అనంతపురం

నీళ్ల కిరికిరి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధర్మవరం రూరల్, డిసెంబర్ 6: పెన్నహోబిళం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ (పీఏబీఆర్) కుడి కాలువ నుంచి విడుదలయ్యే నీటి పంపకాల వ్యవహారం చిలికిచిలికి గాలివానలా మారి అధికార పార్టీ నేతల మధ్య చిచ్చు పెడుతోంది. పీఏబీఆర్ నుంచి విడుదలయ్యే నీటిలో ధర్మవరం ప్రాంతానికి పూర్తి అన్యాయం జరుగుతోందని, తమ ప్రాంత రైతాంగం సైతం ఈ విషయంపై ఆవేదన వ్యక్తం చేస్తోందంటూ రాజధానిలోని పెద్దల చెంతకు నీటి పంపకాల విషయాన్ని ఎమ్మెల్యే గోనుగుంట్ల తీసుకెళ్లినట్లు సమాచారం. ధర్మవరం నియోజకవర్గంలోని ధర్మవరం, బత్తలపల్లి, తాడిమర్రి మండలాలలోని చెరువులకు పీఏబీఆర్ నుంచి విడుదలయ్యే నీటిలో 70 శాతం అందాలని, ఎగువ ప్రాంతాల చెరువులకు 30 శాతం మాత్రమే అందాలని, అయితే 70 శాతం ఎగువ ప్రాంతాలే వాడుకోవడంతో తమకు పూర్తి అన్యాయం జరుగుతోందని తాను రైతులకు ఏ సమాధానం చెప్పాలని ముఖ్య నేతల వద్ద ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. తనపై కక్ష సాధింపునకు రైతాంగాన్ని ఇబ్బందిపెట్టకూడదని స్వంత పార్టీలోని వారే ఇరు ప్రాంతాల రైతులను సమానంగా చూడాలని ప్రభుత్వ పెద్దలు, పార్టీ పెద్దల వద్ద కూడా విన్నవించినట్లు తెలుస్తోంది. అయితే పీఏబీఆర్ నుంచి నవంబర్ 1 నుంచి నీరు విడుదలైనా ఇప్పటికీ ధర్మవరం ప్రాంతంలోకి చేరకపోవడంతో రైతాంగం వత్తిడితో ఏకంగా ఈ నెల 8న కలెక్టర్ కార్యాలయం ముందు ఎమ్మెల్యే గోనుగుంట్ల రైతులతో కలసి ఆమరణ నిరాహార దీక్షకు సిద్ధమైనట్లు పార్టీవర్గాల సమాచారం. పీఏబీఆర్ నుంచి కుడి కాలువ 112 కిలోమీటర్ల దూరంలో ఉన్న చెరువులకు నీటి లభ్యతనుబట్టి నీరు అందుతుంది. తొలుత కూడేరు మండలంలోని మరుట్ల చెరువు నుంచి ప్రారంభమై ధర్మవరం నియోజకవర్గంలోని తాడిమర్రి మండలంలో నార్శింపల్లి సీబీఆర్ దాకా ఈ నీటి హద్దు ఉంటుంది. మొత్తం ఈ కాలువ కింద 49 చెరువులకు నీరు అందాల్సి ఉంటుంది. ఇందులో ధర్మవరం ప్రాంతంలోనే 40 చెరువుల దాకా ఈ కాలువ ద్వారా నీరు అందాలి. అలాగే ఎగువ ప్రాంతంలోని కూడేరు, ఆత్మకూరు, రాప్తాడు నియోజకవర్గాల్లోని పలు చెరువులకు ఈ కాలువ ద్వారానే నీరు వస్తాయి. అయితే ఈ ఏడాది నవంబర్ 1 నుంచి కలెక్టర్ ఆదేశాల మేరకు నీరు విడుదల చేశారు. ఇప్పటివరకు ఎగువప్రాంత చెరువులన్ని నిండినట్లే తెలుస్తోంది. ధర్మవరం నియోజకవర్గంలోని చింతలపల్లి, చిగిచెర్ల చెరువులకు సైతం నీరు కొనసాగినా ఎగువ ప్రాంతం నుంచి కాలువ ద్వారా సక్రమంగా నీరు రాకపోవడంతో ఆ చెరువుల్లోకి సైతం అరకొరగానే నీరు వచ్చింది. గత ఏడాది 2.22 టిఎంసిల నీటిని ధర్మవరం కుడి