ఈ వారం స్పెషల్

అసాధ్యుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘ఎవర్నో లక్ష్యంగా చేసుకుని
పనిచేయడం నా సిద్ధాంతం కాదు. ఇతరుల వేధింపులనుంచి ఇప్పటివరకు నన్ను నేను రక్షించుకున్నాను. నా వాదన తీవ్రంగా ఉంటుంది. పద్ధతి ప్రకారం ఉంటుంది. ప్రత్యర్థుల్ని
అచేతనంగా మార్చేంత
పదునుగానూ ఉంటుంది’’

- సుబ్రహ్మణ్యస్వామి

భిన్న అన్వయింపులతో కూడిన చట్టాన్ని ఔపోసన పట్టడం మామూలు వ్యవహారం కాదు. ఏ కేసునైనా అయితే అనుకూలంగా, లేదా ప్రతికూలంగా బలమైన సెక్షన్లను ఉటంకిస్తూ గత తీర్పులను సోదాహరణగా వివరిస్తూ తన వాదనకు బలం పెంచుకోవడం మాటలు కాదు. న్యాయశాస్త్రంలో ఆరితేరి పదజాల ప్రయోగంలో నిగ్గుదేలిన న్యాయకోవిదులకు మాత్రమే ఇది సాధ్యం. స్వతంత్ర భారత చరిత్రలో రాజ్యాంగ ప్రవీణులు, న్యాయశాస్త్ర ఉద్దండులు చట్టాన్ని గుప్పిట పట్టిన మేధావులకు కొదవలేదు. వీరందరిలోనూ తనదైన ప్రత్యేకతతో, తనకే సాధ్యమైన వాదనా పటిమతో తనకు తానే అనిపించుకునే రీతిలో రాణించడమే కాకుండా... కేసు ఏదైనా తనదే అందె వేసిన చేయిగా ముద్ర వేసుకున్న ఘనత సుబ్రహ్మణ్యస్వామిది. ఎంతటి జటిలమైన కేసునైనా ఆయన వాదించగలడు, ఛేదించనూగలడు. తాను దాఖలు చేసిన కేసులోనే ప్రతికూలంగానూ వాదించగలడు. తాజాగా తమిళనాడులో జయ ఆస్తుల కేసుకు ఆజ్యం పోసి అంతిమంగా ఆమెను జైలుకు పంపిన ఘనత ఆయనదే. అంతేకాదు, జయ గతించిన అనంతరం అదే కేసులో నిందితురాలైన శశికళకు అనుకూలంగా మాట్లాడిన విభిన్న వ్యక్తిత్వం ఆయనదే.

