అనంతపురం

చేతికందని నోటు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం, డిసెంబర్ 8: రోజువారీ నగదు లావాదేవీల కోసం జనానికి ముప్పుతిప్పలు తప్పడం లేదు. పెద్ద నోట్లు రద్దు చేసి నెల రోజులు దాటినా పరిస్థితి చక్కబడటం లేదు. డిజిటల్, ఆన్‌లైన్ లావాదేవీలకు అలవాటుపడాలని ఆర్‌బిఐ, కేంద్ర ప్రభుత్వం ఆదేశిస్తున్నా అందుకు అనుగుణంగా ప్రజల్లో అవగాహన పెరగడం లేదు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు ఈ నెలాఖరు, లేదా వచ్చే ఏడాది జనవరి 15లోపు వంద శాతం కాకపోయినా, కనీసం 80 శాతం మేరకు ఆన్‌లైన్ లావాదేవీలకు ప్రజల్ని అలవాటు చేసేందుకు జిల్లా యంత్రాంగం కృషి చేస్తోంది. ఇందుకోసం నిత్యం అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో స్వైప్ మిషన్లు వాడాలని చెబుతున్నా, అవి చాలా మందికి చేరడం లేదు. అవి ఎలా ఉంటాయో కూడా తమకు తెలియదంటూ పలువురు చిరు వ్యాపారులు చెబుతుండటం విశేషం. ఈ పరిస్థితుల్లో ఆన్‌లైన్ లావాదేవీలపై కనీస అవగాహన సాధారణ ప్రజలు, చిరు వ్యాపారుల్లో కలగడం లేదు. గత మూడు రోజుల క్రితం ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన 3ఎపి పర్స్2లో సుమారు 23 బ్యాంకులు, ఇతర ఆన్‌లైన్ యాప్‌లు అందుబాటులోకి తెచ్చారు. వీటిని కొందరు వ్యాపారులు, పలు సంస్థలు, విద్యార్థులు డౌన్‌లోడ్ చేసుకుని ఉపయోగించడం ప్రారంభించారు. అదనంగా మరో 6 యాప్‌లు కూడా అందుబాటులోకి తెస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. అయితే బ్యాంకులో తగినంత నగదు ఉంచేందుకు చాంతాడంత క్యూల్లో నాలుగైదు గంటలు పైగానే నిల్చోవాల్సి వస్తుండటంతో ఈ యాప్‌లను కూడా సమర్థవంతంగా వినియోగించుకోవడంలో ఇబ్బందులు తప్పడం లేదు. దీనికితోడు స్వైప్ మిషన్లు అందుబాటులో ఉన్న చోట లోడ్ అధికం కావడంతో అవి మొరాయిస్తున్నాయని పలువురు వినియోగదారులు పేర్కొంటున్నారు. కాగా చిన్న నోట్ల చలామణి మందకొడిగా ఉండటం, కొత్త నోట్లు రాకపోవడంతో జనం ఇబ్బందులుపడుతున్నారు. కొత్త చిన్న నోట్లు త్వరలో వస్తున్నట్లు కేంద్రం ప్రకటిస్తున్నా, వచ్చిన ఆ నోట్లు ఎంత శాతం మేర చలామణిలోకి వస్తాయో తెలియని అయోమయ పరిస్థితి బ్యాంకర్లలోనే నెలకొంది. ఇప్పటికే చలామణిలో ఉన్న పాత చిన్న నోట్లు బ్యాంకుల్లో డిపాజిట్ చేయకపోవడంతో లావాదేవీలకు అత్యంత ఆటంకం ఏర్పడింది. దీంతో విధి లేక అధికంగా కొత్త రూ.2 వేలు నోట్లను ఎటిఎంలలో పెడుతున్నామని కొందరు బ్యాంకర్లు చెప్పారు. అందులోనూ ఒక్కో ఎటిఎంలో కేవలం రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు మాత్రమే ఉంచుతున్నారు. అవి కూడా గంటల్లోనే అయిపోతోంది. దీంతో దాదాపు 80 శాతం ఎటిఎంలు మూతపడుతున్నాయి. కార్పొరేట్ బ్యాంకుల ఎటిఎంలలో నగదు రొటేషన్ మేరకు దశలవారీగా