కాలువకు వదిలినట్లు అధికారుల ద్వారా తెలుస్తోంది. ఈ ఏడాది కూడా నవంబర్ 1 నుంచి నీటిని విడుదల చేసినట్లు పీఏబీఆర్‌లో నీటి మట్టాన్ని అనుసరించి కలెక్టర్ ఆదేశానుసారమే నీటిని వదులుతున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. అయితే 70 శాతం చెరువులు ధర్మవరం నియోజకవర్గంలో ఉంటే ఎగువ ప్రాంతంలో 30 శాతం చెరువులున్న వాటికే నీరు వాడుకోవడంతో ఈ ప్రాంతం చెరువులు నిండన్నట్లు రైతుల్లో ఆందోళన మొదలుకావడంతో ఎమ్మెల్యేపై కూడా వత్తిడి పెరగడంతో ఈ నెల 8న కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం చేపట్టి న్యాయం జరగకపోతే ఆమరణ దీక్షకు కూడా సిద్దమయ్యే విధంగా పార్టీవర్గాల ద్వారా సమాచారం. ఇప్పటికే నియోజకవర్గంలోని పార్టీ కార్యకర్తలందరికి కలెక్టర్ కార్యాలయం ముందు చేపట్టనున్న నిరసన సమాచారాన్ని సైతం చేరవేశారు. దీనికితోడు రైతాంగాన్ని సైతం 8న కలెక్టర్ కార్యాలయం ముందుకు తరలించాలని ఎమ్మెల్యే అనుచరులు నిమగ్నమైనట్లు తెలుస్తోంది.

తాగునీటికి కటకట

అనంతపురం, డిసెంబర్ 6: తుంగభద్ర జలాశయం నుంచి హెచ్చెల్సీ ద్వారా జిల్లాతో పాటు కడపకు తరలిస్తున్న నీటి వాటాలో ఏటా కోత పడుతోంది. దీంతో హెచ్చెల్సీ ఆయకట్టు బీడుగా మారుతోంది. ఈ ఏడాది కూడా ఇదే పరిస్థితి నెలకొంది. కేవలం తాగునీటి అవసరాలకు మాత్రమే నీటిని వాడుకునేందుకు ప్రాధాన్యత ఇవ్వక తప్పని పరిస్థితి నెలకొంది. మరో 2.5 టిఎంసిల నీరు ఉంటే వచ్చే ఏడాది జూలై వరకు తాగునీటి సమస్యను అధిగమించవచ్చని సంబంధిత అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు హంద్రీ నీవా నుంచి 11 టిఎంసిల నీటిని తరలించి అనంతపురం పిఎబిఆర్, చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌లో నిల్వ ఉంచాలని అధికారులు ప్రతిపాదించారు. తుంగభద్ర ఎగువ కాలువ స్టేజ్-1, స్టేజ్ -2 ద్వారా అనంతపురం, కర్నూలు, వైఎస్‌ఆర్ కడక జిల్లాలు లబ్ధి పొందుతున్నాయి. ఈ క్రమంలో ఈ ఏడాది జులై 22న టిబి డ్యామ్ ఎస్‌ఇ స్థాయి అధికారుల సమీక్ష సమావేశంలో 2016-17 సంవత్సరానికి హెచ్చెల్సీకి 23.149 టిఎంసిలు కేటాయించాలని నిర్ణయించారు. జలాశయంలో నీటి లభ్యత 151 టిఎంసిలు ఉండవచ్చని అంచనా వేశారు. అయితే జలాశయంలో ప్రతి ఏటా పూడిక చేరుతోంది. దీంతో 132.473 టిఎంసిలున్న జలాశయ సామర్థ్యం గణనీయంగా తగ్గిపోతోంది. దీంతో గత 8 ఏళ్ల క్రితమే 100.855 టిఎంసిలకు తగ్గిపోయింది. దీంతో కాలువకు నీటి కేటాయింపులూ తగ్గుతూ వచ్చాయి. ఈ క్రమంలో హెచ్చెల్సీకి ప్రారంభంలో కేటాయించిన 32.50 టిఎంసిల నీటిలో తాగునీటి అవసరాలు కేటాయించక పోవడంతో, ప్రస్తుతం కేటాయించిన 23.149 టి ఎంసీల నీటిలోనే 10 టిఎంసిలు