సుబ్రహ్మణ్యస్వామి... ఈ పేరంటే ఎంత మక్కువో... ఆయన కేసు వేస్తే ఇటు మిత్రుల్లోనూ, అటు శత్రువుల్లోనూ గుండె గుభిల్లే. అందరిలో ఒకడిగా, అందరికీ ఆప్తుడిగా సాగిన సుబ్రహ్మణ్యస్వామి దశాబ్దాల రాజకీయ జీవితం మెరుపులు, ఉరుములు, వివాదాలు, విస్మయకర పరిణామాలమయమే. ఏ కోణంలో చూసినా ఆయన ఆలోచనలు అంతుపట్టని పజిల్ లాంటివే. కేసు పట్టుకుంటే అంతుచూడటమే. కేసుకు ఆస్కారం ఉంటే వదిలిపెట్టడు. ఇందుకు మిత్రులూ బలికావొచ్చు, శత్రువులూ గంగవెర్రులెత్తిపోవచ్చు. అయినా గీతలో కృష్ణుడు చెప్పినట్లుగా ఫలితాన్ని చూడకు, బాధ్యతను నెరవేర్చు అన్నదే సుబ్రహ్మణ్యస్వామి ఏకైక లక్ష్యం. ఇందుకోసం మిత్రుల్ని శత్రువులను చేసుకుంటారు, శత్రువులే వారంతటవారుగా మిత్రులు అవుతారు. ఫలితాన్ని ఆశించని అప్రతిహత న్యాయపోరాటంలో సుబ్రహ్మణ్యస్వామిని మించిన వ్యక్తి లేడంటే అతిశయోక్తి ఏమీ కాదు. ఒకరి జీవితంలో ఎన్ని కోణాలుంటాయో, ఎన్ని విలక్షణాలుంటాయో, ఎన్ని సందిగ్ధతలు అంతర్లీనంగా కనిపిస్తాయో, ఎన్ని యుక్తులు, ఎత్తులు పైఎత్తులు ఆయా పరిస్థితులను బట్టి ఉంటాయో... అన్నీ సుబ్రహ్మణ్యస్వామి రాజకీయ జీవితంలో, న్యాయవాద జీవితంలో అడుగడుగునా కనిపిస్తాయి. ఇటీవలి భారత రాజకీయాలకు సంబంధించిన ప్రతి కీలక పరిణామంలోనూ సుబ్రహ్మణ్యస్వామి ముద్ర స్పష్టం. ఎప్పుడు తెరపైకి వస్తారో, ఎప్పుడు కనుమరుగవుతారో ఎవరికీ తెలియని విచిత్ర జీవితం ఆయనది. లక్ష్యాన్ని సాధించాలంటే తన ఉనికిని చాటుకోవాలంటే అవకాశాల కోసం ఎదురుచూడాలి. అలా అందివచ్చిన అవకాశాలను అందిపుచ్చుకోవడమే కాకుండా దాని అంతు చూసే నైజం ఆయనది. 2జి స్పెక్ట్రమ్ కేసులో సుదీర్ఘ రాజకీయ ‘అజ్ఞాతం’ నుంచి బయటకు వచ్చిన స్వామి తాజాగా అవినీతి అంతు చూసే యోధుడుగా మారారు. అప్పటినుంచి నేటి జయ-శశికళ కేసు వరకూ స్వామివన్నీ అవినీతి నిర్మూలనపై సంధించిన బ్రహ్మాస్త్రాల్లాంటి కేసులే. ఏ కేసునైనా పరిష్కరించడంలో ఎంతగా ఆసక్తి చూపిస్తారో వివాదాన్ని సృష్టించడంలోనూ అంతే క్రియాశీలత స్వామిలో అడుగడుగునా కనిపిస్తుంది. ఆయన వేసిన కేసులే ఇందుకు నిదర్శనం. ఎదుటి వ్యక్తి ఎంత గొప్పవాడు, అతని రాజకీయ స్థాయి ఏమిటన్నదానితో నిమిత్తం లేకుండా... అతడి తప్పు ఉందంటే స్వామి వెంటాడతాడు. అంతిమ ఫలితం వచ్చేవరకూ వెంటాడుతూనే ఉంటాడు. ఇందుకు దశాబ్దాలుగా ఆయన వేసిన కేసులు చేసిన వాదనలు, సాధించిన ఫలితాలే నిదర్శనం.
అవినీతి, దగా కేసులకు సంబంధించి సుబ్రహ్మణ్యస్వామి కేసు వేస్తే ప్రత్యర్థుల్లో దడదడే. ప్రధానమంత్రులైనా, ముఖ్యమంత్రులైనా, మంత్రులైనా, చివరకు ఉన్నతస్థాయి అధికారులైనా సరే... ఆయన కంట్లో పడితే అంతే. అంతిమంగా జైలుపాలైనా కావాలి, అభాసుపాలైనా కావాల్సిందే. ఇంతగా స్వామితో విసిగి వేసారిన ఆయన పట్ల ఇటు ప్రభుత్వంలోగాని బయటగాని ఎలాంటి వ్యతిరేకత ఉండదు. అంటే ఆయన కేసులతో గంగవెర్రులెత్తిన వారెవరూ కూడా తిరిగి ఆయనపై కేసువేసే సాహసం చేయలేదు. అంతవరకూ ఎందుకు? ఆయనమీద ఏ రకమైన ఆరోపణ ‘బాధితులు’ చేసిన దాఖలాలు లేవు.