కొంచెం కొంచెంగా నగదును పెడుతున్నారు. ఇక ఎస్‌బిఐకి సంబంధించి జిల్లాలో రెండు రీజియన్‌లు ఉన్నాయి. వాటిలో రీజియన్-1లో అనంతపురం, ధర్మవరం, కదిరి, కల్యాణదుర్గం, హిందూపురం, మడకశిర ప్రాంతాలుండగా, మొత్తం 156 ఎటిఎంలు ఉన్నాయి. వీటిలో 29 ఎటిఎం కేంద్రాల్లో 29 డిపాజిట్ మిషన్లు ఉన్నాయి. అలాగే రీజియన్-5లో రాయదుర్గం, ఉరవకొండ, గుంతకల్లు, గుత్తి, తాడిపత్రి పరిధిలో మరో 150 దాకా ఎటిఎంలు ఉన్నాయి. వీటిలోనూ పదుల సంఖ్యలో డిపాజిట్ మిషన్లు ఉన్నాయి. వీటిలో రోజుకు రూ.15 లక్షలు నుంచి రూ.20 లక్షల వరకు మాత్రమే నగదు ఉంచుతున్నట్లు సమాచారం. అత్యధికంగా అనంతపురం సాయినగర్‌లోని మెయిన్ బ్రాంచ్‌లోని ఎటిఎంలో రోజుకు రూ.60 లక్షలు దాకా ఉంచుతున్నారు. దీంతో రోజువారీ ఖర్చులకు రూ.2వేలైనా చాలని డ్రా చేసుకునేందుకు జనం క్యూ కడుతున్నారు. మెయిన్ బ్రాంచ్ బ్యాంకులో రూ.24 వేలు ఏక మొత్తంగా ఇస్తుండటంతో రోజూ చాంతాడంత క్యూ ఉంటోంది. అలాగే రోజువారీ రూ.49 వేల వరకు డిపాజిట్ చేసే వెసులుబాటు ఉండటంతో, ఇలా డిపాజిట్ చేసి అలా వ్యాపార లావాదేవీలకు నగదు తీసుకుంటున్నారు.
పెద్ద నోట్ల రద్దుతో ఏర్పడిన ఇబ్బందుల దృష్ట్యా చిరు వ్యాపారులు మొదలు, వాణిజ్యపరమైన లావాదేవీలు చేసే వారు ఆన్‌లైన్ విధానాన్ని విరివిగా ఉపయోగిస్తున్నారు. చాలా మంది ఎన్‌ఇఎఫ్‌టి(నెఫ్ట్) అనే ఆన్‌లైన్ విధానాన్ని ఉపయోగిస్తున్నారు. దీని ద్వారా ఒక ఖాతా నుంచి మరో ఖాతాకు, ఒక బ్యాంకు నుంచి మరొక బ్యాంకును అవసరమైనంత మొత్తాన్ని(దీనికి పరిమితి లేదు) చెక్ రాసి, ఫారం భర్తీ చేసి బ్యాంకరుకు ఇచ్చి ఆన్‌లైన్ ద్వారా నగదు ట్రాన్స్‌ఫర్ చేయవచ్చు. అలాగే చెక్కులు, డిడిలు విరివిగా వాడుతున్నారు. ఎటిఎంలలో రూ.2 వేలు మాత్రమే డ్రా చేసుకునే వీలున్నందున బ్యాంకుల్లో చెక్కులు, విత్‌డ్రాయల్ ఫారాలు, డిడిలు అందజేసి నగదుగా మార్చుకుంటున్నారు. జాతీయ బ్యాంకుల్లో కొత్తగా చెక్ బుక్కులు ఇవ్వడం లేదు. వాటి కొరత ఉండటమే అందుకు కారణం. మరోవైపు కార్పొరేట్ బ్యాంకులు 10, 20 లీవ్స్(చెక్కులు) ఉన్న చెక్కుబుక్కులు మొదలు, 50 లీవ్స్ ఉన్న వాటి దాకా కూడా వారివారి అవసరాలకు తగ్గట్టుగా అందిస్తున్నారు. దీంతో రోజువారీ వ్యాపార లావాదేవీలు చేసే వారు చెక్కుల్ని విరివిగా వాడుతున్నారు. ఇక ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్స్‌లో డెబిట్, క్రెడిట్ కార్డులు వాడే వారికి రూ.2వేల వరకు చార్జీలు మినహాయిస్తూ గురువారం కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేయడంతో వినియోగదారులకు ఊరట కలిగినట్లయింది. నగదు చలామణికి ఆర్‌బిఐ, కేంద్ర ప్రభుత్వం సుముఖంగా లేకపోవడంతో డిజిటల్ లావాదేవీలకు జనం అలవాటుపడకపోతే ఇబ్బందులు తప్పవని పరిశీలకులు పేర్కొంటున్నారు.