తాగునీటి అవసరాలకు వినియోగించాల్సి వచ్చింది. దీంతో ఆయకట్టు బీడు పడుతోంది. హంద్రీ నీవా ద్వారా ఫేజ్-1లో జీడిపల్లికి కృష్ణా జలాలు రావడంతో కొంత వరకు జిల్లాకు ఊరట కలిగింది. ఈ నేపథ్యంలో తాగునీటి అవసరాలు కూడా ఈ ఏడాది తీరాలంటే హంద్రీ నీవా నుంచి 11 టిఎంసిల నీటి కోసం జల వనరుల శాఖాధికారులు ప్రతిపాదనలు పంపారు. పిఎబిఆర్‌లో నీటిని నిల్వ చేసి అక్కడి నుంచి అనంతపురం, చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌కు పంపడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ నెలాఖరులోగా ప్రతిపాదించిన నీటిలో కొన్ని టిఎంసీలైనా రావచ్చని హెచ్చెల్సీ అధికారులు అంచనా వేస్తున్నారు. హంద్రీ నీవా రెండో దశ పూర్తవడంతో ఈ నెల 2న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గొల్లపల్లి రిజర్వాయర్‌కు నీటిని విడుదల చేశారు. అలాగే వచ్చే ఏడాదిలో కావాల్సినంత నీటిని తెప్పిస్తామని కూడా హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో తాగునీటి కటకట తలెత్తకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సి ఉంది.
నగరంలో రోడ్ల విస్తరణపై నీలినీడలు!

అనంతపురం, డిసెంబర్ 6: అనంతపురం నగరంలో రెండు ప్రధాన రోడ్ల విస్తరణ అటకెక్కనుందా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. నగరంలోని తిలక్ రోడ్డు, గాంధీ బజార్ రోడ్డు విస్తరణ వివాదాస్పదమైన నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు త్రిసభ్య కమిటీనీ వేసిన సంగతి తెలిసిందే. రోడ్లు, భవనాల శాఖ మంత్రి సిద్ధా రాఘవరావు, మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ, సీనియర్ నేత, ఎమ్మెల్సీ నవాజ్ షరీఫ్ సభ్యులుగా కమిటీని నియమించారు. రోడ్ల విస్తరణతోపాటు నగరంలో అభివృద్ధి, పారిశుధ్ధ్యం కార్యక్రమాలు ఎంపి జెసి దివాకర్‌రెడ్డి చేపట్టడంతో స్థానిక అర్బన్ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకరచౌదరి, మేయర్ వ్యతిరేకించారు. దీంతో వీరి మధ్య విభేదాలు తరచూ రచ్చకెక్కడం రివాజుగా మారింది. ఈ నేపథ్యంలో రోడ్ల విస్తరణపై ఎంపి జెసి దివాకరరెడ్డి గత నెల 21న మున్సిపల్ కార్పొరేషన్ ఎదుట నిరసన దీక్ష చేపట్టారు. దీనిపై ముఖ్యమంత్రి సీరియస్ అయ్యారు. అదే రోజు సాయంత్రం ఎమ్మెల్యే, మేయర్, కమిషనర్‌ను విజయవాడకు పిలిపించుకున్నారు. అంతకు ముందు రోజే కలెక్టర్ కోన శశిధర్‌ను పిలిపించుకుని వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా 22న వారందరితో ప్రత్యేకంగా సిఎం సమావేశమయ్యారు. పార్టీకి భంగం కలిగించేలా ఎవరు ప్రవర్తించినా క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించిన విషయం విదితమే. అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలని కూడా సూచించారు. రోడ్ల విస్తరణపై అప్పటికే సిఎం నివేదికలు తెప్పించుకున్నప్పటికీ వాస్తవ పరిస్థితులు తెలుసుకునేందుకు ప్రత్యేక కమిటీని నియమిస్తున్నట్లు చెప్పారు. ఈ మేరకు మంత్రులు, ఎమ్మెల్సీతో త్రిసభ్య కమిటీ వేశారు. గత నెల 23, 24న ఈ కమిటీ అనంతపురంలో పర్యటించింది. సభ్యులు నగరంలోని తిలక్ రోడ్డు, పాతూరులో పర్యటించి వ్యాపారులు, ప్రజలను కలిసి అభిప్రాయాలు తెలుసుకున్నారు. అనంతరం అభిప్రాయ సేకరణ సందర్భంగా ఏకాభిప్రాయం కుదరకపోవడంతో గందరగోళం ఏర్పడగా కార్యక్రమాన్ని వాయిదా వేసుకున్నారు. అనంతరం అర్జీల ద్వారా అభిప్రాయాలు తీసుకున్నారు. ప్రజలు, వ్యాపారుల అభిప్రాయాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళతామని త్రిసభ్య కమిటీ సభ్యులు వెల్లడించారు. రోడ్ల విస్తరణ తప్పదని త్రిసభ్య కమిటీ పేర్కొంది. ఆ తర్వాత పరిస్థితి సద్దుమణిగింది. రోడ్ల విస్తరణను ముఖ్యమంత్రే చూసుకుంటారని, త్వరలో తుది నిర్ణయం వెలువడుతుందని రాజకీయ పార్టీలు, నగర వాసులు ఆశించారు. ఆ తర్వాత ఈ నెల 2న సిఎం జిల్లాపర్యటకు వచ్చి వెళ్లారు. అయితే అనంతలో రోడ్ల విస్తరణ అంశంపై మాత్రం ఇంకా స్పష్టత రాలేదు. అయితే పార్టీలో తలెత్తిన విభేదాలను సద్దుమణచేందుకే సిఎం త్రిసభ్య కమిటీ వేశారని, రోడ్ల విస్తరణ ఉండక పోవచ్చన్న తెలుగుదేశం పార్టీకి చెందిన కొందరు నేతలే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రోడ్ల విస్తరణ చేస్తే బాగుంటుందన్న అభిప్రాయం నగర వాసుల్లో ఉన్నా, తిలక్ రోడ్డు, గాంధీ బజారు రోడ్డులోని వ్యాపారులు, నివాసాలున్న వారు మాత్రం వ్యతిరేకిస్తున్నందున కార్యాచరణను ఇప్పట్లో ప్రకటించక పోవచ్చని కొందరు అభిప్రాయపడుతున్నారు. అయితే ఇపుడే రోడ్లు విస్తరిస్తే బాగుంటుందని, ఎన్నికలు సమీపించేలోపే పూర్తి చేస్తే ఇబ్బందులుండవని నగర వాసులు చర్చించుకుంటున్నారు. ఎన్నికల సమయంలో రోడ్ల విస్తరణ సాధ్యం కాదని, ఓటు బ్యాంకు రాజకీయాల్లో మరుగున పడుతుందన్న అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ఆక్రమణదారులు మినహా ఇతరులెవరైనా నష్ట పోతే పరిహారం ఇవ్వడంలోనూ ప్రభుత్వం న్యాయబద్ధమైన నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్న అభిప్రాయాలు లేకపోలేదు. కాగా కోర్టులో స్టే పెండింగ్‌లో ఉన్నందున వాటిని వెకేట్ చేశాక, తుది కార్యాచరణ రూపొందించి రోడ్ల విస్తరణ పనులు చేసే అవకాశాలు ఉండవచ్చని కూడా తెలుస్తోంది. ఏదేమైనా రోడ్ల విస్తరణ అంశంపై సందిగ్ధత నెలకొనడంతో ప్రజల్లో అనుమానాలు కూడా పెరిగేందుకు ఆస్కారం కలుగుతోంది.