1970 దశకంలో రాజకీయాల్లో ప్రవేశించిన స్వామి తొలి దశలోనే సంచలనానికి తెరలేపారు. అప్పట్లో తిరుగులేని అధినేతగా వున్న ఇందిరాగాంధీ విధానాలనే సవాలు చేశారు. ఇందిర విధానాలన్నీ నాటి సోవియట్ యూనియన్ ప్రభావంతో కూడుకున్నవేనని, దేశాభివృద్ధికి ఆమె అనుసరించిన పద్ధతులేవీ సరిపడవని వాదించారు. అక్కడితో ఆగకుండా సొంతంగానే పంచవర్ష ప్రణాళికలకు ప్రత్యామ్నాయంగా స్వదేశీ ప్రణాళికను రూపొందించారు. భారతదేశం అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలంటే ఎవరినో అనుకరించడం మంచిది కాదని, దేశ అవసరాలను దృష్టిలో పెట్టుకుని స్వావలంబనతో ముందుకు వెళితేనే సత్ఫలితాలు వస్తాయని స్పష్టం చేశారు. అంతేకాదు, స్వదేశీ ప్రణాళిక ద్వారా దేశ అవసరాలను తీర్చవచ్చునని, పూర్తిస్థాయి ఉపాధి కల్పన, స్వావలంబనతో ఆర్థికాభివృద్ధి సాధించవచ్చునన్నారు. అనవసరంగా రక్షణ వ్యయాన్ని పెంచేసుకుండా అభివృద్ధిలో భాగంగానే రక్షణ కేటాయింపులను కొనసాగిస్తే వృద్ధికీ ఊతం లభిస్తుందన్నది నాడు స్వామి ప్రవచించిన స్వదేశీ ప్రణాళిక లక్ష్యం. అంతేకాదు, భారతదేశ ఆధునిక పారిశ్రామికీకరణ, శాస్త్ర ప్రగతి ఏవిధంగా ఉండాలి, అవి దేశానికి ఏవిధంగా ఉపయోగపడాలన్న దానిపైనా స్వామి చేసిన సూచనలు అందర్నీ ఆకర్షించాయి. అలాగే అణు టెక్నాలజీని పూర్తిస్థాయిలో ఉపయోగించుకోవడంలోనూ, తద్వారా ఇతర దేశాలకు పోటీగా స్వావలంబనతో భారత్ రాణించడానికి స్వామి ఇతోధికంగా విలువైన సలహాలే ఇచ్చారనడం అతిశయోక్తి ఏమీ కాదు. ఆయన స్వదేశీ ప్రణాళిక అన్నివిధాలుగా దేశీయతకు అద్దం పట్టేదిగా భారతీయతను మరింత పరిపుష్టం చేసేదిగా ఉందని చెప్పడానికి పారిశ్రామికాభివృద్ధి మొదలుకొని వ్యవసాయ పురోగతి వరకు, అణు టెక్నాలజీ మొదలుకొని అభివృద్ధి దోహద విధానాల వరకు ఆయన చేసిన సూచనలే నిదర్శనం. ఆ విధానానికి ఎంతగా ప్రచారం లభించిందంటే నాటి ప్రధాని ఇందిరాగాంధే దాన్ని తిరస్కరించాల్సి వచ్చింది.
1970 మార్చి 4న బడ్జెట్‌పై చర్చ సందర్భంగా మాట్లాడిన ఇందిరాగాంధీ తీవ్ర స్వరంతోనే తన వ్యతిరేకతను చాటారు. స్వామి ఆలోచనలు అత్యంత ప్రమాదకరమైనవే కాకుండా ఎంతమాత్రం ఆచరణయోగ్యం కావని తేల్చిచెప్పాల్సిన పరిస్థితి ఇందిరాగాంధీకి ఏర్పడింది. అయితే అప్పట్లో స్వామి ఆలోచనలకు పెద్దగా రాజకీయ గుర్తింపు లభించకపోయినా దాదాపు 21 సంవత్సరాల తర్వాత వాటికి ఆచరణయోగ్యత లభించింది. 1991లో అప్పటి ప్రధాని చంద్రశేఖర్ ప్రభుత్వంలో కేబినెట్ మంత్రిగా పనిచేసిన సుబ్రహ్మణ్యస్వామి తన సంస్కరణల విధానానికి నాందీ ప్రస్తావన చేశారు. అనంతరం ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన పి.వి.నరసింహారావు వాటిని త్రికరణశుద్ధిగా అమలుచేశారు. అంటే స్వామి ఏ పనిచేసినా దానికో స్పష్టత, నిర్దుష్టత, అంతిమంగా జాతీయత ఉంటుందని చెప్పడానికి ఇంతకుమించిన నిదర్శనం ఇంకొకటి అవసరం లేదు. సుబ్రహ్మణ్యస్వామి విధానాలను అమలుచేయడమే కాకుండా ఆయనకు ప్రపంచ వాణిజ్య సంస్థ వ్యవహారాలపై వేసిన కమిషన్‌కు చైర్మన్‌గా కూడా పి.వి.నరసింహారావు నియమించారు. అంతేకాదు, ఈ పదవికి కేబినెట్ హోదా కూడా కల్పించారు.