రెచ్చగొడుతున్న జగన్‌కు
రైతులే బుద్ధి చెబుతారు
రామగిరి, డిసెంబర్ 8: రైతులను రెచ్చగొడుతూ వారికి లేనిపోని మాటలు చెబుతున్న వైసీపీ నేత జగన్మోహన్‌రెడ్డికి రైతులే తగిన విధంగా బుద్ధి చెబుతారని పౌర సరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత అన్నారు. గురువారం మండలంలోని కుంటిమద్ది చెరువుకు హంద్రీనీవా కాలువ ద్వారా నీరు రావడంతో ఆ చెరువు పరిశీలనకు మంత్రి విచ్చేశారు. ఈ సందర్భంగా రైతులు, గ్రామస్తులతోనూ మాట్లాడి 12న తెప్పోత్సవం నిర్వహించడానికి ఏర్పాట్ల గురించి చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పట్టిసీమ చేపట్టినప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై లేనిపోని ఆరోపణలు చేసిన ప్రతిపక్ష నేత నేడు ఆ పట్టిసీమ వల్లే రాయలసీమకు నీరు తెచ్చామని చెప్పారు. గోదావరి జిల్లాలకు వెళ్లి జగన్మోహన్‌రెడ్డి అక్కడి రైతులతో మీకు నీరు లేకుండా చేసి పంటలు ఎండేలా చేస్తారని అక్కడి వారిని రెచ్చగొట్టడం, ఇక్కడకు వచ్చి ఈ కాలువలకు నీరు సక్రమంగా రావడం లేదని ఇంకా ఎప్పుడు నీరు తెస్తారు, నీరు తేవడం సాధ్యమేనా అంటూ లేనిపోనివి చెబుతూ రెచ్చగొడుతున్నారని, మీకు రైతులే తగిన విధంగా బుద్ధి చెబుతారన్నారు. హంద్రీనీవా కాలువలు తవ్వి మీ తండ్రి, మీరు డబ్బులు దోచుకున్నారు. ఆ రోజే పనులు పూర్తిచేసి ఉంటే సంతోషించేవారం, నేడు చంద్రబాబునాయుడు లోటు బడ్జెట్‌లో ఉన్నా కాలువ నిర్మాణాలు పూర్తి చేసి నీరు తెప్పించారన్నారు. వైసీపీ పట్టుకోల్పోతోందని గడప గడపకు వైకాపా కార్యక్రమాన్ని పెట్టి ఆ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు సరిగా పనిచేయకపోవడంతో జగన్‌కు మతిస్థిమితం లేక ఏవేవో మాట్లాడుతున్నారని ఆరోపించారు. మీరు మంచి పనులు చేసి ఉంటే అభినందించేవారమన్నారు. పార్టీలకతీతంగా అందరికి నీరు ఇస్తున్నామని, ఎక్కడా పంటలు ఎండకుండా చూస్తున్నట్లు ఆమె తెలిపారు. కుంటిమద్దిలో 12న పండుగ వాతావరణంలో తెప్పోత్సవం నిర్వహించడం జరుగుతుందన్నారు. పోలవరం కూడా పూర్తిచేస్తామని దీంతో ప్రతిపక్షాలకు మాటలు లేకుండా పోతాయని తెలిపారు. మంత్రి వెంట స్థానిక టీడీపీ నేతలు ఎల్.నారాయణచౌదరి, రామ్మూర్తినాయుడు, రంగయ్య, సర్పంచి ఇటిక నల్లప్ప, సాగునీటి సంఘం అధ్యక్షులు శ్రీరాములు పాల్గొన్నారు.
లీజు పేర మున్సిపల్ స్థలాలు కబ్జా!