నగదు రహిత జిల్లాగా మార్చేందుకు
ప్రతి ఒక్కరూ కృషి చేయాలి

అనంతపురం సిటీ, డిసెంబర్ 6: వంద శాతం నగదు రహిత జిల్లాగా రూపొందించేందుకు ప్రతి ఒక్కరూ తమవంతు కృషి చేయాలని కలెక్టర్ కోన శశిధర్ పిలుపునిచ్చారు. మంగళవారం నగదు రహిత లావాదేవీలపై ప్రజలకు అవగాహన కల్పించాలని కలెక్టరేట్ వద్దనున్న ఓటిఆర్‌ఐ నుండి జెఎన్‌టియూ విద్యార్థులుచే భారీగా సంఘమేష్ సర్కిల్, సప్తగిరి సర్కిల్ మీదుగా టవర్‌క్లాక్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం టవర్‌క్లాక్ వద్ద కలెక్టర్, జెఎన్‌టియూ విసి ఆచార్య ఎంఎంఎం.సర్కార్, ఇతర అధికారులు, విద్యార్థినీ, విద్యార్థులచే భారీగా మానహారం ఏర్పాటుచేసి నగదు రహిత లావాదేవీలపై నినాదాలు చేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ పెద్ద నోట్లును ప్రభుత్వం రద్దు చేసిన నేపథ్యంలో ప్రతి ఒక్కరూ నగదు రహిత లావాదేవీలను నిర్వహించేందుకు మొబైల్ బ్యాంకింగ్, ఆన్‌లైన్ బ్యాంకింగ్, పిఓఎస్ మిషన్లు, ఈ-వ్యాలెట్, రూపే, డెబిట్ కార్డులను ఉపయోగించాలన్నారు. దీనివల్ల చిల్లర సమస్య తగ్గడమే కాక మన విలువైన సమయాన్ని కాపాడుకోవచ్చునన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్‌డిఓ మలోలా, ఎస్‌ఎస్‌ఎ పిఓ దశరథరామయ్య, తహశీల్దార్ శ్రీనివాసులు, ఇంజనీరింగ్ కళాశాలల విద్యార్థులు పాల్గొన్నారు.
జెఎన్‌టియూ ఇంజినీరింగ్
కళాశాల ఆధ్వర్యంలో ర్యాలీ
ప్రతి ఒక్కరూ నగదు రహిత లావాదేవీలను నిర్వహించుకోవాలని జెఎన్‌టియూ ఉప కులపతి ఆచార్య ఎంఎంఎం.సర్కార్ పేర్కొన్నారు. మంగళవారం జెఎన్‌టియూ ఇంజినీరింగ్ కళాశాల ఆధ్వర్యంలో నగదు రహిత లావాదేవీలపై ప్రజలకు అవగాహన ర్యాలీకి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ర్యాలీ జెఎన్‌టియూ కళాశాల నుండి కలెక్టరేట్, సంఘమేష్ సర్కిల్, సప్తగిరి సర్కిల్ మీదుగా టవర్‌క్లాక్ వరకు నిర్వహించి, అక్కడ మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెద్ద నోట్లు రద్దుతో ప్రజలు నగదును డైరెక్టుగా ఖర్చు చేయడంలో తీవ్ర ఇబ్బందులుపడుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో జెఎన్‌టియూ రెక్టార్ ఆచార్య సుబ్బారావు, రిజిస్ట్రార్ ఆచార్య క్రిష్ణయ్య, ఎన్‌ఎస్‌ఎస్ కోఆర్టినేటర్ ఆచార్య దేవకుమార్, కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య ప్రహ్లాదరావు, విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొన్నారు.