స్వామి అంటే రాజకీయ నాయకులకు, వ్యాపారవేత్తలకు, చివరకు అధికారులకు చచ్చే భయం. ఎందుకంటే ఆయన ఎలాంటి ఆరోపణలైనా చేయగలుగుతారు. ఎదుటివారి స్థాయితో నిమిత్తం లేకుండా బురదనూ చల్లగలుగుతారు. అందుకే చాలామంది స్వామి చేసిన ఆరోపణలను తుడిచేసుకుంటారే తప్ప పెద్దగా పట్టించుకోరు. ఇందుకు ప్రధాన కారణం తమ గుట్టుమట్లను ఎక్కడ బట్టబయలు చేస్తారోనన్న భయమే. స్వామికి వ్యాజ్యాలు సృష్టించడంలో ఎంతో ఆసక్తి. అంతేకాదు ఎవరి గురించైనా ఎలాంటి సమాచారాన్నైనా ఆయన తవ్వి తీయగలుగుతారు. ఇందుకు నాటి కర్నాటక ముఖ్యమంత్రి రామకృష్ణ హెగ్డే నుంచి దివంగత జయలలిత వరకు ఎన్నో నిదర్శనాలున్నాయి. 1990లో నాటి వి.పి.సింగ్ ప్రభుత్వాన్ని కుప్పకూల్చడం వెనుక, పదమూడు నెలలు తిరక్కుండానే 1998లో అప్పటి ఎన్‌డిఏ ప్రభుత్వాన్ని కూలదోయడం వెనుక స్వామి కీలక పాత్రే నిర్వహించారు. అందుకే ‘స్వామి ఎవర్నీ క్షమించరు, దేన్నీ మరిచిపోరు’ అన్న నానుడి తెరపైకి వచ్చింది.
దీర్ఘకాలం పాటు జనతాపార్టీకి సారథ్యం వహిస్తూ వచ్చిన సుబ్రహ్మణ్యస్వామి అనంతరం బిజెపిలో చేరారు. జనతాదళ్ వ్యవస్థాపకుల్లో ఒకరు. నిజానికి స్వామిని క్రియాశీలక రాజకీయాల్లో తీసుకొచ్చింది 1997 నాటి ఎమర్జెన్సీ పరిస్థితులే. ఎమర్జెన్సీని వ్యతిరేకిస్తూ ఆయన రహస్య ఉద్యమం సాగించారు. ఇందుకోసం అమెరికా, కెనడా, యుకెల్లో భారతీయులను సమీకరించారు. ఆయన వ్యవస్థ ఎంత పటిష్టంగా పనిచేసిందంటే 1976 ఆగస్టు 10న ఢిల్లీలో దిగేవరకు మూడోకంటికి తెలీదు. స్వామి కనిపిస్తే అరెస్టు చేయాలన్న వారెంట్లు ఉన్నా ఆయన ఎవరికీ చిక్కలేదు. ఎంత అకస్మాత్తుగా ఢిల్లీలో దిగారో, తన పని ముగించుకుని అంతే వేగంతో ఢిల్లీ వెళ్లిపోయారు. ఈ పరిణామానికి అప్పటి ప్రధాని ఇందిర, మంత్రివర్గ సహచరులు విస్తుపోయారు. ఆ సంఘటనకు అంతర్జాతీయంగా ప్రచారం వచ్చింది. అంతేకాదు, భారతదేశంలో ఎమర్జెన్సీ ఓ ప్రహసనమేనన్న వాదన మొదలైంది. అది జరిగిన కొన్ని నెలలకే ఎమర్జెన్సీని ఎత్తేసి ఇందిరాగాంధీ ఎన్నికలకు వెళ్లడం, ఓడిపోవడం జరిగిపోయింది.
ఎవర్నీ వదలని స్వామి ఏకంగా అర్‌బిఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్‌పైనా దృష్టిపెట్టారు. భారత ఆర్థిక వ్యవస్థకు రాజన్ చేటుచేస్తున్నారని, ఆయనకు మతిస్థిమితం లేదని తక్షణమే తొలగించాలని మోదీ ప్రభుత్వానికి ఏకంగా లేఖ రాసి అందరి దృష్టినీ ఆకర్షించారు.
అన్యభాషలు నేర్చుకోవడంలో స్వామిది అందెవేసిన చేయి. మిగతా భాషల మాట ఎలా ఉన్నా చైనా భాష చాలా కఠినమైనది. ఓ పట్టాన ఎవరికీ ఒంటబట్టేది కాదు. హార్వర్డ్ యూనివర్శిటీలో చైనా వ్యవహారాలపై నిపుణుడిగా కొనసాగిన స్వామికి ఆ దేశ భాష నేర్చుకోవడమన్నది అవసరంగా మారింది. అంతేకాదు, చైనా గురించి మాట్లాడటం కాదు, ఆ భాష నేర్చుకో అంటూ ఎవరో ఆయనకు సవాలు విసిరారు. అందుకు ఏడాది గడువు పెట్టారు. అయితే కేవలం మూడు నెలల్లోనే ఇంత కఠినమైన భాషను స్వామి నేర్చేసుకున్నారు.
ఇంతగా దేశ రాజకీయాలను, రాజకీయ నాయకత్వాన్ని తమదైన రీతిలో నిలదీస్తూ వచ్చిన సుబ్రహ్మణ్యస్వామికి పదవీకాంక్ష లేదా అంటే ఉందనే చెప్పాలి. ఎందుకంటే ప్రధానిమంత్రి కావాలన్నది తన ఆశయమని, ఒక దశలో ఇది తనకు అందివచ్చిందని కూడా చెప్పుకొచ్చారు. అప్పుడు దక్కకపోయినా తన జాతకం ప్రకారం ఈ పదవి తనకు ఎప్పుడో ఒకప్పుడు ఖాయమని జ్యోతిష్యులే అంటున్నారని ఆయన వ్యాఖ్యానించారు. అంతిమంగా తనపై వచ్చిన వివాదాల మాట ఎలావున్నా, అవినీతిని ఎండగట్టడం సాధ్యమైనంత మేర రాజకీయాలను ప్రక్షాళన చేయడం దేశ ప్రజలకు శాయశక్తులా మంచి జరిగేలా చేయడమే తన ఆశయమంటున్న స్వామి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఈ తరహా రాజకీయ నాయకులు భారతదేశంలోనే కాదు, ఏ దేశంలోనైనా అరుదుగా వుంటారు.