కదిరి, డిసెంబర్ 8: పట్టణంలోని మున్సిపల్ స్థలాలు లీజు పేరుతో కౌన్సిల్‌లో ఆమోదించుకునేలా చేసుకోవడం, అనంతరం వాటిని కబ్జా చేయడం కదిరిలో ఆనవాయితీగా వస్తోందని ప్రజలు చెప్పుకుంటున్నారు. గతంలో మున్సిపాలిటీ స్థలాలను మాత్రమే లీజు పేరుతో కబ్జా చేస్తుండగా, ప్రస్తుతం కొందరి నాయకుల దృష్టి ఏకంగా వృధాగా వున్న ప్రభుత్వ పాఠశాలల భవనాలపై కన్ను వేశారు. దీన్ని లీజు పేరుతో కబ్జా చేసేందుకు రంగం సిద్ధం చేసినట్లు తెలిసింది. గతంలో పట్టణంలోని రిపబ్లిక్ ఐటిఐ ఎదురుగా ఉన్న ప్రభుత్వ స్థలాన్ని ఓ టిడిపి నాయకుడికి సారవ కట్టెలు వేసుకునేందుకు లీజుకిచ్చి, ఆ స్థలంలో ఎటువంటి నిర్మాణాలు చేపట్టకుండా కేవలం సారవ కట్టెల అమ్మకాలకే బాడుగకు ఇస్తున్నట్లు కౌన్సిల్‌లో తీర్మాణం చేసి లీజుకు ఇచ్చారు. అయితే సదరు నాయకుడు ఆ స్థలంలో నిర్మాణం చేపట్టేందుకు సిద్ధం కాగా, ఓ వృద్ధురాలు ఆ స్థలం తనదేనంటూ తనకు ఓ రాజకీయ నాయకుడు రిజిస్ట్రర్ చేసి ఇచ్చినట్లు పత్రాలు చూపించి ఆ నాయకుడితో గొడవకు దిగింది. ఈ విషయాన్ని మున్సిపల్ అధికారుల దృష్టికి టిడిపి నాయకుడు తీసుకురాగా మున్సిపల్ అధికారులు పట్టించుకోకపోవడంతో ఆ వృద్ధురాలు ఆ స్థలంలో నిర్మాణాన్ని చేపట్టింది. దీంతో వున్న మున్సిపల్ స్థలం కాస్తా సగమైంది. ఇదే సందర్భంలో రైల్వే స్టేషన్ రోడ్డులో ప్రభుత్వ స్థలంలో నిర్మించిన మరుగుదొడ్లు శిథిలావస్థకు చేరుకోవడంతో కాంగ్రెస్ హయాంలో ఆ స్థలాన్ని లైబ్రరీకి కేటాయించగా అది అమలుకు నోచుకోలేదు. అదే స్థలాన్ని మరో టిడిపి నాయకుడికి లీజుకు ఇచ్చేలా కౌన్సిల్‌లో తీర్మాణం చేశారు. అయితే ఆ స్థలాన్ని బిజెపి నాయకుడు పట్టాను సిద్ధం చేసుకొని ఏకంగా ఇంటి నిర్మాణం చేపట్టినా అటు పాలకులు, ఇటు మున్సిపల్ అధికారులు ఏమాత్రం పట్టించుకోకపోవడంతో ఆ స్థలం కబ్జాకు గురైంది. అనంతరం గత నెల 30వ తేదీ జరిగిన కౌన్సిల్ సమావేశంలో గాండ్లపెంట మండలానికి చెందిన మరో టిడిపి నాయకుడికి అనాధలకు షెల్టర్ ఇచ్చేందుకు అనంతపురం రోడ్డులోని వీవర్స్ కాలనీలో దాదాపు రూ. 90 లక్షలు విలువ చేసే (స్థలం, పాఠశాల కలిపి) లీజుకిచ్చేందుకు కౌన్సిల్‌లో తీర్మాణం చేయగా వైకాపా కౌన్సిలర్లతోపాటు మరోకొంతమంది టిడిపి కౌన్సిలర్లు కూడా అడ్డుతగలడంతో దాన్ని పెండింగ్‌లో వుంచుతున్నట్లు కౌన్సిల్‌లో తెలిపారు. అయితే మెప్మా ఆధ్వర్యంలో పట్టణంలో బిచ్చగాళ్లకు వుండేందుకు నీడ లేని వారికి షెల్టర్ కల్పించి, వారికి మూడు పూటలా భోజనం పెట్టేందుకే పాఠశాలను లీజుకు ఇస్తున్నట్లు మున్సిపల్ ఛైర్‌పర్సన్ సురియాభాను, కమిషనర్‌లు సూచించినప్పటికీ కౌన్సిలర్లు లీజుకు ఒప్పుకోలేదు. దీంతో చేసేదిలేక దొడ్డి దారిన కొంతమంది కౌన్సిలర్లకు మభ్యపెట్టి ఒక్కొక్కరికి రూ. 10 వేలు ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకొని రూ. లక్షలు విలువ చేసే ఈ పాఠశాల భవనాన్ని లీజుకిచ్చేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఏది ఏమైనా లీజుల పేరుతో ప్రభుత్వ స్థలాలు, భవనాలను స్వాధీనం చేసుకుంటే వాటిని తమ ఆధీనంలో పూర్తిగా కబ్జా చేసుకోవచ్చన్నది నాయకుల టార్గెట్.