నగదు రహిత లావాదేవీలను ప్రతి ఒక్కరు అలవర్చుకోవాలి
ప్రతి ఒక్కరు కొనుగోలు చేసే ప్రతి వస్తువును నగదు రహిత లావాదేవీలతోనే కోనుగోలు చేయడం అలవర్చుకోవాలని ప్రభుత్వ పాలిటెక్నిక్ ప్రిన్సిపాల్ ఆశ్రఫ్ ఆలీ తెలిపారు. మంగళవారం ప్రభుత్వ పాలిటెక్నిక్ అధ్యాపక బృందం, విద్యార్థులు కలసి నగదు రహిత లావాదేవీలపై కళాశాల నుండి ర్యాలీగా బయలుదేరి చిన్మయ నగర్ మీదుగా ప్రసన్నాయపల్లి వరకు విద్యార్థులు నినాదాలు చేసుకుంటూ ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆశ్రీఫ్ అలీ మాట్లాడుతూ నగదు రహిత లావాదేవీలను చేసుకోవాలని పిలుపునిచ్చారు. అధ్యాపకులు డేవిడ్, రంగనాయకులు, విక్రమాచారి, ఎన్‌ఎస్‌ఎస్ కో ఆర్టినేటర్ రామకృష్ణారెడ్డి, జెఎన్‌టియూ ఎస్‌బిఐ మేనేజర్ నాగేంద్రబాబు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

జయలలిత మృతితో
తమిళ కుటుంబాల్లో విషాదం

హిందూపురం, డిసెంబర్ 6: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మృతి స్థానిక తమిళ కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. బెంగళూరు రోడ్డులోని ఫళనినగర్, ఇందిరానగర్‌లలో వందలాది కుటుంబాలు ఎన్నో ఏళ్లుగా ఇక్కడ స్థిరపడి వివిధ రంగాల్లో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. సోమవారం రాత్రి నుండే జయలలిత పరిస్థితి విషమంగా ఉందన్న సమాచారంతో తమిళ కుటుంబాలు తీవ్ర ఉత్కంఠకు గురయ్యాయి. ఈ నేపథ్యంలో రాత్రి 11.30 గంటలకు జయలలిత మృతి చెందిందన్న సమాచారంతో ఆయా కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఈ సందర్భంగా దివంగత ముఖ్యమంత్రి ఫ్లెక్సీలను ఏర్పాటు చేసి నివాళులు అర్పించారు. ఇందులో భాగంగా కొందరు మహిళలు బోరున విలపించారు. ఎన్నో ప్రజా సంక్షేమ పథకాలను అమలుపరుస్తూ పేదల జీవితాల్లో జయలలిత అమ్మగా వెలుగునింపారని పేర్కొన్నారు. అలాంటి అమ్మ ఇకలేరన్న బాధ తమను ఎంతగానో వేధిస్తోందన్నారు. కొందరు రాత్రికి రాత్రే జయలలితను కడసారి చూసేందుకు చెన్నైకు బయలుదేరి వెళ్లారు. ఇదిలా ఉండగా తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మృతి పట్ల స్థానిక బిజెపి, కాంగ్రెస్ పార్టీ నాయకులు నివాళులు అర్పించారు. జయలలిత ఫ్లెక్సీలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు హరి, రమేష్‌రెడ్డి, ఆదర్శ్‌కుమార్, నాగేష్‌బాబు, ఉదయ్, జయసింహ, తిరుమలేష్, కాంగ్రెస్ నాయకులు ఆదిమూర్తి, శైవలి రాజశేఖర్, ఇందాద్, నాగరాజు, బండ్లపల్లి జబీ, రహమత్ తదితరులు పాల్గొన్నారు.