ఇలా వచ్చి...
అలా వెళ్లారు!

ఎమర్జెన్సీ కాలంనాటి డేగ నిఘాను సైతం తప్పించుకుని అనుకున్నది సాధించిన ఘనత సుబ్రహ్మణ్యస్వామిది. ఎమర్జెన్సీలో ప్రతిపక్ష నాయకులందరిపైనా అప్పటి ఇందిర ప్రభుత్వం గట్టి నిఘా పెట్టింది. అరెస్టుల పరంపర కొనసాగించింది. అలాంటి సమయంలో ఎత్తుకు పైఎత్తు వేసిన స్వామి అనుకున్నది సాధించి అంతర్థానమయ్యారు. 1975 - 1977 వరకు దేశంలో 21 నెలల పాటు ఎమర్జెన్సీ అమలులో వుంది. పార్లమెంటు సమావేశమైంది. ఆ సమావేశానికి స్వామి కచ్చితంగా హాజరుకావాల్సిన పరిస్థితి. లేనిపక్షంలో రాజ్యాంగంలోని 101(4) అధికరణ కింద సభ్యత్వం కోల్పోతారు. అప్పటికే అరెస్టు వారెంటు జారీ అయింది. హార్వర్డ్ యూనివర్శిటీలో విజిటింగ్ ప్రొఫెసర్‌గా వున్న స్వామి భారత పార్లమెంటులో ఆకస్మికంగా కనిపించారు. విమానాశ్రయం నుంచి పార్లమెంటుకు స్వామి ఎలా రాగలిగారన్నది ఆసక్తిని కలిగించేదే. తనను తానే నమ్మలేనంతగా అచ్చుగుద్దినట్లుగా ఎవరూ గుర్తుపట్టలేనంతగా ఓ సర్దార్జీలా స్వామి మారిపోయారు. సునాయాసంగా పార్లమెంటుకు చేరుకుని స్పీకర్‌కు కనిపించి వెనువెంటనే సభనుంచి వెళ్లిపోయారు. జెఎస్ వ్యాస్, ఇతరులు పార్లమెంటు బయట ఓ కారులో స్వామి కోసం ఎదురుచూస్తున్నారు. కారులో ఎక్కిన స్వామిని పాలెం విమానాశ్రయానికి తరలించారు. అక్కడినుంచి ఆయన అమెరికా వెళ్లిపోయారు.