20 నుండి క్రిస్మస్,
2 నుండి సంక్రాంతి కానుకల పంపిణీ
అనంతపురం కల్చరల్, డిసెంబర్ 8: ఈ నెల 20వ తేదీ నుండి చంద్రన్న క్రిస్మస్ కానుక, జనవరి 2 నుండి చంద్రన్న సంక్రాంతి కానుక పంపిణీ చేయనున్నట్లు జెసి బి.లక్ష్మీకాంతం పేర్కొన్నారు. ఈమేరకు ఆర్డీఓలు, తహశీల్దార్లు, ఎంపిడిఓలు, ఎంఇఓలతో గురువారం జాయింట్ కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. క్రిస్మస్, సంక్రాంతి కానుకలు కార్డుదారులందరికీ పంపిణీ చేయాలని ఆదేశించారు. కానుకలో భాగంగా అరకేజి శనగ బేడలు, పామోలిన్ అర లీటరు, కంది పప్పు అర కేజి, గోధుమ పిండి ఒక కేజి, అర కేజి బెల్లం, నెయ్యి వంద గ్రాములు, సరుకులను సంచిలో పెట్టి ఇవ్వాలన్నారు. ఎంఎల్‌ఎస్ పాయింట్‌కు సరుకులు రాగానే నాణ్యతను పరిశీలించాలని ఆదేశించారు. అదేవిధంగా నగదు రహిత లావాదేవీల జిల్లాగా ప్రకటించేందుకు తమవంతు సహకారాన్ని అందించాలని జెసి పేర్కొన్నారు. నేటి నుండి వలంటీర్లు, బ్యాంకు లైజన్ అధికారులు, అటెస్టేషన్ అధికారులు, ఎంతమందికి బ్యాంకు ఖాతాలు, రూపే కార్డులు, డెబిట్ కార్డులు, ఇతరత్రా కార్డులు, జన్‌ధన్ ఖాతాలు, ఇన్ యాక్టివ్ ఖాతాలు, స్మార్ట్ ఫీచర్ ఫోన్లు ఎంతమందికి ఉన్నాయి, ఎంతమందికి లేవన్న సమాచారాన్ని ఇంటింటికీ వెళ్లి సేకరించి నివేదికలో పంపాలన్నారు. బ్యాంకు ఖాతాలు లేని వారికి ఖాతాలను ప్రారంభించాలన్నారు. 10 సం.లు నిండిన ప్రతి ఒక్కరికీ తప్పనిసరిగా బ్యాంకు ఖాతా ప్రారంభించాలన్నారు. ప్రతి వ్యాపార సంస్థ పిఓఎస్ మిషన్లు ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సివిల్ సప్లయ్ డిఎం శ్రీనివాస్, డియస్‌ఓ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.
టౌన్ ప్లానింగ్‌లో
నిబంధనలు బేఖాతర్ !
* లక్షల ఆదాయానికి గండి
హిందూపురం టౌన్, డిసెంబర్ 8:పురం మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ విభాగంలో గతంలో నిబంధనలు పట్టించుకోకుండా అనుమతులు ఇచ్చిన వైనం వెలుగుచూసింది. నిబంధనల ప్రకారం అనుమతి లేని లే ఔట్లలో నిర్మాణాలు చేసుకొంటే 14 శాతం అదనపు రుసుంను వసూలు చేయాలి. ఈ రుసుంను మార్కెట్ ధర ప్రకారం వసూలు చేయాల్సి ఉంటుంది. అయితే గతంలో పనిచేసిన కొందరు అధికారులు మార్కెట్ ధరపై కాకుండా డాక్యుమెంట్‌పై ఉన్న విలువ ఆధారంగా రుసుంను నిర్ణయించడం విశేషం. నిబంధనల ప్రకారం మార్కెట్ ధరపై మున్సిపల్ రుసుంలు వసూలు చేయాలి. అయితే గతంలో పనిచేసిన కొందరు అధికారులు దరఖాస్తుదారులకు అనుకూలంగా వ్యవహరిస్తూ చేతివాటం ప్రదర్శించారు. దీంతో మున్సిపాలిటీకి లక్షలాది రూపాయల ఆదాయం గండిపడింది. ఒక్క మున్సిపల్ టౌన్ ప్లానింగ్ విభాగంలో దాదాపు రూ.70 లక్షలు మున్సిపాలిటీకి రావాల్సిన ఆదాయం రాకుండా పోయింది. ఇటీవలే ఆడిట్ పూర్తి చేసిన అధికారులు గతంలో జరిగిన అక్రమాలను వెలికి తీశారు. టౌన్ ప్లానింగ్‌లో 2013-14 సంవత్సరంలో వచ్చిన దరఖాస్తులను, రికార్డులను పరిశీలించారు. వీటిలో చాలా వాటికి 14 శాతం అదనపు రుసుం వసూలు చేయని వైనం వెల్లడయింది. టౌన్ ప్లానింగ్ అధికారులు దరఖాస్తుదారులతో కుమ్మక్కై మున్సిపాలిటీకి రావాల్సిన ఆదాయానికి గండి కొట్టారని ఆడిట్‌లో తేలిపోయింది. దీంతో ఈ సొమ్మును వసూలు చేయాలంటూ ఆడిట్ అధికారులు అభ్యంతరాల రిజిస్ట్రర్‌లో పేర్కొన్నారు. గతంలో జరిగిన అక్రమాలను ఇటీవల ఆడిట్ సందర్భంగా అధికారులు గుర్తించడంతో అసలు విషయం బయటకొచ్చినట్లయింది. లేదంటే ఈ ప్రక్రియ ఇలాగే ఎవరికి తెలియకుండా సాగిపోయేది. సంబంధిత విభాగంలో గతంలో పనిచేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని వారు తమ అభ్యంతరాల్లో పేర్కొన్నారు. అయితే 2014లో ఏర్పాటైన నూతన పాలకవర్గం అధికారంలోకి వచ్చినప్పటి నుండి టౌన్ ప్లానింగ్ విభాగంపై ప్రత్యేక దృష్టి సారించి అక్రమాలకు అవకాశం లేకుండా చూశారు. గతంలో జరిగిన అక్రమాలు వెల్లడి కావడంతో చర్యలకు ఉపక్రమించేందుకు ఉన్నతాధికారులను సంప్రదిస్తున్నారు. 14 శాతం అదనపు రుసుం చెల్లించని దరఖాస్తుదారులందరి నుండి ఫీజు వసూలు చేసేందుకు ఉన్న మార్గాలను పరిశీలిస్తున్నారు. అందరికీ నోటీసులు ఇవ్వాలని నిర్ణయించారు. మరోవైపు ఇదే విభాగంలో ఇంటి నిర్మాణం చేపట్టిన ప్రతి ఇంటి వద్ద ఇంకుడు గుంతలు తవ్వకం కోసం చెల్లించే ఫీజును కొందరి నుండి వసూలు చేయని విషయాన్ని గుర్తించారు. ఈ సొమ్ము దాదాపు రూ.60 వేల దాకా ఉంటుంది. ఈ సొమ్మును వసూలు చేయాలని అభ్యంతరాల్లో పేర్కొన్నారు. దీంతో టౌన్ ప్లానింగ్ విభాగంలో గతంలో జరిగిన అవకతవకలపై దృష్టి సారిస్తున్నారు. గత అక్రమాలు బయటకు రావడంతో ప్రస్తుతం టౌన్ ప్లానింగ్‌లో పనిచేస్తున్న అధికారులు అల్లాడిపోతున్నారు. ఏది, ఎక్కడ వచ్చి తగులుకొంటోందని రికార్డులను పూర్తిస్థాయిలో సిద్ధం చేసుకొంటున్నారు. ఏదేమైనా అధికారులు నిర్వాకం కారణంగా లక్షలాది రూపాయల మున్సిపల్ ఆదాయానికి గండి పడినట్లయింది. ఈ విషయమై మున్సిపల్ కమిషనర్ విశ్వనాథ్ మాట్లాడుతూ 14 శాతం చెల్లించని దరఖాస్తుదారుల నుండి సంబంధిత రుసుం వసూలు చేసేందుకు నోటీసులు జారీ చేయనున్నట్లు తెలిపారు. అదే విధంగా గతంలో పనిచేసిన అధికారులకు కూడా ఆడిట్ అభ్యంతరాలపై తెలియచేయనున్నట్లు తెలిపారు. ఆడిట్ అభ్యంతరాలపై పూర్తిస్థాయిలో రికవరీలకు చర్యలు తీసుకొంటామని స్పష్టం చేశారు.