అంబేద్కర్‌కు నివాళులు
అనంతపురం కల్చరల్, డిసెంబర్ 6: భారత రాజ్యాంగ నిర్మాత డా.బిఆర్. అంబేద్కర్ వర్థంతి సందర్భంగా ఆయనకు పలువురు నివాళులర్పించారు. అంబేద్కర్ వర్థంతిని పురస్కరించుకుని ఆదివారం నగరంలో జడ్పీ కార్యాలయం ఎదురుగా గల అంబేద్కర్ విగ్రహానికి పలువురు రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు, ఉద్యోగ, సామాజిక, ప్రజాసంఘాల నాయకులు, కార్యకర్తలు పూలమాలలు వేసి నివాళులర్పించారు.జోహార్ డా.అంబేద్కర్ అంటూ నినాదాలు చేశారు. అంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తామన్నారు. కలెక్టరేట్ ఆవరణలో అంబేద్కర్ చిత్రపటానికి కలెక్టర్ కోన శశిధర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశానికి రాజ్యాంగాన్ని రూపొందించిన మహానుభావుడు అంబేద్కర్ అన్నారు. దేశానికి ఆయన చేసిన సేవలను గుర్తించిన భారతప్రభుత్వం భారతరత్న బిరుదుతో సత్కరించిందన్నారు. బాల్యంలోనే అనేక అవమానాలకు గురై, పేదరికాన్ని ఎదుర్కొంటూ స్వయంకృషి, స్వీయ ప్రతిభతో కేంద్ర మంత్రి పదవిని అలంకరించిన మహామనిషి అంబేద్కర్ అన్నారు. సామాజిక సమసరతావేదిక ఆధ్వర్యంలో పలువురు ప్రముఖులు అంబేద్కర్‌కు నివాళులర్పించారు. వేదిక అఖిల భారత కన్వీనర్ శ్యాంప్రసాద్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేశారు. ఈకార్యక్రమంలో ప్రజ్ఞాప్రవాహ్ జిల్లా కన్వీనర్ ఉమాకాంతరెడ్డి, గణేశ్ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి పరుచూరి రమేష్‌బాబు, బిఎంఎస్ నాయకులు లక్ష్మయ్య, సంజీవరెడ్డి, ఆరోగ్యభారతి జిల్లా ప్రముఖ్ సుధాకర్, ఆర్‌ఎస్‌ఎస్ జిల్లా వ్యవస్థాప్రముఖ్ జివిడి.శాస్ర్తీ, కూరగాయల మాణిక్యం పాల్గొన్నారు. జడ్పీ చైర్మన్ చమన్‌సాబ్, సామజిక హక్కుల వేదిక నాయకులు నూర్ మహమ్మద్, రమేష్‌గౌడ్, జాఫర్, సాలార్‌బాషా, ఎస్‌ఆర్.నాగభూషణం తదితరులు నివాళులర్పించారు. ఎమ్మెల్సీ డా.గేయానంద్, జెవివి భాస్కర్, బిఎస్‌ఎన్‌ఎల్ ఉద్యోగులు, నాగలింగం, పెద్దనగౌడ్, ఎస్సీ,ఎస్టీ ఎలక్ట్రికల్ ఉద్యోగులు సంపత్‌కుమార్, నారాయణనాయక్, సత్యానందం, విజయభాస్కర్ తదితరులు నివాళులర్పించారు. బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వరరెడ్డి, నగర అధ్యక్షులు శ్రీనివాసులు, రామ్మూర్తి, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కోటా సత్యం, ఎస్సీ సెల్ నాయకులు శంకర్, లిటిల్ ఫ్లవర్ బిఇడి కళాశాల విద్యార్థులు, కరస్పాండెంట్ ఆంజనేయులు అంబేద్కర్‌కు నివాళులర్పించారు. మేవా రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాసులు, నాయకులు శ్రీరాములు, కె.జయరాములు, మాలమహానాడు జిల్లా అధ్యక్షులు ఓబిలేసు, ప్రధానకార్యదర్శి ఓబుళపతి, వివిధ సంఘాల నాయకులు నివాళులర్పించారు. వైకాపా కార్యాలయంలో అంబేద్కర్ చిత్రపటానికి నాయకులు, కార్యకర్తలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎస్కేయూలో పూలేభవన్‌లో అంబేద్కర్ వర్థంతిని నిర్వహించారు. విసి రాజగోపాల్, రిజిస్ట్రార్ రమణ, రెక్టార్ శ్రీ్ధర్ తదితరులు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళుర్పించారు.