తడబడి... తాళి కట్టబోయ...
దేశ రాజకీయ నాయకత్వాన్ని, అధికారులను ముప్పుతిప్పలు పెట్టిన స్వామి తెలివిని అంచనా వేయలేం. ఆయనది తప్పటడుగులకు ఆస్కారం లేని ఆలోచనా విధానం. కానీ ఎంతటి వాడైనా పొరపడక తప్పదు. తడబడక తప్పదు. అందుకు ఉదాహరణ - పెళ్లికొడుకుకు అందించాల్సిన మంగళసూత్రాన్ని పెళ్లికూతురి మెడలో తానే కట్టేందుకు స్వామి ప్రయత్నించిన సంఘటన వ్యంగోక్తులకు దారితీసింది. ఈ సంఘటన తమిళనాడులోని ఓ వివాహ కార్యక్రమంలో జరిగింది. మంగళసూత్రాన్ని ఇచ్చి పెళ్లికొడుకును ఆశీర్వదించండి అంటూ అందిస్తే ఏకంగా ఆ తాళిని పెళ్లికూతురు మెడలో కట్టేందుకు ప్రయత్నించడం వివాదాన్ని రేపింది. సమయానికి ఓ అధికారి అప్రమత్తం చేయబట్టి సరిపోయింది. లేకుంటే పెద్ద పొరపాటే జరిగిపోయి వుండేది.