కార్పొరేషన్ కమిషనర్‌గా సురేంద్రబాబు
అనంతపురంటౌన్, డిసెంబర్ 8:కార్పొరేషన్ నూతన ఎఫ్‌ఎసి కమిషనర్‌గా ఇన్‌చార్జి ఎస్.ఇ ఇ.సురేంద్రబాబు గురువారం రాత్రి పదవీ బాధ్యతలు చేపట్టారు. కార్పొరేషన్ నూతన ఎఫ్‌ఎసి కమిషనర్‌గా ఇన్‌చార్జి సూపరింటెండెంట్ ఇంజినీర్ ఇ.సురేంద్రబాబును నియమిస్తూ గురువారం మున్సిపల్ పరిపాలనా శాఖ డైరెక్టర్ కె.కన్నబాబు ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం వాటర్ వర్క్స్ ఇ.ఇగా, ఇన్‌చార్జి ఎస్‌ఇగా బాధ్యతలు నిర్వహిస్తున్న సురేంద్రబాబుకు కమిషనర్‌గా పూర్తి అదనపు బాధ్యతలు (ఎఫ్‌ఎసి) అప్పగించటం విశేషం. నూతన కమిషనర్ నియామక ఉత్తర్వులు జారీ అయిన వెంటనే ప్రస్తుత కమిషనర్ సోమన్‌నారాయణ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. రిలీవింగ్ ఆర్డర్స్ తీసుకుని ఇన్‌చార్జి ఎస్‌ఇ ఇ.సురేంద్రబాబుకు బాధ్యతలు అప్పగించారు. కార్పొరేషన్‌లోని వివిధ విభాగాధికారులు, సిబ్బంది నూతన కమిషనర్ సురేంద్రబాబుకు పుష్పగుచ్ఛాలు అందించి అభినందనలు తెలిపారు.
ఆర్టీసీ బస్సును ఢీకొన్న ఐచర్
ఇద్దరి మృతి
మడకశిర, డిసెంబర్ 8: పావగడ పట్టణ సమీపంలో చెళ్ళకెర రహదారిలో గురువారం మధ్యాహ్నం ఎపిఎస్‌ఆర్‌టిసి బస్సు, ఐచర్ వాహనం ఢీకొనడంతో ఇద్దరు మృతి చెందగా మరో 10 మంది తీవ్ర గాయాలకు గురయ్యారు. ఇందుకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. కల్యాణదుర్గం నుండి బెంగళూరుకు వెళుతున్న ఆర్టీసీ బస్సు, పావగడ నుండి అనంతపురం వెళ్తున్న ఐచర్ వాహనం పరస్పరం ఢీకొన్నాయి. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న కంబదూరు మండలం కదిరిదేవరపల్లికి చెందిన యశోదమ్మ (40)తోపాటు మరో వ్యక్తి కూడా మృతి చెందాడు. అంతేకాక బస్సు డ్రైవర్ నరసింహులు, ఐచర్ డ్రైవర్ మణి తీవ్ర గాయాలకు గురికాగా చికిత్సల నిమిత్తం బెంగళూరుకు తరలించారు. కాగా ప్రమాదంలో పావగడకు చెందిన రత్నమ్మ, నరసింహమూర్తి, కండక్టర్ పద్మావతి, శ్రీనివాసులు, మంజునాథ్, లక్ష్మిదేవి, వెంకటేష్, దేవరాజు తదితరులు గాయాలకు గురయ్యారు. ప్రమాదం జరిగిన వెంటనే క్షతగాత్రులను చికిత్సల నిమిత్తం పావగడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పావగడ సిఐ ఆనంద్, ఎస్సై మంజునాథ్ సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

నగదు రహిత లావాదేవీలపై
ప్రజల్లో అవగాహన కల్పించాలి
అనంతపురం సిటీ, డిసెంబర్ 8: నోట్ల రద్దుతో సామాన్య ప్రజలు ఎంతో కష్టపడ్డారని దీనిని దృష్టిలో వుంచుకుని ప్రస్తుతం వున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని గ్రామీణ ప్రాంత ప్రజల్లో పెంపొందించేలా ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు కృషి చేయాలని జిల్లా జూయింట్ కలెక్టర్ బి.