అనంతపురం

డెంగ్యూ కాటు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం, సెప్టెంబర్ 23 : జిల్లాలో డెంగ్యూ, విష జ్వరాలు మరణ మృదంగం కొనసాగుతూనే ఉంది. వివిధ వ్యాధుల బారిన పడి ఆసుపత్రులో మృతి చెందిన చిన్నారుల సంఖ్య శుక్రవారానికి ఐదుకు చేరగా, మరో మహిళ కర్నూలులో మృతి చెందింది. వీరిలో ప్రభుత్వ లెక్కల ప్రకారం ముగ్గురు డెంగ్యూ బారిన పడి తుది శ్వాస వదిలారు. ఈనెల 15న అనంతపురం నగరంలోని వినాయక్‌నగర్‌కు చెందిన ఇద్దరు చిన్నారులు, 22న ధర్మవరానికి చెందిన శ్రీజ(14) బెంగళూరులో చికిత్స పొందుతూ మృతి చెందారు. మిగతా ఇద్దరిలో ఒకరు హిందూపురం ఆస్పత్రిలో, అనంతపురం ప్రభుత్వ సర్వజనాస్పత్రిలోని సిఐసియులో విషజ్వరంతో చికిత్స పొందుతూ మృతి చెందారు. నార్పలకు చెందిన సాలమ్మ (55) మృతి చెందింది. కాగా చిన్నారులు నిలువునా రాలిపోతుంటే పిల్లల తల్లిదండ్రులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ముఖ్యంగా పారిశుద్ధ లోపం, డ్రైనేజీలు అపరిశుభ్రంగా ఉండటం, చెత్తాచెదారంతో నిండిపోయి మురుగు నీరు ముందుకు సాగక పోవడం, వర్షం నీరు గుంతల్లో ఎక్కడబడితే అక్కడ నిల్వ ఉండిపోవడం వంటి అనేక కారణాలతో జ్వరాలు ప్రబలుతున్నాయి. పాలకులు, ప్రజాప్రతినిధులు, వైద్య శాఖాధికారులు, సిబ్బంది బాధ్యతారాహిత్యం, చిత్తశుద్ధి లోపం, నిర్లక్ష్య ధోరణితో విషజ్వరాలు విరుచుకు పడుతున్నాయి. పిహెచ్‌సిలు మొదలు జిల్లాకేంద్రంలోని సర్వజనాస్పత్రి వరకూ ఓపిలు, వార్డులు విష జ్వర బాధితులతో కిటకిటలాడుతున్నాయి. శుక్రవారానికి అనంతపురం ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో 17 డెంగ్యూ పాజిటివ్ కేసులకు చికిత్స అందిస్తున్నారు. వీటిలో 10 మంది చిన్నారులు ఉండటం భయాందోళనలకు గురి చేస్తోంది. అనంతపురం నగరం సునీతానగర్‌కు చెందిన లక్ష్మీదేవి (36), కనగానపల్లి మండలం కొత్తూరు గ్రామానికి చెందిన మధుసూదనరెడ్డి (26)కి డెంగ్యూ లక్షణాలున్నట్లు వైద్యులు ధ్రువీకరించారు. వీరిద్దరికీ వైద్యం కొనసాగిస్తున్నారు. ఇక డెంగ్యూతో చికిత్స పొందుతున్న చిన్నారుల్లో నగరానికి చెందిన రాణినగర్‌కు చెందిన రెయిన్‌బాబా(5) పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు తెలిపారు. అత్యవసరమైతే ఈ బాలున్ని బెంగళూరుకు రిఫర్ చేసే పరిస్థితి ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే మరో 213 మంది విష జ్వరాలతో సర్వజనాస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిలో 84 మంది చిన్నారులు ఉండటం ఆందోళన కలిగిస్తోంది. కాగా సర్వజనాస్పత్రిలో అదనంగా 5 ప్రత్యేక వార్డుల్ని ఏర్పాటు చేశారు. ఇందులో నాలుగు వార్డులు చిన్న పిల్లల కోసం కేటాయించారు. మొత్తం 70 పడకలు సిద్ధం చేసి పెద్దలు, చిన్నారులకు ప్రత్యేక వార్డుల్లో చేర్చి వైద్యం అందిస్తున్నారు. ఇకపోతే వైద్య ఆరోగ్య శాఖ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ వెంకటరమణప్ప, డిఎంఆడ్‌హెచ్‌ఓ, సర్వజనాస్పత్రి సూపరింటెండెంట్, హెచ్‌ఓడితో కలిసి శుక్రవారం సర్వజనాసుపత్రిలోని అన్ని వార్డుల్ని కలియదిరిగారు. ప్రధానంగా విష జ్వరాలు, డెంగ్యూ పాజిటివ్ కేసులకు చికిత్స చేస్తున్న వార్డుల్లో పరిస్థితిని సమీక్షించారు. ఈనేపథ్యంలో శనివారం వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ అనంతపురంలో నిర్వహిస్తున్న దోమలపై దండయాత్ర ర్యాలీలో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా మధ్యాహ్నం వరకూ మంత్రి వివిధ కార్యక్రమాల్లో పాల్గొని, సర్వజనాస్పత్రిని సందర్శించనున్నారు. తర్వాత ఆస్పత్రి వైద్యాధికారులు, జిల్లా వైద్యాధికారులతో విష జ్వరాలు, డెంగ్యూ, డయేరియా, చికున్ గున్యాలపై సమీక్షించనున్నారు.
తగ్గని పందుల సంచారం..
నగర పాలక సంస్థ, మున్సిపాలిటీలు, మండల కేంద్రాల్లో పారిశుద్ధ్యం అత్యంత దయనీయంగా తయారైంది. ఇక గ్రామీణ ప్రాంతాల్లో వేరే చెప్పాల్సిన అవసరం లేదు. తీరా చేతులు కాలాక ఆకులు పట్టుకుంటున్నారు. పందుల సంచారం అనంతపురంతోపాటు అన్ని మున్సిపాలిటీల్లో అధికంగా ఉంది. ఎక్కడబడితే అక్కడ చెత్తాచెదారంతో నిండిపోయినా ముందస్తుగా పట్టించుకున్న పాపాన పోలేదు. ముందస్తుగా చర్యలు తీసుకోక పోవడం వల్లే దోమలు విజృంభించి ప్రజలు విష జ్వరాల బారిన పడుతున్నారు. పందుల పట్టివేత, శివార్లకు తరలింపు నగరానికే పరిమితం చేశారు. ఇక్కడ కూడా పందుల్ని నగర శివార్లకు తరలించడంలో కాపరుల నుంచి పూర్తి స్థాయి సహకారం అందడం లేదు. దీంతో పందుల తరలింపు ప్రశ్నార్థకంగా మారింది. ఆయా విషయాలపై నేడు రానున్న జిల్లా ఇన్‌చార్జి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాసులు, జిల్లా మంత్రులు దృష్టి సారించి తగిన చర్యలు చేపట్టాలని, జిల్లాలో మరణ మృదంగాన్ని ఆపాలని ప్రజలు కోరుతున్నారు.