ఇవి మామూలు కేసులా?!

సుబ్రహ్మణ్యస్వామి ఏ కేసు వేసినా అది సంచలనమే. ఆయన దాఖలు చేసిన కేసులన్నీ కూడా అవినీతి, ఆర్థిక అవకతవకలు, అధికార దుర్వినియోగానికి సంబంధించినవే. సంక్షిప్తంగా కొన్ని ముఖ్య కేసులను పరిశీలిస్తే స్వామి పట్టు ఏమిటో, తుదివరకు పోరాడగలిగే ఆయన సామర్థ్యం ఏమిటో స్పష్టమవుతుంది. కేవలం కేసు వేసి వదిలివేయకుండా కీలకమైన ఆధారాలను సాక్ష్యాలను సమీకరించి సమరం చేయడం, చివరి వరకూ అదే పట్టుదలతో పోరాడటం ఆయన నైజం.

1980లో స్వామి వేసిన కేసుకు నాటి కర్నాటక ముఖ్యమంత్రి రామకృష్ణ హెగ్డే రాజీనామా చేయాల్సి వచ్చింది. అది వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకుల ఫోన్లను ట్యాప్ చేయాలని అప్పటి ఇంటలిజెన్స్ చీఫ్ ఆదేశించడానికి సంబంధించింది. అందుకు సంబంధించిన లేఖను స్వామి విడుదల చేయడంతో డొంకంతా కదిలింది.

ఆశ్రీత పక్షపాతంతో నాటి టెలికాం మంత్రి రాజా తీసుకున్న నిర్ణయాలు ఖజానాకు వందల కోట్ల నష్టాన్ని తెచ్చిపెట్టిన విషయం వెలుగులోకి వచ్చింది స్వామి ద్వారానే. 2జి స్పెక్ట్రమ్ కేటాయింపులకు సంబంధించిన అంశాల కూపీ లాగారు. నాటి ప్రధాని మన్మోహన్‌సింగ్‌కు వరుస లేఖలు రాస్తూ ఈ కుంభకోణాన్ని బట్టబయలు చేశారు. సుప్రీంకోర్టులో కేసు కూడా వేశారు. దాంతో సిబిఐ దర్యాప్తుకు ఆదేశించాల్సిన పరిస్థితి తలెత్తింది. దీని ప్రభావం నాటి యుపిఏను ఎంతగా కుదిపేసిందో తెలిసిందే. దీనివల్లే కేంద్ర మంత్రి పదవికి ఎ.రాజా రాజీనామా చేయడం, డిఎంకె ఎంపిగా ఉన్న కనిమొళి జైలుపాలు కావడం తెలిసిందే. ఇది దేశంలో బట్టబయలైన అతిపెద్ద కుంభకోణం.

1996లో జయలలిత అక్రమాస్తులకు సంబంధించిన కేసు దాఖలు చేశారు. ఆమె ఆదాయానికి మించిన ఆస్తులను సమకూర్చుకుందంటూ ఆధారాలతో వెల్లడించారు. 1991-96 మధ్యకాలంలో తమిళనాడు ముఖ్యమంత్రిగా జయ అపారంగా ఆర్జించారని బయటపెట్టారు. ఈ కేసులోనే జయలలితను 2014 సెప్టెంబర్ 27న దోషిగా నిర్ధారించారు. ఆమె ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడంతో పాటు జైలుశిక్షను కూడా ఆమె అనుభవించారు. ఈ కేసు ఆమె మరణానంతరం కూడా వెంటాడింది. ట్రయల్‌కోర్టు ఇచ్చిన తీర్పును కర్నాటక హైకోర్టు కొట్టివేసినప్పటికీ సుప్రీంకోర్టు దాన్ని ధ్రువీకరించడంతో ఆమె సహచరిగా తెరపైకి వచ్చిన శశికళ కూడా జైలుపాలయ్యారు.