లక్ష్మికాంతం సూచించారు. గురువారం స్థానిక ప్రశాంతి సమాఖ్య కార్యాలయంలోని మీటింగ్ హాల్‌లో డిఆర్‌డిఎ, డిపిఎంలు, ఏరియా కోఆర్టినేటర్లు, ఏపిఎంలకు నగదు రహిత లావాదేవీలపై ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జెసి మాట్లాడుతూ భవిష్యత్తులో భౌతికంగా నగదు లేకుండా సాంకేతిక పరిజ్ఞానంతో ప్రతి ఒక్కరూ లావాదేవీలను జరుపుకునేలా డిజిటల్ లిటరసీపై అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి కుటుంబంలో ఈ ప్రక్రియ జరగాలన్నారు. దీనికి గ్రామస్థాయి ప్రభుత్వ యంత్రాంగం అక్కడి ప్రజల్లో అవగాహన పెంపొందించే ఉద్దేశ్యంతో ముందుగా డిఆర్‌డిఎ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని మహిళా సంఘాలకు అవగాహన కల్పించాలని నిర్ణయించామని పేర్కొన్నారు. అందులో భాగంగా నేడు జిల్లా స్థాయిలో అవగాహన కార్యక్రమాలు చేపట్టామని, రేపటి రోజున పంచాయతీ స్థాయిలో పంచాయతీకి ఒక్కొక్క ఎంబిటి ద్వారా వెలుగు సిబ్బంది, గ్రామ సమైక్య సంఘాల లీడర్లకు శిక్షణ కల్పిస్తున్నట్లు తెలిపారు. ఒక ఎంబిటి ఈ నెల ఆఖరి వరకు ఒక పంచాయతీలో 200 మందికి మొబైల్ బ్యాంకింగ్‌పై శిక్షణ ఇవ్వాలని ఆదేశించారు. ఇందులో 180 మంది సభ్యులకు, 20 మంది వ్యాపార సంస్థలకు శిక్షణ కల్పించాలన్నారు. జిల్లాలోని 1003 గ్రామ పంచాయతీల్లో డిసెంబర్ ఆఖరు నాటికి సుమారు 2 లక్షల మంది డ్వాక్రా మహిళా సంఘ సభ్యులకు శిక్షణ పూర్తి చేయాలని ఆదేశించారు. దీనికి అవసరమగు స్మార్ట్ఫోన్, ట్యాబ్‌లు కలిగి శిక్షణ పొందిన 454 మంది ఇంటర్నెట్ సాదీలు గ్రామాల్లోనే వున్నారని తెలిపారు. మిగిలిన 549 పంచాయతీలో ట్యాబ్, స్మార్ట్ఫోన్‌లు కలిగిన విఓ, యానిమేటర్లు, నైపుణ్యం కలిగిన మహిళలు ఇదివరకే శిక్షణ పొంది వున్నారని, అందువల్ల ఈ ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు.అనంతరం యాక్సెస్ బ్యాంకు ప్రతినిధి వెంకటేశ్వరరావు నగదు రహిత లావాదేవీలపై పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ద్వారా మహిళలకు వివరించారు. ఈ కార్యక్రమంలో మహిళా సంఘాలు, బ్యాంకు ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

మట్టిపెళ్ల విరిగిపడి వ్యక్తి మృతి
లేపాక్షి, డిసెంబర్ 8: మండల పరిధిలోని చోళసముద్రం సమీపంలోని వంకలో గురువారం మట్టిపెళ్ల విరిగిపడి గంగాధరప్ప (38) మరణించాడు. వివరాలు ఇలా ఉన్నాయి. కె.బసవనపల్లికి చెందిన గంగాధరప్ప తన స్వంత ట్రాక్టర్‌తో ఓ రైతు పొలానికి మట్టి తోలేందుకు వెళ్ళాడు. మట్టిని ట్రాక్టర్‌లో నింపుతున్న సమయంలో పై నుండి ఓ పెద్ద మట్టిపెళ్ల విరిగి గంగాధరప్పపై పడింది. అక్కడున్న ఇద్దరు కూలీలు మట్టిపెళ్ళలను తొలగించేలోపే ఆయన మృతి చెందాడు. మృతుడు ఇటీవలే ట్రాక్టర్‌ను కొని స్వంతంగా నడుపుకొని జీవనం సాగిస్తున్నాడు.
రోడ్డుప్రమాదంలో యువకుడి దుర్మరణం
తాడిపత్రి, డిసెంబర్ 8: మండల పరిధిలోని అనంతపురం రహదారిలో ఆటోనగర్ క్రాస్ రోడ్ వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నరేంద్ర(20) దుర్మరణం పాలైనాడు. రూరల్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు పుట్లూరు మండలం కందిగోపుల గ్రామానికి చెందిన నరేంద్ర వ్యక్తిగత పనులపై పట్టణానికి వచ్చి తిరుగు ప్రయాణంలో రైల్వే బ్రిడ్జిపై నుండి వేగంగా వెళ్తుండగా, ఆటోనగర్ మలుపు వద్ద లారీ ఢీకొట్దిందని, తీవ్ర గాయాలపాలైన నరేంద్రను చికిత్సకై తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడని తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని తెలిపారు.