దళిత జన బాంధవుడు అంబేద్కర్
అనంతపురంటౌన్ : బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతికి విశేష కృషి సల్పిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దళితజన బాంధవుడని పలువురు వక్తలు కొనియాడారు. మంగళవారం స్థానిక పద్మశ్రీ కల్లూరు సుబ్బారావుకాంగ్రెస్ భవన్‌లో అంబేద్కర్ వర్ధంతి సమావేశం జరిగింది. తొలుత అంబేద్కర్ చిత్రపటానికి పలువురు నేతలు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. వారు మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాతగా అంటరానితనం, ఆర్థిక అసమానతలకు వ్యితిరేకంగా అంబేద్కర్ అలుపెరగని పోరాటం సాగించారన్నారు. అంబేద్కర్ ఆశయాలను ఆదర్శంగా తీసుకుని దళితుల అభ్యున్నతికై అందరూ కృషి సల్పాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్‌సి సెల్ నగర అధ్యక్షుడు రామాంజనేయులు, దాదాగాంధి, రమణ, వాసు, కృష్ణ పాల్గొన్నారు.
హోంగార్డుల సేవలు అభినందనీయం
అనంతపురం సిటీ, డిసెంబర్ 6: హోంగార్డులు లేని పోలీసు వ్యవస్థను ఊహించలేనిదని, వారి సేవలు అభినందనీయమని అదనపు ఎస్పీ కె.మాల్యాద్రి పేర్కొన్నారు. మంగళవారం హోంగార్డుల 54వ ఆవిర్భావ దినోత్సవాన్ని స్థానిక పోలీసు పరేడ్ మైదానంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎఎస్పీ కె.మాల్యాద్రి హాజరయ్యారు. పరేడ్ మైదానంలో హోంగార్డుల నుండి ప్లటూన్ల నుంచీ గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 1963వ సంవత్సరం నుండి హోంగార్డు వ్యవస్థ ప్రారంభమై, ప్రస్తుతం హోంగార్డులు అన్ని పోలీసులు పనుల్లోను కీలకంగా విధులు నిర్వర్తిస్తున్నారని తెలిపారు. హోంగార్డులు నైపుణ్యం పెంపొందించుకుని క్రమశిక్షణగా మెలగాలని పిలుపునిచ్చారు. అనంతరం హోంగార్డులకు నిర్వహించిన పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులను అందజేసారు. అనంతర నగరంలోని కోర్టు రోడ్డు, టవర్‌క్లాక్, సుభాష్ రోడ్, సప్తగిరి సర్కిల్, గీతా మందిరం ప్రాంతాల మీదుగా జిల్లా పోలీసు హెడ్ క్యార్టర్స్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎఆర్ డియస్పీ చిన్నికృష్ణ, ఆర్‌ఐలు మోసెన్‌బాబు, వెంకటేశ్వరరావు, ఆర్‌స్‌లు నిరంజన్, జాఫర్, రాఘవేంద్ర తదితరులు పాల్గొన్నారు.

విపశ్యన ధ్యానయోగ చారిటబుల్ ట్రస్టు
నూతన కార్యవర్గం
అనంతపురం కల్చరల్, డిసెంబర్ 6: విపశ్యన ధ్యానయోగ చారిటబుల్ ట్రస్టు నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. తపోవనంలోని శ్రీవేదగాయత్రి దేవాలయం సభామందిరంలో మంగళవారం జరిగిన జనరల్‌బాడీ సమావేశంలో ట్రస్టు ఆధ్వర్యంలో చేపట్టనున్న కార్యాక్రమాలపై విస్తృతంగా చర్చించారు. అదే విధంగా కొత్త కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా గురూజీ రాజ్‌పుట్ విజయ్‌సింగ్, ఉపాధ్యక్షులుగా కె.ఇందిరమ్మ, ప్రధానకార్యదర్శిగా బి.ఎస్.ప్రసాద్, సంయుక్త కార్యదర్శిగా జి.్భరతి, కోశాధికారిగా ఎం.ఇందిరలక్ష్మి, కార్యవర్గసభ్యులుగా పి.వేణుగోపాల్, మాధవీలత, సుజాత, నాగేశ్వరి, సావిత్రమ్మ, భాగ్యమ్మ, రత్నమ్మ, అనురాధ, అనిత, సుమలత, సుజాత, నాగేశ్వరి, శివలీల, ఉమామహేశ్వరి, భవాని, నిర్మల, భాను, తిరుమల, రాధ, శ్రీసుధ ఎన్నికయ్యారు.