సోనియాగాంధీ ఇటలీ మూలాలను ప్రశ్నించిన తొలి రాజకీయ నాయకుడు సుబ్రహ్మణ్యస్వామి. రాజీవ్‌గాంధీ హత్యానంతరం ఆమె దేశ రాజకీయాల్లోకి ప్రవేశించడాన్ని ఆయన సవాలుచేశారు. ఆ వ్యవహారం కూడా అప్పట్లో సంచలనం రేపింది. 2014లో మూడు విదేశీ బ్యాంకుల్లో సోనియాగాంధీ రహస్య ఖాతాలు ఉన్నాయని స్వామి ఆరోపించారు. వాటికన్ బ్యాంకులోనూ, సరసిన్ బ్యాంకులోనూ, అలాగే జ్యూరిచ్‌లోని పికెట్ బ్యాంకులో కూడా సోనియాకు రహస్య ఖాతాలున్నాయని బయటపెట్టారు. తాజాగా నేషనల్ హెరాల్డ్ వ్యవహారాన్ని కూడా తెరపైకి తెచ్చింది సుబ్రహ్మణ్యస్వామే. ఇప్పటికీ కాంగ్రెస్‌కు ఈ కేసు గుదిబండగానే మారింది.

1989-91 మధ్యకాలంలో అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి కరుణానిధిపై కూడా స్వామి కేసుల చిట్టా తీశారు. అప్పటినుంచి కరుణానిధికి ఆయనకు మధ్య తీవ్రస్థాయిలోనే సంఘర్షణ మొదలైంది. 1997లో అవినీతి ఆరోపణల చిట్టా విప్పారు. అప్పట్లో కరుణానిధి ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన సేతు సముద్రం షిప్పింగ్ కెనాల్ ప్రాజెక్టు వ్యవహారం వివాదాస్పదంగా మారింది. ఇది కోర్టుదాకా వెళ్లింది. ఈ ప్రాజెక్టును స్వామి తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ ప్రాజెక్టు వల్ల పురాణాల నాటి రామసేతుకే నష్టం జరుగుతుందని కోర్టులో వాదించారు. చివరకు ప్రభుత్వం ఈ ప్రాజెక్టును ఉపసంహరించుకుంది.

1980లో హషీంపురా ఊచకోత ఘటనకు సంబంధించి కాంగ్రెస్ నాయకుడు పి.చిదంబరాన్ని కూడా ముప్పుతిప్పలు పెట్టారు. దశాబ్దాలు దాటినా ఇప్పటికీ కూడా వీరిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితే. 1990 దశకంలో ఫెరా ఉల్లంఘనలకు సంబంధించి స్వామిని అరెస్టు చేయించేందుకు చిదంబరం విశ్వప్రయత్నం చేశారు. కానీ అది సాధ్యం కాలేదు. 2012లో కూడా వీరిమధ్య తీవ్రస్థాయిలోనే ఎయిర్‌సెల్ వ్యవహారం రాజకీయ సంఘర్షణ రేపింది. తన కుమారుడు లబ్ధి పొందేలా ఎయిర్‌సెల్‌ను మలేషియాకు చెందిన మాక్సి సంస్థకు విక్రయించే విషయంలో చిదంబరం జాప్యం చేశారని స్వామి ఆరోపించారు.

మానస సరోవర యాత్రను హిందువులు చేపట్టేలా చేసిన ఘనత సుబ్రహ్మణ్య స్వామిదే. ఆయన దీన్నో సవాలుగా తీసుకున్నారు. 1981లో అప్పటి చైనా అధినేత డెంగ్ జియావో పింగ్‌తో సమావేశమై దీన్ని సాధించారు. ఆనాటి ఆ కథనాలు మీడియాలో విస్తృతంగా ప్రసారమయ్యాయి. అనంతర కాలంలో ఆయన మానస సరోవర్‌ను స్వయంగా సందర్శించారు.

- బి. రాజేశ్వర ప్రసాద్