో పాటు, ముందస్తు పేజీలు కొన్ని విడుదల చేశారు. బాహుబలి సినిమాతోనూ, కథతోనూ సంబంధం లేకుండా... బాహుబలి, భల్లాలదేవ పెద్దవాళ్లుగా ఎదిగే క్రమంలో జరిగే సంఘటనలతో ఈ కామిక్ పుస్తకాల్ని తీర్చిదిద్దినట్లు తెలిసింది. ‘బాహుబలి’ చిత్ర నిర్మాణ సంస్థ ఆర్కా మీడియా వర్క్స్‌తో కలిసి గ్రాఫిక్ ఇండియా సంస్థ ఈ పుస్తకాన్ని రూపొందిస్తోంది. ఇదో కొత్త ఆలోచన ఇండియన్ సినిమా వరకూ.

- సూర్యప్రకాష్ జోశ్యుల
9704683520

భారీ ఏర్పాట్లు

బాహుబలి-2 సరికొత్త రికార్డులను నెలకొల్పుతూ భారతీయ సినీ చరిత్రలోనే కొత్త ట్రెండ్స్ సృష్టిస్తోంది.
* ప్రపంచవ్యాప్తంగా 9000 స్క్రీన్స్‌లో విడుదలైన తొలి భారతీయ చిత్రం ఇది.
* దేశంలోనే 6500 స్క్రీన్స్‌లో విడుదలైన తొలి చిత్రం. 2015లో బాహుబలి-1 చిత్రం 4000 స్క్రీన్స్‌లో విడుదలయింది.
* ఒరిజినల్ ఐమాక్స్ ఫార్మాట్‌లో విడుదలయిన మూడవ భారతీయ చిత్రం. అంతకుముందు అమీర్‌ఖాన్ ‘్ధమ్-3’, హృతిక్ రోషన్ ‘బ్యాంగ్ బ్యాంగ్’ చిత్రాలు మాత్రమే ఐమాక్స్ ఫార్మాట్‌లో విడుదలయ్యాయి.
* 4కె రిజల్యూషన్‌తో విడుదలైన తొలి భారతీయ చిత్రం బాహుబలి-2. ఇందుకోసం తెలుగు రాష్ట్రాల్లోనే దాదాపు 200 సినిమా ధియేటర్లలో కేవలం బాహుబలి-2 కోసం 4కె ప్రొజెక్టర్లను ఏర్పాటుచేశారు. సాధారణంగా తెలుగు చిత్రాలను 2కె ప్రొజెక్టర్ల ద్వారానే ప్రదర్శిస్తున్నారు.

భారీ వసూళ్ల
భారతీయ సినిమాలు
భారతీయ సినీ చరిత్రలో ఇంతవరకూ ఉన్న భారీ రికార్డులను బాహుబలి -2 బద్దలు కొడుతుందని మార్కెట్ వర్గాల విశే్లషణ. ఇంతవరకూ బాలీవుడ్ చిత్రాలకు మాత్రమే పరిమితమైన ఈ రికార్డులను బాహుబలి-1 కొంతవరకూ చేరుకుంది. అయితే, బాహుబలి - ద కన్‌క్లూజన్ ఇప్పుడు వాటన్నింటినీ తిరగ రాయబోతోంది. ఈ సినిమా దాదాపు వెయ్యికోట్ల రూపాయల కలెక్షన్లు సాధిస్తుందని మార్కెట్ వర్గాల అంచనా. గత కొద్ది సంవత్సరాలుగా దేశంలో రూ.500 కోట్లకు మించి భారీ కలెక్షన్లు సాధించిన టాప్-5 చిత్రాల వివరాలు ఇవి:

1. పికె అమీర్‌ఖాన్ రూ.792 కోట్లు
2. దంగల్ అమీర్‌ఖాన్ రూ.730 కోట్లు
3. బాహుబలి-1 రాజవౌళి రూ.650 కోట్లు
4. భజరంగి భాయిజాన్ సల్మాన్‌ఖాన్ రూ.626 కోట్లు
5. ధూమ్-3 అమీర్‌ఖాన్ రూ.585 కోట్లు

- సతీష్‌కుమార్